సాక్షి, పెద్దపల్లి: రూ.లక్ష రుణమాఫీ చేస్తానని చెప్పి రైతులను మోసం చేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇచ్చిన హామీ మేరకు నెలరోజుల్లోనే రూ.2లక్షల లోపు రుణాలను మాఫీ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించేందుకు ఇవాళ ఏ ముఖం పెట్టుకొని ప్రజల్లోకి వస్తారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని చెప్పి ఇవ్వలేకపోయిన మీరు.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతీ నియోజకవర్గంలో 3,500 ఇళ్లు ఇవ్వాలని బడ్జెట్ కేటాయిస్తే.. మీ మాదిరిగా వాటిని ఎగ్గొట్టాలని చెప్పడానికి వస్తారా? జాబ్ కేలెండర్ ప్రకటించి ఉద్యోగాలు ఇస్తుంటే అవి తప్పు అని చెప్పడానికి వస్తారా? దళితులకు మూడు ఎకరాల భూ పంపిణీ అని చెప్పి ఇవ్వలేదని చెప్పడానికి వస్తారా? .. అని కేసీఆర్‌ను నిలదీశారు.
‘నీవు, నీ కొడుకు పదేళ్లు తెలంగాణను దోచుకొని విదేశాల్లో దాచుకున్నారు’ అని విమర్శించారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు శనివారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగసభలో మంత్రులు శ్రీధర్‌బాబు, పోన్నం ప్రభాకర్‌తో కలిసి భట్టి మాట్లాడారు.
తెలంగాణ ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి వాట్సప్ గ్రూప్‌ల ద్వారా తప్పుడు ప్రచారం చేసి పబ్బం గడుపుకోవాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ప్రక్షాళన చేసి, ఉద్యోగల భర్తీ కోసం జాబ్ క్యాలెండర్ ప్రకటించడంతోపాటు, ప్రతీ నియోజకవర్గంలో యువతకు పోటీ పరీక్షలకు తరీ్ఫదు ఇచ్చేందుకు అంబేడ్కర్ నాలెడ్జ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు.
జెన్‌కో, సింగరేణి ఆధ్వర్యంలో 800 మెగావాట్ల పవర్ ప్లాంట్
రామగుండం థర్మల్ బీ పవర్ ప్లాంట్‌ను పరిశీలించిన మంత్రులు, అక్కడ అధికారులతో వివిధ పనులపై సమీక్షించారు. అనంతరం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. పాత ఆర్‌టీఎస్–బీ ప్లాంట్ స్థలంలోనే 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ పవర్‌ప్లాంట్‌ను జెన్‌కో, సింగరేణి సంయుక్త సహకారంతో స్థాపిస్తామని వెల్లడించారు. ప్రాజెక్టు ఏర్పాటుకు అవసరమైన భూమి, ఇతర సౌకర్యాల కల్పనకు ప్రజాప్రతినిధులు, అధికారులు సహకరించి, త్వరగా ప్రతిపాదనలు పంపిస్తే పవర్‌ప్లాంట్ పనులు ప్రారంభిస్తామని తెలిపారు.
2031నాటికి గరిష్టంగా తెలంగాణకి 27,059 మెగావాట్ల విద్యుత్, 2034–35 నాటికి 31,809 మెగావాట్లకుపైగా విద్యుత్ డిమాండ్ ఉంటుందని అంచనా వేశామని వివరించారు. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పీఎం కుసుమ్ పథకం కింద రాష్ట్రంలో మరో 4వేల మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని వివరించారు.
ఇందులో ప్రత్యేకంగా మహిళా సంఘాలకు ప్రాధన్యత కల్పిస్తామని భట్టి చెప్పారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మక్కాన్‌సింగ్, విజయరమణారావు, గడ్డం వివేక్, వినోద్, ప్రేమ్‌సాగర్‌రావు, సింగరేణి సీఎండీ ఎన్.బలరాం, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్‌రావు పాల్గొన్నారు.
కేసీఆర్.. ఏ ముఖం పెట్టుకొని వస్తావ్?: భట్టి విక్రమార్క
Published Sun, Sep 1 2024 5:23 AM | Last Updated on Sun, Sep 1 2024 12:34 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment