సాక్షి, పెద్దపల్లి జిల్లా: ఉద్యోగాల కోసం మొదలైన పోరాటం.. ఉద్యమంగా మారి తెలంగాణ తెచ్చుకునేలా చేసిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన పెద్దపల్లిలో యువ వికాస సభలో మాట్లాడుతూ.. మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి నినాదంతో ఈ ప్రభుత్వం ఏర్పడిందన్నారు. ఇప్పటివరకు 56 వేల మందికి నియామక పత్రాలు అందజేశామని తెలిపారు. మీ అందరి అభిమానంతోనే ముఖ్యమంత్రి అయ్యానని.. ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న పార్టీ కాంగ్రెస్ అంటూ రేవంత్ పేర్కొన్నారు.
పదేళ్లు మోసం చేసినోళ్లే ఇప్పుడు..
‘‘పదేళ్లు మోసం చేసినోళ్లే ఇప్పుడు అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. పదినెలల పాలనపై వాళ్లు చేసిన విష ప్రచారం అంతా ఇంతా కాదు. తెలంగాణ తెచ్చుకున్నది ఎందుకోసం?. ఒక కుటుంబాన్ని అందలం ఎక్కించేందుకే తెలంగాణ తెచ్చుకున్నామా?. కేసీఆర్ కుటుంబంలో అందరికి పదవులు వచ్చాయి. కవిత ఓడిపోతే మూడు నెలల్లో ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు.
..ఉదయం లేస్తే ప్రభుత్వంపై పడి ఏడుస్తున్నారు. శాపనార్థాలు పెడుతున్నారు. శాసనసభకు వచ్చి కేసీఆర్ సలహాలు ఇవ్వొచ్చుకదా?. పదేళ్లలో నిరుద్యోగులకు ఎందుకు ఉద్యోగ పత్రాలు ఇవ్వలేదు? పరీక్షలు వాయిదా వేయాలంటూఐ కృత్రిమ ఉద్యమం సృష్టించారు. ధర్నా చౌక్ ఎత్తేసి నిర్బంధం విధించారు. గతంలో ఇందిరాపార్క్ దగ్గర ధర్నా చేసే పరిస్థితి ఉండేదా?’’ అంటూ రేవంత్‌ప ప్రశ్నించారు.
కిషన్ రెడ్డి, బండి సంజయ్‌కు రేవంత్ సవాల్
‘‘కిషన్ రెడ్డి, బండి సంజయ్‌కు సవాల్ విసురుతున్నా.. 25 ఏళ్లలో మోదీ గుజరాత్‌లో మొదటి ఏడాదిలోనే 55 వేల ఉద్యోగాలు ఇచ్చారా... ? చర్చకు మేం సిద్ధంగా ఉన్నాం. 25లక్షల మంది రైతులకు రూ.21వేల కోట్లు రుణమాఫీ కోసం విడుదల చేసిన చరిత్ర మాది. గుజరాత్ రాష్ట్రంలో రైతు రుణమాఫీ చేశారా ఎవరు చర్చకు వస్తారో రండి. ఒక్కరోజులోనే ఎవరూ అద్భుతాలు సృష్టించరు.. ప్రజలు మాకు ఐదేళ్లు అవకాశం ఇచ్చారు.
..పది నెలలు కూడా ఓపిక పట్టకుండా దిగిపో దిగిపో అంటున్నారు.. వాళ్ల దుఃఖం దేనికో అర్థం కావడంలేదు. పదేళ్లు సీఎంగా, కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవంతో కేసీఆర్ ముందుకు వచ్చి సూచనలు ఇవ్వాలి. కులగణనలో కేసీఆర్, కేటీఆర్, హరీష్, సంతోష్ ఎందుకు పాల్గొనడంలేదు?. మీరు బీసీ వ్యతిరేకులా.. బీసీలకు దక్కాల్సిన వాటా ఇవ్వడం ఇష్టం లేదా? బీసీ సంఘాలు ఆలోచన చేయండి. కులగణనలో పాల్గొనని వారిని సామాజిక బహిష్కరణ చేయండి’’ అంటూ రేవంత్ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment