Nizamabad Rural Assembly Constituency
-
తెలంగాణను ఏడిపించేదే కాంగ్రెస్ పార్టీ: సీఎం కేసీఆర్
సాక్షి, నర్సాపూర్, నిజామాబాద్ రూరల్: రైతుబంధు ఉండాలంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవాలని సీఎం కేసీఆర్ అన్నారు. రైతు బంధు పథకాన్ని కలలో కూడా ఎవరూ ఊహించలేదని తెలిపారు. మొట్టమొదటిసారి రైతుబంధును పుట్టించిందే బీఆర్ఎస్ అని, ఈ పథకం కింద పెట్టుబడి సాయం అందుతుందన్నారు. దురదృష్టవశాత్తు రైతు చనిపోతే వారం రోజుల్లోనే రూ. 5 లక్షల బీమా అందిస్తున్నామని చెప్పారు. ఈ మేరకు నర్సాపూర్‌లో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఎన్నికలు వచ్చినప్పుడు ఆగం కావద్దని.. పార్టీలు, నాయకుల గురించి చర్చ జరగాలని పేర్కొన్నారు. ఒకప్పటి కాంగ్రెస్ పాలన, ప్రస్తుత బీఆర్ఎస్ పాలన ఎలా ఉందో బేరీజు వేసుకోవాలని నియోజకవర్గ ప్రజలకు సీఎం కేసీఆర్ సూచించారు. 24 గంటల కరెంట్ అవసరం లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చెబుతున్నారని, మూడు గంటల కరెంట్‌తో పొలాలు పండుతాయా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం అయితే.. ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్ అని విమర్శించారు. తెలంగాణను ఏడిపించేదే కాంగ్రెస్ పార్టీ అని మండిపడ్డారు. చదవండి: చిదంబరానికి మంత్రి హరీష్ రావు కౌంటర్ బెంగుళూరును దాటనున్నాం.. రాష్ట్రంలో ఇండస్ట్రీల కోసం బ్రహ్మాండమైన పాలసీ తీసుకొచ్చి పెట్టుబడులు సమకూర్చుతున్నామని కేసీఆర్ తెలిపారు. ఐటీ రంగంలో దూసుకుపోతున్నామని, త్వరలోనే బెంగళూరును దాటే పరిస్థితి వస్తుందన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెరిగి, ఆదాయం పెరిగిందన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ వచ్చినప్పుడు భారత్‌లో రాష్ట్రంలో 19 వ స్థానంలో ఉంటే.. నేడు 3 లక్షల 18 వేలతో తసలరి ఆదాయంలో ఇండియాలో నంబర్ వన్‌గా ఉన్నామని తెలిపారు. ‘రైతుబంధు దుబారానో లాభమో రైతులు తేల్చాలి. మూడు గంటల కరెంట్ సరిపోతుందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. 24 గంటల కరెంట్ ఉండాలంటే బీఆర్ఎస్ను గెలిపించాలి. రైతులందరూ 10 హెచ్‌పీ మోటార్ పెట్టుకోవాలని రేవంత్ అంటున్నారు. 3, 5 హెచ్‌పీ మోటారు ఉంటది రైతుల వద్ద. ఇప్పుడు 10 హెచ్‌పీ మోటార్ ఎవడు కొనియ్యాలి? ఎన్ని అవస్థలు.. ఎన్ని లంచాలు గతంలో. ఇవాళ ట్రాన్స్ఫార్మర్లు, మోటార్లు కాలడం లేదు. ఏ బాధ లేదు. మంచిగా రైతు పండించుకున్నంత చేతికి డబ్బులు వస్తున్నాయి’ అని కేసీఆర్ పేర్కొన్నారు. -
TS Election 2023: బీఆర్ఎస్కు ‘డబుల్ బెడ్రూం’ బెడద!
నిజామాబాద్: గతంలో డిచ్పల్లి పేరిట ఉండగా ప్రస్తుతం నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంగా మారింది. డిచ్పల్లి మండలం ధర్మారం(బి) గ్రామానికి చెందిన మండవ వెంకటేశ్వరరావు ఇక్కడి నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మూడు సార్లు మంత్రిగా, ఒకసారి ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్‌గా ఆయన పని చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో వచ్చిన ఉప ఎన్నికల్లో మండవ వెంకటేశ్వరరావుపై కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి ఆకుల లలిత విజయం సాధించి 10 నెలల పాటు ఎమ్మెల్యేగా పని చేయడం చెప్పుకోదగ్గ విషయం. ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలు: నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో రాజకీయ చైతన్యం ఎక్కువ. ఆర్ఎస్ఎస్, హిందూత్వ ప్రభావం బాగానే ఉంటుంది. కాలేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ 21, 22 ప్యాకేజీ, మంచిప్ప ప్రాజెక్టు ద్వారా నియోజకవర్గంలోని లక్ష ఎకరాలకు సాగు నీరు అందిస్తామని బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. కానీ ఆ హామీ నెరవేరలేదు. మంచిప్ప రిజర్వాయర్ నిర్మాణం వల్ల ఆ గ్రామంతో పాటు బైరాపూర్, అమ్రాబాద్ గ్రామ పంచాయతీల పరిధిలోని 8 తండాలు ముంపునకు గురవుతున్నాయి. ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉంది. డిచ్పల్లి మండలం బీబీపూర్ తండ వద్ద మాత్రమే 50 మందికి డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇచ్చారు. మిగిలిన మండలాల్లో డబుల్ బెడ్రూం ఇండ్ల జాడే లేదు. రైతులు ధరణి సమస్యలపై ఆగ్రహంగా ఉన్నారు. గల్ఫ్ కార్మికులు సుమారు 33వేల మంది వరకు ఉంటారు. వారి కుటుంబ సభ్యులను లెక్కేస్తే 90వేల వరకు ఉంటారు. జక్రాన్‌పల్లి ఎయిర్‌పోర్టు ఏర్పాటు లో జాప్యం, గల్ఫ్ కార్మికులతో పాటు సమస్యలు ఎన్నికలపై ప్రభావితం చూపే అవకాశాలుంటాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన హామీల్లో 2లక్షల పంట రుణమాఫీ, రూ. 500 లకే సిలిండర్, నిరుద్యోగ భృతి తదితర హామీలు గ్రామాల్లో చర్చనీయాంశంగా ఉన్నాయి. రాజకీయపరంగా బీఆర్ఎస్ నేతల అసమ్మతి, కాంగ్రెస్, బీజేపీలో నాయకుల మధ్య అంతర్గత విబేధాలు ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపనున్నాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులు: బీఆర్ఎస్: ► సిట్టింగ్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కాంగ్రెస్ పార్టీ : ► మాజీ ఎమ్మెల్సీలు డాక్టర్ భూపతిరెడ్డి ► అరికెల నర్సారెడ్డి ► నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కాటిపల్లి నగేష్‌రెడ్డి బీజేపీ: ► మాజీ జెడ్పీటీసీ దినేష్‌కుమార్ వృత్తిపరంగా ఓటర్లు: రైతులు ఎక్కువగా ఉంటారు.. లంబాడా గిరిజనులు కూడా ఎక్కువగానే ఉంటారు. మతం/కులం పరంగా ఓటర్లు: ► బీసీ ఓటర్లు : మున్నూరుకాపులు 40 వేలు ► యాదవులు/గొల్లకుర్మలు 15వేలు ► పద్మశాలీలు 19వేలు, ముదిరాజ్‌లు 20వేలు ► ఎస్సీలు : 28 వేలు, ఎస్టీలు 22వేలు ► క్రిస్టియన్లు : 10వేలు ► ముస్లీం మైనార్టీలు :15 వేలు భౌగోళిక పరిస్థితులు.. జిల్లాలోనే ప్రసద్ధి చెందిన డిచ్పల్లి ఖిల్లా రామాలయం, రామడుగు ప్రాజెక్టు, తెలంగాణ యూనివర్సిటీ, సారంగపూర్ హనుమాన్ ఆలయం, ఇందల్వాయి రామాలయం, సిరికొండ లొంక రామేశ్వరాలయం నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోనే ఉన్నాయి. ఈ నియోజకవర్గం చుట్టూ సరిహద్దులుగా 8 నియోజకవర్గాలు ఉన్నాయి. సిరికొండ, ఇందల్వాయి, మోపాల్, డిచ్పల్లి, రూరల్ మండలాల్లో అటవీ ప్రాంతం ఉంది. రాజకీయపరమైన అంశాలు.. బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరో కన్ఫాం అయ్యింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తన కుమారుడు ధర్పల్లి జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ మోహన్ రెడ్డిని బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎన్నికల్లో నిలబెట్టాలని ప్రయత్నించారు. కానీ అధిష్టానం మాత్రం బాజిరెడ్డికే మరోసారి టికెట్ కట్టబెట్టింది. ఇక కాంగ్రెస్‌కు చెందిన మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ భూపతిరెడ్డిపై ప్రజల్లో సానుభూతి ఉంది. ఈసారి ఆయనకే కాంగ్రెస్ పార్టీ టికెట్ వస్తుందని భావిస్తున్నారు. మరోవైపు తన మేనల్లుడు, ప్రముఖ సినీహీరో నితిన్ అండతో ఏఎంసీ మాజీ చైర్మన్ కాటిపల్లి నగేష్‌రెడ్డి కాంగ్రెస్ టికెట్ తెచ్చుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వీరిద్దరికి తోడు మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు సహకారంతో పార్టీ టికెట్ కోసం యత్నిస్తున్నారు. -
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ రాజకీయ చరిత్ర
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి సిటింగ్ ఎమ్మల్యేగా ఉన్న బాజిరెడ్డి గోవర్దన్ 2018లో మరోసారి గెలిచారు. ఆయన అంతకుముందు ఒకసారి ఆర్మూరులోను, మరోసారి బాన్స్వాడలోను విజయం సాదించారు. బాజిరెడ్డి మొత్తం నాలుగుసార్లు గెలిచినట్లయింది. 2014 ఎన్నికల ముందు అనూహ్యమైన రీతిలో బాజిరెడ్డి గోవర్దన్ టిఆర్ఎస్లో చేరి కాంగ్రెస్ ఐ ప్రముఖ నేత డి.శ్రీనివాస్‌ను ఓడిరచారు. తిరిగి మరోసారి ఇక్కడే ఆయన కాంగ్రెస్ ఐ సమీప ప్రత్యర్ది భూపతి రెడ్డిపై 25655 ఓట్ల మెజార్టీతో గెలిచారు. భూపతి రెడ్డి టిఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉంటూ టిక్కెట్ ఇవ్వలేదన్న కోపంతో కాంగ్రెస్ ఐలోకి మారి ఓటమి చెందారు. బాజిరెడ్డి గోవర్ధన్‌కు 87756 ఓట్లు రాగా భూపతి రెడ్డికి 57911 ఓట్లు వచ్చాయి. కాగా బిజెపి పక్షాన పోటీచేసిన కేశుపల్లి ఆనందరెడ్డికి పదహారువేల పైచిలుకు ఓట్లు లభించాయి. బాజిరెడ్డి గోవర్ధన్ మున్నూరు కాపు సామాజికవర్గానికి చెందినవారు. గతంలో డిచ్ పల్లి నియోజకవర్గంగా ఉన్న ఈ ప్రాంతంలో కమ్మ సామాజికవర్గం నేతలు అత్యధికసార్లు గెలిచినా, ప్రస్తుతం మున్నూరు కాపు వర్గం నేతలకు అవకాశం వచ్చింది. ఈ నియోజకవర్గం పునర్విభజన జరిగిన తర్వాత నిజామాబాద్ రూరల్‌గా మారింది. అంతకుముందు డిచ్పల్లి పేరుతో ఉండేది. రద్దయిన డిచ్పల్లి, ఇప్పటి నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఏడుసార్లు కమ్మ సామాజికవర్గం నేతలు గెలుపొందితే, రెండుసార్లు రెడ్లు, మూడుసార్లు బిసి(మున్నూరుకాపు) నేతలు ఎన్నికయ్యారు. సీనియర్ నేత మండవ వెంకటేశ్వరరావు ఐదుసార్లు విజయం సాధించారు. రద్దు అయిన డిచ్‌పల్లిలో ఎనిమిదిసార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ ఐ రెండుసార్లు, టిడిపి ఐదు సార్లు, సోషలిస్టు పార్టీ మరోసారి గెలిచాయి.1983 నుంచి 2009 వరకు ఒక ఉప ఎన్నికలో తప్ప కాంగ్రెస్ ఎన్నడూ గెలవలేకపోయింది. మండవ వెంకటేశ్వరరావు గతంలో చంద్రబాబు క్యాబినెట్లో మంత్రిగా ఉన్నారు. టిఆర్ఎస్ పక్షాన 2004లో గెలిచిన గంగారెడ్డి అంతకుముందు టిడిపి తరుఫున మూడుసార్లు ఎమ్.పి.గా నెగ్గారు. 1991లో టిడిపి ఎమ్.పిగా గెలిచిన ఈయన పి.వి. ప్రభుత్వాన్ని రక్షించడానికి ఆయనకు మద్దతు ఇచ్చి కాంగ్రెస్ ఐలోకి వెళ్లారు. 1998లో తిరిగి టిడిపిలోకి వచ్చి మరో రెండుసార్లు ఎమ్‌పి అయ్యారు. 2004 నాటికి టిఆర్ఎస్లో చేరి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత కొంతకాలానికి ఆయన ఈ పార్టీకి కూడా దూరం అయ్యారు. 2008 ఉప ఎన్నికలో కాంగ్రెస్ పక్షాన పోటీచేసిన ఆకుల లలిత గెలిచారు. ఆ తర్వాత ఆమె ఎమ్మెల్సీ అయ్యారు. 2018లో ఆమె ఆర్మూరులో పోటీచేసి ఓడిపోయారు. తదుపరి ఆమె టిఆర్ఎస్లో చేరిపోయారు. నిజామాబాద్ రూరల్‌లో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
తెలంగాణ కమలం పార్టీ ఆఫీస్‌లో కలకలం.. ఒక్కసారిగా దూసుకొచ్చి..
సాక్షి, హైదరాబాద్: ఇందూరు కమలం దళంలో రేగిన చిచ్చు.. హైదరాబాద్ లోని స్టేట్ పార్టీ కార్యాలయానికి పాకింది. ఎంపీ ధర్మపురి అరవింద్ తీరుపై స్థానిక అసమ్మతి నేతలు ఆందోళనకు దిగారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పార్టీ సీనియర్ నేతలు సముదాయించినా అసమ్మతి నేతలు వినకపోవడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. నిజామాబాద్ కాషాయ పార్టీ నేతల ఆందోళనకు కారణమేంటీ ? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వారికి ఏం చెప్పి సముదాయించారు? నిజామాబాద్ జిల్లాలో కాషాయ పార్టీ రెండుగా చీలింది. నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు బస్వ లక్ష్మీ నర్సయ్య ఇటీవల 13 మండలాల అధ్యక్షులను తొలగించి.. కొత్త వారిని నియమిస్తున్నట్లు ప్రకటించారు. స్థానిక నేతలతో చర్చించకుండా.. నేరుగా కొత్తవారిని ప్రకటించడంపై అసమ్మతివర్గం రగిలిపోయింది. ఎంపీ అరవింద్ పట్టుబట్టి పార్టీ మండల అధ్యక్షులను మార్చివేశారని అసమ్మతివర్గం ఆరోపిస్తోంది. (చదవండి: విశ్వనగరమట.. కనీస స్పందన ఉండదా?.. కేసీఆర్, కేటీఆర్‌లపై రేవంత్‌రెడ్డి ఫైర్) బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ అర్భన్ నియోజకవర్గాలకు చెందిన కొంత మంది నేతలు వచ్చి ఒక్కసారిగా బైఠాయించి.. ఆందోళనకు దిగారు. అరవింద్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పార్టీ రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి ఉమాశంకర్, రాష్ట్ర కార్యదర్శి ప్రకాశ్ రెడ్డి.. వారిని సముదాయించే ప్రయత్నం చేసినా వినలేదు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిజామాబాద్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ బీజేపీ నుంచి పోటీ చేయడానికి చాలా మంది అభ్యర్థులు ఆసక్తి చూపుతున్నారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి పార్టీ జిల్లా అధ్యక్షుడు బస్వ లక్ష్మీనర్సయ్య పోటీ చేయాలని గట్టిపట్టుదలతో ఉన్నారు. ఎంపీ అరవింద్ ప్రోత్సాహంతో ధన్ పాల్ సూర్యనారయణ గుప్త అక్కడ పనిచేసుకుంటున్నారు. ఇక ఆర్మూర్ లోనూ ఇద్దరు నేతలు పోటీ పడుతున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన వినయ్ రెడ్డితో పాటు ఇటీవల పార్టీలో చేరిన వ్యాపారవేత్త రాకేశ్ రెడ్డి ఆర్మూర్ బీజేపీ టికెట్ కోసం పోటీ పడుతున్నారు. (చదవండి: మోదీ సర్కార్‌పై అవిశ్వాస తీర్మానం.. లోక్‌సభలో ఎవరి బలం ఎంతంటే!) బోధన్ అసెంబ్లీ నుంచి ప్రకాశ్ రెడ్డితో పాటు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. జిల్లాలో నేతల మధ్య వర్గపోరు తారస్థాయికి చేరింది. (చదవండి: కాంగ్రెస్‌లోకి వస్తూనే టికెట్ల పంచాయితీ పెట్టిన జూపల్లి! నాగం ఆగమాగం.. చేరికపై ట్విస్టయితే ఉండదుగా!) ఇదే తరుణంలో మండలాల అధ్యక్షులను మార్చడం.. వచ్చే ఎన్నికల్లో పోటీచేయాలనుకున్న కొంత మంది.. అసమ్మతి వర్గానికి ఆజ్యం పోయడంతో ఆ రచ్చ కాస్తా బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరింది. ఎంపీ అరవింద్ మాత్రం.. మండలాల అధ్యక్షుల మార్పులో తనప్రమేయం లేదని చెబుతున్నారు. ఆందోళనకు దిగిన నిజామాబాద్ అసమ్మతి నేతలను కిషన్ రెడ్డి పిలిపించుకుని మాట్లాడారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆందోళన చేయడంపై వారికి గట్టి వార్నింగ్ ఇచ్చారు. సమస్య ఉంటే అంతర్గతంగా కూర్చొని సెట్ చేసుకోవాలని.. ఇలా వీధిన పడటం భావ్యం కాదని క్లాస్ తీసుకున్నారు. ఈ నెల 29న అమిత్ షా పర్యటన తర్వాత... సర్ధుబాటు చేసుకుందామని చెప్పి ఆందోళనకు దిగిన అసమ్మతి నేతలను కిషన్ రెడ్డి తిరిగి పంపించారు. -సాక్షి, పొలిటికల్ డెస్క్