
సాక్షి, పెద్దపల్లి: తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్‌పై కేంద్రమంత్రి బండి సంజయ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేస్తామని డబ్బులు వసూలు చేస్తారా? అని ప్రశ్నించారు. ఇదే సమయంలో కాంగ్రెస్ నేతలకు దమ్ముంటే కేంద్ర బడ్జెట్‌పై చర్చకు రావాలని సవాల్ విసిరారు.
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్రమంత్రి బండి సంజయ్ నేడు పెద్దపల్లి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్బంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. తెలంగాణలో ఎల్‌ఆర్‌ఎస్ పేరుతో రూ.50వేల కోట్ల దోపిడీకి కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేస్తామని ఇప్పుడు డబ్బులు వసూలు చేస్తారా?. ఎన్నికల సమయంలో మీరు ఇచ్చిన హామీ ఇదే(ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేస్తామని కాంగ్రెస్ నేతలు మాట్లాడిన వీడియో). ఇప్పుడు ఎందుకు మాట మార్చుతున్నారు?. కాంగ్రెస్ పార్టీ బర్త్, డెత్ రెగ్యులరైజేషన్ స్కీంలను కూడా ప్రవేశపెడతారేమో అంటూ ఎద్దేవా చేశారు.
ఇదే సమయంలో కేంద్ర బడ్జెట్‌పై దమ్ముంటే బహిరంగ చర్చకు రండి. మీకు చేతనైతే బీసీ రిజర్వేషన్లపై టెన్ జనపథ్ ఎదుట ధర్నా చేయండి. కాంగ్రెస్ నమ్మక ద్రోహానికి, బీజేపీ పోరాటాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలు ఇవి. ఈ ఎన్నికల్లో కచ్చితంగా బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
ఇదిలా ఉండగా.. ఈ నెల 27న మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్- కరీంనగర్ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలతోపాటు వరంగల్- ఖమ్మం- నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి.

Comments
Please login to add a commentAdd a comment