
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన విషయంలో శాస్త్రీయ విధానంతో కేంద్రం ముందుకెళ్లాలని, దీనికి ఆమోదం వచ్చేంతవరకు ఆ ప్రక్రియను వాయిదా వేయాలని రాష్ట్రంలోని పలు రాజకీయ పక్షాల నేతలు అభిప్రాయపడ్డారు. జనాభా ప్రాతిపదికన పునర్విభజన చేయడం వల్ల దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయని, ప్రధానంగా తెలంగాణకు రాజకీయ ముప్పు పొంచిఉంటుందని ఆందోళన వ్యక్తంచేశారు. దీనిపై శాస్త్రీయ విధానంతోనే కేంద్రం ముందుకెళ్లేలా ఒత్తిడి తెచ్చే కార్యాచరణను రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.
సోమవారం అసెంబ్లీ కమిటీ హాల్లో లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, కాంగ్రెస్ సీనియర్ నేత కె.జానారెడ్డి నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కాంగ్రెస్, సీపీఐ, ఎంఐఎం, సీపీఎం, సీపీఐఎంఎల్, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకులు హాజరయ్యారు.
భట్టి విక్రమార్క మాట్లాడుతూ లోక్‌సభ నియోజకవర్గ పునర్విభజన పేరుతో కేంద్రం ముందుకెళ్తున్న తీరుతో తెలంగాణకు జరిగే నష్టాన్ని ఎలా ఎదుర్కోవాలన్న అంశంపై చర్చించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి సూచన మేరకు సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు చెప్పారు. బీఆర్‌ఎస్, బీజేపీ నేతలు ప్రత్యేక రాజకీయ కారణాలతో హాజరుకాలేదన్నారు. కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో దక్షిణాది రాష్ట్రాల పాత్ర అనివార్యం కావాలని, ఈ క్రమంలో రాజకీయ పార్టీలు ఇచ్చే సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పారు.
సభ తీర్మానం చేయాలి: ఎంఐఎం నేత అక్బరుద్దీన్
జానారెడ్డి మాట్లాడుతూ.. దేశంలో కొత్త ఆందోళనకు దారితీయకుండా కొంతకాలం ఇదే సీట్ల సంఖ్యను కొనసాగించాలని, ఈ విషయంలో కేంద్రం పునరాలోచించకపోతే ప్రమాదం పొంచి ఉంటుందన్న విషయాన్ని వారికి తెలియజేయాలని సూచించారు. ఎంఐఎం శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజనను వ్యతిరేకిస్తూ శాసనసభలో తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపాలని చెప్పారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, సీపీఐ శాసనసభా పక్ష నేత కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ ఉత్తర భారతంలో పెరుగుతున్న లోక్‌సభ సీట్లకు అనుగుణంగా దక్షిణాదిలోనూ పెంచాలని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌తోపాటు సీపీఐ, సీపీఎం లాంటి జాతీయ పార్టీలు ఒక విధానంతో వెళ్లాలనే అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది.
ప్రతి రాష్ట్రానికి సమాన హక్కు ఉండేలా నియోజకవర్గాల పునర్విభజన జరగాలని సీపీఐఎంఎల్ నేత హనుమేశ్ అభిప్రాయపడగా, ఉత్తరాదిలో పెరుగుతున్న సీట్ల శాతం ప్రకారమే దక్షిణాదిలోనూ పెంచాలని ఆర్‌పీఐ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, సీపీఎం మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, పల్లా వెంకట్‌రెడ్డితోపాటు పలు పార్టీల నేతలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment