‘పాలమూరు’లో కాంగ్రెస్ హవా..
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఉమ్మడి పాలమూరులో కాంగ్రెస్ విజయభేరి మోగించింది. మొత్తం 14 అసెంబ్లీ నియోజకవర్గ స్థానాల్లో 12 గెలుపొంది సత్తా చాటింది. బీఆర్‌ఎస్ అభ్యర్థులు కేవలం రెండు స్థానాలకే పరిమితమయ్యారు. మహబూబ్‌నగర్, వనపర్తి నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డికి చుక్కెదురైంది.
దేవరకద్ర నియోజకవర్గానికి సంబంధించి బీఆర్‌ఎస్ అభ్యర్థి ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి జీఎమ్మార్ మధ్య రౌండ్ రౌండ్‌కూ హోరాహోరీ పోరు కొనసాగింది. రౌండ్‌రౌండ్‌కు ఉత్కంఠగా సాగిన లెక్కింపులో చివరి రౌండ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి జి.మధుసూదన్‌రెడ్డికి 907 ఓట్ల మెజార్టీ రాగా.. పోస్టల్ బ్యాలెట్‌తో కలుపుకుని మొత్తం 1,392 ఓట్ల మెజార్టీతో బీఆర్‌ఎస్ అభ్యర్థిపై విజయం సాధించారు.
తొలిసారిగా 9 మంది..
ఉమ్మడి పాలమూరులో తొమ్మిది మంది తొలిసారి గా శాసనసభలో అడుగుపెట్టనున్నారు. కాంగ్రెస్‌కు సంబంధించి జడ్చర్ల, దేవరకద్ర, నారాయణపేట, మక్తల్, షాద్‌నగర్, నాగర్‌కర్నూల్, కల్వకుర్తి, వనపర్తి అభ్యర్థులు జనంపల్లి అనిరు«ద్‌రెడ్డి, జి.మధుసూదన్‌రెడ్డి, పర్ణికారెడ్డి, వాకిటి శ్రీహరి, వీర్లపల్లి శంకర్, కూచుకుళ్ల రాజే శ్రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, మేఘారెడ్డితో పాటు బీఆర్‌ఎస్ అలంపూర్ అభ్యర్థి విజయుడు తొలిసారిగా విజయం సాధించారు. ఇందులో అందరూ యువతే కావడం విశేషం.
వనపర్తిలో గలాటా..
వనపర్తిలో చిట్యాల శివారులోని మార్కెట్ యార్డు గోదాంలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ హాల్ నుంచి వెనుతిరిగి వెళ్తున్న మంత్రి నిరంజన్‌రెడ్డి కారు అద్దాలను కాంగ్రెస్ కార్యకర్తలు ధ్వంసం చేయడంతో దుమారం చెలరేగింది. పోలీసులు వారిని చెదరగొట్టి మంత్రిని అక్కడి నుంచి పంపించి వేశారు. ఆ తర్వాత బీఆర్‌ఎస్ శ్రేణులు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో రాస్తారోకోకు దిగడం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. రోడ్డుపైనే సుమారు గంటన్నర సేపు ఆందోళనకు దిగగా ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులకు వారికి నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు.
మంత్రులకు తప్పని ఓటమి..
మహబూబ్‌నగర్‌లో మంత్రి బీఆర్‌ఎస్ అభ్యర్థి శ్రీనివాస్‌గౌడ్‌పై కాంగ్రెస్ అభ్యర్థి యెన్నం శ్రీనివాస్‌రెడ్డి 18,738 ఓట్ల మెజార్టీతో గెలిచారు. అదేవిధంగా వనపర్తిలో మంత్రి నిరంజన్‌రెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థి తూడి మేఘారెడ్డి 25,320 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.
ఒక్కటి మినహా. అన్నింటా హస్తం
ఉమ్మడి నల్లగొండ జిల్లా
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ ప్రభంజనం సృష్టించింది. ఉమ్మడి జిల్లాలో 12 నియోజకవర్గాలకుగాను 11 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించగా, ఒక్క సూర్యాపేట నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ అభ్యర్థి జగదీ‹Ùరెడ్డి గెలుపొందారు.
మిగతా నియోజకవర్గాలైన నల్లగొండలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, నకిరేకల్‌లో వేముల వీరేశం, మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, దేవరకొండలో నేనావత్ బాలునాయక్, నాగార్జునసాగర్ లో కుందూరు జయవీర్‌రెడ్డి, మిర్యాలగూడలో బత్తుల లక్ష్మారెడ్డి, తుంగతుర్తి లో మందుల సామేల్, హుజూర్‌నగర్‌లో నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోదాడలో నలమాద పద్మావతిరెడ్డి, ఆలేరులో బీర్ల అయిలయ్య, భువనగిరిలో అనిల్‌కుమార్‌రెడ్డి గెలుపొందారు.
ప్రతి రౌండ్‌లోనూ కాంగ్రెస్ ఆధిక్యం..
2018 ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో 10స్థానాల్లో బీఆర్‌ఎస్ గెలు పొందగా, రెండు స్థానాల్లో అప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. ఈసారి అంతకుమించి 11 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే, ఒకే ఒక్క స్థానంలో బీఆర్‌ఎస్ గెలుపొందింది. ప్రస్తుత విజయంతో కాంగ్రెస్ ఉమ్మడి జిల్లాలో తిరుగులేని పార్టీగా తమ పట్టును సాధించింది.
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులంతా తమ ప్రత్యర్థులైన బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులపైనే ఈ విజయాన్ని సాధించారు. ప్రతి అభ్యర్థికి భారీ మెజారిటీని ఇచ్చి ఓటర్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల వైపు నిలిచారు. ఈ ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మొదటి రౌండ్ నుంచి చివరి రౌండ్ వరకు అధిక్యాన్ని కనబరచడం విశేషం.
గిరిజన ఖిల్లాలో‘కమలం’ బోణీ!
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఓటర్లు విభిన్న తీర్పు ఇచ్చారు. తొలిసారిగా ఈ ప్రాంతం నుంచి నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీకి పంపి కొత్త రికార్డు సృష్టించారు. ఈ ప్రాంతం నుంచి కమలనాథులు శాసనసభకు ఎన్నికకావడం ఇదే తొలిసారి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పది స్థానాల్లో ఆదిలాబాద్, నిర్మల్, ముథోల్, సిర్పూర్‌లో బీజేపీ విజయకేతనం ఎగురవేసింది. 2019 ఎన్నికల్లో ఆదిలాబాద్ ఎంపీగా సోయం బాపూరావు బీజేపీ నుంచి గెలిచి సంచలనం సృష్టించారు. తాజాగా ఏకంగా నలుగురు ఎమ్మెల్యేలను గెలిపించి ఇక్కడి ఓటర్లు అనూహ్య తీర్పునిచ్చారు.
బీఆర్‌ఎస్‌పై అదే దెబ్బ..
గిరిజనుల రిజర్వేషన్లు 6 నుంచి పది శాతం పెంచుతూ బీఆర్‌ఎస్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఆదివాసీ, గిరిజనులకు ఆర్వోఎఫ్‌ఆర్(అటవీ భూమి హక్కు పత్రాలు) 48వేల మందికి లక్ష ఎకరాల అటవీ భూములపై హక్కులు కల్పించారు. కానీ ఇవేమీ బీఆర్‌ఎస్‌కు ఫలితం ఇవ్వలేకపోయాయి. ఆదివాసీ లంబాడా మధ్య వైరం, గిరిజనేతరులకు ఏజెన్సీ సమస్యలు బీఆర్‌ఎస్‌ను దెబ్బతీశాయి.
మూడు ఎస్టీ స్థానాల్లో ఆసిఫాబాద్, బోథ్‌లో బీఆర్‌ఎస్ అభ్యర్థులు కోవ లక్ష్మి అనిల్ జాదవ్ గెలుపొందగా, ఖానాపూర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి వెడ్మ బొజ్జు గెలిచారు. నిర్మల్ నుంచి బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఆదిలాబాద్‌లో మాజీ మంత్రి జోగు రామన్న, మంచిర్యాలలో నడిపెల్లి దివాకర్‌రావు, సిర్పూర్‌లో కోనేరు కోనప్ప, బెల్లంపల్లిలో దుర్గం చిన్నయ్య, చెన్నూరులో బాల్క సుమన్ ఘోర ఓటమి పాలయ్యారు.
కేటీఆర్ స్నేహితుడైన భూక్యా జాన్సన్‌నాయక్ ఖానాపూర్‌లో ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి వెడ్మ బొజ్జు గెలుపొందారు. మొదటి నుంచి ఈ స్థానంలో త్రికోణ పోటీగా ఉంది. బీజేపీ నుంచి మాజీ ఎంపీ, సీనియర్ నాయకులు రమేశ్‌రాథోడ్, ఇటు జాన్సన్ నాయక్, వెడ్మ బొజ్జు బరిలో ఉండగా, చివరకు ఆదివాసీ నాయకుడికే పట్టం కట్టారు. ఇక్కడ 1984లో మాజీ మంత్రి కోటా్నక భీంరావు కాంగ్రెస్ నుంచి గెలవగా, మళ్లీ 40ఏళ్ళ తర్వాత ఓ ఆదివాసీకి విజయం వరించింది.
ఓరుగల్లులో కాంగ్రెస్ హోరు
సాక్షి ప్రతినిధి, వరంగల్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మూడోసారి జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఓరుగల్లులో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 10 చోట్ల గెలిచి అనూహ్య ఫలితాలను రికార్డు చేయగా, బీఆర్‌ఎస్ రెండు స్థానాలకే పరిమితమైంది. రాజకీయ ఉద్దండులుగా పేరొందిన నాయకులు, వరుస విజయాలను నమోదు చేసిన నేతలు కాంగ్రెస్ అభ్యర్థుల చేతిలో ఓటమిపాలయ్యారు.
వరంగల్ పశ్చిమనుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థి దాస్యం వినయ్ భాస్కర్‌పై కాంగ్రెస్ అభ్యర్థి నాయిని రాజేందర్‌రెడ్డి, తూర్పులో బీజేపీ అభ్యర్థి ఎర్రబెల్లి ప్రదీప్‌రావుపై కాంగ్రెస్ అభ్యర్థి కొండా సురేఖ, పరకాలలో బీఆర్‌ఎస్ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థి రేవూరి ప్రకాశ్‌రెడ్డి, వర్ధన్నపేటలో బీఆర్‌ఎస్ అభ్యర్థి అరూరి రమేశ్‌పై కాంగ్రెస్ అభ్యర్థి కేఆర్ నాగరాజు విజయం సాధించారు. అదేవిధంగా భూపాలపల్లిలో బీఆర్‌ఎస్ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థి గండ్ర సత్యనారాయణరావు, ములుగులో బీఆర్‌ఎస్ అభ్యర్థి బడే నాగజ్యోతిపై కాంగ్రెస్ నుంచి ములుగు సీతక్క గెలుపొందారు.
నర్సంపేటనుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థి పెద్ది సుదర్శన్‌రెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థి దొంతి మాధవరెడ్డి, పాలకుర్తిలో మంత్రి, బీఆర్‌ఎస్ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్‌రావుపై కాంగ్రెస్ అభ్యర్థి మామిడాల యశస్వినిరెడ్డి, మహబూబాబాద్‌లో బీఆర్‌ఎస్ అభ్యర్థి శంకర్‌నాయక్‌పై కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ మురళీనాయక్, డోర్నకల్‌లో రెడ్యానాయక్‌పై కాంగ్రెస్ అభ్యర్థి రాంచంద్రునాయక్ విజయం సాధించారు. జనగామలో కాంగ్రెస్ అభ్యర్థి దొంతి మాధవరెడ్డిపై బీఆర్‌ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి, స్టేషన్‌ఘన్‌పూర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ఇందిరపై బీఆర్‌ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి గెలుపొందారు.
విలక్షణం.. ఇందూరు తీర్పు
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఎన్నికల ఫలితాల్లో ఉమ్మడి ఇందూరు జిల్లా మరోసారి విలక్షణ తీర్పు తో తన ప్రత్యేకతను చాటుకుంది. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య ముఖా ముఖి పోరు జరగగా ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో మాత్రం కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ మధ్య త్రిముఖ పోరు జరిగింది. దీంతో నిజామాబాద్ జిల్లాలోని ఉన్న 9 స్థానాలకు గాను కాంగ్రెస్ 4, బీజేపీ 3, బీఆర్‌ఎస్ 2 చోట్ల విజయం సాధించాయి. సీఎం కేసీఆర్, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి పోటీపడిన కామారెడ్డి నుంచి బీజేపీ అభ్యర్థిగా కాటిపల్లి వెంకటరమణారెడ్డి జెయింట్ కిల్లర్ రేంజ్‌లో విజయం సాధించారు.
నిజామాబాద్ అర్బన్ నుంచి బీజేపీ అభ్యర్థులుగా ధన్‌పాల్ సూర్యనారాయణగుప్తా, ఆర్మూర్ నుంచి పైడి రాకేష్‌రెడ్డి విజయం సాధించారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ బోధన్, నిజామాబాద్ రూరల్, ఎల్లారెడ్డి, జుక్కల్ స్థానాల్లో గెలిచింది. ప్రస్తుతం భూపతిరెడ్డి 21,963 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఎల్లారెడ్డి నుంచి మదన్‌మోహన్‌రావు ప్రస్తుతం 24,001 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. మదన్‌మోహన్ 2019 పార్లమెంట్ ఎన్నికల్లో జహీరాబాద్ ఎంపీగా పోటీ చేసి కేవలం 6వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు.
ఇక బోధన్ నుంచి గెలిచిన మాజీ మంత్రి పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి మినహా నిజామాబాద్ రూరల్ నుంచి విజయం సాధించిన మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ భూపతిరెడ్డి, ఎల్లారెడ్డి నుంచి గెలుపొందిన మదన్‌మోహన్‌రావు, జుక్కల్ నుంచి గెలిచిన లక్ష్మీకాంతరావు సైతం శాసనసభలో తొలిసారి అడుగుపెట్టనున్నారు. మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి కేవలం 3,062 ఓట్ల స్వల్ప ఆధిక్యతతో గెలుపొందారు. 1999, 2004, 2009లో బోధన్ నుంచి గెలిచిన సుదర్శన్‌రెడ్డి వైఎస్‌ఆర్, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి కేబినెట్‌లలో పనిచేశారు. 2014, 2018లో బీఆర్‌ఎస్ అభ్యర్థి షకీల్‌పై పోటీ చేసి ఓటమి చెందారు. ప్రస్తుతం షకీల్‌పై విజయం సాధించారు.
పోచారం వరుసగా 5వ సారి, ప్రశాంత్‌రెడ్డి వరుసగా 3వ సారి విజయంబాన్సువాడ నుంచి బీఆర్‌ఎస్ తరపున గెలుపొందిన పోచారం శ్రీనివాసరెడ్డి తన రాజకీయ జీవితంలో 8 సార్లు పోటీ చేసి 7 సార్లు గెలుపొందగా, 2009, 2011(ఉప ఎన్నిక), 2014, 2018, 2023లలో వరుసగా 5 సార్లు విజయం సాధించడం గమనార్హం. స్పీకర్‌గా పనిచేసిన వారు తదుపరి ఎన్నికల్లో ఓటమి చెందుతారన్న సెంటిమెంట్‌ను పోచారం బ్రేక్ చేశారు.
పోచారం 23,464 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఇక బాల్కొండ నుంచి మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి 2014, 2018, 2023లో వరుసగా మూడుసార్లు గెలు పొందారు. ప్రశాంత్‌రెడ్డి కేవలం 4,533ఓట్లతో గెలుపొందారు. నిజామాబాద్ రూరల్ నుంచి ఆర్టీసీ చైర్మన్ బాజి రెడ్డి గోవర్ధన్ ప్రస్తు తం 21,963 ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు.
Comments
Please login to add a commentAdd a comment