రాష్ట్రంలో ఏ పార్టీతో పొత్తు లేకుండా 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఏకంగా నాలుగు ఎంపీ సీట్లు గెలుపొందిన బీజేపీ...మళ్లీ ఇప్పుడు 2023 నవంబర్ 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అదే మ్యాజిక్‌ను రిపీట్ చేయగలుగుతుందా ? లేదా అన్న చర్చ ఇప్పుడు సాగుతోంది. బీఆర్‌ఎస్‌కు దీటైన ప్రత్యా మ్నాయంగా బీజేపీనే ఎదుగుతోందనే వాదనలకు బలం చేకూర్చే విధంగా గత మూడున్నరేళ్లలో ఆ పార్టీ సాధించిన రాజకీయ విజయాలు స్పష్టం చేశాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
బీఆర్‌ఎస్–బీజేపీల మధ్యనే అనేక సందర్భాల్లో ప్రధాన పోటీ జరగడంతో...కాంగ్రెస్ పార్టీ అనేది ‘పూర్ థర్డ్ పొజిషన్’కు చేరుకున్న విషయాన్ని గుర్తుచేస్తున్నారు. అయితే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ బీజేపీ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఇక్కడా కాంగ్రెస్ పార్టీలో నూతనోత్సాహం వెల్లివిరిసింది. దానికి తగ్గట్టుగానే రాష్ట్ర రాజకీయాల్లో తమదే పైచేయి అంటూ హైప్ ఇచ్చేలా ఆ పార్టీ చేపట్టిన ప్రచార కార్యక్రమాలు కూడా అందుకు దోహదపడ్డాయి.
అదే సమయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ మార్పు పార్టీ వర్గాల్లో చర్చకు తెరలేపింది. సంజయ్ మార్పుపై చర్చ జరగడం, పార్టీపరంగా కార్యకలాపాలు పుంజుకోకపోవడం, సంస్థాగతంగా పార్టీ బలోపేతానికి సంబంధించి దాదాపు 35 వేల పోలింగ్‌బూత్‌లలో పూర్తిస్థాయిలో బూత్ కమిటీల అధ్యక్షులు, సభ్యుల నియామకం జరగకపోవడం తదితర కారణాలతో బీజేపీ నాయకులు, కేడర్‌లో ఒకింత నిస్తేజం ఏర్పడిందనే చెప్పాలి.
పెరిగిన అసంతృప్త స్వరాలతో నష్టం?
కొత్త అధ్యక్షుడిగా కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి (గతంలోనే మూడుసార్లు ఆ బాధ్యతలు నిర్వహించిన వ్యక్తి–గతంలో రెండుపర్యాయాలు ఏపీ అధ్యక్షుడిగా, ఒకసారి తెలంగాణ అధ్యక్షుడిగా ఉన్నారు) నియామకం తర్వాత పార్టీలో అన్నీ కుదురుకోడానికి కొంత సమయం పట్టింది. ఆ లోగానే ముఖ్యనేతలు, జాతీయకార్యవర్గసభ్యుల స్థాయి నాయకుల అసంతృప్త స్వరాలు కూడా ఒక్కసారిగా పెరిగాయి.
ఢిల్లీ లిక్కర్‌స్కాంలో ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను అరెస్ట్ చేసి, ఇంతవరకు బెయిల్ రాకుండా జైళ్లో పెట్టగా, ఇదే కేసులో ప్రమేయముందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారించినా తదు పరి చర్యలు ఎందుకు తీసుకోలేదు ? కాళేశ్వరం, ఇతర ప్రాజెక్ట్‌ల్లో అవినీతి, అక్రమాలు జరిగాయని స్వయంగా ప్రధాని మోదీ, కేంద్రహోంమంత్రి అమిత్‌షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బహిరంగసభల్లోనే ప్రస్తావించినా కేసీఆర్ సర్కార్‌పై తదుపరి చర్యలెందుకు తీసుకోలేదు ?.. దీంతో బీఆర్‌ఎస్‌తో బీజేపీకి లోపాయికారి అవగాహన ఉందనే అనుమానాలను పార్టీపెద్దలు ఏ విధంగా దూరం చేస్తారనే ప్రశ్నలు సంధించారు. అసంతృప్త నేతల సమావేశాలు, బీఆర్‌ఎస్–బీజేపీ దోస్తీపై చర్చ కూడా బీజేపీకి నష్టం చేసిందనే చెప్పాలి.
మోదీ మాటలతో మళ్లీ ఊపు
ఈ నెల 1న మహబూబ్‌నగర్, 3న నిజామాబాద్ సభల ద్వారా ప్రధాని మోదీ బీఆర్‌ఎస్ వంటి అవినీతి పార్టీతో బీజేపీకి పొత్తు ఉండదని స్పష్టం చేశారు. దీంతో పాటు తమను ఎన్డీఏలో చేర్చుకోవాలని, జీహెచ్‌ఎంసీ పాలకమండలిలో బీఆర్‌ఎస్–బీజేపీ కలిసి పనిచేద్దామంటూ సీఎం కేసీఆర్ తన వద్దకు వచ్చి చేసిన విజ్ఞప్తిని తిరస్కరించానని స్పష్టం చేశారు. అదేవిధంగా కేటీఆర్‌ను సీఎం చేసేందుకు సహకరించాలని కోరితే ఇది ప్రజాస్వామ్యమని రాచరికం కాదని చెప్పానని మోదీ పేర్కొన్న తర్వాత ఈ పరిస్థితిలో కొంత మార్పు వచ్చిందని, పార్టీలో మళ్లీ ఊపు వచ్చిందని నేతలు చెబుతున్నారు.
అప్పుడు 40 సీట్లలో మెజారిటీ..
2019 లోక్‌సభ ఎన్నికలపుడు బీజేపీకి వివిధ ఎంపీ సీట్ల పరిధిలో దాదాపు 40 అసెంబ్లీ స్థానాల్లో మెజారిటీ లభించడంతో... అప్పటి నుంచి పార్టీ మరింతగా పుంజుకున్నందున 60–70 సీట్లలోనైనా గెలుస్తామనే విశ్వాసాన్ని ముఖ్య నేతలు వ్యక్తం చేస్తున్నారు. గత లోక్‌సభ ఎన్నికల తర్వాత వరసగా బీజేపీ బలం పుంజుకోవడంతో పాటు... అధికార బీఆర్‌ఎస్‌తో పోటాపోటీగా నువ్వా నేనా అన్నట్టుగా దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో తలపడి బీజేపీ అభ్యర్థులు ఎం.రఘునందన్‌రావు, ఈటల రాజేందర్ గెలుపొందారు.
మునుగోడు ఉప ఎన్నికల్లో విజయం దగ్గర దాకా చేరుకుని దాదాపు 12 వేల ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి ఓటమి పాలయ్యారు. ఐనా అది కూడా తమ నైతిక విజయమేనని, గత ఎన్నికల్లో మునుగోడులో సాధించిన 12వేల ఓట్ల నుంచి 87 వేల ఓట్లకు చేరుకోవడమంటే మామూలు విషయం కాదని బీజేపీ నాయకులు గట్టిగా వాదిస్తున్నారు. గత లోక్‌సభ ఎన్నికల తర్వాత 2020 డిసెంబర్ లో జరిగిన జీహేచ్‌ఎంసీ ఎన్నికల్లో 48 మంది కార్పొరేటర్లు గెలుపొందడం ద్వారా బీజేపీ సంచలనం సృష్టించింది.
అంతకు ముందు ఆ పార్టీకి నలుగురు మాత్రమే కార్పొరేటర్లు ఉండగా ఏకంగా వారి సంఖ్య 48కు చేరుకోవడం ద్వారా బీజేపీ పట్ల ప్రజల్లో ముఖ్యంగా పట్టణ ప్రాంతం...అర్భన్‌ఓటర్లలో ప్రభావం పెరుగుతోందని, హిందుత్వ నినాదంతో ఓటర్ల పోలరైజేషన్ దిశగా హైదరాబాద్ ప్రజలు అడుగులు వేస్తున్నారనే చర్చ కూడా అప్పట్లో బలంగానే సాగింది. అంతకు ముందు 2018 డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 105 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయింది. కేవలం 7 శాతం ఓట్లే పార్టీ ఖాతాలో పడ్డాయి.
మళ్లీ మరో నాలుగు నెలల్లోనే అంటే 2019 ఏప్రిల్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో సొంతంగా పోటీచేసి ఉత్తర తెలంగాణలోని కీలకమైన కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ తోపాటు సికింద్రాబాద్ ఎంపీ సీట్లు గెలుచుకుని సత్తా చాటింది. గత ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేసి 20 శాతం ఓట్లను సాధించి అందరి అంచనాలను తలకిందులు చేయడం రాజకీయ పరిశీలకులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. మళ్లీ అలాంటి ప్రదర్శనే కనబరిచి గణనీయమైన సంఖ్యలో ఎమ్మెల్యే సీట్లు గెలువగలుగుతుందా ? అనే నమ్మకాన్నే, ధీమానే బీజేపీ శ్రేణులు వ్యక్తం చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment