సాక్షి, హైదరాబాద్: ఇందూరు కమలం దళంలో రేగిన చిచ్చు.. హైదరాబాద్ లోని స్టేట్ పార్టీ కార్యాలయానికి పాకింది. ఎంపీ ధర్మపురి అరవింద్ తీరుపై స్థానిక అసమ్మతి నేతలు ఆందోళనకు దిగారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పార్టీ సీనియర్ నేతలు సముదాయించినా అసమ్మతి నేతలు వినకపోవడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. నిజామాబాద్ కాషాయ పార్టీ నేతల ఆందోళనకు కారణమేంటీ ? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వారికి ఏం చెప్పి సముదాయించారు?
నిజామాబాద్ జిల్లాలో కాషాయ పార్టీ రెండుగా చీలింది. నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు బస్వ లక్ష్మీ నర్సయ్య ఇటీవల 13 మండలాల అధ్యక్షులను తొలగించి.. కొత్త వారిని నియమిస్తున్నట్లు ప్రకటించారు. స్థానిక నేతలతో చర్చించకుండా.. నేరుగా కొత్తవారిని ప్రకటించడంపై అసమ్మతివర్గం రగిలిపోయింది. ఎంపీ అరవింద్ పట్టుబట్టి పార్టీ మండల అధ్యక్షులను మార్చివేశారని అసమ్మతివర్గం ఆరోపిస్తోంది.
(చదవండి: విశ్వనగరమట.. కనీస స్పందన ఉండదా?.. కేసీఆర్, కేటీఆర్‌లపై రేవంత్‌రెడ్డి ఫైర్)
బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ అర్భన్ నియోజకవర్గాలకు చెందిన కొంత మంది నేతలు వచ్చి ఒక్కసారిగా బైఠాయించి.. ఆందోళనకు దిగారు. అరవింద్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పార్టీ రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి ఉమాశంకర్, రాష్ట్ర కార్యదర్శి ప్రకాశ్ రెడ్డి.. వారిని సముదాయించే ప్రయత్నం చేసినా వినలేదు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
నిజామాబాద్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ బీజేపీ నుంచి పోటీ చేయడానికి చాలా మంది అభ్యర్థులు ఆసక్తి చూపుతున్నారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి పార్టీ జిల్లా అధ్యక్షుడు బస్వ లక్ష్మీనర్సయ్య పోటీ చేయాలని గట్టిపట్టుదలతో ఉన్నారు.
ఎంపీ అరవింద్ ప్రోత్సాహంతో ధన్ పాల్ సూర్యనారయణ గుప్త అక్కడ పనిచేసుకుంటున్నారు. ఇక ఆర్మూర్ లోనూ ఇద్దరు నేతలు పోటీ పడుతున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన వినయ్ రెడ్డితో పాటు ఇటీవల పార్టీలో చేరిన వ్యాపారవేత్త రాకేశ్ రెడ్డి ఆర్మూర్ బీజేపీ టికెట్ కోసం పోటీ పడుతున్నారు.
(చదవండి: మోదీ సర్కార్‌పై అవిశ్వాస తీర్మానం.. లోక్‌సభలో ఎవరి బలం ఎంతంటే!)
బోధన్ అసెంబ్లీ నుంచి ప్రకాశ్ రెడ్డితో పాటు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. జిల్లాలో నేతల మధ్య వర్గపోరు తారస్థాయికి చేరింది.
(చదవండి: కాంగ్రెస్‌లోకి వస్తూనే టికెట్ల పంచాయితీ పెట్టిన జూపల్లి! నాగం ఆగమాగం.. చేరికపై ట్విస్టయితే ఉండదుగా!)
ఇదే తరుణంలో మండలాల అధ్యక్షులను మార్చడం.. వచ్చే ఎన్నికల్లో పోటీచేయాలనుకున్న కొంత మంది.. అసమ్మతి వర్గానికి ఆజ్యం పోయడంతో ఆ రచ్చ కాస్తా బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరింది. ఎంపీ అరవింద్ మాత్రం.. మండలాల అధ్యక్షుల మార్పులో తనప్రమేయం లేదని చెబుతున్నారు.
ఆందోళనకు దిగిన నిజామాబాద్ అసమ్మతి నేతలను కిషన్ రెడ్డి పిలిపించుకుని మాట్లాడారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆందోళన చేయడంపై వారికి గట్టి వార్నింగ్ ఇచ్చారు. సమస్య ఉంటే అంతర్గతంగా కూర్చొని సెట్ చేసుకోవాలని.. ఇలా వీధిన పడటం భావ్యం కాదని క్లాస్ తీసుకున్నారు. ఈ నెల 29న అమిత్ షా పర్యటన తర్వాత... సర్ధుబాటు చేసుకుందామని చెప్పి ఆందోళనకు దిగిన అసమ్మతి నేతలను కిషన్ రెడ్డి తిరిగి పంపించారు.
-సాక్షి, పొలిటికల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment