నాకు తెలంగాణ తీసుకువచ్చిన ఘనతే ఆకాశమంత పెద్దది. దానికి మించిన పదవి ఉందా? రెండుసార్లు సీఎంగా పనిచేసిన. పదేళ్లు సీఎంగా ఉన్నా. ఇక్కడ నా కంటే ఎక్కువకాలం పదవిలో ఉన్న సీఎం ఉన్నడా? 70 ఏళ్లొచ్చాయి. ఇంతకంటే జీవితంలో ఇంకేం కావాలి? పేదరికంలేని తెలంగాణే నా పంతం. అందుకే బీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించాలి.
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/సాక్షి, సిద్దిపేట/ఖానాపూర్: పేదరికం లేని తెలంగాణ తన పంతమని.. కేరళ తరహాలో వందశాతం అక్షరాస్యత, నిరంతరం తాగునీరు, ప్రతీ ఇంచుకు సాగునీరు రావాలనేదే తన లక్ష్యమని బీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెప్పారు. రైతాంగం గుండెల మీద చేతులు వేసుకుని నిద్రపోయే తెలంగాణ కావాలని.. దానికోసమే తాను తండ్లాడుతున్నానని, పదవి కోసం కాదని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే దళారీ రాజ్యం వస్తుందని, తెలంగాణ ఆగమైపోతుందని వ్యాఖ్యానించారు. ఆదివారం జగిత్యాల, వేములవాడ, దుబ్బాక, ఖానాపూర్ నియోజకవర్గాల్లో నిర్వహించిన బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే..
‘‘ఎన్నికలనగానే ఆగమాగం కావొద్దు. అభ్యర్థులు, పార్టిల చరిత్ర చూసి ఓటేయాలి. అసలు ఉన్న తెలంగాణను ఊడగొట్టి, ఆంధ్రాల కలిపిందే కాంగ్రెస్ పార్టీ. ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ ఉద్యమంలో ఏడుగురు తెలంగాణ యువకులను కాల్చిచంపారు. తర్వాత 58 ఏళ్లు గోస పడ్డాం. రాష్ట్రం వచ్చా క సంక్షేమానికి పెద్దపీట వేసుకున్నాం. రూ.200 పింఛన్లను రూ.2,000 చేసుకున్నం. మళ్లీ గెలిస్తే దాన్ని రూ.5 వేలు చేసుకుందాం. రైతుబంధు సాయాన్ని రూ.16వేలు చేసుకుందాం. నీటి తీరువా రద్దు చేసి, 24 గంటల కరెంటు ఇస్తున్నాం. కల్యాణలక్ష్మి, అమ్మ ఒడి, ఉచిత ప్రసవాలు, కేసీఆర్ కిట్, రైతుబీమా, పల్లె–బస్తీ దవాఖానాలు, వంద పడకల ఆస్పత్రు లు, మెడికల్ కాలేజీలు ఇలా ఎన్నో చేసుకున్నం. ఇవన్నీ కాంగ్రెస్ వారు ఎందుకు చేయలేకపోయారు ? ఇందిరమ్మ రాజ్యం తెస్తామంటున్నారు. ఎమర్జె న్సీలు, యువతను జైల్లో పెట్టడమేనా ఇందిరమ్మ రాజ్యమంటే? ఆమె పాలనలోనే కదా జగిత్యాల, సిరిసిల్లను కల్లోలిత ప్రాంతాలుగా ప్రకటించింది.
కాంగ్రెస్ నేతల అసమర్థత వల్లే..
గులాబీ పార్టీ సామర్థ్యాన్ని శంకించిన నాటి మంత్రి ఎమ్మెస్సార్ ముఖం మీద రాజీనామా విసిరికొట్టా ను. అప్పుడు 2.5 లక్షల మెజార్టితో కరీంనగర్ ప్రజ లు గెలిపించారు. కాంగ్రెస్ నాయకుల అసమర్థత వల్లే తెలంగాణ చాలా ఏళ్లు దుఃఖపడింది. నాడు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణకు ఒక్క రూపా యి ఇవ్వనన్నప్పుడు ఒక్కరూ నోరు తెరవలేదు.
కాంగ్రెస్ వాళ్లది.. భూమేత!
అధికారంలోకి వస్తే ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. రైతుబంధు, రైతు బీమా, ఎమ్మెస్పీ ధరలకు వరి ధాన్యం కొనుగోలుకు మూలం ధరణి. దాని స్థానంలో కాంగ్రెస్ వాళ్లు తెచ్చేది భూమాత కాదు.. భూమేత. మళ్లీ దళారుల రాజ్యం వస్తుంది. కాంగ్రెస్ వాళ్లు కౌలుదారు చట్టం చేస్తరట. అలా చేస్తే రైతులు చిప్పపట్టుకుని తిరగాలి. పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రైతుబంధు వృథా అంటున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి రైతులకు 3 గంటల కరెంటు చాలంటున్నారు. కాంగ్రెస్ అంటేనే రైతుల పాలిట శని. ప్రజలు ఆలోచించి ఓటేయాలి.
అసైన్డ్ భూములకు పట్టాలిస్తాం
బీఆర్‌ఎస్ సర్కారు అసైన్డ్ భూములను లాక్కుంటోందని బీజేపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు. అది అవాస్తవం. మేం మళ్లీ అధికారంలోకి వస్తే అసైన్డ్ భూములకు పట్టాలిస్తాం. దేశవ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే.. తెలంగాణకు ఒక్కటీ ఇవ్వలేదు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలని ప్రధాని మోదీకి 100 ఉత్తరాలు రాసినా ఇవ్వలేదు. అలాంటి బీజేపీకి ఒక్క ఓటు కూడా వేయొద్దు. వేస్తే మోరీలో పడేసినట్టే.
తండాలను పంచాయతీలు చేశాం
బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాకే తండాలను పంచాయతీలుగా చేసి గిరిజనుల కల సాకారం చేశాం. గిరిజనుల ఆత్మగౌరవ ప్రతీకగా బంజారాహిల్స్‌లో బంజారా భవన్‌తోపాటు పక్కనే కుమురంభీం భవన్ నిర్మించాం. పోడు పట్టాలిచ్చాం, వాటికి రైతుబంధు, రైతుబీమా కూడా వర్తింపజేస్తున్నాం. కాంగ్రెస్‌వన్నీ వట్టి మాటలే. బీఆర్‌ఎస్ భయంకరమైన మెజార్టితో గెలుస్తోంది..’’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. జగిత్యాలలో డాక్టర్ సంజయ్‌కుమార్, వేములవాడలో చల్మెడ లక్ష్మీనరసింహారావు, ఖానాపూర్‌లో జాన్సన్ నాయక్‌ను గెలిపించాలని కోరారు.
వేములవాడ ముఖచిత్రం మారుస్తా..
వేములవాడతో నాది ప్రత్యేక అనుబంధం. ఇక్కడి రాజన్న గుడిలోనే నా వివాహం జరిగింది. కోర్టు కేసుల కారణంగా ఎమ్మెల్యే రమేశ్‌బాబును మార్చాల్సి వచ్చింది. వేములవాడ ముఖచిత్రం మార్చే బాధ్యత నాది. ఇక్కడి మూలవాగు, తల్లికోట సూరమ్మ ప్రాజెక్టులను అభివృద్ధి చేసుకుందాం. మల్కపేట రిజర్వాయర్ ప్రారంభానికి సిద్ధంగా ఉంది. జగిత్యాల జిల్లాను కరీంనగర్ తరహాలో అభివృద్ధి చేసుకుందాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మంజూరు చేసుకుందాం.
Comments
Please login to add a commentAdd a comment