
సాక్షి, హైదరాబాద్: బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సెంట్రల్ కమిటీనే తెలంగాణకు కొత్త అధ్యక్షుడిని నియమించాలని డిమాండ్ చేశారు. గతంలో కొంతమంది గ్రూపిజం కారణంగా పార్టీకి నష్టం జరిగిందని ఆరోపించారు. మరోవైపు.. తాను అధ్యక్ష పదవిలో రేసులో లేనంటూ కేంద్రమంత్రి బండి సంజయ్ కుండబద్దలు కొట్టారు.
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘త్వరలో తెలంగాణకు కొత్త బీజేపీ అధ్యక్షుడు వస్తారు. అధ్యక్షుడిని స్టేట్ కమిటీ డిసైడ్ చేస్తే రబ్బర్ స్టాంప్‌లాగే ఉంటారు. సెంట్రల్ కమిటీనే రాష్ట్ర అధ్యక్షుడిని నియమించాలి. గతంలో కొంతమంది గ్రూపిజంతో పార్టీకి నష్టం జరిగింది. మంచి నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేల చేతులు కట్టేశారు. తెలంగాణలో ఫ్రీ హ్యాండ్ ఇస్తే బీజేపీ అధికారంలోకి వస్తుంది. కొత్త అధ్యక్షుడు సీక్రెట్ మీటింగ్స్ పెట్టుకోవద్దు’ అంటూ వ్యాఖ్యలు చేశారు.
అంతకుముందు, కేంద్రమంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ..‘నేను రాష్ట్ర అధ్యక్షుడు పదవి రేసులో లేను. రాష్ట్ర అధ్యక్ష పదవి రావాలని కూడా కోరుకోవడం లేదు. నాకు కేంద్ర మంత్రి పదవిని అమిత్ షా ఇచ్చారు. ఆ బాధ్యతలు నెరవేరుస్తున్నాను. జాతీయ నాయకత్వం ఏ బాధ్యత ఇచ్చినా స్వీకరిస్తాను’ అని చెప్పుకొచ్చారు. అయితే, కొద్దిరోజులుగా తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవిపై కాషాయపార్టీలో కోల్డ్ వార్ నడుస్తోంది. స్థానిక బీజేపీ నేతలు ఒకరిపై మరొకరు పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు.

Comments
Please login to add a commentAdd a comment