TS Assembly Top Stories
-
చివరి ప్రచార సభలో కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు..!
సాక్షి, గజ్వేల్ : ‘నరేంద్రమోదీ దేశం మొత్తం 157 మెడికల్ కాలేజీలు పెట్టాడు. నేను 100సార్లు అడిగితే కూడా తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేదు. జిల్లాకో నవోదయ పాఠశాల ఇవ్వాలని చట్టంలో ఉన్నా ఒక్కటి కూడా ఇయ్యలే. ఇలాంటి బీజేపీకి ఒక్క ఓటు కూడా ఎందుకెయ్యాలి. మనమేమన్న పిచ్చిపోషి గాళ్లమా..మనం గొర్రెలం కాదని 30వ తేదీ నిరూపించాలి. మన మీద కుట్రలు చేసే కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు ఓటేయాలో ఆలోచించాలి. ఏమియ్యకున్నా ఓటేస్తే మనల్ని గొర్రెలే అనుకుంటారు’ అని బీఆర్ఎస్ చీఫ్, సీఎం కేసీఆర్ గజ్వేల్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గజ్వేల్‌లో జరిగిన చివరి ప్రచార సభలో ఆయన మాట్లాడారు. ‘కాంగ్రెస్ గెలిచేది లేదు సచ్చేది లేదు. ఒకవేళ గెలిస్తే ఇందిరమ్మ రాజ్యం తెస్తామంటున్నరు. ఆకలి చావుల ఇందిరమ్మ రాజ్యం ఎవరికి కావాలి. నెహ్రూ, ఇందిర పాలనలో మంచి పనులు చేస్తే దళితులు ఇంకా ఇలా ఎందుకు ఉన్నారు కాంగ్రెస్ వస్తే ఆకలిచావులే. రైతుబంధు దుబారా అని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతున్నడు. రైతులకు 3 గంటల కరెంట్ చాలని పీసీసీ అధ్యక్షుడంటున్నడు. 3 గంటల కరెంట్ కావాల్నా..24 గంటల కరెంట్ కావాల్నా’ అని కేసీఆర్ కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. ‘ఫిబ్రవరి నెల వస్తే నాకు 70 ఏళ్లు వస్తాయి. తెలంగాణ తెచ్చిన కీర్తి నాకు చాలు. పదవులు వద్దు. ఇప్పటికే పదేళ్లు ముఖ్యమంత్రిగా చేశాను. తెలంగాణ నెంబర్ వన్ కావాలన్నదే నా లక్ష్యం. ఈసారి బీఆర్ఎస్ గెలిస్తే గజ్వేల్ నియోజకవర్గంలో అందరికీ దళితబంధు ఇస్తాం. గజ్వేల్‌లో రెండుసార్లు గెలిపించారు. ఈసారి మళ్లీ ఆశీర్వదించండి. గజ్వేల్‌కు ఐటీ టవర్లు తెచ్చిపెట్టే బాధ్యత నాది. మల్లన్నసాగర్ ముంపు బాధితులకు కాలుష్య రహిత పరిశ్రమలు తీసుకువచ్చి ఉద్యోగాలు కల్పిస్తా. వారికి త్యాగం వెలకట్టలేనిది. వారికి నా కృతజ్ఞతలు. ట్రిపుల్ ఆర్ పూర్తయితే గజ్వేల్ దశ మారిపోతుంది’అని కేసీఆర్ తెలిపారు. ఇదీచదవండి..తెలంగాణ ఓటర్లకు సోనియాగాంధీ భావోద్వేగ సందేశం -
బీజేపీ, ఎంఐఎం, బీఆర్ఎస్ కలిసే పనిచేస్తాయి: రాహుల్ గాంధీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు చివరి రోజు ప్రచారంలో కాంగ్రెస్ నేతలు స్పీడ్ పెంచారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. నాంపల్లిలో కాంగ్రెస్ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ క్రమంలో బీజేపీ, బీఆర్ఎస్పై విరుచుకుపడ్డారు. నాంపల్లి సభలో రాహుల్ మాట్లాడుతూ.. ‘ప్రేమను పంచాలనే లక్ష్యంతో భారత్ జోడో యాత్ర చేశాను. బీజేపీ విభజన రాజకీయాలు చేసింది. మన దేశ సంస్కృతి ఇది కాదు. నాపై దేశవ్యాప్తంగా కేసులు పెట్టారు. నాపై పరువు నష్టం కేసు కూడా వేశారు. నా లోక్‌సభ సభ్యత్వాన్ని కూడా రద్దు చేశారు. నాపై 24 కేసులు ఉన్నాయి. వివాదాస్పద వ్యాఖ్యలు చేసే ఒవైసీపై ఎన్ని కేసులు ఉన్నాయి. కాంగ్రెస్ నేతలపై ఈడీ, సీబీఐ, ఐటీ దాడులు ఉంటాయి. ఒవైసీపై ఎందుకు ఉండవు. కాంగ్రెస్, బీజేపీ పోటీచేసే రాష్ట్రాల్లో.. మా ఓట్లు చీల్చేందుకు ఎంఐఎం వస్తుంది. బీజేపీ ఇచ్చిన లిస్ట్‌తో తమ అభ్యర్థులను ఎంఐఎం ప్రకటిస్తుంది. బీజేపీ, ఎంఐఎం, బీఆర్ఎస్ మూడు పార్టీలు కలిసి పనిచేస్తాయి. నేను మోదీతో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. కేంద్రంలో మోదీని ఓడించాలంటే.. తెలంగాణలో కేసీఆర్‌ను ఓడించాలి. హైదరాబాద్‌లో మెట్రో, ఎయిర్‌పోర్టు నిర్మించింది కాంగ్రెస్ హయాంలోనే. బైబై కేసీఆర్ అని చెప్పే సమయం వచ్చింది’ అని కామెంట్స్ చేశారు. -
BRS ధనిక పార్టీ.. డబ్బు ఎలా వచ్చింది: ప్రియాంక గాంధీ
సాక్షి, జహీరాబాద్: నేటితో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెర పడనుంది. ఈ క్రమంలో చివరి రోజు పార్టీల నేతలు ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఇక, కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ.. జహీరాబాద్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బీఆర్ఎస్పై విరుచుకుపడ్డారు. ఈ సందర్బంగా ప్రియాంక మాట్లాడుతూ.. పదేళ్లలో బీఆర్ఎస్ ఏంచేసింది. ప్రశ్నాపత్నాలు లీక్ అయ్యాయి. ధరణితో రైతుల కష్టాలు పెరిగాయి. రుణమాఫీ పూర్తి కాలేదు. ఇచ్చిన హామీలను బీఆర్ఎస్ నెరవేర్చలేదు. అధిక ధరలు సామాన్యుడికి భారంగా మారాయి. బైబై కేసీఆర్.. మార్పు రావాలి. తెలంగాణలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయి. ప్రాజెక్ట్‌ల నిర్మాణంలో బీఆర్ఎస్ అవినీతి చేసింది. బీఆర్ఎస్ అత్యంత ధనిక పార్టీ. ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. కర్ణాటకలో మహిళల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నాం.. ఇక్కడ కూడా అమలు చేస్తాం’ అని అన్నారు. -
గెలిచినా, ఓడినా.. ప్రజల కోసమే పనిచేస్తా
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం రాజకీయ వారసురాలిగా ఆమె కోడలు, ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి ఇప్పుడు హుజూర్నగర్ నుంచి సీపీఎం అభ్యర్థీగా అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగారు. మల్లు స్వరాజ్యం రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన 40 ఏళ్ల తర్వాత అదే కుటుంబం నుంచి లక్ష్మి పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె వివిధ అంశాలపై మాట్లాడారు. ఆమె మాటల్లోనే.. మహిళల సంక్షేమం, అభివృద్ధిపై వివక్ష.. మహిళా సంక్షేమం, అభివృద్ధిపై ప్రభుత్వాలు వివక్ష చూపుతున్నాయి. పాలకులెవరైనా కొన్నేళ్లుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ, బీఆర్ఎస్ మహిళల సంక్షేమానికి పాటుపడుతున్నామని చెబుతున్నాయే తప్ప ఆచరణలో పట్టించుకోవడం లేదు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా.. మల్లు స్వరాజ్యం కోడలిగా ఆమె చూపిన బాటలో నడుస్తున్నా. ప్రజా పోరాటాలు చేసినా, ప్రజాస్వామిక ఎన్నికల్లో పోటీ చేసినా ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం. ఎన్నికల్లో గెలుపొందడం ద్వారా ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారం చూపించవచ్చనే ఆలోచనతోనే ఎన్నికల బరిలో నిలిచాను. గెలిచినా, ఓడినా ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతా. మహిళల్లో చైతన్యం తీసుకురావడం ద్వారా సమానత్వం, మహిళా సంక్షేమం, అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేస్తా. అత్తామామల ప్రోద్బలంతోనే.. మా అత్తామామ మల్లు స్వరాజ్యం, మల్లు వెంకటనర్సింహారెడ్డి, నా భర్త నాగార్జునరెడ్డి ప్రోత్సాహంతోనే ఇంతవరకు వచ్చాను. వివాహం అయ్యాక అత్తమామల ప్రోద్బలంతో కుటుంబాన్ని చూసుకుంటూనే చదువుకున్నా. డిగ్రీ, ఎల్ఎల్బీ పూర్తి చేశా. రాజకీయ అవగాహన ఉంది సీపీఎం అనుబంధ ప్రజా సంఘమైన ఐద్వాకు లీగల్ సెల్ కన్వీనర్‌గా పనిచేశా. ఐద్వా ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేశా. తెలంగాణ వచ్చిన తర్వాత ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నా. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో నల్లగొండ స్థానం నుంచి సీపీఎం తరఫున పోటీచేశా. పోరాటమే గెలిపిస్తుంది నిత్యం ప్రజల్లో ఉంటూ మహిళలు, కార్మిక సమస్యలపై పోరాడాను. సూర్యాపేట మండలం రాయినిగూడెం ఏకగ్రీవ సర్పంచ్‌గా ఎన్నికయ్యాక, రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించి ఏకగ్రీవ పంచాయతీలకు నిధులు సాధించా. నల్లగొండలో డ్వాక్రా మహిళలకు రూ.10 లక్షల రుణాలు, గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలని కలెక్టరేట్ ఎదుట ధర్నాలు చేశాను. పోలీసుల లాఠీచార్జ్‌లకు గురయ్యా.. జైలుకు వెళ్లా. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల సమస్యలపై పోరాడాను, ఏడు కిలోమీటర్లు పాదయాత్ర చేశా. నిరంతరం ప్రజల కోసం పోరాడా.. ఆ పోరాటమే నన్ను ఈ ఎన్నికల్లో గెలిపిస్తుందని ఆశిస్తున్నా. నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక కృషి ఈ ఎన్నికల్లో గెలిస్తే ఉపాధిహామీ పనులను పట్టణ ప్రాంతాలకు విస్తరింపజేసేలా కృషిచేస్తా. మేళ్లచెరువు, మఠంపల్లి మండలాల్లో దాదాపు 30 వేల ఎకరాల్లో సాగుచేస్తున్న మిర్చి, పత్తి పంటలకు వాటికి సరైన మార్కెట్ సౌకర్యం లేదు. శీతల గిడ్డంగులు లేవు. హుజూర్‌నగర్‌లో మహిళా డిగ్రీ కళాశాల కావాలి. మండలానికి ఒక పాలిటెక్నిక్, జూనియర్ కాలేజీ ఉండాలి. సాగర్ ఎడమ కాలువ చివరి భూములకు నీరందడం లేదు. లిఫ్టులు సరిగా పనిచేయడం లేదు. పోడు భూములకు పట్టాలు లేవు. ఇలా నియోజకవర్గంలో అనేక అనేక సమస్యలు ఉన్నాయి. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఆయా సమస్యల సత్వర పరిష్కారం కోసం కృషిచేస్తా. - చింతకింది గణేశ్ -
తిట్లకు జామర్‌ను కనుగొనాల్సిన అవసరముంది!
‘‘డార్విన్ పరిణామ సిద్ధాంతమనేది రాజకీయాల్లో తిట్లక్కూడా వర్తిస్తుందేమో నాయనా’’ అంటూ విలక్షణమైన స్టేట్మెంట్ ఇచ్చారు స్వామీ ఎలక్షనానంద అలియాస్ స్వామీ సలక్షణానంద. ‘‘అదెలా స్వామీ?’’ అడిగాడు శిష్యుడు. ‘‘ఒకప్పుడు రాజకీయాల్లో విమర్శలుండేవి. తర్వాత అవి కువిమర్శలయ్యాయి, అటు తర్వాత తిట్లు, ఆపైన బూతులు..తాజాగా ఇప్పుడు బండబూతులు. అందుకే పరిణామ క్రమం ఒక్క జీవులకే కాదు... తిట్లకూ ఉందనిపిస్తోంది. అంతేనా..‘యథా తిట్లూ... తథా యాడ్స్’ అన్నట్టుగా కొన్ని పార్టీల ప్రకటనలైతే ఎదుటివాడిపై అరుస్తున్నట్టు..ప్రేక్షకుణ్ణి కరుస్తున్నట్టూ ఉన్నాయి నాయనా’’ ‘‘మొదట్లో అరే..ఒరే అని తిట్టుకుంటున్నవాళ్లు కాస్తా..ఈమధ్య అంతకంటే ఘోరంగా ముందుకెళ్తున్నారు. మొన్న కేటీఆర్ రేవంత్‌ను తిట్టాడనుకో. నిన్న మళ్లీ రేవంత్ కేసీఆర్‌ను తిడతాడు. ‘నీకంటే చాలా పెద్దవాడు కదా..కేసీఆర్‌ను అలా తిట్టడం సబబేనా?’ అని అడిగితే..‘మరి కేటీఆర్‌కూ నాకు మధ్య అంతే ఏజ్ గ్యాప్ ఉంది కదా. అప్పుడు నేను కేసీఆర్‌ను అనడం సమంజసమే కదా’ అంటూ జస్టిఫికేషన్లు ఇచ్చుకుంటూ మరీ తిట్టుకుంటున్నారు. ఇక మైనంపల్లి తిట్లయితే..తాజాగా తెగ వైరల్. పరిస్థితి చూస్తుంటే బాధగా ఉంది స్వామీ’’ అన్నాడు శిష్యుడు దిగులుగా. ‘‘అలనాడెప్పుడో ప్రఖ్యాత సినీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు, తాను రాసిన ‘క–రాజు కథలు’ అనే అద్భుత కథాసంపుటిలోని ‘పలుకుబడి’ అనే కథలో ‘తిట్లు మంచివే’ అంటాడు. పైగా తిట్టేవాడెప్పుడూ (సమాజంలో) పై అంతస్తులో ఉంటాడట. తిట్టేవారికే అందరూ మద్దతు పలుకుతారట. అందుకే (విద్యార్థులు)అందరితోనూ తిట్లు తెగ ప్రాక్టీస్ చేయించాల్సిన అవసరముందనీ, ఎవరైతే తిట్లలో ప్రావీణ్యం సాధిస్తారో, వారి ‘పలుకుబడే’ రాజ్యంలో ఇంతింతై అన్నట్టుగా పెరుగుతుందని, దాదాపు పాతికేళ్ల కిందటే సెలవిచ్చారు. అదేదో యాడ్‌లో మరక మంచిదే అన్నట్టుగా... సింగీతం వారి సిద్ధాంతం ప్రకారం ‘తిట్లూ మంచివేనేమో’నంటూ సర్దుకుపోవాల్సిందే నాయనా’’ ‘‘అలా ఎలా అన్నారు సింగీతం వారు..తిట్లు మంచివెలా అవుతాయి స్వామీ?’’ ‘‘ఆ హాస్య కథల్లో వ్యంగ్యంగా అన్నమాట అది. ‘భాష రాకపోయినా సరే..బేరాలాడే సమయంలో సైగలతోనైనా సర్దుకుపోతారు ప్రజలు. కానీ బేరం కుదరక కోపం వచ్చిందనుకో..తిట్టుకుంటారూ, ఆపైన కొట్టుకుంటారు. ఇయ్యరమయ్యర కొట్టుకోవడం కంటే..పొట్టుపొట్టుగా తిట్టుకోవడం బెటరంటారు సింగీతం వారు. అలా తిట్టుకుని తాము సాధించిన ‘పై అంతస్తు’తో ఇగో చల్లారిపోయిందనుకో..దాంతో కొట్టుకోవడం ఆగిపోతే అది మంచిదేగా అని ఉద్బోధిస్తారు నాయనా. మనవాళ్లూ తెగ తిట్టుకుని అక్కడితో అలా ఆగిపోతున్నారుగా. కాబట్టి సింగీతం వారి సిద్ధాంతం ప్రకారం అది బెటరేగా’’ ‘‘అసలిలా ఇంతగా తిట్టుకోడానికి కారణం ఏమిటంటారు? ‘‘అదేదో సినిమా డైలాగ్ ఉంది కదా నాయనా. లాస్ట్ పంచ్ మనదైతే వచ్చే కిక్కే వేరని. దాని కోసమే ఇలా తిట్టుకుంటున్నట్టుంది. కానీ వీళ్లు గ్రహించాల్సిందేమిటంటే..ఎవడికి వాడు ఇదే లాస్ట్ పంచ్ అనుకుంటాడు తప్ప..ఆ లాస్ట్ అనేది ఎప్పటికీ రాదనీ, అదో చైన్ రియాక్షన్‌లా అలా సాగిపోతూనే ఉంటుందని ఎవరూ గ్రహించడం లేదు. అయినా పర్లేదులే ఇంకెంత..జస్ట్ రెండు రోజులేగా’’ ‘‘రెండ్రోజుల్లో ఈ అసెంబ్లీ ఎన్నికలు ముగుస్తాయి సరే..ముందుంది మొసళ్లపండగ అన్నట్టు..మున్ముందు ఎంపీ ఎలక్షన్లూ, ఆ పైన స్థానిక ఎన్నికలూ, అటు తర్వాత మున్సిపల్ ఎన్నికలూ..ఇలా ఎలక్షన్లూ, తిట్లూ ఎప్పటికీ ముగిసేవి కాదు స్వామీ. ఏం జరిగితే అవి ఆగుతాయో తెలియడం లేదు’’ బెంగగా అన్నాడు శిష్యుడు.‘‘అందుకే నాకనిపిస్తోంది నాయనా..బాంబులకు ఉన్నట్టే... బూతులకూ జామర్ కనుగొంటే బాగుండు’’ అంటూ తాను దిగులు పడ్డారు స్వామీ ఎలక్షనానంద. -
TS: ఊపు ఊపిన సోషల్ ప్రచారం
వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్.. జనాలకు ఇదొక నిత్యవ్యవహారం(నిత్యావసరం!). కానీ, రాజకీయ పార్టీలకు, నేతలకు మాత్రం అవసరాన్ని బట్టి వాడకంగా మారింది. ప్రత్యేకించి ఎన్నికల సమయంలో ఇది వాళ్లకు అత్యంత ప్రాధాన్యమిచ్చే అంశం. త్వరగతిన ప్రజలకు చేరాలంటే సోషల్ మీడియాను మించిన వేగవంతమైన వేదిక వాళ్లకు మరొకటి కనిపించడం లేదు మరి. అందుకే.. అన్ని మాధ్యమాల్లో ఈసారి ఎన్నడూ లేనంతంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల Telangana Assembly Election 2023 కంటెంట్ వైరల్ అయ్యింది. నిస్సారంగా సాగుతున్న నేతల ప్రసంగాల నడుమ.. ఒక రకంగా ఎన్నికల సమరానికి ఊపు తెచ్చింది కూడా ఈ సామాజిక మాధ్యమ ప్రచారమే! సోషల్ మీడియా ప్రచారంలో నేతల ఊకదంపుడు ఉపన్యాసాలుంటేనే సరిపోదు. జనంలోకి దూసుకెళ్లే స్థాయిలోనే కంటెంట్‌లో దమ్ముండాలి. అయితే ఇక్కడ నేతల డిజిటల్ క్యాంపెయినింగ్‌పైనా ఎన్నికల సంఘం నజర్ ఉంటుంది. అభ్యర్థుల ఖర్చు పరిమితి రూ.40లక్షలు దాటకూడదని ఎన్నికల సంఘం మార్గదర్శకాలు ఉన్నాయి. కాబట్టి తమ ప్రచార ఖర్చులన్నింటిలోనే సోషల్ మీడియా నిర్వహణ కూడా ఉండేలా చూసుకోవాలి. వ్యక్తిగత ఖాతాల నిర్వహణ.. వాటి కోసం ఎంత మంది పని చేస్తున్నారు.. వాళ్ల జీతభత్యాలు, ఇతర ఖర్చుల వివరాలు.. నేతల ప్రసంగాల్లో ఈసీ కోడ్ ఉల్లంఘనలు ఏమైనా ఉన్నాయా?.. నిశిత పరిశీలన ఉండాలి. అదే.. ఎన్నికల నిబంధనల్లో ఎక్కడా పార్టీల ఖర్చు పరిమితిపై ఆంక్షలు లేవు. దీంతో నేతల పేర్ల ప్రస్తావన తేకుండా.. పార్టీలను గెలిపించాలంటూ ప్రధానంగా సోషల్ మీడియా ప్రచారం ఉవ్వెత్తున సాగింది. పాటలు.. పదనునైన తూటాలు గులాబీల జెండలే రామక్క.. మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి.. సాలు దొర, సెలవు దొర అంటూ.. ప్రకటనలు సోషల్ మీడియాను ఒక ఊపు ఊపాయి స్వరాష్ట్ర ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగేసేలా చేసి.. ఇక్కడి ప్రజల నరాల్ని ఉత్తేజితం చేసిన తెలంగాణ పాటకు ఇప్పుడు రాజకీయ రంగు పలుముకుంది. ఉద్యమ గాయకులు, జానపద కళాకారులుగా పేరొందిన ఎందరో.. పూర్తిగా పార్టీలకు ఆస్థాన గాయకులుగా పని చేశారు. పొగడ్తలు, విమర్శలతో.. విడివిడిగా, కలగలిపి రూపొందించిన పాటలు ఈసారి తెలంగాణ ఎన్నికల ప్రచారంలో Telangana Assembly Election 2023 ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. స్పెషల్ సాంగ్స్‌తో పాటుగా జానపద గేయాలకు.. ఆఖరికి సినిమా పాటల పేరడీలు సైతం జనాదరణతో సంబంధం లేకుండా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌తో జబర్దస్త్ ఫేమ్ వేణు డైరెక్ట్ చేసిన బలగం సినిమాను సైతం.. ఏ నేత వదలకుండా ‘ప్రజలే మా బలగం’ అంటూ పోస్టర్లు వదిలారు. ఇంటర్వ్యూల పర్వం.. వయసు తారతమ్యాలు లేకుండా యూట్యూబ్‌కు ఇప్పుడు ఎక్కువ ప్రాధాన్యం ఉంటోంది. ఫుల్ వీడియోలతో పాటు షార్ట్ వీడియోలపై ఎక్కువ స్క్రీన్ టైం గడిపేస్తున్నారు. అందుకే యూట్యూబ్ ప్లాట్‌ఫామ్‌ను తమ ప్రచారం కోసం వాడేసుకున్నాయి పొలిటికల్ పార్టీలు. రాజకీయ మేధావులు, ప్రముఖ జర్నలిస్టులతో పాటు అటు జాతీయస్థాయిలో.. ఇటు స్థానికంగానూ జనాల నోళ్లలో ఎక్కువగా నానుతుండే యూట్యూబర్లు, బుల్లి తెర నుంచి జనాలకు ఎక్కువగా పరిచయమున్న వాళ్లు.. రాజకీయ నేతల్ని ఇంటర్వ్యూలు చేశారు. లీడర్లు సైతం తమ ప్రచారానికి ఉపయోగపడే రీతిలో ఉండేలాగానే ఆ ఇంటర్వ్యూల్ని ప్లాన్ చేయించుకోవడం గమనార్హం. ఈ విషయంలో ప్రత్యర్థుల నుంచి విమర్శలు ఎదురైనా సరే నేతలు తేలికగా తీసుకున్నారు. డిజిటల్ ఫ్లాట్‌ఫామ్ ఇంటర్వ్యూలలో పాడ్‌కాస్ట్, రేడియోలను సైతం వదల్లేదు. వ్యక్తిగత దూషణలు ఈసారి తెలంగాణలో ప్రధాన పార్టీల కీలక నేతల ప్రచారాల ప్రసంగాల్లో పెద్దగా ప్రత్యేకత ఏం కనిపించలేదు. సామెతలు, పిట్ట కథలతో సమాజాన్ని ఆకట్టుకునే కేసీఆర్ సైతం.. ప్రతిపక్షాలపై సాధారణ విమర్శలతోనే సరిపెట్టారు. అయితే వ్యక్తిగత విమర్శల పర్వం మాత్రం షరా మామూలుగా కొనసాగింది. ‘‘చిప్పకూడు తిన్న సిగ్గు రాలే..!!’’ అంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, బక్కోడు భూబకాసరుడు అంటూ కేసీఆర్‌ను ఉద్దేశించి రేవంత్ చేసిన వ్యాఖ్యలు.. ఓ మోతాడు డోసుతో సాగింది విమర్శల పర్వం. బడా-చోటా నేతలు ప్రచారంలో విమర్శలు-ప్రతివిమర్శలకు దిగి ఎన్నికల సమరాన్ని హీటెక్కించారు. రాజకీయ ప్రసంగాలు సాదాసీదాగా సాగినప్పటికీ.. అక్కడక్కడ మాత్రం ఆ విమర్శలు బూతుల దాకా వెళ్లాయి. ఉదాహరణకు.. మొన్నటిదాకా బీఆర్ఎస్లో ఉన్న ఖానాపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖానాయక్.. టికెట్ దక్కకపోవడంతో కాంగ్రెస్ కండువా కప్పేసుకుని కేసీఆర్‌పైనే వ్యక్తిగత దూషణలకు దిగారు. మైనంపల్లి, మల్లారెడ్డిల మధ్య విమర్శలైతే ఒక పరిధిని దాటాయి. ఇక.. పార్టీల మధ్య దూషణలు, విమర్శలు తీవ్రతరమై యాడ్స్ రూపేణా కనిపించడంతో ఎన్నికల సంఘం కలుగజేసుకుని చర్యలతో వాటిని కట్టడి చేసింది. Credits: Nenu Mari Antha Yedvanaaaa Insta Page ఇదేందయ్యా ఇది.. ఇది ఊహించలే! తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు Telangana Assembly Election 2023 ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఇదే. సాధారణంగా.. నేతలు తమ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలలో, పార్టీలు తమ అధికారిక పేజీలలో.. ఇవేగాక ఫలానా నేతల ‘సైన్యం’(ఆర్మీ) పేరిట పేజీలు, ఫ్యాన్ మేడ్ హ్యాండిల్స్ ఉండనే ఉన్నాయి. అయితే అదేం విచిత్రమో.. నిత్యం సినిమా డైలాగులు, ఫన్నీ సీన్ల ఫొటోలతో మీమ్స్ వేసి ఫాలోవర్లకు వినోదం పంచే సోషల్ మీడియా పేజీలు సైతం పొలిటికల్ టర్న్ తీసుకున్నాయి. ఫలానా పేజీ ఫలానా రాజకీయ పార్టీకి.. వకాల్తా పుచ్చుకుని మరీ పోస్టింగ్‌లు చేశాయి. ప్రభుత్వ, పార్టీ విజయాలపై లబ్ధిదారులతో ప్రచారం. ఈసారి వ్యహారమంతా పార్టీల పరాజయాలపై పోస్టులు. నేతల స్పీచ్లలోని తప్పులు.. చేష్టలపై మీమ్స్.. ట్రోల్స్ ఇలా నడిచింది. ఆఖరికి.. పార్టీల మేనిఫెస్టోలను కూడా సోషల్ మీడియా పేజీలు ప్రచారం చేశాయంటే ఈసారి సోషల్ ప్రచారం ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి 29ఏళ్ల లోపు ఓటర్లు 72లక్షల మంది ఉన్నట్లు ఎన్నికల సంఘం గణాంకాలు చెబుతున్నాయి. దాదాపు 10 లక్షల మంది 18-19 వయసులో(కొత్త ఓటర్లు) ఉన్నవాళ్లు ఉన్నారు. ఇక 30పైబడిన వాళ్లలోనూ సామాజిక మాధ్యమాలలో టైంపాస్ బాపతు ఎక్కువే ఉన్నారు. వీళ్లను ఆకట్టుకునే ప్రయత్నంలో భాగంగానే.. ఇలాంటి పేజీలను పొలిటికల్ పార్టీలు తమ ఆధీనంలోకి తీసుకుని ఉంటాయనేది స్పష్టంగా తెలుస్తోంది. ట్రెండింగ్‌లో హెలికాఫ్టర్ ఎక్కడో ఆదిలాబాద్‌లో పార్టీ ప్రచార సభలో మాట్లాడిన నేత.. గంటన్నర తర్వాత సంగారెడ్డి మీటింగ్‌లో కనిపిస్తారు. ఆ తర్వాత గంటకు ఎక్కడో నల్లగొండ బహిరంగ సభలో ప్రసంగిస్తుంటారు. వందల కిలోమీటర్ల దూరం.. వాయువేగంతోనే వెళ్తే సాధ్యమవుతుంది కదా!. అలా ఈసారి ఎన్నికల్లో నేతల హెలికాఫ్టర్ల వాడకం ఎక్కువగా కనిపించింది. ప్రధాన పార్టీల అగ్రనేతలు మాత్రమే కాదు.. స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఉన్నవాళ్లూ, కీలక నేతలు, ఓ మోస్తరు నేతలు సైతం విమానల్లో చక్కర్లు కొట్టేశారు. అదే సమయంలో.. రెంట్‌కు హెలికాఫ్టర్లను అందించే కంపెనీలకైతే ఫుల్ గిరాకీ నడిచింది. అలా హెలికాఫ్టర్ ట్రెండ్ కూడా సోషల్ మీడియాకు ఎక్కింది. బర్రెలక్క నాగర్ కర్నూల్ పెద్దకొత్తపల్లి మండలం మరికల్ గ్రామానికి చెందిన 26 ఏళ్ల కర్నె శిరీష.. ‘బర్రెలక్క’గా తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ ఇప్పుడు. స్వతంత్ర అభ్యర్థినిగా నాగర్ కర్నూల్ బరిలో నిలిచిన శిరీష గురించి మీడియా, సోషల్ మీడియా విపరీతంగా చర్చించింది. చాలాకాలం కిందట.. డిగ్రీ చదివి కూడా నిరుద్యోగిగా ఉన్నానంటూ ఉద్యోగాల నోటిఫికేషన్.. నియామకాల భర్తీ విషయంలో ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తూ బర్రెలను మేపుతూ సరదాగా వీడియో అప్లోడ్ చేసి ‘బర్రెలక్క’ ఫేమస్ అయ్యింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో నామినేషన్ వేయడం.. ప్రచారం చేసుకునేందుకు సైతం డబ్బులు లేవంటూ సోషల్ మీడియాలో విజ్ఞప్తులు.. ఆ వీడియోకు నిరుద్యోగ యువత కదిలివచ్చి చందాలేసుకుని మరీ ఆమె కోసం ప్రచారంలోకి దిగడం.. గుర్తుతెలియని వర్గం ఆమె బృందంపై దాడి చేయడం.. కన్నీళ్లతో ఆమె మాట్లాడిన మాటలు.. ఆ వెంటనే ఆమె లభించిన మేధోవర్గాల, కొందరు రాజకీయ నేతల మద్ధతు.. హైకోర్టు ఆదేశాలతో గన్‌మెన్ సెక్యూరిటీ.. ఈ పరిణామాలన్నింటిని నడుమ సోషల్‌మీడియాలో ఆమెకు విపరీతంగా పెరిగిన సానుభూతి రప్పించి ఈ దఫా ఎన్నికల్లో ఈమె గురించి చర్చించుకునేలా చేశాయి. ఇవేకావు తమ నియోజకవర్గ ఓటర్లు ఏ ప్రాంతంలో ఉన్నా.. ఫోన్లు చేసి, మెసేజ్‌లు పంపి మీటింగ్‌లకు రమ్మని ఆహ్వానాలు పంపడం. వాట్సాప్‌లో సందేశాలు.. ఒక అడుగు ముందుకేసి రాజకీయ ప్రత్యర్థుల అవినీతి-అసమర్థతలను ఎండగట్టే రీతిలో రూపొందించిన కరపత్రాల పంపిణీ.. ఫేక్ ప్రచారాలు వాటిని ఖండిస్తూ వచ్చిన ఫ్యాక్ట్ చెకింగ్ కౌంటర్లు.. ఇలా షరామాములుగానే కనిపించింది. నవంబర్ 28 సాయంత్రం ఎన్నికల ప్రచారం ముగియనున్న నేపథ్యంలో కథనం -
కాంగ్రెస్‌వాళ్లే రైతుబంధు ఆపారు: కేసీఆర్
సాక్షి, షాద్‌నగర్: కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్నీ బాధలే. చావునోట్లో తలపెట్టి తెలంగాణ సాధించుకున్నామని సీఎం కేసీఆర్ అన్నారు. పార్టీల చరిత్ర చూసి ఓటు వేయాలని ప్రజలను ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. సోమవారం సీఎం కేసీఆర్ షాద్‌నగర్ బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగించారు. ‘ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎలాంటి వారో అన్నీ చూసి ఓటు వేయాలి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను అభివృద్ధి చేసుకుంటున్నాం. పార్టీల చరిత్ర చూసి ఓటు వేయ్యాలి. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక పెన్షన్ రూ.5వేలు వరకు ఇస్తాం. రైతుబంధు దుబారా అని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. రైతుబంధు ఉండాలంటే మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణిని తీసేస్తారట. ధరణి స్థానంలో భూమాత తెస్తామంటున్నారు. కాంగ్రెస్ వాళ్లే రైతుబంధును ఆపారు. కాంగ్రెస్‌లో కూడా రైతుబంధు తీసుకున్న నేతలు, కార్యకర్తలు ఉన్నారు. కాంగ్రెస్ వాళ్లకు సిగ్గు ఉందా?. రైతుల నోటికాడ బుక్క గుంజుకుంటారా?. షాద్‌నగర్ వరకు మెట్రో తెచ్చే బాధ్యత నాది. షాద్‌నగర్‌కు మెట్రో వస్తే.. ఇక్కడ భూముల ధరలు మూడింతలు పెరుగుతాయి. రైతుబంధు ఆపేస్తే కాంగ్రెస్ వాళ్లకు కూడా నష్టమే. కాంగ్రెస్ నేతల ఫిర్యాదుతోనే రైతుబంధును ఈసీ నిలిపివేసింది. పాలమూరు ఎత్తిపోతలు పూర్తి కాకుండా కాంగ్రెస్ వాళ్లే స్టేలు తెచ్చారు’ అంటూ విమర్శలు చేశారు. తెలంగాణను ఊటగొట్టిన పార్టీ కాంగ్రెస్.. తెలంగాణను ఊటగొట్టిన పార్టీ కాంగ్రెస్ అని సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ చరిత్ర ప్రజలకు తెలుసని అన్నారు. తెలంగాణను సాధించేందుకే ఈ పార్టీ పుట్టిందని గుర్తు చేశారు. ఓటు తలరాతను మారుస్తుందని పేర్కొన్నారు. ఆచితూచి ఓటు వేయాలని ప్రజలకు సూచించారు. ఆందోల్‌లో నిర్వహించి ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. పార్టీల చరిత్ర, అభ్యర్థుల చరిత్రను గమనించి ఓటు వేయాలని సీఎం కేసీఆర్ ప్రజలను కోరారు. ప్రజల హక్కులను కాపాడే పార్టీ బీఆర్ఎస్ అని అన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని నిర్వీర్యం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించిందని పేర్కొన్నారు. ఎన్నికల తర్వాత పెన్షన్లు రూ.5వేలకు పెంచామని తెలిపారు. కంటి వెలుగు వంటి మంచి కార్యక్రమాలతో అభివృద్ధి దిశగా నడిచామని స్పష్టం చేశారు. -
మార్పు కోసమే ప్రజలు ఓటేయబోతున్నారు: సచిన్ పైలట్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందిపరిచ్చిన గ్యారంటీలు ఖచ్చితంగా అమలు చేస్తామని రాజస్థాన్ ఎమ్మెల్యే, ఏఐసీసీ జాతీయ నాయకులు సచిన్ పైలట్ తెలిపారు. తెలంగాణ యువత కాంగ్రెస్‌కు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పారదర్శక పాలన అందిస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు ప్రజల్లో మంచి స్పందన ఉందని.. రాహుల్ గాంధీ, ఖర్గే, ప్రియాంకా గాంధీల పర్యటనలకు మంచి స్పందన వస్తుందని సచిన్ పైలట్ తెలిపారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో ఆకాంక్షలు నెరవేరలేదని, నిరుద్యోగం పెరిగి పోతుందని విమర్శించారు. ప్రజలు ప్రభుత్వ మార్పు కోరుకుంటున్నారని తెలిపారు. భారత్ జోడోయాత్ర ద్వారా తెలంగాణలో రాహుల్ గాంధీ 4 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశారని గుర్తు చేశారు. ‘చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లతోపాటు పాటు తెలంగాణలోను కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. 30వ తేదీ జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటేయాలి. కాంగ్రెస్‌కు అధికారం ఇవ్వాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. బీఆరెస్ ప్రభుత్వం ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. వారికి క్రెడిబిలిటి లేదు. ఉద్యోగాలు ఇవ్వలేదు.. నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. కర్ణాటక విజయం తరువాత జరుగుతున్న తెలంగాణ ఎన్నికల్లో కూడా అలాంటి ఫలితమే వస్తుంది. ఓట్ ఫర్ చేంజ్.. మార్పు కోసమే ప్రజలు ఓటేయబోతున్నారు. రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి బహుమతిగా ఇవ్వండి. రాజస్థాన్‌లో 5 సంవత్సరాలకోసారి ప్రభుత్వాన్ని మార్చే సంప్రదాయం ఉంది. సంప్రదాయాన్ని బ్రేక్ చేసి అక్కడ మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది. కేంద్ర ప్రభుత్వం రాజస్థాన్‌కు ఎలాంటి సహకారం ఇవ్వలేదు. ప్రజలు అర్ధం చేసుకున్నారు. ప్రజలు బీజేపీకి వ్యతిరేకంగా ఓటేశారు. సీఎం అభ్యర్థి అనేది కాంగ్రెస్‌లో ఉండదు. అధిష్టానం సీఎంను సెలెక్ట్ చేస్తుంది.’ అని పైలట్ తెలిపారు -
ఐటీ పార్కుల్లో మతం ఎక్కడిది?.. కేటీఆర్‌పై కిషన్ రెడ్డి ఫైర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ గజ్వేల్, కామారెడ్డిలో ఓడిపోతున్నారని రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. ఈ రెండు చోట్లా బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుస్తున్నారని ఆయన తెలిపారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ తెలంగాణకు ప్రమాదకరమని సీరియస్ కామెంట్స్ చేశారు. కాగా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సూటుకేసుల ప్రభుత్వం వస్తుంది. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అని ప్రచారం చేస్తే ఊరుకునేది లేదు. కాంగ్రెస్, బీఆర్ఎస్ తెలంగాణను పాలించిన తీరు, కేంద్రంలో బీజేపీ పాలన తీరును బేరీజు వేసుకుని ఓటు వేయండి. మోదీని అడ్డుకోవడానికి బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి డ్రామాలు చేస్తున్నాయి. కేసీఆర్ పోటీ చేసిన రెండు చోట్లలో ఓడిపోతారు. బీజేపీ అక్కడ విజయం సాధిస్తుంది. కామారెడ్డిలో కేసీఆర్‌ను గెలిపించడానికి రేవంత్ రెడ్డి పోటీచేస్తున్నారు. తెర వెనుక బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసిన తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటారు. బీజేపీ కమిట్మెంట్ను మ్యానిఫెస్టో రూపంలో తెలంగాణ ప్రజల ముందు పెట్టాం. ఆచరణ సాధ్యం కాని హామీలు ఇవ్వలేదు. కాంగ్రెస్ మైనారిటీ డిక్లరేషన్, కేసీఆర్ మైనార్టీలకు ఇచ్చిన హామీలు ఒక్కటే. మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీ పడి హామీలు ఇస్తున్నారు. రాజ్యాంగ విరుద్ధమైన హామీలు ఇస్తున్నారు.. ముస్లిం సమాజం అర్థం చేసుకోవాలి. ఐటీ పార్కుల్లో మతం ఎక్కడిది?. ముస్లీం ఐటీ టవర్స్ కట్టడం ఏంటి?. సాప్ట్ వేర్ రంగంలో కూడా కేటీఆర్ మతాన్ని జోప్పిస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలనలో పాతబస్తీ ఎందుకు అభివృద్ధి చేయలేదు?. ఇన్నాళ్లు పాతబస్తీ యువతకు ఉపాధి అవకాశాలు ఎందుకు కల్పించలేదు. పాతబస్తీలో అక్షరాస్యత శాతం ఎందుకు తక్కువగా ఉంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఒవైసీ కుటుంబానికి అండగా ఉన్నాయి తప్ప.. సామాన్య ముస్లీం సమాజానికి ఏం చేయలేదు. ఒవైసీ కుటుంబం శాసిస్తే కేసీఆర్ ఏదైనా చేస్తారు. పాతబస్తీ ప్రజలు చదువుకుంటే ఒవైసీ కబంధ హస్తాల నుంచి బయటకు వస్తారని అక్షరాస్యత పెంచకుండా చూస్తున్నారు. పాతబస్తీకి మెట్రో వసతి ఎందుకు కల్పించలేకపోయారు. దారుసలాంను ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంఐఎం దారాదత్తం చేసింది’ అంటూ విమర్శించారు. -
తెలంగాణ ఎన్నికలు.. సీఈవో వికాస్‌రాజ్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన సీఈఓ వికాస్‌రాజ్ కీలక కామెంట్స్ చేశారు. బ్యాలెట్ ఓట్ల వివరాలను కూడా ఆయన వెల్లడించారు. ఈసారి బ్యాలెట్ ఓట్లు భారీగా పెరిగినట్టు తెలిపారు వికాస్ రాజ్. కాగా, రాష్ట్ర శాసనసభ ఎన్నికల ఏర్పాట్లపై ఆదివారం ఆయన బీఆర్కేఆర్ భవన్లో మాట్లాడుతూ.. శనివారం నాటికి 1,24,239 మంది ఓటర్లు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేశారు. గత శాసనసభ ఎన్నికల్లో మొత్తంగా 1,00,135 పోస్టల్ బ్యాలెట్లే నమోదుకాగా.. ఈసారి భారీగా పెరుగుతున్నాయి. ∙కొత్త ఓటర్ల కోసం ఓటరు గుర్తింపు కార్డుల ముద్రణ పూర్తయింది. ఈ ఏడాది 54.39 లక్షల కార్డులను ముద్రించారు. ఇంకా 3 లక్షల కార్డులను బూత్ స్థాయి అధికారుల (బీఎల్ఓ) ద్వారా పంపిణీ చేయాల్సి ఉంది. ∙ 119 శాసనసభ నియోజకవర్గాల్లో మొత్తం 2,290 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా.. అందులో 2,068 మంది పురుషులు, 221 మంది మహిళలు, ఒకరు ట్రాన్స్‌జెండర్ ఉన్నారు. ∙మొత్తం 49 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. 31 జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో నాలుగు చొప్పున కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ∙ఎన్నికల్లో 1.85 లక్షల మంది పోలింగ్ సిబ్బంది, 22 వేల మంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు. బీఎల్ఓలను కలుపుకొంటే మొత్తం 2.5లక్షల మంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. ఎన్నికల బందోబస్తు కోసం 45వేల మంది రాష్ట్ర పోలీసులు, 3 వేల మంది అటవీ, ఎక్సైజ్‌శాఖ సిబ్బందితోపాటు 50 కంపెనీల టీఎస్ఎస్పీ, 375 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించనున్నారు. ∙కర్ణాటక, ఏపీ, మహారాష్ట్రల నుంచి 5 వేల మంది చొప్పున, మధ్యప్రదేశ్, తమిళనాడుల నుంచి 2 వేల చొప్పున, ఛత్తీస్‌గఢ్ నుంచి 2,500 మంది కలిపి.. మొత్తంగా 23,500 మంది హోంగార్డులు రాష్ట్ర ఎన్నికల బందోబస్తు విధుల్లో పాల్గొననున్నారు. -
రెండున్నర లక్షల ఓట్లు.. ఆర్టీసీ ఉద్యోగులు ఎటు వైపో?
సాక్షి, హైదరాబాద్: ఈ ఎన్నికల్లో ‘ఆర్టీసీ ఓటర్లు’ కీలకంగా మారబోతున్నారు. ప్రస్తుతం సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు, పదవీ విరమణ పొందిన ఉద్యో గులకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా రెండున్నర లక్షల వరకు ఓట్లున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో వారి సంఖ్య అధికంగా ఉంది. నగరంలోని ఎల్బీనగర్ నియోజకవర్గంలో 10 వేల వరకు ఉన్నాయి. ఇలాంటి నియోజకవర్గాలు మరికొన్ని ఉన్నాయి. మిగతా ప్రాంతాల్లో అంతగా లేనప్పటికీ, వేలల్లోనే ఉండటం విశేషం. ప్రస్తుతం ఆర్టీసీలో 43 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. రిటైర్ అయిన ఆర్టీసీ ఉద్యోగులు దాదాపు 20 వేలమంది ఉన్నారు. వారి కుటుంబాలకు సంబంధించి దాదాపు 2.43 లక్షల ఓట్లు ఉన్నట్టు అంచనా. గత రెండు ఎన్నికల్లో ఆర్టీసీ ఉద్యోగులు ఎక్కువగా బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలిచారు. ఈసారి వారి ఓట్లను సాధించేందుకు కాంగ్రెస్ తీవ్రంగా యత్నిస్తోంది. ఇటీవలే ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసిన నేపథ్యంలో, బీఆర్ఎస్ పార్టీ వారి ఓట్లు తనకే అధికంగా వస్తాయని ఆ పార్టీ నమ్మకంగా ఉంది. చదవండి: ‘ప్రజల తెలంగాణ’ కల నిజం చేస్తాం ప్రచారంలో ఆర్టీసీ ప్రస్తావన.. నష్టాల్లో కూరుకుపోయి దివాలా దిశలో ఉన్న ఆర్టీసీని ఆదుకుని తిరిగి నిలబెట్టిన ఘనత తమదే అని బీఆర్ఎస్ నేత లు ప్రచారం చేస్తున్నారు. దీనికి కౌంటర్ ఇస్తూ కాంగ్రెస్ ఆరోపణలు గుప్పిస్తోంది. ఆర్టీసీ ఉద్యోగులను బీఆర్ఎస్ ప్రభుత్వం వంచించిందని, వారికి అందాల్సిన దీర్ఘకాలిక బకాయిలను కూడా చెల్లించక ఇబ్బంది పెడుతోందని చెబుతోంది. బస్సుల సంఖ్య తగ్గించి ఆర్టీసీని నిర్వీర్యం చేసిందని, తెలంగాణ వచ్చిన తర్వాత అసలు ఆర్టీసీలో నియామకాలే చేపట్టలేదని, ఫలితంగా ఉద్యోగుల సంఖ్య తగ్గిపోయిందని పేర్కొంటోంది. ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాలకు రుణాలు ఇస్తూ ఉపయోగపడే సహకార పరపతి సంఘం నిధులు వాడేసుకుందని, సంస్థకు ప్రభు త్వం నుంచి నిధులు రాక సహకార పరపతి సంఘం మూతపడబోతోందని కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది. ప్రభుత్వంలో విలీనం చేయటం ద్వారా ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో వేతనాలు అందబోతున్నాయని బీఆర్ఎస్ చెప్తోంటే, విలీనం పేరుతో కాలయాపన చేసిన ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క నెల కూడా వేతనాలు అందించలేకపోయిందని కాంగ్రెస్ విమర్శిస్తోంది. బీజేపీ కూడా ఆర్టీసీ విషయంలో ప్రభుత్వం తీరుపై విమర్శలు గుప్పిస్తోంది. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనానికి మద్దతుగా ఉద్యోగులు బీఆర్ఎస్కు అండగా నిలుస్తారో, ఏళ్లు గడుస్తున్నా బకాయిలు చెల్లించకపోవటం, సీసీఎస్‌ను నిర్వీర్యం చేయటం, నియామకాలు లేకపోవటాన్ని పరిగణనలోకి తీసుకుని వేరే పార్టీలకు మద్దతుగా నిలుస్తారో వేచి చూడాలి. -
కాంగ్రెస్‌కు ఒక్క చాన్స్ ఇవ్వండి
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్/పటాన్ చెరు/గచ్చిబౌలి (హైదరాబాద్): తాను ఓడిపోతే రెస్ట్ తీసుకుంటామని చెబుతున్న సీఎం కేసీఆర్‌ను ఫామ్ హౌస్‌కే పరిమితం చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. ఓటమి తప్పదని తెలిసే కేసీఆర్ ఇలా అంటున్నారని చెప్పారు. తదాస్తు దేవతలు ఉన్నారని, వారంలోనే ఆయన మాట నెరవేరనుందన్నారు. ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండుసార్లు సీఎంగా కేసీఆర్‌కు అవకాశం ఇచ్చారు. ఒక్కసారి కాంగ్రెస్‌కు అవకాశం ఇవ్వండి. ఇందిరమ్మ రాజ్యం ఏర్పాటు చేస్తాం’అని చెప్పారు. ఇవి సెమీఫైనల్ ఎన్నికలని, రాష్ట్రంలో ప్రజలందరి సహకారంతో భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. దీంతో 2024లో ఢిల్లీ ఎర్రకోటలో తిరంగా జెండా ఎగుర వేయడానికి మార్గం సుగమవుతుందని, మోదీని ఇంటికి పంపిస్తామన్నారు. రేవంత్ ఆదివారం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి, పటాన్చెరు, ఉమ్మడి పాలమూరు జిల్లాలోని నారాయణపేట, దేవరకద్ర, మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన ప్రచార సభల్లో మాట్లాడారు. ‘ఈ బకాసురుడికి రూ. లక్ష కోట్లు దోచినా చాలట్లేదు. ధరణి పేరుతో రాష్ట్రంలో పదివేల ఎకరాలు మింగాడు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కేసీఆర్ ఎక్కడ దాక్కున్నా తోకబట్టి ఈడ్చుకొచ్చి రూ.లక్ష కోట్లను కక్కిస్తాం. సీఎం కేసీఆర్‌కు చర్లపల్లి జైల్లోనే డబుల్ బెడ్రూం నిర్మిస్తాం.. దోపిడీలో భాగమైన కొడుకు, బిడ్డ, అల్లుడికీ చోటు కల్పిస్తాం’అని వ్యాఖ్యానించారు. పాలమూరు బిడ్డ సంతకంతోనే.. పదేళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్నా కేసీఆర్ ఏనాడూ పాలమూరును పట్టించుకోలేదని రేవంత్ అన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి పూర్తిచేసే బాధ్యత కాంగ్రెస్‌దని చెప్పారు. ఈసారి ఎన్నికల్లో పాలమూరు బిడ్డను గెలిపించుకోకుంటే మళ్లీ గుంపు మేస్త్రీలు సంతల్లో పశువుల్లా వలస తీసుకెళ్లే పరిస్థితి వస్తుందన్నారు. కాంగ్రెస్‌లో శషబిషలు, గ్రూపులు, గుంపులు లేవన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలపై ఎవరైనా చేయిచేసుకుంటే వారి గుడ్లు పీకి గోళీలు ఆడతానని హెచ్చరించారు. రాష్ట్రంలోని 119 మంది కాంగ్రెస్ అభ్యర్థుల్లో ఎంతోమంది పెద్దవాళ్లు, ఉద్దండులున్నా పాలమూరు బిడ్డ సంతకంతోనే పోటీలో నిలుస్తున్నారని, ఇది పాలమూరు గడ్డ గొప్పతనమని చెప్పారు. పాలమూరు బిడ్డలు నాటిన మొక్కను నరికేందుకు ఢిల్లీ నుంచి మోదీ, గల్లీ నుంచి కేడీ, కేటీఆర్, హరీశ్ గొడ్డళ్లు పట్టుకుని వస్తున్నారని, పాలమూరు బిడ్డలు చైతన్యంతో ఎదురు తిరగాలని పిలుపునిచ్చారు. మూడోసారి మనవడికి ఇస్తారా? కేసీఆర్ మూడోసారి గెలిపించాలని కోరుతున్నారని, ఇప్పటికే తాను సీఎం అయి, కొడుకు, అల్లుడిని మంత్రులను చేశారని, సంతోష్‌రావును ఎంపీగా చేశారని, నిజామాబాద్‌లో నేలకేసికొడితే బిడ్డను మళ్లీ ఎమ్మెల్సీని చేశారని, ఈసారి గెలిస్తే మనవడిని మంత్రి చేస్తారని రేవంత్ వ్యాఖ్యానించారు. లక్కీ నెంబర్ ఆరు లాగా మనవడు మంత్రి అయ్యాడంటే అందరికీ పదవులొచ్చినట్లవుతుందని అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. టీఎస్పీఎస్సీ 17 పరీక్షలను నిర్వహించి పల్లీలను అమ్మినట్లు పరీక్ష పేపర్లను అమ్మి మోసం చేసిందని, నిరుద్యోగులంతా కేసీఆర్‌కు బుద్ధి చెప్పాలన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేసే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుందని చెప్పారు. కార్యక్రమాల్లో యెన్నం శ్రీనివాస్‌రెడ్డి (మహబూబ్‌నగర్), పరి్ణకారెడ్డి (నారాయణపేట), జి.మధుసూదన్‌రెడ్డి (దేవరకద్ర), జగదీశ్వర్‌గౌడ్ (శేరిలింగంపల్లి), కాట శ్రీనివాస్ గౌడ్ (పటాన్చెరు) పాల్గొన్నారు. -
పేదరికం లేని తెలంగాణే నా పంతం
నాకు తెలంగాణ తీసుకువచ్చిన ఘనతే ఆకాశమంత పెద్దది. దానికి మించిన పదవి ఉందా? రెండుసార్లు సీఎంగా పనిచేసిన. పదేళ్లు సీఎంగా ఉన్నా. ఇక్కడ నా కంటే ఎక్కువకాలం పదవిలో ఉన్న సీఎం ఉన్నడా? 70 ఏళ్లొచ్చాయి. ఇంతకంటే జీవితంలో ఇంకేం కావాలి? పేదరికంలేని తెలంగాణే నా పంతం. అందుకే బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలి. సాక్షి ప్రతినిధి, కరీంనగర్/సాక్షి, సిద్దిపేట/ఖానాపూర్: పేదరికం లేని తెలంగాణ తన పంతమని.. కేరళ తరహాలో వందశాతం అక్షరాస్యత, నిరంతరం తాగునీరు, ప్రతీ ఇంచుకు సాగునీరు రావాలనేదే తన లక్ష్యమని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెప్పారు. రైతాంగం గుండెల మీద చేతులు వేసుకుని నిద్రపోయే తెలంగాణ కావాలని.. దానికోసమే తాను తండ్లాడుతున్నానని, పదవి కోసం కాదని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే దళారీ రాజ్యం వస్తుందని, తెలంగాణ ఆగమైపోతుందని వ్యాఖ్యానించారు. ఆదివారం జగిత్యాల, వేములవాడ, దుబ్బాక, ఖానాపూర్ నియోజకవర్గాల్లో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘ఎన్నికలనగానే ఆగమాగం కావొద్దు. అభ్యర్థులు, పార్టిల చరిత్ర చూసి ఓటేయాలి. అసలు ఉన్న తెలంగాణను ఊడగొట్టి, ఆంధ్రాల కలిపిందే కాంగ్రెస్ పార్టీ. ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ ఉద్యమంలో ఏడుగురు తెలంగాణ యువకులను కాల్చిచంపారు. తర్వాత 58 ఏళ్లు గోస పడ్డాం. రాష్ట్రం వచ్చా క సంక్షేమానికి పెద్దపీట వేసుకున్నాం. రూ.200 పింఛన్లను రూ.2,000 చేసుకున్నం. మళ్లీ గెలిస్తే దాన్ని రూ.5 వేలు చేసుకుందాం. రైతుబంధు సాయాన్ని రూ.16వేలు చేసుకుందాం. నీటి తీరువా రద్దు చేసి, 24 గంటల కరెంటు ఇస్తున్నాం. కల్యాణలక్ష్మి, అమ్మ ఒడి, ఉచిత ప్రసవాలు, కేసీఆర్ కిట్, రైతుబీమా, పల్లె–బస్తీ దవాఖానాలు, వంద పడకల ఆస్పత్రు లు, మెడికల్ కాలేజీలు ఇలా ఎన్నో చేసుకున్నం. ఇవన్నీ కాంగ్రెస్ వారు ఎందుకు చేయలేకపోయారు ? ఇందిరమ్మ రాజ్యం తెస్తామంటున్నారు. ఎమర్జె న్సీలు, యువతను జైల్లో పెట్టడమేనా ఇందిరమ్మ రాజ్యమంటే? ఆమె పాలనలోనే కదా జగిత్యాల, సిరిసిల్లను కల్లోలిత ప్రాంతాలుగా ప్రకటించింది. కాంగ్రెస్ నేతల అసమర్థత వల్లే.. గులాబీ పార్టీ సామర్థ్యాన్ని శంకించిన నాటి మంత్రి ఎమ్మెస్సార్ ముఖం మీద రాజీనామా విసిరికొట్టా ను. అప్పుడు 2.5 లక్షల మెజార్టితో కరీంనగర్ ప్రజ లు గెలిపించారు. కాంగ్రెస్ నాయకుల అసమర్థత వల్లే తెలంగాణ చాలా ఏళ్లు దుఃఖపడింది. నాడు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణకు ఒక్క రూపా యి ఇవ్వనన్నప్పుడు ఒక్కరూ నోరు తెరవలేదు. కాంగ్రెస్ వాళ్లది.. భూమేత! అధికారంలోకి వస్తే ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. రైతుబంధు, రైతు బీమా, ఎమ్మెస్పీ ధరలకు వరి ధాన్యం కొనుగోలుకు మూలం ధరణి. దాని స్థానంలో కాంగ్రెస్ వాళ్లు తెచ్చేది భూమాత కాదు.. భూమేత. మళ్లీ దళారుల రాజ్యం వస్తుంది. కాంగ్రెస్ వాళ్లు కౌలుదారు చట్టం చేస్తరట. అలా చేస్తే రైతులు చిప్పపట్టుకుని తిరగాలి. పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రైతుబంధు వృథా అంటున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి రైతులకు 3 గంటల కరెంటు చాలంటున్నారు. కాంగ్రెస్ అంటేనే రైతుల పాలిట శని. ప్రజలు ఆలోచించి ఓటేయాలి. అసైన్డ్ భూములకు పట్టాలిస్తాం బీఆర్ఎస్ సర్కారు అసైన్డ్ భూములను లాక్కుంటోందని బీజేపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు. అది అవాస్తవం. మేం మళ్లీ అధికారంలోకి వస్తే అసైన్డ్ భూములకు పట్టాలిస్తాం. దేశవ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే.. తెలంగాణకు ఒక్కటీ ఇవ్వలేదు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలని ప్రధాని మోదీకి 100 ఉత్తరాలు రాసినా ఇవ్వలేదు. అలాంటి బీజేపీకి ఒక్క ఓటు కూడా వేయొద్దు. వేస్తే మోరీలో పడేసినట్టే. తండాలను పంచాయతీలు చేశాం బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాకే తండాలను పంచాయతీలుగా చేసి గిరిజనుల కల సాకారం చేశాం. గిరిజనుల ఆత్మగౌరవ ప్రతీకగా బంజారాహిల్స్‌లో బంజారా భవన్‌తోపాటు పక్కనే కుమురంభీం భవన్ నిర్మించాం. పోడు పట్టాలిచ్చాం, వాటికి రైతుబంధు, రైతుబీమా కూడా వర్తింపజేస్తున్నాం. కాంగ్రెస్‌వన్నీ వట్టి మాటలే. బీఆర్ఎస్ భయంకరమైన మెజార్టితో గెలుస్తోంది..’’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. జగిత్యాలలో డాక్టర్ సంజయ్‌కుమార్, వేములవాడలో చల్మెడ లక్ష్మీనరసింహారావు, ఖానాపూర్‌లో జాన్సన్ నాయక్‌ను గెలిపించాలని కోరారు. వేములవాడ ముఖచిత్రం మారుస్తా.. వేములవాడతో నాది ప్రత్యేక అనుబంధం. ఇక్కడి రాజన్న గుడిలోనే నా వివాహం జరిగింది. కోర్టు కేసుల కారణంగా ఎమ్మెల్యే రమేశ్‌బాబును మార్చాల్సి వచ్చింది. వేములవాడ ముఖచిత్రం మార్చే బాధ్యత నాది. ఇక్కడి మూలవాగు, తల్లికోట సూరమ్మ ప్రాజెక్టులను అభివృద్ధి చేసుకుందాం. మల్కపేట రిజర్వాయర్ ప్రారంభానికి సిద్ధంగా ఉంది. జగిత్యాల జిల్లాను కరీంనగర్ తరహాలో అభివృద్ధి చేసుకుందాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మంజూరు చేసుకుందాం. -
రిస్క్ వద్దు !
సాక్షి, హైదరాబాద్ : ‘తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయి. తెలంగాణను ఎన్నో రెట్లు అభివృద్ధి చేసుకున్నాం. తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఇంటింటికీ నీళ్లిచ్చాం. 24 గంటల కరెంటు ఇచ్చాం. 69 లక్షల మంది రైతులకు రైతుబంధు, 47లక్షల మందికి ఆసరా పింఛన్లు, 1.10 లక్షల మందికి రైతుబీమా, 13.50 లక్షల మందికి కల్యాణలక్ష్మి లబ్ధి చేకూర్చాం. వెయ్యి రెసిడెన్షియల్ పాఠశాలలు తీసుకొచ్చాం. అక్షరాస్యత 15 నుంచి 20 శాతం పెరిగింది. ఇవన్నీ కొనసాగాలంటే మళ్లీ కేసీఆర్ సీఎంగా ఉండాల్సిన అనివార్యత ఉంది. కాంగ్రెస్, బీజేపీ నాయకుల మాయమాటలు విని రిస్క్ తీసుకోవద్దని చెబుతున్నాం’ అని బీఆర్ఎస్ సీనియర్ నేత, రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు వివరించారు. శాసనసభ ఎన్నికల నేపథ్యంలో సాక్షిటీవీ లైవ్‌షోలో ఆయన పలు అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. వివరాలు ఆయన మాటల్లోనే... కర్ణాటక వైఫల్యాల ప్రచారం ఆత్మరక్షణకు కాదు కర్ణాటక ఇచ్చే ప్రకటనలన్నీ అబద్ధం. యువశక్తి అని యాడ్ ఇచ్చారు. అక్కడ ఉద్యోగాలు ఇచ్చారా? మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నారు. బస్సులు కూడా లేకుండా చేశారు. 10 కిలోల ఉచితబియ్యం అని 5 కిలోలు ఇస్తున్నారు. కర్ణాటకలో జరుగుతున్న విషయాలను చెపుతున్నాం. కర్ణాటక మోడల్ అంటే 3 గంటల కరెంటు, రైతుబంధు తొలగింపు, నోటిఫికేషన్లు ఇవ్వకపోవడమా? కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ కర్ణాటక ప్రకటనలు ఇవ్వటం ఎందుకు. కాంగ్రెస్ మాటలు నమ్మి ఆగం కావొద్దు బీఆర్ఎస్ ప్రజల పార్టీ. బీజేపీ కార్పొరేట్ పార్టీ. ఇక కాంగ్రెస్ దొంగ హామీలు ఇస్తూ ప్రజలను మోసం చేస్తుంది. ఐదు గ్యారంటీల పేరుతో కర్ణాటకలో జనాన్ని మోసం చేసింది. అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అవుతున్నా అక్కడ ఎన్నికల హామీలు అమలు చేయటం లేదు. ఏడాదికి 2లక్షల ఉద్యోగాలు అన్నారు. ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. నోటిఫికేషన్లు లేవు. కర్ణాటకలో 5 గ్యారంటీలు ఏమోగానీ ఉన్న గ్యారంటీలు పోయాయి. గతంలో బీజేపీ ప్రభుత్వం అక్కడ అమలు చేసిన రైతుబంధు, యువశక్తి, 9 గంటల కరెంటును తొలగించింది. విద్యార్థులకు స్కాలర్íÙప్లో 80 శాతం కోత విధించింది. నిరుద్యోగ భృతి కూడా ఇవ్వటం లేదు. కానీ ఇక్కడ కేసీఆర్ 24 గంటల కరెంట్, రైతుబంధుతో వ్యవసాయం పండగ చేశారు. రేవంత్‌రెడ్డి 3 గంటల కరెంట్, కర్ణాటక డిప్యూటీ సీఎం 5 గంటల కరెంట్ చాలు అంటున్నారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే 3 గంటల కరెంట్, 5 గంటల కరెంట్ ఒప్పుకున్నట్టే. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇవన్నీ రద్దు అవుతాయి. ప్రజలు ఆలోచించాలి. కరెంటు, నీళ్లు వచ్చినోళ్లంత కారుకు ఓటేయాలి 24 గంటల కరెంట్, మిషన్ భగీరథతో ఇంటింటికీ నీరు గురించి కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోంది. పూర్తిస్థాయిలో కరెంట్, ఇంటింటికీ నీళ్లు వచ్చినోళ్లంతా కారుకు ఓటేయండి... రాని వారు కాంగ్రెస్‌కు ఓటేయండి. సాఫీగా తెలంగాణపాలన సాగుతోంది. అనేకరంగాల్లో మార్గదర్శకంగా తెలంగాణను దేశంలో నంబర్ 1 స్థానంలో ఉంచారు. కేసీఆర్‌కు వాగు వంక, చెట్టు పుట్ట అన్ని తెలుసు. ప్రతిపక్ష నాయకులకు ఏది తెలియదు. కేసీఆర్ ఫోకస్ రైతులే ఎక్కడా లేనివిధంగా రైతుబంధును రాష్ట్రంలో అమలు చేస్తే కేంద్ర ప్రభుత్వం దానిని పీఎం కిసాన్ సమ్మాన్ యోజన పేరుతో అమలు చేస్తోంది. అధికారంలోకి వస్తే రైతుబంధు కింద కాంగ్రెస్ పార్టీ రూ.15 వేలు ఇస్తామని చెప్తోంది. కానీ మేము రూ.16 వేలు ఇస్తామని చెప్తున్నాం. గతంలో కరెంట్ కష్టాలు ఉండేవి. ఇప్పుడు 24 గంటల కరెంటు వస్తుంది. కరెంటు కావాలా? కాంగ్రెస్ కావాలా అని అందుకే అంటున్నాం. కేసీఆర్ రైతుబిడ్డ. ఆయన ఫోకస్ అంతా రైతులే. వాస్తవాలు చెబుతున్నాం కాంగ్రెస్ ప్రకటనలకో, ప్రచారానికో మేం భయపడడం లేదు. 6 గ్యారంటీల పేరుతో జనాన్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రం ఏమవుతుందో విడమర్చి చెబుతున్నాం. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 12 మంది ముఖ్యమంత్రులు కావడం ఖాయం. ప్రజల్లో అపనమ్మకం సృష్టించే ప్రయత్నం ధరణితోపాటు ప్రభుత్వ పథకాలన్నీ భేష్ అని ప్రజలే చెబుతున్నారు. మా బలం ఏందో ప్రతిపక్షాలకు తెలుసు. మా బలం మీద విమర్శ చేస్తేనే, దు్రష్పచారం చేస్తేనే జనం నమ్ముతారు అని వారి ఆలోచన. ప్రజల్లో అపనమ్మకం సృష్టించి జనాన్ని ఇబ్బందులు పెట్టాలని కాంగ్రెస్ చూస్తోంది. ఇంకా ఆయన ఏమన్నారంటే... ♦ బీఆర్ఎస్ సభలకు ఎక్కడ చూసినా ఇసుక వేస్తే రాలనంత జనం వస్తున్నారు. కానీ రాహుల్, ప్రియాంక సభలు జనం లేక వెలవెలబోతున్నాయి. ఖాళీ కుర్చీలకు ఉపన్యాసం ఇస్తున్నారు. ♦ కాంగ్రెస్‌నేతలు కుటుంబపాలన అనడం విడ్డూరం. ఇందిర, రాజీవ్, సోనియా, రాహుల్‌గాంధీ వీరంతా ఎవరు? మేము ప్రజాక్షేత్రం నుంచి వచ్చిన వాళ్లం. మాది కుటుంబ పార్టీ ఎలా అవుతుంది. ♦ ఉస్మానియా యూనివర్సిటీ వెళ్లడానికి భయపడేది మేము కాదు రేవంత్‌రెడ్డి భయపడుతున్నారు. విద్యార్థులను బీర్లు, బిర్యానీ ఇస్తే ఏమైనా చేస్తారు అని అన్నాడు. ♦ పేపర్ లీకేజీలు ఇతర రాష్ట్రాల్లో జరగటం లేదా? జరిగిన తప్పును మేమే గుర్తించి సీఐడీ విచారణకు ఇచ్చాం. అత్యంత పారదర్శకంగా ఉద్యోగాలు భర్తీ చేస్తాం ♦ మేము ఎవరికి బీ టీమ్ కాదు. కాంగ్రెస్, బీజేపీలు బీఆర్ఎస్కు భయపడుతూ ఒకరిపైఒకరు చెప్పుకుంటూ మా మీద ఆరోపణ చేస్తున్నాయి. ♦ బీఆర్ఎస్ వీక్ అని వచ్చినవన్నీ ఫేక్ సర్వేలు.. పేపర్ల మీద సర్వేలు చేస్తే ఎలా? ♦ కొంతమంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకతనే కాదు. పాజిటివ్ కూడా ఉండొచ్చు కదా. సంక్షేమ పథకాల లబ్ధి ఎమ్మెల్యేల ద్వారానే వెళ్తుంది కదా. 80 సీట్లతో మేమే అధికారంలోకి వస్తాం ♦ కేటీఆర్‌ను సీఎంను చేయాలని పార్టీ అనుకుంటే చేస్తుంది. మాకు కేసీఆరే సీఎం కావాలని అనుకుంటున్నాం. -
‘ప్రజల తెలంగాణ’ కల నిజం చేస్తాం
సాక్షి, కామారెడ్డి/సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘ప్రజల తెలంగాణ కల సాకారం కాబోతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ భారీ మెజారిటీతో అధికారంలోకి రాబోతోంది. తొలి మంత్రిమండలి సమావేశంలోనే ఆరు గ్యారంటీలను చట్టబద్ధం చేసి అమలు చేస్తాం’ అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఈ ఎన్నికలు దొరల తెలంగాణకు, ప్రజల తెలంగాణకు మధ్య జరుగుతున్నాయన్నారు. రాష్ట్రంలో సంపదను అంతా ఒకే కుటుంబం అనుభవిస్తోందని, రీడిజైన్ పేరుతో ఒక్క ప్రాజెక్టుతోనే రూ.లక్ష కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. ఈ మధ్య తాను మేడిగడ్డకు వెళ్లి చూడగా పునాదులు పగిలిపోయి, డ్యాం లోపలికి కుంగిపోయి కనిపించిందన్నారు. కాళేశ్వరం కట్టింది నీళ్ల కోసం కాదని, దోచుకోవడం కోసమేనన్నారు. ధరణి పోర్టల్ ద్వారా లక్షలాది మంది రైతుల భూములను తమవారికి ధారాదత్తం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆదివారం కామారెడ్డి, సంగారెడ్డి, ఆందోల్‌లో నిర్వహించిన సభల్లో రాహుల్ ప్రసంగించారు. ఆదాయం వచ్చే ల్యాండ్, లిక్కర్, ఇరిగేషన్, ఇసుక లాంటి శాఖలన్నీ తమ చేతుల్లో పెట్టుకుని, ఇష్టారీతిన దోచుకున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో 8 లక్షల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, దీనికి ప్రభుత్వ విధానాలే కారణమన్నారు. ప్రధాని మోదీకి లోక్‌సభలో అవసరం ఉన్నప్పుడల్లా అండగా నిలవడం వల్లే కేసీఆర్‌పై సీబీఐ, ఈడీ లాంటి కేసులు నమోదు కాలేదని చెప్పారు. ఒకవేళ కేసీఆర్ మద్దతు ఇవ్వకపోయి ఉంటే సీఎం కురీ్చకీ ఎసరొచ్చేదని రాహుల్ దుయ్యబట్టారు. తొలి సమావేశంలోనే... కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ప్రతినెలా బ్యాంకు ఖాతాలో రూ. 2,500 జమ చేస్తామని, బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడం ద్వారా నెలకు రూ.5 వేల మేరకు ప్రయోజనం కల్పిస్తామని, గ్యాస్ సిలిండర్‌ను రూ.ఐదు వందలకు ఇస్తామని, రైతులకు రైతుభరోసా ద్వారా ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని, అలాగే రైతు కూలీలకు ఏటా రూ.12వేలు అందిస్తామని తెలిపారు. రైతులకు 24 గంటలపాటు ఉచితంగా కరెంటు ఇస్తామని, ఇళ్లు లేనివారందరికీ రూ.5 లక్షలు ఇచ్చి సొంతింటి కల నిజం చేస్తామని చెప్పారు. తెలంగాణ కోసం ప్రాణాలొదిలిన అమరుల కుటుంబాలకు 250 గజాల ఇంటి స్థలం ఇస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగాల కోసం ఎంతో మంది రూ.లక్షలు ఖర్చు చేసి కోచింగ్ తీసుకుంటున్నారని, తాను వాళ్ల దగ్గరకు వెళ్లి మాట్లాడానని రాహుల్ చెప్పారు. విద్యాభరోసా కార్డులను ఇచ్చి, వారి ఉన్నత చదువులు, కోచింగ్ కోసం రూ.5 లక్షలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగాల కోసం పరీక్షలు రాసిన విద్యార్థులు ఇంటికి చేరేలోపు పరీక్ష పత్రాలు లీకైనట్టు తెలిసి గుండెలు బాదుకోవలసిన పరిస్థితి తెచ్చారని మండిపడ్డారు. అవినీతి సొమ్ము ప్రజల ఖాతాల్లోకి.. తొమ్మిదేళ్ల పాలనలో కేసీఆర్, ఆయన కుటుంబం దోచుకున్న అవినీతి సొమ్మునంతా కక్కిస్తామని రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. కక్కించిన ఈ సొమ్మును నిరుపేదల ఖాతాల్లో వేస్తామని చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలన్నీ ఒక్కటేనన్నారు. బీజేపీతో కాంగ్రెస్ పోరాడిన ప్రతి ఎన్నికల్లో ఎంఐఎం తమ అభ్యర్థులను బరిలోకి దించి బీజేపీకి సహకరిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్‌కు నష్టం చేసేలా అస్సాం, గోవా, రాజస్తాన్ ఎన్నికలో ఎంఐఎం వ్యవహరించిందని గుర్తుచేశారు. బీజేపీతో పోరాడుతున్నందుకు తనపై 24 కేసులు నమోదు చేశారని, తన ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేసి, తన నివాసాన్ని కూడా లాక్కున్నారని ధ్వజమెత్తారు. దేశంలో ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్న మోదీ సర్కానూ వదిలిపెట్టేది లేదన్నారు. విద్వేషాల బజార్లో ప్రేమ అనే దుకాణం తెరిచిన కాంగ్రెస్‌కు మద్దతు పలకాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాల్లో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, రాష్ట్ర కాంగ్రెస్ ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, నిజామాబాద్ అర్బన్, బాన్సువాడ, ఎల్లారెడ్డి అభ్యర్థులు షబ్బీర్‌అలీ, ఏనుగు రవీందర్‌రెడ్డి, కె.మదన్మోహన్ పాల్గొన్నారు. కామారెడ్డి ప్రజల తీర్పు చరిత్రలో నిలిచిపోతుంది ‘ప్రజల రక్తానికి మరిగిన పులిని వేటాడేందుకు వేటగాన్ని రంగంలోకి దింపుతారు. అట్లనే తెలంగాణ సంపదను దోచుకుంటున్న కేసీఆర్‌ను రాజకీయంగా బొందపెట్టేందుకే నన్ను ఇక్కడికి పంపారు. కామారెడ్డి ప్రజలు ఇచ్చే తీర్పు చరిత్రలో నిలిచిపోతుంది. దేశం మొత్తం మీవైపే చూస్తోంది’ అని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కాలేజీ గ్రౌండ్స్‌లో జరిగిన విజయభేరి సభలో ఆయన మాట్లాడారు. నలభై ఏళ్లుగా ఎన్నో పదవులు అనుభవించినప్పుడు గుర్తుకురాని అమ్మ, అమ్మమ్మ ఊరు కేసీఆర్‌కు ఇప్పుడు గుర్తొచ్చిందా అని ప్రశ్నించారు. గల్ఫ్ కార్మీకుల కష్టాలను కేసీఆర్ ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ఇక్కడి భూముల మీద కన్నేసి కామారెడ్డికి వచ్చారని, కేసీఆర్‌ను ఓడించి తగిన గుణపాఠం చెప్పాలని రేవంత్‌రెడ్డి ప్రజలను కోరారు. -
కాంగ్రెస్‌తో కష్టాలు తెచ్చుకోవద్దు
మణికొండ/దుబ్బాకటౌన్: రాష్ట్రంలో కంటికి కనిపించే అభివృద్ధి, ఇంట్లోకి వస్తున్న సంక్షేమ పథకాలను కాదని, ఏరికోరి కాంగ్రెస్ పాలన తెచ్చుకుని కష్టాల పాలు కావద్దని మంత్రి హరీశ్‌రావు అన్నా రు. ఆదివారం మణికొండ మున్సిపాలిటీ కేంద్రంలోని క్రీడా ప్రాంగణంలో రాజేంద్రనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌కు మద్దతుగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం ఏ కోశానాలేదని, ఒకవేళ వస్తే విద్యుత్ కోత లు, బిల్డర్ల వద్ద కర్ణాటకలో మాదిరిగా చదరపు అడుగుకు రూ.80లు వసూలు, స్కాములు, కర్ఫ్యూ లు తప్పవని అన్నారు. రైతులకు రైతుబంధు, బీ మా, బీసీబంధు, దళితబంధు, ఇంటింటికి తాగునీ రు, 24గంటల విద్యుత్, శాంతి భద్రతలు, ప్రభుత్వ ఆసుపత్రులు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, న్యూ ట్రిషన్ కిట్లు ఇస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మా ర్చాల్సిన అవసరం ఎందుకని హరీశ్‌రావు ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో ప్రతి మíßహిళకు గృహలక్ష్మి, రూ.400లకే గ్యాస్ సిలిండర్, ప్రతి కుటుంబానికి రూ.15 లక్షల ఆరోగ్యబీమా, మరో లక్ష డబుల్బెడ్రూం గృహాలను ఇస్తామని హామీ ఇచ్చారు. మరో మూడు రోజులు మాత్రమే ప్రతిపక్షాలకు చెందిన నాయకులు కనిపిస్తారని, ఎన్నికలు ముగియగానే వారంతా ఢిల్లీ బాట పడతారని, ఇక్కడ ఉండేది ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, ముఖ్యమంత్రి కేసీఆర్‌లు మాత్రమేనని గుర్తుంచుకోవాలన్నారు. ఉత్తర ప్రదేశ్‌లో గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రెండు సీట్లు మాత్రమే గెలిచిందని, అక్కడి ప్రజలు ఆ పార్టీని నమ్మలేదని, అలాంటిది రాహుల్, ప్రియాంకలు ఇక్కడకు వచ్చి గొప్పలు చెపుతున్నారని ఎద్దేవా చేశారు. వారిని నమ్మి మోసపోవద్దని హరీశ్‌రావు కోరారు. వారికి దమ్ముంటే ఇప్పుడు బెంగళూరు ప్రజలతో సమావేశం పెట్టాలని సవాల్ విసిరారు. రాబోయే ఐదు సంవత్సరాలలో హైదరాబాద్ నగరం చుట్టూ నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, మణికొండ, శంషాబాద్‌లకు వంద పడకల ఆసుపత్రులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. కాగా, మన రాష్ట్రం, మన పాలనకే ప్రజలు పట్టం కట్టాలని.. ఢిల్లీ పార్టీలను తరమికొట్టాలని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రకాశ్‌గౌడ్ అన్నారు. రాష్ట్రంలో మరో మారు బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందని, ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరు ఓటు వేయాలని అన్నారు. కేంద్రం రూ.28 వేల కోట్లు ఎగ్గొట్టింది.. రైతుల బోరు బావుల వద్ద కరెంట్ మీటర్లు పెట్టక పోవడంవల్ల తెలంగాణకు రావాల్సిన రూ.28 వేల కోట్లను కేంద్రం ఎగ్గొట్టిందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా దుబ్బాకలో బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డికి మద్దతుగా నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి మాట్లాడారు. ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్న కాంగ్రెస్, రాష్ట్రంలో 11 సార్లు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసిందని, పొరపాటున కాంగ్రెస్ వస్తే మళ్లీ చీకటి కష్టాలు వస్తాయని అన్నారు. -
కాంగ్రెస్ అమ్ముడుపోయే పార్టీ
సాక్షి, యాదాద్రి/నారాయణపేట/ములుగు: కాంగ్రెస్ అంటేనే అమ్ముడుపోయే పార్టీ అని, అది తెలంగాణలో బీఆర్ఎస్ను బీ టీమ్‌లా కాపాడుతోందని బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే బీఆర్ఎస్కు వేసినట్టేనని, ఆ రెండింటికీ చెక్‌పెట్టి బీజేపీని గెలిపించాలని కోరారు. మూసీ నదిలా తెలంగాణ మొత్తాన్ని కేసీఆర్ అవినీతితో కలుషితం చేశారని.. ఈ అవినీతి కాలుష్యాన్ని శుద్ధి చేయాలంటే బీజేపీకి అధికారం అప్పగించాలని పేర్కొన్నారు. ఆదివారం మక్తల్, ములుగు, భువనగిరి నియోజకవర్గాల పరిధిలో నిర్వహించిన బీజేపీ సకల జనుల విజయ సంకల్ప సభల్లో అమిత్‌షా మాట్లాడారు. నారాయణపేట సభలో కురుమూర్తిస్వామి, జోగుళాంబదేవి, సంగమేశ్వరస్వామికి.. ములుగు సభలో సమ్మక్క–సారలమ్మ, రామలింగేశ్వరస్వామికి నమస్కరిస్తున్నా అంటూ అమిత్ షా తన ప్రసంగాలను ప్రారంభించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘ఇవి తెలంగాణ భవిష్యత్ కోసం జరుగుతున్న ఎన్నికలు. ప్రజలంతా ఆలోచించి ఓటు వేయాలి. కేసీఆర్ సర్కారు గత పదేళ్లలో అవినీతిలో కూరుకుపోయింది. కుంభకోణాల మయంగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టులో, మియాపూర్ భూముల్లో వేల కోట్లు దోచుకున్నారు. బీఆర్ఎస్ వీఆర్ఎస్ తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. కేసీఆర్ భూకబ్జాల కారును గ్యారేజీకి పంపిస్తాం. కేసీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అవినీతి, అక్రమాలపై విచారణ జరిపి జైలుకు పంపిస్తాం. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదని కేసీఆర్ అబద్ధాలు చెప్తున్నారు. అసలు కేసీఆర్ జాతీయ హోదా కోసం ఒక్కనాడు కూడా ప్రధాని మోదీని కలవలేదు. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య డీల్.. కాంగ్రెస్‌కు వేసే ప్రతి ఓటు బీఆర్ఎస్కు వేసినట్లే. వారిలో ఎవరికి ఓటు వేసినా ఒక్కటే. కాంగ్రెస్ అమ్ముడు పోయే పార్టీ. అది బీఆర్ఎస్ను బీ టీంలా కాపాడుతోంది. కేంద్ర, రాష్ట్రాల్లో వారి మధ్య అధికారాన్ని పంచుకునే డీల్ కుదిరింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ఎలాగూ అధికారంలోకి రాదు. ఆ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఇక్కడ కేసీఆర్‌ను ముఖ్యమంత్రిని చేస్తారు. బీఆర్ఎస్ రాబోయే రోజుల్లో కేంద్రంలో రాహుల్‌గాందీని ప్రధాన మంత్రిని చేయాలనేది ఒప్పందం. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తాం తెలంగాణలో అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేస్తాం. ఎస్సీ వర్గీకరణ చేపడతాం. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తాం. కేసీఆర్ రజాకార్ల పార్టీ ఎంఐఎంకు భయపడి విమోచన దినోత్సవాన్ని నిర్వహించడం లేదు. మేం అధికారంలోకి రాగానే సెపె్టంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా అధికారికంగా నిర్వహిస్తాం. బీఆర్ఎస్ ఇస్తున్న నాలుగు శాతం ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేసి ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు పెంచుతాం. మేం అధికారంలోకి రాగానే గిరిజనేతరులకు సైతం ఆంక్షలు లేని పోడుపట్టాలు జారీ చేస్తాం. గిరిజన రైతులకు రూ.12 వేల చొప్పున అందజేస్తాం. అయోధ్యలో రాముడి దర్శనం చేయిస్తాం భవ్యమైన, దివ్యమైన అయోధ్యలో రామమందిరం నిర్మాణం జరుగుతోంది. జనవరి 22న ప్రాణప్రతిష్ఠ జరగనుంది. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ఇక్కడి ప్రజలకు ఉచితంగా అయోధ్య ప్రయాణం, వసతి, దర్శనం కల్పిస్తాం..’’అని అమిత్ షా ప్రకటించారు. 'డబుల్ ఇంజన్’తో రాష్ట్రం నంబర్‌వన్ రాష్ట్రంలో, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రావాలని కోరుకుందాం. దేశాన్ని సురక్షితంగా అభివృద్ధిపథంలో నడిపిస్తున్న మోదీని 2024లో మరోసారి ప్రధాని చేసుకుందాం. కేంద్రంలో, రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కారుతో తెలంగాణను నంబర్‌వన్‌గా అభివృద్ధి చేసుకుందాం. బీజేపీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలి. -
30న తెలంగాణ భవిష్యత్తు తేలిపోతుంది
సుందరయ్య విజ్ఞాన కేంద్రం (హైదరాబాద్)/నారాయణపేట: గత పదేళ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక్కడ ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారని కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. ముషీరాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి అంజన్‌కుమార్‌యాదవ్‌కు ఆశీస్సులు అందించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆదివారం సాయంత్రం బాగ్‌లింగంపల్లి చౌరస్తాలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో బహిరంగ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సిద్ధరామయ్య మాట్లాడుతూ నవంబర్ 30న తెలంగాణ భవిష్యత్తు తేలిపోతుందని, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో అన్ని కుల, మతాల ప్రజల సంక్షేమం కోసం పని చేసే ఏకైక పార్టీ కాంగ్రెస్సే అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గౌరవించి సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ ప్రమేయం లేదని, పార్లమెంటులో ఆయనకు ఎంపీలు లేకపోయినా సోనియా గాంధీ ధైర్యం చేసి రాష్ట్రాన్ని ఇచ్చారని చెప్పారు. రాష్ట్ర సంపదను కేసీఆర్ కుటుంబం లూటీ చేసిందని ధ్వజమెత్తారు. కేసీఆర్, మోదీలకు ఓడిపోతామనే భయం ప్రారంభమైందని, బీజేపీకి మూడు సీట్లు మించి రావని అన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మూడే రోజులు ‘బీఆర్ఎస్ నాయకులు రాష్ట్ర అభివృద్ధిని మరచి పక్కనున్న కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ పథకాలు అమలు కావడం లేదని దుష్ప్రచారం చేస్తున్నారని సిద్ధరామయ్య అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం నారాయణపేట జిల్లా మక్తల్‌లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వాకిటి శ్రీహరి తరపున ఏర్పాటు చేసి రోడ్‌షోలో సిద్ధరామయ్య మాట్లాడారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఇంకా మూడురోజులే గడువు ఉందన్నారు. రూ.లక్ష కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు అన్నారని, కానీ అది మూణ్నాళ్ల ముచ్చటగా మారిందని విమర్శించారు. మా రాష్ట్రం వస్తే గ్యారంటీల అమలు చూపిస్తాం సాక్షి, హైదరాబాద్: కర్ణాటక ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన ఐదు గ్యారంటీలను కచ్చితంగా అమలు చేస్తున్నామని, ఈ విషయంలో ఎవరికైనా అనుమానాలుంటే తమ రాష్ట్రానికి వస్తే చూపిస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. ఐదు గ్యారంటీల ను కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అమలు చేయడం లేదని తెలంగాణ సీఎం కేసీఆర్, కేటీఆర్‌లు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని చెప్పారు. ఈ పథకాల అమలు కోసం తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రూ.38 వేల కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు. ఆదివారం తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఆయన హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణా హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ రాష్ట్ర మంత్రులు బోసురాజు, లక్ష్మీ హెబ్బాల్కర్, మాజీ ఎంపీ వి.హనుమంతరావు తదితరులతో కలసి మాట్లాడారు. ఐదు గ్యారంటీల్లో నాలుగు గ్యారంటీలను ఇప్పటికే అమలు చేశామని, ఎన్నికల సందర్భంగా కర్ణాటక ప్రజలకిచ్చిన 165 హామీల్లో ఇప్పటివరకు 158 నెరవేర్చామని సిద్ధరామయ్య వెల్లడించారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం గత పదేళ్లలో ప్రజలకు ఇచ్చిన హామీల్లో 10 శాతం కూడా నెరవేర్చలేదన్నారు. ఐదు గ్యారంటీల అమలు కారణంగా కర్ణాటక ఆర్థిక వ్యవస్థ దివాళా తీసిందని ప్రధాని మోదీ చెపుతున్న మాటల్లో వాస్తవం లేదని సిద్ధరామయ్య అన్నారు. -
TS: సీనియర్లకు ఫ్రెషర్ల ఛాలెంజ్
ఎన్నికల్లో యువ ఓటర్ల పాత్ర ఎంతో కీలకమైనది. యువత ముందుకొచ్చి ఓటు వేయడమే కాకుండా.. ప్రత్యక్ష రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహారించాలన్న చర్చ ఎప్పటి నుంచో నడుస్తున్నదే. అయితే ఈసారి జరగనున్న తెలంగాణ ఎన్నికల్లో పలుచోట్ల యువరక్తం.. పైగా కొత్త ముఖాలు.. అందునా సీనియర్లతో పోటాపోటీకి సిద్ధం కావడం గమనార్హం. కార్నె శిరీష(బర్రెలక్క) : నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కార్నె శిరీష(బర్రెలక్క) స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తోంది. ఈ దఫా ఎన్నికల్లో చిన్నవయస్కురాలైన అభ్యర్థిగా ఈమెకు ఓ గుర్తింపు దక్కింది. సోషల్ మీడియాలో బర్రెలక్కగా బాగా పాపులర్ అయిన శిరీష.. నామినేషన్ మొదలు నుంచి వార్తల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రచార సమయంలో ఆమె వర్గం దాడి జరిగాక.. ఆ చర్చ తారాస్థాయికి చేరింది. చివరాఖరికి హైకోర్టు సైతం ఆమెకు భద్రత కల్పించాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. కొల్లాపూర్ నుంచి జూపల్లి కృష్ణారావు, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, బీజేపీ సుధాకర్ లాంటి సీనియర్లను ఈమె ఢీ కొడుతుండడం గమనార్హం. ఇదీ చదవండి: పవన్ కంటే బర్రెలక్క నూరుపాళ్లు నయం! మామిడాల యశస్వినీరెడ్డి: ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న మరో అత్యంత యువ అభ్యర్థి యశస్విని కావడం విశేషం. కాంగ్రెస్ తరఫున పాలకుర్తిలో ఎర్రబెల్లి దయాకర్‌రావు లాంటి సీనియర్ మీద మామిడాల యశస్వినీ(26) పోటీకి దిగింది. యశస్వినీరెడ్డి హైదరాబాద్ లో బీటెక్ పూర్తి చేసింది. ఆపై ఝాన్సీరెడ్డి కొడుకు రాజారామ్ మోహన్ రెడ్డిని వివాహం చేసుకుని అమెరికా వెళ్లింది. అత్త ఝాన్సీరెడ్డికి కాంగ్రెస్ టికెట్ విషయంలో పౌరసత్వ అభ్యంతరాలు తలెత్తడంతో.. కోడలు యశస్వినీకి ఆ అవకాశం దక్కింది. ఇటీవలే టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి కూడా ఈ యువ అభ్యర్థి కోసం ప్రచారం కూడా చేశారు. నాన్ లోకల్ అనే ప్రత్యర్థి ప్రచారాన్ని తిప్పి కొడుతూ.. పాలకుర్తిలో గెలుపుపై యశస్విని ధీమా వ్యక్తం చేస్తోంది. ఇదీ చదవండి: ఎర్రబెల్లికి చుక్కలు చూపిస్తున్న హనుమాండ్ల ఫ్యామిలీ మైనంపల్లి రోహిత్‌రావు: మైనంపల్లి హనుమంతరావు తనయుడు మైనంపల్లి రోహిత్(27). మెదక్ జిల్లా నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మెడిసిన్ పూర్తిచెసిన రోహిత్ తన తండ్రి.. ఆయన అనుచర గణం అండతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ‘మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్’ పేరిట కరోనా టైంలో అందించిన సేవలకు ప్రత్యేక గుర్తింపు దక్కింది. మెదక్‌లో పద్మాదేవేందర్‌రెడ్డి లాంటి సీనియర్‌తో పోటీకి రోహిత్ సిద్ధం అయ్యారు. ఇదీ చదవండి: మెదక్‌లో మళ్లీ పాతయుద్ధమేనా? ఉషా దాసరి: ఐఐటీ గ్రాడ్యుయేట్ ఉషా దాసరి (27).. పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీఎస్పీ అభ్యర్థినిగా పోటీలో ఉన్నారు. కలెక్టర్ కావాలనే కలని సైతం పక్కన పెట్టి తల్లిదండ్రుల పేరు మీద ట్రస్ట్ నెలకొల్పి.. ఉచిత ట్యూషన్లతో స్థానికంగా మంచి పేరు సంపాదించుకున్నారీమె. దాసరి మనోహర్‌తో పాటు చింతకుంట విజయరమణారావులాంటి సీనియర్ల నడుమ పోటీకి నిలిచారు. ఇదీ చదవండి: ఐఐటీ స్టూడెంట్... పొలిటికల్ ఎంట్రీ వీళ్లేకాదు.. మిరియాల రామకృష్ణ(28) జనసేన అభ్యర్థిగా ఖమ్మం నియోజకవర్గంలో తుమ్మల.. పువ్వాడ అజయ్లాంటి వారితో పోటీ పడుతుండగా.. అలాగే ములుగు నుంచి సీతక్కకు పోటీగా బీఆర్ఎస్ అభ్యర్థిని బడే నాగజ్యోతి(29) ఎన్నికల బరిలో దిగి యువసత్తా చాటాలని చూస్తున్నారు. -
ఏం మేలు జరిగిందని ఇందిరమ్మ రాజ్యం రావాలి?: కేసీఆర్
సాక్షి, నిర్మల్: యాభై ఏళ్ల పాలనలో తెలంగాణకు కాంగ్రెస్ చేసిందేమీ లేదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. ఆదివారం ఖానాపూర్ బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ.. ఓటేసే ముందు పార్టీల చరిత్రను గుర్తు తెచ్చుకోవాలని ప్రజానీకాన్ని అభ్యర్థించారాయన. ‘‘తెలంగాణను బలవంతంగా ఏపీలో కలిపిందే కాంగ్రెస్. కాంగ్రెస్ ఏకపక్ష నిర్ణయంతో 58 ఏళ్లు గోస పడ్డాం. కాంగ్రెస్ పాలనలో తాగునీరు కూడా ఇవ్వలేకపోయారు. ప్రాణాలు పణంగా పెట్టి 15 ఏళ్లు పోరాడి తెలంగాణ సాధించుకున్నాం. బీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. రైతులకు 24 గంటలు కరెంట్ ఇస్తున్నాం. కొనుగోలు కేంద్రాలు పెట్టి ధాన్యం కొంటున్నాం. ..ఆడబిడ్డలకు కల్యాణ కల్యాణ లక్ష్మి, షాదీముబాకర్‌లు ఇస్తున్నాం. గిరిజనుల, ఆదివాసీల ఆత్మగౌరవ భవనాలు నిర్మించాం. అన్ని వర్గాల ఆత్మగౌరవం కోసం పని చేశాం. దేశంలో రైతు బంధు పదాన్ని పుట్టించిందే బీఆర్ఎస్. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణిని తీసేస్తుందట. ధరణి తీసేస్తే రైతు బంధు ఎలా వస్తుంది?.కాంగ్రెస్ వస్తే మళ్లీ దళారీల రాజ్యం వస్తుంది. ఈసారి గెలిచాక.. పెన్షన్ రూ.5 వేలకు పెంచుతాం. తెల్ల రేషన్‌కార్డు దారులకు సన్నబియ్యం ఇస్తాం. రైతుబంధు రూ.16 వేలకు పెంచుకుందాం అని అన్నారాయన. జగిత్యాలలో మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ తెచ్చింది ఎవరు? 24 గంటల కరెంట్ ఇచ్చింది ఎవరు?. 50 ఏళ్ల కాంగ్రెస్ పాలన.. పదేళ్ల బీఆర్ఎస్ పాలన ఏంటో ప్రజలకు తెలుసు. ఏం మేలు జరిగిందని మళ్లీ ఇందిరమ్మ రాజ్యం రావాలి?. ఇందిరమ్మ రాజ్యంలో జగిత్యాలను కల్లోలిత ప్రాంతంగా ప్రకటించారు. యువకులను జైల్లో పెట్టారు. ఇందిరమ్మ రాజ్యంలో ఏ వర్గం బాగుపడింది?. ఇందిరమ్మ రాజ్యంలో అన్నీ చీకటి రోజులే కదా. ఏపీ పాలకుల కంటే కాంగ్రెస్ నేతలే తెలంగాణను ఎక్కువ ముంచారు. ఎవరు నిజమైన సిపాయిలో గుర్తించాలి’’ అని కేసీఆర్ జగిత్యాల బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగించారు. యాభై ఏళ్ల పాలనలో కాంగ్రెస్ ఏం చేయలేదు. రైతు బంధు గురించి ఎవరైనా ఆలోచించారా? రైతు బంధు పుట్టించిందే బీఆర్ఎస్.. కేసీఆర్. రైతు బంధు దుబారా అని కాంగ్రెస్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అంటున్నారు. రైతు బంధు ఉండాలా? వద్దా?. కాంగ్రెస్ వస్తే ధరణిని బంగాళాఖాతంలో కలుపుతారట. ధరణిని ఆపేస్తే.. రైతు బంధు ఎట్లా వస్తది?. ఓటు వేసే ముందు పార్టీ చరిత్ర, అభ్యర్థుల గుణగణాలు చూడాలి అని అన్నారాయన. -
రైతు చుట్టూ రాజకీయం
ఎన్నికల్లో రైతులను ఆకర్షించే పనిలో అన్ని పార్టీలూ నిమగ్నమయ్యాయి. రైతులను ప్రసన్నం చేసుకుంటేనే అధికారం దక్కుతుందని ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి. అందుకే రైతు కేంద్రంగా అనేక పథకాలకు శ్రీకారం చుడుతున్నాయి. ఈ మేరకు ఆయా పార్టీలు ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోలే నిదర్శనం. గ్రామీణ ప్రాంతాల్లో కీలకమైన రైతులు, వ్యవసాయ కూలీలను పార్టీలు టార్గెట్‌గా చేసుకొని ప్రచారం చేస్తున్నాయి. వ్యవసాయం : 2 కోట్ల మంది రాష్ట్రంలో రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయం అందుకుంటున్న రైతులు 66 లక్షల మంది ఉన్నారు. వీరే కాకుండా సెంటు భూమిలేని కౌలు రైతులు 6 లక్షల మందికి పైగా ఉంటారు. అంటే రైతులు, కౌలుదారులు కలిపి దాదాపు 72 లక్షల రైతు కుటుంబాలు ఉన్నట్లు ఓ లెక్క. కుటుంబంలో కనీసం ఇద్దరు చొప్పున ఓటు హక్కు కలిగి ఉన్నా, దాదాపు కోటిన్నర మంది వరకు ఉంటారు. ఉపాధి హామీ పథకం కింద నమోదు చేసుకున్న కూలీల సంఖ్య 52 లక్షలు. అంటే రాష్ట్రంలో వ్యవసాయం, దానిపై ఆధారపడిన వారే 2 కోట్ల మంది ఉంటారని వ్యవసాయ వర్గాలు చెబుతున్నాయి. బీఆర్ఎస్ రైతుబంధు రూ.16 వేలు రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ రైతులపై పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టింది. సాగునీటి ప్రాజెక్టులు మొదలు వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్, రైతుబంధు, రైతుబీమా పథకాలు ప్రవేశపెట్టింది. రైతుబంధు కింద రైతులకు ఇప్పటివరకు రాష్ట్రంలో రూ. 72 వేల కోట్లు అందజేసింది. ప్రస్తుతం ఎకరానికి ఏడాదికి రూ. 10 వేలు ఇస్తుండగా, మరోసారి అధికారం అప్పగిస్తే విడతల వారీగా పెంచుతామని తెలిపింది. రైతుబంధు సాయాన్ని మొదటి సంవత్సరం ఎకరానికి ఏటా 12 వేల రూపాయలకు పెంచుతామని హామీనిచ్చింది. వచ్చే ఐదేళ్లలో రైతుబంధు సహాయాన్ని క్రమంగా పెంచుతూ... గరిష్టంగా ఎకరానికి ఏటా 16 వేల రూపాయలకు పెంచుతామని చెబుతోంది. రైతుబీమా ఎలాగూ ఉంది. అయితే గత రెండుసార్లు రైతులకు రూ. లక్ష రుణమాఫీ ప్రకటించి అమలు చేసిన బీఆర్ఎస్, ఈసారి మాత్రం తన ఎన్నికల మేనిఫెస్టోలో రుణమాఫీని ప్రకటించకపోవడం గమనార్హం. కాంగ్రెస్ మేనిఫెస్టోలో రూ.2 లక్షల రుణమాఫీ రైతులకు భరోసా దిశగా కాంగ్రెస్ అడుగులు వేస్తోంది. 24 గంటల ఉచిత కరెంట్ కాంగ్రెస్ పేటెంట్ అని ఆ పార్టీ చెబుతోంది. రైతుబంధుకు బదులుగా రైతు భరోసా పేరుతో ఏడాదికి ఎకరానికి ఒక్కో రైతుకు రూ. 15 వేలు ఇస్తామని వెల్లడించింది. కౌలు రైతులకు రైతు భరోసా రూ. 15 వేల పెట్టుబడి సాయం అందిస్తామని ప్రకటించింది. ఇక వ్యవసాయ కూలీలకు, ఉపాధి కూలీలకు ఏటా రూ.12 వేల ఆర్థిక సాయం అందిస్తామని చెబుతోంది. అన్ని పంటలకు మెరుగైన మద్దతు ధర, వరికి క్వింటాలుకు రూ. 500 బోనస్ ఇస్తామని పేర్కొంది. అలాగే రైతు డిక్లరేషన్‌లో భాగంగా ఒకేసారి రూ. 2 లక్షల రుణ మాఫీ చేస్తామని తెలిపింది. మద్దతు ధరకు అన్ని పంటలను కొనుగోలు చేస్తామని ప్రకటించింది. మూతపడిన చక్కెర కర్మాగారాన్ని తెరిపిస్తామని, పసుపు బోర్డును ఏర్పాటు చేస్తామని తెలిపింది. భూమి యాజమాన్య హక్కులను అందిస్తామని, పోడు భూముల రైతులకు, అసైన్డ్ భూముల లబ్దిదారులకు క్రయ విక్రయాలతో సహా అన్ని యాజమాన్య హక్కులు కల్పిస్తామని తెలిపింది. రైతు కమిషన్ ఏర్పాటుతో సహా సరికొత్త వ్యవసాయ విధానం తెస్తామని చెబుతోంది. వరికి మద్దతు ధర రూ. 3,100 ఇస్తామన్న బీజేపీ మరోవైపు తామూ అధికారంలోకి వస్తామని చెబుతోన్న బీజేపీ కూడా తన మేనిఫెస్టోలో చిన్న సన్నకారు రైతులకు ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసుకునేందుకు రూ. 2,500 సాయం అందిస్తామని తెలిపింది. ఉచిత పంటల బీమాను ప్రకటించింది. వరికి రూ. 3,100 మద్దతు ధర ఇస్తామని తెలిపింది. పసుపు కోసం మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్‌ను ఏర్పాటు చేస్తామని పేర్కొంది. ఆసక్తి కలిగిన రైతులకు దేశీ ఆవులను ఉచితంగా అందిస్తామని తెలిపింది. జాతీయ పసుపు బోర్డు నిర్ణయానికి అనుగుణంగా నిజామాబాద్ టర్మరిక్ సిటీని అభివృద్ధి చేస్తామని ప్రకటించింది. ఏమాత్రం తగ్గని లెఫ్ట్ పార్టీల మేనిఫెస్టో... ఇక ఒంటరిగా బరిలో నిలిచి 19 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్న సీపీఎం తన ఎన్నికల మేనిఫెస్టోలో రైతుకు అనుకూలంగా అనేక హామీలు ఇచ్చింది. రైతులకు ఒకేసారి రూ. 2 లక్షల రుణమాఫీ కోసం కృషి చేస్తామని తెలిపింది. కేరళ తరహాలో రైతు రుణ విమోచన చట్టం రూపొందించాలని కోరుతామని, రైతుల పంటలపై 80 శాతం రుణాలు ఇచ్చి గోదాముల సౌకర్యం కల్పించాలని, ధరల నిర్ణాయక కమిషన్ ఏర్పాటు చేసి పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, పంటలు సేకరించాలని కోరుతామని స్పష్టం చేసింది. కౌలు రైతుల గుర్తింపు, వ్యవసాయ రుణాలు, సబ్సి డీలు, పంట బీమా, కౌలు, పోడు తదితర రైతులందరికీ రూ. 5 లక్షల రైతు బీమా సౌకర్యం కల్పించా లని, ప్రకృతి వైపరీత్యాలు, అటవీ జంతువుల వల్ల పంట నష్టం జరిగితే సాగు చేసిన రైతులకు పరిహారం అందించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తా మని సీపీఎం పేర్కొంది. మరోవైపు కాంగ్రెస్ మద్దతుతో ఒక స్థానంలో పోటీ చేస్తున్న సీపీఐ కూడా తన ఎన్నికల మేనిఫెస్టోలో కీలకమైన అంశాలను పొందుపర్చింది. రైతులకు పెట్టుబడి సాయాన్ని ఎకరాకు రూ. 20 వేలు ఇవ్వాలని కోరింది. ఒకేసారి రైతులకు రూ. 2 లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేయాలని పేర్కొంది. -బొల్లోజు రవి -
అనుమానం లేదు అధికారంలోకి వస్తాం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీనే అంటూ ఆ పార్టీ నేతలు ఎన్నికల సంగ్రామంలోకి దిగారు. ఈసారి తెలంగాణలో బీజేపీ జెండా రెపరెపలాడుతుందని గట్టిగానే సౌండ్ వినిపిస్తున్నారు. నాటి దుబ్బాక ఎన్నికల్లో గెలుపు నుంచి మొన్నటి జీహెచ్‌ఎచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ పొందిన సీట్లే ఇందుకు నిదర్శమని కాషాయనేతలు చెబుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి సాక్షితో మాట్లాడుతూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎలా, ఎందుకు అధికారంలోకి వస్తుందో చెప్పుకొచ్చారు. తెలంగాణ ప్రజలు బీజేపీకి ఎందుకు మద్దతిస్తారో క్లారిటీ ఇచ్చారు. జోడు పదవులకు న్యాయం జరుగుతుందా? నేను పదవిలోకి వచ్చి రెండు నెలలే అవుతోంది. ఈ సమయంలో పార్టీ కోసం, ఎన్నికల కోసం పూర్తిస్థాయిలో నా అనుభవం పెట్టి పనిచేస్తున్నాను. బీజేపీ టెంపో డౌన్ అయ్యిందా? ఒక పథకం ప్రకారం కొన్ని శక్తులు ఇలాంటివి ప్రచారం చేస్తున్నాయి. ప్రజల్లో అలాంటి పరిస్థితి లేదు. సుమారు 100 స్థానాల్లో బీజేపీ బలంగా ఉంది. కొన్ని స్థానాల్లో బీఆర్ఎస్కు, మరికొన్ని స్థానాల్లో కాంగ్రెస్‌కు దీటుగానే బీజేపీ ఉంది. మాకొచ్చే ఫీడ్ బ్యాక్‌లో మేం బలంగా ఉన్నాం. కిషన్‌రెడ్డి వల్ల బీజేపీకి లాభమా?.. బీఆర్ఎస్కి లాభమా? రాష్ట్ర అధ్యక్షుడి మార్పుపై సోషల్ మీడియాలో కొంత అసత్య ప్రచారం జరుగుతోంది. సామాన్య ప్రజలు ఈ విషయాన్ని పట్టించుకోలేదు. కొన్నేళ్లుగా బీఆర్ఎస్కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నది బీజేపీనే. నేను అధ్యక్షుడైన రెండు నెలల్లో పలుమార్లు కేసీఆర్ సర్కార్‌కు వ్యతిరేకంగా నిరసనలు తెలిపాను. రెండుసార్లు నన్ను అరెస్ట్ కూడా చేశారు. ప్రజల కోసం కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్పై ఏనాడూ పోరాటం చేయలేదు. జైళ్లకు వెళ్లింది, కేసులు పెట్టించుకున్నది బీజేపీ నేతలే. గతంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి పనిచేశాయి. బీఆర్ఎస్ పార్టీ.. కాంగ్రెస్ నేతలను కొనుగోలు చేసిన విషయం ప్రజలకు తెలుసు. బీజేపీ ఎప్పటికీ కుటుంబ పార్టీలో కలవదు. బీఆర్ఎస్, మజ్లిస్ ఒక్కటే. కానీ, మజ్లిస్ పార్టీతో బీజేపీ ఎన్నటికీ కలిసే ప్రసక్తే లేదు. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడన్నది ఎంత నిజమో.. మజ్లిస్‌తో బీజేపీ కలవదు అన్నది కూడా అంతే నిజం. తెలంగాణపై కర్ణాటక ఎఫెక్ట్ ఉందా? కరా్టటక ఫలితాల తర్వాత తెలంగాణకు భారీ మొత్తంలో డబ్బు చేరుతోంది. అక్కడ పన్నుల ద్వారా వచ్చిన డబ్బును తెలంగాణలో ఎన్నికల ప్రచారం కోసం వాడుకుంటున్నారు. రూ.వేల కోట్లను మీడియా మేనేజ్మెంట్, సోషల్ మీడియాకు వాడుకుంటున్నారు. కానీ, కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మడం లేదు. అంబర్‌పేట నుంచి ఎందుకు పోటీలో లేరు? నేను పోటీ చేయాలనుకున్నాను. నా వ్యక్తిగత నిర్ణయం వేరు.. పార్టీ హైకమాండ్ నిర్ణయం వేరు. నాకు పార్టీ టికెట్ ఇవ్వలేదు. బీసీని సీఎంను చేయాలని మా పార్టీ నిర్ణయించింది. ఈ సమయంలో నేను పోటీ చేస్లి గెలిచి.. ప్రజల్లో సీఎం అభ్యర్థిపై సందిగ్ధత ఉండకూడదనే ఉద్దేశంతోనే నేను పోటీలో లేను. 4 శాతం రిజర్వేషన్ల తొలగింపు కరెక్టేనా? ఇది రాజకీయపరమైన అంశం. రాష్ట్ర హైకోర్టు నాలుగు శాతం రిజర్వేషన్లను రాజ్యాంగ వ్యతిరేకమని తీర్పు ఇచ్చింది. మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ వ్యతిరేకం. ఇప్పటికే ముస్లింలలో కొందరికి బీసీ–డీలో రిజర్వేషన్ దొరుకుతోంది. మేము ఈబీసీలో ఏదైతే 10 శాతం రిజర్వేషన్ ఇస్తున్నామో అందులో ముస్లింలకు రిజర్వేషన్ కల్పిస్తున్నాం. అందులో అందరికీ రిజర్వేషన్ ఉంటుంది. మతపరమైన రిజర్వేషన్లను బాబా సాహెబ్ అంబేడ్కర్ కూడా వ్యతిరేకించారు. బీజేపీ అధికారంలోకి వస్తే సీఎం అభ్యర్థి ఎవరు.. మీ మద్దతు ఎవరికి ? నా మద్దతు పార్టీకి ఉంటుంది. ప్రజాస్వామ్య పద్ధతిలోనే ముఖ్యమంత్రి ఎంపిక ఉంటుంది. పార్టీ అభ్యర్థుల అభిప్రాయాలను తీసుకుంటాం.. ఢిల్లీలో పార్లమెంటరీ బోర్డు ఉంటుంది.. వాళ్ల అభిప్రాయాలు తీసుకుని, విశ్లేషించి, మిగతా ఎమ్మెల్యేల అందరితో మాట్లాడిన తర్వాతే సీఎంను ప్రకటిస్తాం. యూపీ ఎన్నికలప్పుడు కూడా యోగి ఆదిత్యనాథ్‌ను తర్వాతే ఎంపిక చేశాం. ఒకసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత యోగి ఆదిత్యనాథ్ ప్రతీ విషయంలోనూ ముద్రవేశారు. ఈ ఎన్నికల్లో ఎన్ని సీట్లు వస్తాయని భావిస్తున్నారు? అధికారంలోకి రావడానికి కావలసినన్ని సీట్లు బీజేపీ గెలుస్తుంది రాజకీయాల్లో అటు ఇటు అయితే ? ఆ ప్రశ్న ఉత్పన్నం కాదు. ఒకవేళ బీజేపీకి సరిపడా సీట్లు రాకపోతే ప్రతిపక్షంలో కూర్చుంటుందా? బీజేపీ కచ్చితంగా అధికారంలోకి వస్తుంది. గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగినప్పుడు మాకు 100 సీట్లు వస్తాయని బీఆర్ఎస్ చెప్పింది. బీజేపీకి కేవలం రెండు మూడు సీట్లు వస్తాయని చెప్పింది. కానీ ఫలితాలు వెల్లడైన తర్వాత పరిస్థితి తారుమారైంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీకి ఇన్ని సీట్లు వస్తాయని ఏ ఒక్కరూ ఊహించలేదు. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి ఉందని భావిస్తున్నాం. దేని ఆధారంగా చెబుతున్నారు? తెలంగాణలో 18 నుంచి 25 సంవత్సరాల వయసున్న యువతలో బీజేపీ పట్ల అభిమానం ఉంది. ఒక ఇంట్లో తండ్రి బీఆర్ఎస్ పార్టీలో ఉండవచ్చేమో కానీ వాళ్ల పిల్లలు బీజేపీ పట్ల.. నరేంద్ర మోదీ పట్ల సానుకూలంగా ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి ఎంతోమంది యువత అభిమానులుగా ఉన్నారు. ఇదే మిగతా పార్టీలకు బీజేపీకి ఉన్న తేడా. బీఆర్ఎస్ లౌకిక రాజ్యం, కాంగ్రెస్ ఇందిరమ్మ రాజ్యం అంటున్నారు, మీరేమో రామరాజ్యం అంటున్నారు? హిందువుల గురించి మాట్లాడితే మతోన్మాద పార్టీనా? ఈ దేశ ప్రజలందరికీ మనవి చేస్తున్నాను.. దేశంలో హిందూయిజం ఉన్నప్పుడే సెక్యులర్‌గా ఉంటుంది. హిందువులు మైనార్టీలోకి వెళ్లినప్పుడు దేశంలో సెక్యులరిజం ఉండదు. నేను రాసిస్తాను. మేము అన్ని మతాల గురించి మాట్లాడతాం. క్రిస్టియన్ల గురించి, ముస్లింల గురించి మాట్లాడతాం. మేం ముస్లింలను వ్యతిరేకించం, కేవలం మజ్లిస్ పార్టీ విధానాలతో వ్యతిరేకిస్తాం. హిందువుల గురించి కచ్చితంగా మాట్లాడతాం. హిందువులు దేశ పౌరులు కారా? వాళ్లకి ఇక్కడ హక్కులు లేవా?. వాళ్లకు అన్యాయం జరిగినప్పుడు మేము ప్రశ్నిస్తే అది మతోన్మాదం ఎలా అవుతుంది? నేను మళ్లీ మళ్లీ చెబుతున్నాను హిందూయిజం ఉన్నంతకాలమే దేశంలో సెక్యులరిజం ఉంటుంది. -
తెలంగాణ: బరిలో కురువృద్ధులు.. ఎవరో తెలుసా?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి ప్రధాన పార్టీల అభ్యర్థుల నడుమ పోటీ నువ్వా నేనా అన్నట్లు ఉంది. అదే సమయంలో ఈసారి ఎన్నికల్లో కురువృద్ధులు తమ సత్తా చాటాలనుకుంటున్నారు. అత్యధిక వయసుతో ఎలక్షన్ బరిలో దిగిన నేతల జాబితాను పరిశీలిస్తే.. 1. వనమా(బీఆర్ఎస్.. కొత్తగూడెం) వనమా వెంకటేశ్వరరావు..(78) కొత్తగూడెం ఎమ్మెల్యే, ప్రస్తుత బీఆర్ఎస్ అభ్యర్థి కూడా. ప్రస్తుత అసెంబ్లీలో అందరికంటే వయస్సులో పెద్ద నేత వనమానే కావడం గమనార్హం. వనమా 1989లో మొట్టమొదటిసారిగా కొత్తగూడెం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. ఇప్పటికే ఆయన మూడు సార్లు ఎమ్మెల్యేగా నెగ్గి.. ఒకసారి మంత్రిగా కూడా పని చేశారు. ప్రస్తుతం మళ్ళీ కొత్తగూడెం నుంచే పోటీ చేస్తున్నారు. మొదటిసారి గెలిచిన తర్వాత, రెండుసార్లు 1999లో 2004లోనూ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. 2008లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. పదేళ్ల తరువాత కాంగ్రెస్ కి రాజీనామా చేసి, అనంతరం బీఆర్ఎస్ లో చేరారు. బీఆర్ఎస్ లో చేరే ముందు కాంగ్రెస్ లో పార్టీ టికెట్ పై పోటీ చేశారు. ఈ పోటీలో బీఆర్ఎస్ అభ్యర్థి జలగం వెంకట్ రావుపై మెజారిటీ ఓట్లతో గెలుపొందారు. కాని, గెలిచిన అనంతరం ఆయన కాంగ్రెస్‌ను వీడి.. బీఆర్ఎస్ కండువా కప్పేసుకున్నారు. 2018 ఎన్నికల్లో ఇవే తనకు చివరి ఎన్నికలని.. ఒకసారి అవకాశం కల్పించాలని ప్రజల ముందుకు వచ్చి విజయం సాధించారు. ఆ ఎన్నిక ప్రత్యర్థి అభ్యంతరంతో కోర్టు దాకా చేరి.. చివరకు సుప్రీంలో ఊరటతో గట్టెక్కింది. ఇక ఇప్పుడు తన తనయుడ్ని బరిలోకి దింపాలని చూసినా.. చివరకు వనమాకే బీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది. 2. మర్రి శశిధర్ రెడ్డి (బీజేపీ.. సనత్‌నగర్) సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి(74).. తండ్రి అడుజాడల్లో రాజకీయంలోకి వచ్చి నాలుగు సార్లు నెగ్గి.. రెండుసార్లు ఓటమిపాలయ్యారు.ఈయన జాతీయ ప్రకృతి విపత్తుల నివారణ సంస్థ మాజీ చైర్మన్ కూడా. ప్రస్తుతం సనత్‌నగర్ లో బీజేపీ నుంచి పోటీలో నిలిచారు. మొదట్లో రెండుసార్లు కాంగ్రెస్ అభ్యర్థిగా వరుసగా నెగ్గారు. మూడోసారి పోటీలో ఓటమిపాలయ్యారు. ఆ తరువాత వరుసగా రెండుసార్లు గెలుపొందారు. అప్పటివరకు జాతీయ ప్రకృతి విపత్తుల నివారణ సంస్థకు చైర్మన్ గా నిలిచిన శశిధర్.. 2014లో తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా అనంతరం ఎమ్మెల్యేగా పోటీ చేసినా.. విజయం దక్కలేదు. ప్రస్తుతం సనత్ నగర్ నుంచే బరిలో నిలిచారాయన. 3. పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి (కాంగ్రెస్.. బోధన్) మరో సీనియర్ నేత సుదర్శన్ రెడ్డి(74).. 2023లో బోధన్ నుంచి ఎమ్మెల్యేగా పోటీకి దిగారు. వ్యాపారి అయిన పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి.. 1989లో మొదలుపెట్టిన తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో (1989) బోధన్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాతి ఎలక్షన్స్‌లో గెలిచి.. మరో రెండుసార్లు బోధన్ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా నిలిచారు. ఆ తర్వాత 2014 ఎన్నికల బరిలో నిలిచి ఓటమి పాలయ్యారు. బోధన్ నుంచి పోటీలో నిలిచారాయన. 4. టీ.జీవన్ రెడ్డి (కాంగ్రెస్, జగిత్యాల) సీనియర్ నేత తాటిపర్తి జీవన్ రెడ్డి (72). కాంగ్రెస్ తరఫున జగిత్యాల నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. మొత్తం ఆరుసార్లు జగిత్యాల ఎమ్మెల్యేగా ఈయన గెలిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 1983లో జరిగిన ఎన్నికల్లో నెగ్గి.. తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. అప్పటి నుంచి వరుసగా మూడుసార్లు నెగ్గి జీవన్ రెడ్డి.. 1994 ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. ఆ తరువాత వరుసగా మూడుసార్లు గెలిచి.. హ్యాట్రిక్ రికార్డు సాధించారు. అయితే.. 2006, 2009 కరీంనగర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన ఈయన ఓటమి పాలయ్యారు. తిరిగి, 2014లో తెలంగాణ ఏర్పడ్డాక మరోసారి గెలిచారు.. 2018 ఎన్నికల్లో ఓటమిని చవిచూశారు. ఇప్పుడు మరోసారి జగిత్యాల నుంచే బరిలో నిలిచారాయన. 5. నడిపెల్లి దివాకర్ రావు (బీఆర్ఎస్.. మంచిర్యాల) కాంగ్రెస్ పార్టీలో చేరి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన నడిపెల్లి దివాకర్ రావు..(71) మంచిర్యాల మున్సిపాలిటీ కౌన్సిలర్‌గా విజయం దక్కించుకున్నారు. ఆ తరువాత కొన్ని సంవత్సరాల పాటు కాంగ్రెస్‌లోనే వివిధ శాఖల్లో పని చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ వచ్చాక.. మంచిర్యాల ఎమ్మెల్యేగా వరుసగా రెండుసార్లు ఈయనే నెగ్గారు. ప్రస్తుతం మంచిర్యాల నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీకి నిలబడ్డారు. 6. తుమ్మల నాగేశ్వర్రావు (కాంగ్రెస్.. ఖమ్మం) తుమ్మల నాగేశ్వరరావు..(71) సత్తుపల్లి నియోజకవర్గంలో ప్రారంభించిన ఈయన రాజకీయ జీవితం.. ప్రస్తుతం ఖమ్మం నియోజకవర్గానికి చేరింది. తుమ్మల తొలి పోటీలోనే ఓటమి పలకరించింది. ఆ తరువాత 1985లో మధ్యంతర ఎన్నికల్లో విజయం అందుకున్నారు. అప్పటి నుంచి వరుసగా నాలుగుసార్లు టీడీపీ నుంచి పోటీ చేసి అసెంబ్లీకి ఎన్నికైయ్యారు. తెలంగాణ ఏర్పాటు అయ్యాక బీఆర్ఎస్కు మారిన అనంతరం.. 2014లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2016లో ఉప ఎన్నికలో పోటీ చేసి నెగ్గారు. తెలంగాణ 2018 ఎన్నికల్లో.. పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2023లో బీఆర్ఎస్కు రాజీనామా చేసి కాంగ్రెస్ చేరి ఖమ్మం బరిలో నిలిచారు. 7. బాబూ మోహన్ (బీజేపీ.. ఆందోల్) సినీ నటుడైన బాబూ మోహన్..(71) సీనియర్ ఎన్టీఆర్‌పై ఉన్న అభిమానంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1999లో జరిగిన ఎన్నికల్లో మెదక్ జిల్లా ఆందోల్ శాసనసభ నియోజకవర్గం నుంచి ఎన్నిక కావడంతో పాటు మంత్రిగానూ అవకాశం అందుకున్నారు. ఆపై 2014లో బీఆర్ఎస్లో చేరారు. అటుపై బీజేపీ కండువా కప్పేసుకుని.. ఆందోల్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం, సంగారెడ్డి ఆందోల్ నుంచి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీకి నిలిచారు. 8. రేవూరి ప్రకాష్ రెడ్డి (కాంగ్రెస్.. పరకాల) సీనియర్ నేత రేవూరి ప్రకాష్ రెడ్డి..(71) టీడీపీతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2018లో టీడీపీలో ఉండగా పశ్చిమ గోదావరి జిల్లా నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2019లో టీడీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. 2023 సంవత్సరంలో కాంగ్రెస్ ప్రకాష్ రెడ్డిని వరంగల్ రూరల్ నియోజకవర్గం పరకాల అభ్యర్థిగా ప్రకటించింది. 9. రాంరెడ్డి దామోదర్ రెడ్డి (కాంగ్రెస్.. సూర్యాపేట) సీనియర్ నాయకుడు రాంరెడ్డి దామోదర్ రెడ్డి..(71).. ఎక్కువసార్లు ఎమ్మెల్యేగా నెగ్గిన ట్రాక్ ఈయనది. కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తూ.. తుంగతుర్తి, సూర్యాపేట నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం సూర్యాపేట నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచారు. 10. ముఠా గోపాల్ (బీఆర్ఎస్.. ముషీరాబాద్) ముఠా గోపాల్..(70) రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. 2014 ఎన్నికలో ఓడినా.. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిపై గెలుపొందారు. అనంతరం టీడీపీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరారు. ప్రస్తుతం ముషీరాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. 11. మంచి రెడ్డి కిషన్ రెడ్డి (బీఆర్ఎస్.. ఇబ్రహీంపట్నం) మంచి రెడ్డి కిషన్ రెడ్డి..(70) టీడీపీ ద్వారా రాజకీయ అరంగ్రేటం చేసి 2009, 2014 శాసనసభ ఎన్నికల్లో గెలుపొందారు. ఆ తరువాత టీడీపీని వీడి బీఆర్ఎస్ కండువా కప్పేసుకున్నారు. 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి 376 ఓట్ల స్వల్ప మెజార్టీతో గెలుపొందారు. ఈ ఎన్నికలోనూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిల్చున్నారాయన. -
పువ్వాడకి సీపీఐ మద్దతా? నారాయణ ఏమన్నారంటే..
సాక్షి, ఖమ్మం: ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థి, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్ర విమర్శలు చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్-సీపీఐ పొత్తుగా ముందుకు వెళ్తున్నాయి. కానీ ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు కోసం కాకుండా.. పువ్వాడ అజయ్ కోసం సీపీఐ ప్రచారం చేస్తోందన్న ప్రచారం ఎక్కువగా వినిపిస్తోంది. ఈ ప్రచారాన్ని నారాయణ ఖండించారు. అజయ్‌ను తులసి వనంలో గంజాయి మొక్కగా అభివర్ణించిన నారాయణ.. ఉమ్మడి ఖమ్మంలో ఓడిపోయే బీఆర్ఎస్ సీటు అజయదేనని జోస్యం చెప్పారు. ‘‘ఖమ్మంలో సీపీఐ కాంగ్రెస్ సపోర్ట్ చేయట్లేదు అనే ప్రచారం నడుస్తోంది. కానీ, అది అపోహ మాత్రమే. సీపీఐ నేత పువ్వాడ నాగేశ్వరరావు కొడుకు పువ్వాడ అజయ్‌కు మద్దతు ఇస్తుందనే కొందరు చెప్పుకుంటున్నారు. అలాంటి ఆలోచనలు ఏమైనా ఉంటే ఇవాళ్టి చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఎవరైనా సీపీఐ నుంచి అజయ్‌కు మద్దతు ఇస్తే.. అది ఎంత పెద్ద నేత అయినా సరే చర్యలు తీసుకుంటాం’’ అని నారాయణ చెప్పారు. ఖమ్మంలో సీపీఐ కోసం ఎంతో కృషి చేసిన వ్యక్తి పువ్వాడ నాగేశ్వర్ రావు. కానీ, తండ్రి నాగేశ్వరరావుకి మూడు నామాలు పెట్టిన వ్యక్తి అజయ్ కుమార్. అటువంటి వ్యక్తికి ఎటువంటి పరిస్థితుల్లోనూ సీపీఐ మద్దతు ఇవ్వదు. ఉమ్మడి ఖమ్మంలో జిల్లాలో బీఆర్ఎస్ ఓడిపోయే సీటు అజయదే అని నారాయణ అన్నారు. ఆ మూడు పార్టీలవి ఒప్పందమే! కాంగ్రెస్, సీపీఐకు ఓటేస్తే.. బీజేపీ, బీఆర్ఎస్ ,ఏంఐఎం.. మూడు పార్టీలు ఎలిమినేట్ అవుతాయి. ఆ మూడు ఒక ఒప్పందం ప్రకారమే ముందుకు వెళ్తున్నాయి. గోషామహల్లో బీజేపీ తరఫున రాజాసింగ్ పోటీ చేస్తున్నారు. అక్కడ ఎంఐఎం అభ్యర్థిని నిలబెట్టలేదు. కానీ జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న చోట మాత్రం ఏంఐఎం అభ్యర్థిని నిలబెట్టింది. ఇది ఒక్కటి చాలు వీళ్లంతా ఎంతలా కలిసి ఉన్నారో చెప్పటానికి. పైకి ఒకరిపై ఒకరు విమర్శించుకున్నట్లు కనిపిస్తూ డ్రామాలు ఆడుతున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం వల్లే తెలంగాణలో ఆ పార్టీ గ్రాఫ్ పెరిగింది. కాంగ్రెస్, సీపీఐ గెలిస్తే దేశ రాజకీయాల్లో అనేక మార్పులు జరుగుతాయి అని నారాయణ అన్నారు. -
కాంగ్రెస్‌లో చేరిన అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం..
సాక్షి, జోగులాంబ గద్వాల జిల్లా: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికల ప్రచారం చివరి అంకానికి చేరుతుండటంతో.. గెలుపే లక్ష్యంగా అన్నీ పార్టీలు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. ఎన్నికల పోరుకు మరో ఆరు రోజులే సమయమున్న నేపథ్యంలో అధికార బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. అలంపూర్ నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహం బీఆర్ఎస్ను వీడి. కాంగ్రెస్ పార్టీలో చేరారు. శుక్రవారం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కాగా అలంపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న అబ్రహంను మరోసారి బీఆర్ఎస్ తరపున అభ్యర్థిగా ప్రకటించిన కేసీఆర్.. అనూహ్యంగా అభ్యర్థిని మార్చారు. అబ్రహం స్థానంలో చల్లా వెంకట్రామిరెడ్డి వర్గానికి చెందిన విజేయుడికి టికెట్ ఖాయం చేసింది పార్టీ అధిష్టానం. సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన తనను కాదని వేరే వ్యక్తికి టికెట్ ఇవ్వడంతో అబ్రహం బీర్ఎస్ పార్టీపై అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఈ క్రమంలోనే ఆయన పార్టీ వీడాలని నిర్ణయించుకున్నారు.