సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనే అంటూ ఆ పార్టీ నేతలు ఎన్నికల సంగ్రామంలోకి దిగారు. ఈసారి తెలంగాణలో బీజేపీ జెండా రెపరెపలాడుతుందని గట్టిగానే సౌండ్ వినిపిస్తున్నారు. నాటి దుబ్బాక ఎన్నికల్లో గెలుపు నుంచి మొన్నటి జీహెచ్‌ఎచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ పొందిన సీట్లే ఇందుకు నిదర్శమని కాషాయనేతలు చెబుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి సాక్షితో మాట్లాడుతూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎలా, ఎందుకు అధికారంలోకి వస్తుందో చెప్పుకొచ్చారు. తెలంగాణ ప్రజలు బీజేపీకి ఎందుకు మద్దతిస్తారో క్లారిటీ ఇచ్చారు.
జోడు పదవులకు న్యాయం జరుగుతుందా?
నేను పదవిలోకి వచ్చి రెండు నెలలే అవుతోంది. ఈ సమయంలో పార్టీ కోసం, ఎన్నికల కోసం పూర్తిస్థాయిలో నా అనుభవం పెట్టి పనిచేస్తున్నాను.
బీజేపీ టెంపో డౌన్ అయ్యిందా?
ఒక పథకం ప్రకారం కొన్ని శక్తులు ఇలాంటివి ప్రచారం చేస్తున్నాయి. ప్రజల్లో అలాంటి పరిస్థితి లేదు. సుమారు 100 స్థానాల్లో బీజేపీ బలంగా ఉంది. కొన్ని స్థానాల్లో బీఆర్‌ఎస్‌కు, మరికొన్ని స్థానాల్లో కాంగ్రెస్‌కు దీటుగానే బీజేపీ ఉంది. మాకొచ్చే ఫీడ్ బ్యాక్‌లో మేం బలంగా ఉన్నాం.
కిషన్‌రెడ్డి వల్ల బీజేపీకి లాభమా?.. బీఆర్‌ఎస్‌కి లాభమా?
రాష్ట్ర అధ్యక్షుడి మార్పుపై సోషల్ మీడియాలో కొంత అసత్య ప్రచారం జరుగుతోంది. సామాన్య ప్రజలు ఈ విషయాన్ని పట్టించుకోలేదు. కొన్నేళ్లుగా బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నది బీజేపీనే. నేను అధ్యక్షుడైన రెండు నెలల్లో పలుమార్లు కేసీఆర్ సర్కార్‌కు వ్యతిరేకంగా నిరసనలు తెలిపాను. రెండుసార్లు నన్ను అరెస్ట్ కూడా చేశారు. ప్రజల కోసం కాంగ్రెస్ నేతలు బీఆర్‌ఎస్‌పై ఏనాడూ పోరాటం చేయలేదు. జైళ్లకు వెళ్లింది, కేసులు పెట్టించుకున్నది బీజేపీ నేతలే.
గతంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కలిసి పనిచేశాయి. బీఆర్‌ఎస్ పార్టీ.. కాంగ్రెస్ నేతలను కొనుగోలు చేసిన విషయం ప్రజలకు తెలుసు. బీజేపీ ఎప్పటికీ కుటుంబ పార్టీలో కలవదు. బీఆర్‌ఎస్, మజ్లిస్ ఒక్కటే. కానీ, మజ్లిస్ పార్టీతో బీజేపీ ఎన్నటికీ కలిసే ప్రసక్తే లేదు. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడన్నది ఎంత నిజమో.. మజ్లిస్‌తో బీజేపీ కలవదు అన్నది కూడా అంతే నిజం.
తెలంగాణపై కర్ణాటక ఎఫెక్ట్ ఉందా?
కరా్టటక ఫలితాల తర్వాత తెలంగాణకు భారీ మొత్తంలో డబ్బు చేరుతోంది. అక్కడ పన్నుల ద్వారా వచ్చిన డబ్బును తెలంగాణలో ఎన్నికల ప్రచారం కోసం వాడుకుంటున్నారు. రూ.వేల కోట్లను మీడియా మేనేజ్‌మెంట్, సోషల్ మీడియాకు వాడుకుంటున్నారు. కానీ, కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మడం లేదు.
అంబర్‌పేట నుంచి ఎందుకు పోటీలో లేరు?
నేను పోటీ చేయాలనుకున్నాను. నా వ్యక్తిగత నిర్ణయం వేరు.. పార్టీ హైకమాండ్ నిర్ణయం వేరు. నాకు పార్టీ టికెట్ ఇవ్వలేదు. బీసీని సీఎంను చేయాలని మా పార్టీ నిర్ణయించింది. ఈ సమయంలో నేను పోటీ చేస్లి గెలిచి.. ప్రజల్లో సీఎం అభ్యర్థిపై సందిగ్ధత ఉండకూడదనే ఉద్దేశంతోనే నేను పోటీలో లేను.
4 శాతం రిజర్వేషన్ల తొలగింపు కరెక్టేనా?
ఇది రాజకీయపరమైన అంశం. రాష్ట్ర హైకోర్టు నాలుగు శాతం రిజర్వేషన్లను రాజ్యాంగ వ్యతిరేకమని తీర్పు ఇచ్చింది. మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ వ్యతిరేకం. ఇప్పటికే ముస్లింలలో కొందరికి బీసీ–డీలో రిజర్వేషన్ దొరుకుతోంది. మేము ఈబీసీలో ఏదైతే 10 శాతం రిజర్వేషన్ ఇస్తున్నామో అందులో ముస్లింలకు రిజర్వేషన్ కల్పిస్తున్నాం. అందులో అందరికీ రిజర్వేషన్ ఉంటుంది. మతపరమైన రిజర్వేషన్లను బాబా సాహెబ్ అంబేడ్కర్ కూడా వ్యతిరేకించారు.
బీజేపీ అధికారంలోకి వస్తే సీఎం అభ్యర్థి ఎవరు.. మీ మద్దతు ఎవరికి ?
నా మద్దతు పార్టీకి ఉంటుంది. ప్రజాస్వామ్య పద్ధతిలోనే ముఖ్యమంత్రి ఎంపిక ఉంటుంది. పార్టీ అభ్యర్థుల అభిప్రాయాలను తీసుకుంటాం.. ఢిల్లీలో పార్లమెంటరీ బోర్డు ఉంటుంది.. వాళ్ల అభిప్రాయాలు తీసుకుని, విశ్లేషించి, మిగతా ఎమ్మెల్యేల అందరితో మాట్లాడిన తర్వాతే సీఎంను ప్రకటిస్తాం. యూపీ ఎన్నికలప్పుడు కూడా యోగి ఆదిత్యనాథ్‌ను తర్వాతే ఎంపిక చేశాం. ఒకసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత యోగి ఆదిత్యనాథ్ ప్రతీ విషయంలోనూ ముద్రవేశారు.
ఈ ఎన్నికల్లో ఎన్ని సీట్లు వస్తాయని భావిస్తున్నారు?
అధికారంలోకి రావడానికి కావలసినన్ని సీట్లు బీజేపీ గెలుస్తుంది
రాజకీయాల్లో అటు ఇటు అయితే ?
ఆ ప్రశ్న ఉత్పన్నం కాదు.
ఒకవేళ బీజేపీకి సరిపడా సీట్లు రాకపోతే ప్రతిపక్షంలో కూర్చుంటుందా?
బీజేపీ కచ్చితంగా అధికారంలోకి వస్తుంది. గతంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరిగినప్పుడు మాకు 100 సీట్లు వస్తాయని బీఆర్‌ఎస్ చెప్పింది. బీజేపీకి కేవలం రెండు మూడు సీట్లు వస్తాయని చెప్పింది. కానీ ఫలితాలు వెల్లడైన తర్వాత పరిస్థితి తారుమారైంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీకి ఇన్ని సీట్లు వస్తాయని ఏ ఒక్కరూ ఊహించలేదు. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి ఉందని భావిస్తున్నాం.
దేని ఆధారంగా చెబుతున్నారు?
తెలంగాణలో 18 నుంచి 25 సంవత్సరాల వయసున్న యువతలో బీజేపీ పట్ల అభిమానం ఉంది. ఒక ఇంట్లో తండ్రి బీఆర్‌ఎస్ పార్టీలో ఉండవచ్చేమో కానీ వాళ్ల పిల్లలు బీజేపీ పట్ల.. నరేంద్ర మోదీ పట్ల సానుకూలంగా ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి ఎంతోమంది యువత అభిమానులుగా ఉన్నారు. ఇదే మిగతా పార్టీలకు బీజేపీకి ఉన్న తేడా.
బీఆర్‌ఎస్ లౌకిక రాజ్యం, కాంగ్రెస్ ఇందిరమ్మ రాజ్యం అంటున్నారు, మీరేమో రామరాజ్యం అంటున్నారు?
హిందువుల గురించి మాట్లాడితే మతోన్మాద పార్టీనా? ఈ దేశ ప్రజలందరికీ మనవి చేస్తున్నాను.. దేశంలో హిందూయిజం ఉన్నప్పుడే సెక్యులర్‌గా ఉంటుంది. హిందువులు మైనార్టీలోకి వెళ్లినప్పుడు దేశంలో సెక్యులరిజం ఉండదు. నేను రాసిస్తాను. మేము అన్ని మతాల గురించి మాట్లాడతాం. క్రిస్టియన్ల గురించి, ముస్లింల గురించి మాట్లాడతాం.
మేం ముస్లింలను వ్యతిరేకించం, కేవలం మజ్లిస్ పార్టీ విధానాలతో వ్యతిరేకిస్తాం. హిందువుల గురించి కచ్చితంగా మాట్లాడతాం. హిందువులు దేశ పౌరులు కారా? వాళ్లకి ఇక్కడ హక్కులు లేవా?. వాళ్లకు అన్యాయం జరిగినప్పుడు మేము ప్రశ్నిస్తే అది మతోన్మాదం ఎలా అవుతుంది? నేను మళ్లీ మళ్లీ చెబుతున్నాను హిందూయిజం ఉన్నంతకాలమే దేశంలో సెక్యులరిజం ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment