ఎంబీటీతో ఎంఐఎంకు చెక్‌ | Check for MIM with MBT | Sakshi
Sakshi News home page

ఎంబీటీతో ఎంఐఎంకు చెక్‌

Published Sun, Jan 14 2024 3:43 AM | Last Updated on Sun, Jan 14 2024 3:43 AM

Check for MIM with MBT - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మజ్లిస్‌ ఇత్తేహదుల్‌ ముస్లిమీన్‌ (ఎంఐఎం)కు మజ్లిస్‌ బచావో తెహ్రీక్‌ (ఎంబీటీ)తో చెక్‌ పెట్టే దిశలో అధికార కాంగ్రెస్‌ పార్టీ పావులు కదుపుతోంది. హైదరాబాద్‌ నగరంతో పాటు రాష్ట్రంలోని కొన్ని నియోజకవర్గాల్లో ప్రభావం చూపగలిగిన ఎంఐఎంను కట్టడి చేసేందుకు ముల్లును ముల్లుతోనే తీసే వ్యూహంలో భాగంగా ఎంబీటీతో కలిసి వెళ్లాలని భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే ఈ ప్రతిపాదన ఉన్నప్పటికీ కొన్ని సమీకరణల నేపథ్యంలో ఇది సాధ్యం కాలేదని, ఇప్పుడు ఆ ప్రతిపాదన అమల్లోకి వచ్చేలా రాష్ట్ర కాంగ్రెస్‌ పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

ఈ ప్రయత్నాల్లో భాగంగానే రానున్న లోక్‌సభ ఎన్నికల్లో హైదరాబాద్‌ లోక్‌సభ స్థానాన్ని ఎంబీటీకి కేటాయించాలనే ప్రతిపాదన అధిష్టానం పెద్దల వరకు చేరింది. అంతకంటే ముందే జాతీయ స్థాయిలోని ఇండియా కూటమిలో ఎంబీటీని చేర్చుకోవాలని, తద్వారా ఎంఐఎంకు దీటుగా ఎంబీటీని దేశ స్థాయిలో ప్రోత్సహించాలని కాంగ్రెస్‌ భావిస్తోంది.

కూటమి సమావేశాల్లో ఎంబీటీని భాగస్వామిని చేయడంతో పాటు ఎన్నికల ప్రచార సభలకు ఆహా్వనించడం ద్వారా ఎంఐఎం ద్వారా బీజేపీకి కలుగుతున్న లబ్ధి, ఆ రెండు పార్టీల దోస్తీని ముస్లిం మైనార్టీలకు అర్థమయ్యేలా పాతబస్తీ పార్టీ అయిన ఎంబీటీతోనే చెప్పించాలనేది కాంగ్రెస్‌ వ్యూహంగా కనిపిస్తోంది. 

‘బస్తీ’మే సవాల్‌ 
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు కాంగ్రెస్‌తో కలిసి పనిచేసిన ఎంఐఎం రాష్ట్ర ఏర్పాటు తర్వాత మారిన రాజకీయ సమీకరణల దృష్ట్యా కాంగ్రెస్‌కు కొరకరాని కొయ్యగా తయారయింది. పాతబస్తీలో తనకున్న బలాన్ని, బలగాన్ని వేదికగా చేసుకుని అన్ని సందర్భాల్లో కాంగ్రెస్‌ పార్టీని సవాల్‌ చేస్తూ నిలబడింది. దాదాపు పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌కు మిత్రపక్షంగా వ్యవహరించిన ఎంఐఎం రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే పంథాను కొనసాగిస్తోంది.

