
అదేంటోగానీ దీపావళి బాణాసంచాకు చెందిన అనేక అంశాలు ఈసారి ఎన్నికల్లో బాగా రెలెవెంట్ అయి నప్పాయి. ప్రముఖ నేతల, పార్టీల స్వగతాలూ,స్వభావాలూ, ఆలోచనలూ...ఇవన్నీ తమ స్వగతాలుగా బాణాసంచాల్లో రిఫ్లెక్ట్ అవుతున్న తీరు ఇది.
బీఆర్‌ఎస్ స్వగతం...
ఎప్పట్నుంచో మన పార్టీ దేదీప్యమానం. మనం జస్ట్ ఓ తాడు పేనితే, అవి ‘దీపావళి తాళ్ల’లా మనకు వెలుగులూ, ప్రత్యర్థుల్ని కట్టడి చేసే మోకులయ్యాయి. మనం ఓ చిన్న గోలీ విసిరితే, అది నల్లగా పాంబిళ్లలా పాకి ప్రత్యర్థులను గజగజలాడించింది.
మనమింతగా వెలిగామా! ఎందుకోగానీ తీరా ఎన్నికల ముందే మనకు కొన్ని అపశకునాల బాంబుపేలుళ్లు! మేడిగడ్డను ‘తాటాకు బాంబు’అంటూ ప్రొజెక్ట్ చేసినా, లక్ష్మి బ్యారేజీ కుంగి ‘లక్ష్మి బాంబు’లా పేలింది. సరిగ్గా ఎలక్షన్ టైము చూసుకుని...సర్రుమంటూ కాళ్లకింది భూచక్రంలా గిర్రుమంది. కనీసం డిసెంబరు మూడు నాటికైనా ఈ గండాలన్నీ తొలగి, మనం మతాబులా వెలగాలి మునుపటిలాగే! మన వారసులూ ‘సిసింద్రీ’ల్లా నిలవాలి ఎప్పటిలాగే!!
కాంగ్రెస్ స్వగతం...
అదేంటోగానీ... నిక్కమైన చక్కటి ‘బాంబు’ఒక్కటైన చాలు అని అధిష్ఠానం అనుకుంటుందా...ఒక్కో నియోజకవర్గంలో ఓ వెయ్యిమంది ‘థౌజెండ్‌వాలా’ల్లా పటపటా పేల్తారు! అభ్యర్థి ఎంపిక అయ్యేదాకా అందరూ చిటపట, చిటపట, చిటపటలాడుతూనే ఉంటారు. అందర్నీ మనం మన కార్యకర్తలనుకుంటాంగానీ...తామూ నేతలమేనంటూ వాళ్లు ‘టెన్ థౌజెండ్‌వాలా’లవుతారు.
హమ్మయ్య ఎలాగోలా ఎంపిక పూర్తయ్యిందనుకుంటూ, హాయిగా నిట్టూర్చేలోపు...తోటి పోటీదారును సాటి సీఎంగా ఎంచి, ప్రతివాడూ ఎదుటివాడి సీటు కింద మంటపెట్టి వాణ్ని ‘రాకెట్’లా ఎగరేయాలని చూస్తారు. ఒక్కొక్కడు పైపైకెగిరాక...అక్కడా అనేక విన్యాసాలతో రంగురంగుల గోళాల్ని విరజిమ్ముతుంటాడు. అవి ఉల్కాపాతాల్లా సీఎమ్ కుర్చీని తాకి, తమ అవకాశాల్నెక్కడ గండికొడతాయోనంటూ అందరూ భయపడతుంటారు.
కమ్యూనిస్టులు...
రాజకీయ దీపావళిలో మనకూ బోల్డంత ప్రాధాన్యముందని మనమూ అనుకుంటామా?! కానీ వాస్తవం వేరు. కనీసం మనల్ని దీపావళి అగ్గిపెట్టెలోని వెలుగుపూల అగ్గిపుల్లల్లాగా కూడా చూడరు. తమ సొంత బాణాసంచా పేలడానికి పనికొచ్చే కొవ్వొత్తిలా మాత్రమే చూస్తూ...మనకెలాంటి వెలుగులూ, శబ్దాలూ అక్కర్లేదనీ...కేవలం వాళ్ల కోసమూ, వాళ్ల బాణాసంచాలు వెలగడం కోసమే మనం కొవ్వొత్తుల్లా కాలి, కారి, కరిగిపోతూ త్యాగం చేయాలనుకుంటారు ఈ పొరుగు పార్టీల వాళ్లు. ప్చ్.
బీజేపీ...
అసలు...ఏ బాంబు వెలగాలన్నా కాకరపువ్వొత్తినే కాల్చి మంట అంటిస్తారు కదా. అసలీ కాకరపువ్వొత్తిని కాకరపువ్వొత్తి అనే ఎందుకనాలి? మన పార్టీ గుర్తు ‘కమలం’కదా. కాబట్టి ఇకపై కాకరపువ్వొత్తిని ‘కమలం పువ్వొత్తి’అనే అనాలంటూ... ‘దీపావళి’సందర్భంగా ఓ రివల్యూషనరీ రిజల్యూషన్ తీసుకోవాల్సిందే మనం. అలా ఎలా కుదురుతుందంటూ మన కాళ్లలోనే పేలేలా ఎవ్వరూ బాంబులు పేల్చకండి.
అసలిప్పటివరకు మనం మార్చని పేరంటూ ఏదైనా ఉందా? పథకాలూ, చట్టాల పేర్లూ, వీధుల–నగరాల పేర్లూ మార్చాం. ఆఖరికి...వాళ్లెవరో తమ కూటమికి పెట్టుకున్నారంటూ, ఇంగ్లిష్ లో పలికాల్సిన సొంతదేశం పేరు కూడా ప్రాంతీయ భాషల్లోకే మార్చి పలుకుతున్నప్పుడు కాకరపువ్వొత్తిని... ‘కమలం–పువ్వొత్తి’అని మార్చి పిలిస్తే పోయేదేముంది, ఒక కీలక బాణాసంచాకు మన పార్టీ గుర్తు పేరును చిరస్థాయిగా నిలిచిపోయేలా చేయడం తప్ప?
ఇక సామాన్యుడి స్వగతం...
సరే...అన్ని పార్టీలూ బాణాసంచా కాంతులతో ఏదోరకంగా వెలుగుతున్నవే కదా. మరి సామాన్యుడికి మిగిలేదేమిటి, దీపావళినాటి బాంబుల కాలుష్యపు పొగ, నుసి తప్ప! ఆ మర్నాడు వీధుల నిండా బాణాసంచాకు వాడిన కాగితాల చుట్టల వ్యర్థాలు తప్ప! అందుకే...ఇప్పటికైనా తమ బతుకులు వెలిగేపోయేలా ఆలోచించి ఓటేయ్యాలంటూ...ప్రతి సాటి ఓటరుకూ, మరో సామాన్య ఓటరు చేసుకుంటున్న విజ్ఞప్తులివి. తమ బతుకులు చీదేసిన చిచ్చుబుడ్డీలు కాకూడదంటూ చేస్తున్న వినతులివి.