సాక్షి, హైదరాబాద్: ఫ్యామిలీ ప్రైవేట్ లిమిటెడ్ పార్టీలుగా మారిన కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లపై పోరాడేది తామేనని, తెలంగాణ ప్రజలు, భావి తరాల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని తమ పార్టీని గెలిపించాలని కేంద్ర మంత్రి, బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఎన్నికల్లో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ వేలాది కోట్లు ఖర్చు చేస్తూ ఎంఐఎం మధ్యవర్తిత్వంతో బీజేపీ గెలవకుండా కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు.
సోమవారం పార్టీ నాయకులు డా.ఎస్.ప్రకాశ్‌రెడ్డి, సోలంకి శ్రీనివాస్, సునీతారెడ్డి, అమర్‌నాథ్, జి, వెంకటరెడ్డి, మౌనికతో కలిసి కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీల అమలు ఎలా అనేది కోటి డాలర్ల ప్రశ్న అని వ్యాఖ్యానించారు. ఈ గ్యారంటీల అమలుకు తెలంగాణకు ఇప్పుడొస్తున్న రెవెన్యూకు మూడింతలు డబ్బు అవసరమని లెక్క వేశారు.
ఇక్కడ ఎన్నికలకు కర్ణాటక ప్రభుత్వ యాడ్స్ ఎలా ఇస్తారు ?
తెలంగాణలో ఏ ప్రాతిపదికన కర్ణాటక ప్రభుత్వ డబ్బుతో కాంగ్రెస్ ప్రకటనలు ఇస్తుందని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఇక్కడ ఎన్నికల కోసం కర్ణాటకలోని కాంట్రాక్టర్లు, ఐటీసంస్థలు, వ్యాపారులను బెదిరించి వేల కోట్లు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఇక్కడి పోటీలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థుల్లో 50 శాతం మందికి కేసీఆర్, మరో 50 శాతం మందికి కర్ణాటక సర్కార్ ఖర్చు చేస్తోందని నిందించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల దోస్తీ, కాంగ్రెస్ కేంద్ర కేబినెట్‌లో కేసీఆర్ మంత్రిగా పనిచేయడం, కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్ విలీనం చేసేందుకు కేసీఆర్ ప్రయత్నాలు వంటి అంశాలపై రాహుల్‌గాంధీ చర్చకు రావాలని కిషన్‌రెడ్డి సవాల్ విసిరారు.
కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లది డూప్ ఫైట్...
‘ఎన్నికల నేపథ్యంలో...కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లది డూప్ ఫైట్...రాహుల్‌గాంధీ అంత చేతగాని రాజకీయనాయకుడు మరొకరు లేడు’అని కిషన్‌రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవి నిర్వహణ చేతకాదంటూ వదులుకున్న వ్యక్తి రాహుల్ అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో వైద్యకళాశాలల ఏర్పాటు కోసం కేసీఆర్ రాసినట్టు చెబుతున్న 50 లేఖలు చూపిస్తే తాను రాజకీయాల నుంచి విరమించుకుంటానని సవాల్ విసిరారు.
రైతుబంధుపై కాంగ్రెస్, బీఆర్‌ఎస్ డ్రామాలు..
‘రైతుబంధుపై కాంగ్రెస్, బీఆర్‌ఎస్ డ్రామాలాడుతున్నాయి బీఆర్‌ఎస్ సర్కార్‌కు చిత్తశుద్ధి ఉంటే నోటిఫికేషన్‌కు ఒక రోజు ముందుగానే రైతుబంధు ఎందుకు ఇవ్వలేదని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్‌తో ఫిర్యాదు చేయించడం ద్వారా బీఆర్‌ఎస్‌కు ఇది ఇవ్వడం ఇష్టం లేదని తేలిందన్నారు.
హైదరాబాద్ పేరు మారుస్తాం...
బీజేపీ అధికారానికి వస్తే హైదరాబాద్ పేరును కచ్చితంగా భాగ్యనగర్‌గా మార్చేస్తామని ఒక ప్రశ్నకు కిషన్‌రెడ్డి బదులిచ్చారు. ‘ఎవరైనా బీజే పీ, బీఆర్‌ఎస్ ఒక్కటంటే.. లాగి చెప్పుదెబ్బ కొట్టండి...ఎట్టిపరిస్థితుల్లోనూ ఎవరితో కలిసే ప్రసక్తే లేదు’అని తీవ్రంగా స్పందించారు.
Comments
Please login to add a commentAdd a comment