అసెంబ్లీ ఎన్నికలకు ముందూ ఆ తర్వాత కూడా కాంగ్రెస్‌ పట్ల ఎంఐఎం వైఖరిలో మార్పు రాలేదు. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌కు అదనపు బలంగా, తమకు వైరిపక్షంగా మారిన ఎంఐఎంకు చెక్‌ పెట్టాలని కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించుకుంది. పార్లమెంటు ఎన్నికలు మొదలుకుని ఇక ముందు జరిగే అన్ని ఎన్నికల్లోనూ పాతబస్తీలో ఒవైసీ సేనకు సవాల్‌ విసిరేందుకు సిద్ధమవుతోంది. 

అసెంబ్లీ అంచనాలతో 
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్‌ పార్లమెంటు పరిధిలోని రెండు నియోజకవర్గాల్లో ఎంబీటీ (యాకుత్‌పుర), కాంగ్రెస్‌ (నాంపల్లి) ఢీ అంటే ఢీ అనేలా ఎంఐఎంతో తలపడ్డాయి. చాలా తక్కువ తేడాతో ఓడిపోయాయి. అయితే, ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీకి అధికారం దక్కిన నేపథ్యంలో ఎంబీటీని ముందుంచడం ద్వారా ఆ రెండింటితో పాటు మిగిలిన ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ పెద్ద ఎత్తున ముస్లిం మైనార్టీల ఓట్లను కొల్లగొట్టవచ్చనే అంచనాల్లో కాంగ్రెస్‌ నాయకులున్నారు.

ఈ ప్రయత్నంలోనే విజయం సాధిస్తామని, ఒకవేళ లోక్‌సభ ఎన్నికల్లో ఎంఐఎంను కొంతమేర నిలువరించగలిగినా, జీహెచ్‌ఎంసీ ఎన్నికల సమయానికి మరింత సమర్థవంతంగా ఎంఐఎంను ఢీ కొట్టగలుగుతామనేది అటు ఎంబీ టీ, ఇటు కాంగ్రెస్‌ల భావనగా కనిపిస్తోంది. ఈ విషయమై కాంగ్రెస్‌ నేత ఒకరు మాట్లాడుతూ ‘అధికారంలో ఉన్నప్పుడే ఎంఐఎంను కట్టడి చేయగలం.

ఇందుకు ఎంబీటీని వేదికగా చేసుకుని ముందుకెళితే మంచి ఫలితాలు రాబట్టగలుగుతాం. లోక్‌సభ ఎన్నికలే కాదు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ మా రెండు పార్టీలు అవగాహనతో వెళ్లడం ఖాయంగానే కనిపిస్తోంది.’అని వ్యాఖ్యానించడం గమనార్హం. 

ఆ ఎన్నికలకు ముందే 
వాస్తవానికి, ఎంబీటీతో పొత్తుపై అసెంబ్లీ ఎన్నికలకు ముందే చర్చలు జరిగాయి. అప్పట్లో ఏఐసీసీ పరిశీలకురాలిగా వచ్చిన ప్రస్తుత రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్‌ మున్షీ, ఎంబీటీ నేత అంజదుల్లాఖాన్‌ రెండు, మూడుసార్లు భేటీ అయి చర్చలు కూడా జరిపారు. కానీ, కాంగ్రెస్‌ పార్టీలో అంతర్గతంగా జరిగిన చర్చల అనంతరం అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే ఎంబీటీతో స్నేహం నష్టం చేస్తుందనే భావనతో వెనక్కు తగ్గినట్టు తెలిసింది.

ఇప్పుడు ఇదే స్నేహం ద్వారా ఎంఐఎంకు చెక్‌ పెట్టే దిశలో ముందుకెళుతోంది. ఇందుకు ఎంబీటీ నేత అంజదుల్లాఖాన్‌ కూడా సుముఖంగా ఉన్నారు. పాతబస్తీలోని కాంగ్రెస్‌ నేతలు, కాంగ్రెస్‌ సానుభూతిపరులు కూడా ఈ ప్రతిపాదనను స్వాగతిస్తున్నారు. ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ వెలువడే సమయానికి ఈ రెండు పార్టీల మధ్య అవగాహన కుదిరే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement