
ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ ద్వంద వైఖరిపై మండిపడ్డారు. రాహుల్ గాంధీ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌పై సంఘీభావం తెలుపుతారు. అదేవిధంగా తెలంగాణలో మాట్లాడినప్పుడు మాత్రం కేజ్రీవాల్ అవినితీ పరుడని అంటారని స్మృతి ఇరానీ ఎద్దేవా చేశారు.
‘రాహుల్ గాంధీ ద్వంద వైఖరిలో మాట్లాడానికి సంబంధించి నేను ఆధారాలు ఇవ్వగలను. కేజ్రీవాల్‌తో పాటు బీఆర్‌ఎస్ చీఫ్ కేసీఆర్ అవినీతిపరుడని 2, జూలై, 2023లో తెలంగాణ రాహుల్ మాట్లాడుతూ అన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి అన్ని విషయాలు దర్యాప్తు సంస్థలకు తెలుసన్నారు. అవినీతి సొమ్మును ఆప్ గోవా ఎన్నికలకు వినియోగించిందని కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ అన్నారు. వీరిలో ఎవరు నిజం చెబుతున్నారు?’ అని స్మృతి ఇరానీ నిలదీశారు.
Smt. @smritiirani addresses a press conference at party headquarters in New Delhi. https://t.co/jITZyxd3dL
— BJP (@BJP4India) March 22, 2024
ఎవరు నిజమైన రాహుల్ గాంధీ? తెలంగాణలో మాట్లాడే రాహుల్ గాంధీ? లేదా ఢిల్లీలో మాట్లాడే రాహుల్ గాంధీ? అని ఆమె ప్రశ్నించారు. రాజ్యాంగబద్దమైన పదవిలో ఉండి, అధికారాన్ని అడ్డంపెట్టుకొని ఎంతటి అవినీతికి పాల్పడతారో అరవింద్ కేజ్రీవాల్‌ను చూస్తే తెలుస్తోందని స్మృతి ఇరానీ మండిపడ్డారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ కావటంతో రాహుల్ శుక్రవారం కేజ్రీవాల్ ఇంటికి వెళ్లి ఆయన కుటుంబసభ్యులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. కేజ్రీవాల్‌ను అక్రమంగా అరెస్ట్ చేశారని, కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఆయన్ను అరెస్ట్ చేశారని అన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరవింద్ కేజ్రీవాల్ ఈడీ రిమాండ్‌లో ఉన్నారు. అదేవిధంగా ఇదే కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ఏడురోజుల రిమాండ్ పూర్తి చేసుకోగా... తాజాగా (శనివారం) రౌస్ అవెన్యూ కోర్టు మరో మూడురోజులు ఈడీ కస్టడీకి అప్పగించింది.