సాక్షి, పెద్దపల్లి: తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కోలుకుంటున్నారని అన్నారు మాజీ మంత్రి హరీష్‌రావు. ఆయన పూర్తిగా కోలుకున్న తర్వాత త్వరలోనే జిల్లాల్లో పర్యటిస్తారని తెలిపారు. తెలంగాణలో కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను రద్దు చేస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు హరీష్ రావు.
కాగా, పెద్దపల్లి జిల్లా కేంద్రంలో శనివారం పార్లమెంట్ నియోజకవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి నియోజకవర్గం పరిధిలోని నేతలు, బీఆర్‌ఎస్ ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ..‘కేసీఆర్ కోలుకుంటున్నారు. త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యవంతుడై ప్రజల మధ్యలోకి వస్తారు. ఫిబ్రవరిలో తెలంగాణ భవన్‌కి వచ్చి ప్రతీ రోజూ కార్యకర్తలను కలుస్తారు. త్వరలోనే కేసీఆర్ జిల్లాల పర్యటనలు ఉంటాయి. కేసీఆర్ కిట్ మీద కేసీఆర్ గుర్తును కాంగ్రెస్ ప్రభుత్వం చెరిపేస్తోంది.
కేసీఆర్ గుర్తును కేసీఆర్ కిట్ నుంచి తొలిగిస్తారేమో కానీ.. తెలంగాణ ప్రజల గుండెల నుంచి తొలగించలేరు. కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను రద్దు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రద్దులు, వాయిదాలు అన్నట్టుగా నడుస్తోంది. కాంగ్రెస్ విపరీత చర్యలపై ఉద్యమిస్తాం. బీఆర్ఎస్ కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలకు దిగితే ఎమ్మెల్యేమంతా బస్సు పట్టుకుని బాధితుల దగ్గరకు వెళ్లి ప్రభుత్వాన్ని నిలదీస్తాం. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం. తెలంగాణ కోసం ఉద్యమంలో రాజీనామాలు చేశాం తప్ప రాజీ పడలేదు. ఈ ప్రభుత్వ తీరు చూస్తుంటే ఏడాదిలోనే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదనిపిస్తోంది’ అంటూ కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment