నిజామాబాద్: గతంలో డిచ్‌పల్లి పేరిట ఉండగా ప్రస్తుతం నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంగా మారింది. డిచ్పల్లి మండలం ధర్మారం(బి) గ్రామానికి చెందిన మండవ వెంకటేశ్వరరావు ఇక్కడి నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మూడు సార్లు మంత్రిగా, ఒకసారి ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్‌గా ఆయన పని చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో వచ్చిన ఉప ఎన్నికల్లో మండవ వెంకటేశ్వరరావుపై కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి ఆకుల లలిత విజయం సాధించి 10 నెలల పాటు ఎమ్మెల్యేగా పని చేయడం చెప్పుకోదగ్గ విషయం.
ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలు:
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో రాజకీయ చైతన్యం ఎక్కువ. ఆర్ఎస్ఎస్, హిందూత్వ ప్రభావం బాగానే ఉంటుంది. కాలేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ 21, 22 ప్యాకేజీ, మంచిప్ప ప్రాజెక్టు ద్వారా నియోజకవర్గంలోని లక్ష ఎకరాలకు సాగు నీరు అందిస్తామని బీఆర్‌ఎస్ పార్టీ ప్రకటించింది. కానీ ఆ హామీ నెరవేరలేదు. మంచిప్ప రిజర్వాయర్ నిర్మాణం వల్ల ఆ గ్రామంతో పాటు బైరాపూర్, అమ్రాబాద్ గ్రామ పంచాయతీల పరిధిలోని 8 తండాలు ముంపునకు గురవుతున్నాయి. ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉంది. డిచ్‌పల్లి మండలం బీబీపూర్ తండ వద్ద మాత్రమే 50 మందికి డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇచ్చారు.
మిగిలిన మండలాల్లో డబుల్ బెడ్రూం ఇండ్ల జాడే లేదు. రైతులు ధరణి సమస్యలపై ఆగ్రహంగా ఉన్నారు. గల్ఫ్ కార్మికులు సుమారు 33వేల మంది వరకు ఉంటారు. వారి కుటుంబ సభ్యులను లెక్కేస్తే 90వేల వరకు ఉంటారు. జక్రాన్‌పల్లి ఎయిర్‌పోర్టు ఏర్పాటు లో జాప్యం, గల్ఫ్ కార్మికులతో పాటు సమస్యలు ఎన్నికలపై ప్రభావితం చూపే అవకాశాలుంటాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన హామీల్లో 2లక్షల పంట రుణమాఫీ, రూ. 500 లకే సిలిండర్, నిరుద్యోగ భృతి తదితర హామీలు గ్రామాల్లో చర్చనీయాంశంగా ఉన్నాయి. రాజకీయపరంగా బీఆర్ఎస్ నేతల అసమ్మతి, కాంగ్రెస్, బీజేపీలో నాయకుల మధ్య అంతర్గత విబేధాలు ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపనున్నాయి.
ప్రధాన పార్టీల అభ్యర్థులు:
బీఆర్ఎస్:
► సిట్టింగ్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్
కాంగ్రెస్ పార్టీ :
► మాజీ ఎమ్మెల్సీలు డాక్టర్ భూపతిరెడ్డి
► అరికెల నర్సారెడ్డి
► నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కాటిపల్లి నగేష్‌రెడ్డి
బీజేపీ:
► మాజీ జెడ్పీటీసీ దినేష్కుమార్
వృత్తిపరంగా ఓటర్లు:
రైతులు ఎక్కువగా ఉంటారు.. లంబాడా గిరిజనులు కూడా ఎక్కువగానే ఉంటారు.
మతం/కులం పరంగా ఓటర్లు:
► బీసీ ఓటర్లు : మున్నూరుకాపులు 40 వేలు
► యాదవులు/గొల్లకుర్మలు 15వేలు
► పద్మశాలీలు 19వేలు, ముదిరాజ్లు 20వేలు
► ఎస్సీలు : 28 వేలు, ఎస్టీలు 22వేలు
► క్రిస్టియన్లు : 10వేలు
► ముస్లీం మైనార్టీలు :15 వేలు
భౌగోళిక పరిస్థితులు..
జిల్లాలోనే ప్రసద్ధి చెందిన డిచ్‌పల్లి ఖిల్లా రామాలయం, రామడుగు ప్రాజెక్టు, తెలంగాణ యూనివర్సిటీ, సారంగపూర్ హనుమాన్ ఆలయం, ఇందల్వాయి రామాలయం, సిరికొండ లొంక రామేశ్వరాలయం నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోనే ఉన్నాయి. ఈ నియోజకవర్గం చుట్టూ సరిహద్దులుగా 8 నియోజకవర్గాలు ఉన్నాయి. సిరికొండ, ఇందల్వాయి, మోపాల్, డిచ్పల్లి, రూరల్ మండలాల్లో అటవీ ప్రాంతం ఉంది.
రాజకీయపరమైన అంశాలు..
బీఆర్‌ఎస్ అభ్యర్థి ఎవరో కన్‌ఫాం అయ్యింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తన కుమారుడు ధర్పల్లి జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ మోహన్ రెడ్డిని బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎన్నికల్లో నిలబెట్టాలని ప్రయత్నించారు. కానీ అధిష్టానం మాత్రం బాజిరెడ్డికే మరోసారి టికెట్ కట్టబెట్టింది. ఇక కాంగ్రెస్‌కు చెందిన మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ భూపతిరెడ్డిపై ప్రజల్లో సానుభూతి ఉంది.
ఈసారి ఆయనకే కాంగ్రెస్ పార్టీ టికెట్ వస్తుందని భావిస్తున్నారు. మరోవైపు తన మేనల్లుడు, ప్రముఖ సినీహీరో నితిన్ అండతో ఏఎంసీ మాజీ చైర్మన్ కాటిపల్లి నగేష్‌రెడ్డి కాంగ్రెస్ టికెట్ తెచ్చుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వీరిద్దరికి తోడు మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు సహకారంతో పార్టీ టికెట్ కోసం యత్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment