తోడేళ్లలా ఆవురావురు | CM KCR Fires On Rahul Gandhi And Congress | Sakshi
Sakshi News home page

తోడేళ్లలా ఆవురావురు

Published Mon, Oct 30 2023 4:25 AM | Last Updated on Mon, Oct 30 2023 4:25 AM

CM KCR Fires On Rahul Gandhi And Congress - Sakshi

ఆదివారం ఆలేరులో ప్రజా ఆశీర్వాద బహిరంగ సభకు హాజరైన ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌

రాహుల్‌ గాంధీ ధరణి తీసేస్తానంటున్నాడు. ఆయనకు వ్యవసాయం ఎరుకనా.. ఎద్దు ఎరుకనా, ఎన్నడన్న నాగలి దున్నిండా? ఎవడో సన్నాసి రాసిస్తే చిలుక పలికినట్లు పలుకుతున్నాడు. ధరణి ఉంటేనే మీ భూములు మీకున్నాయి. నిశ్చింతగా ఉన్నారు. ప్రభుత్వం వద్ద, అధికారుల వద్ద భూములపై ఉన్న అధికారాన్ని ధరణితో రైతులకే ఇచ్చాం. ఆ అధికారాన్ని కాపాడుకుంటారా? పోగొట్టుకుంటారా? మీరే నిర్ణయించుకోవాలి. 
– ముఖ్యమంత్రి కేసీఆర్‌  

సాక్షి ప్రతినిధి, నల్లగొండ, సాక్షి, యాదాద్రి, కోదాడ: ‘కాంగ్రెస్‌ పదేళ్లుగా అధికారం లేక ఆకలితో ఆవురావురంటోంది. చాన్స్‌ ఇస్తే గొర్రెల మంద మీద తోడేళ్లు పడ్డట్టు పడదాం.. మట్టిగడ్డ కూడా మింగుదామనే ఆలోచనతో ఆ పార్టీ నేతలు ఉన్నా రు. అలాంటి కాంగ్రెస్‌ కావాలా? అభివృద్ధిలో ముందుకు పోతున్న బీఆర్‌ఎస్‌ కావాలా? ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి..’ అని సీఎం కేసీఆర్‌ అన్నారు. ‘మేము తెలంగాణ ఇచ్చామని చెప్పడానికి కాంగ్రెస్‌ పార్టీకి సిగ్గుండాలి.

14 ఏళ్ల పాటు ఏడిపించారు. ఎంతోమంది ప్రాణాలు తీసుకున్నారు. ఏడాదిపాటు భయంకరమైన పోరా టం చేస్తే ఇచ్చారు తప్ప పుణ్యానికి ఇవ్వలే..’ అంటూ ధ్వజమెత్తారు. ఆదివారం ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని కోదాడ, ఆలేరులో జరిగిన ప్రజా ఆశీర్వాద సభల్లో, తిరుమలగిరిలో నిర్వహించిన తుంగతుర్తి నియోజకవర్గ సమర శంఖారావం సభలో ఆయన ప్రసంగించారు. 

చావునోట్లో తలకాయ పెడితే దిగొచ్చారు..
‘బీఆర్‌ఎస్‌తో కాంగ్రెస్‌ పొత్తు పెట్టుకొని రాష్ట్రంలో, ఢిల్లీలో అధికారం పొంది ఏడిపించారు తప్ప, మర్యాదగా తెలంగాణ ఇవ్వలేదు. ఉద్యమంలో కేసీఆర్‌ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని ఆమరణ దీక్ష చేపట్టి చావు నోట్లో తలకాయ పెడితే, ప్రజలంతా ఉప్పెనలా ఉద్యమం చేస్తే అప్పుడు దిగి వచ్చి తెలంగాణ ప్రకటన చేశారు. మళ్లీ కొంతమంది ముందుకు ఎగదోసి రాజీనామా నాటకం ఆడి, వెనక్కి తీసుకున్నారు. తరువాత ఏడాదిపాటు భయంకరమైన ఉద్యమం చేస్తే తప్ప మన తెలంగాణ మనకు రాలేదు. ఎంతమంది ప్రాణాలు తీసుకున్నారు. ఎంతమంది ఉద్యమకారులను జైల్లో పెట్టారు.

చెరుకు సుధాకర్‌ను కూడా జైల్లో వేశారు. అయినా తట్టుకుని నిలబడ్డాం కాబట్టి, పోరాటం చేశాం కాబట్టి దిగి వచ్చి ఇచ్చారు. శ్రీకాంతాచారి లాంటి వారి ప్రాణాలను బలి తీసుకొని ఇచ్చారు తప్ప పుణ్యానికి తెలంగాణ ఇవ్వలే. ఎవరెవరివో బూట్లు నాకిన వాళ్లు ఇప్పుడు వచ్చి చెప్పే మాటలు నమ్మొద్దు. తెలంగాణ ఉద్యమానికి బయలుదేరినప్పుడు పిడికెడు మందే ఉన్నాం. ఒక్క కాంగ్రెస్‌ నాయకుడు, బీజేపీ నాయకుడు రాలేదు. జేఏసీ ఏర్పాటు కోసం రాజీనామా చేయమంటే మంత్రి పదవులను వదిలిపెట్ట్టలేదు. ఎన్నికలు వచ్చాయంటే రకరకాల మనుషులు వచ్చి రకరకాలుగా మాట్లాడతారు. ప్రజలు ఆలోచించి అభివృద్ధి చేసే బీఆర్‌ఎస్‌కు ఓటు వేయాలి..’ అని కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు. 

రాహుల్‌కు వ్యవసాయం ఎరుకనా?
‘కాంగ్రెస్‌ నాయకులు ధరణి పోర్టల్‌ను తీసేస్తామని పదేపదే చెబుతున్నారు. రాహుల్‌గాంధీ కూడా ధరణి తీసేస్తానంటున్నాడు. ఆయనకు వ్యవసాయం ఎరుకనా.. ఎద్దు ఎరుకనా, ఎన్నడన్న నాగలి దున్నిండా..? ఎవడో సన్నాసి రాసిస్తే చిలుక పలికినట్లు పలుకుతున్నాడు. ధరణి ఉంటేనే మీ భూములు మీకున్నాయి. నిశ్చింతగా ఉన్నారు. ప్రభుత్వం వద్ద, అధికారుల వద్ద భూములపై ఉన్న అధికారాన్ని ధరణితో రైతులకే ఇచ్చాం. ఒకరి భూములను ఒకరికి రాసిన తంటాలు పోయాయి.

ధరణితో మీ బొటన వేలు పడితే తప్ప మీ భూమి బదిలీ కాదు. ఆ అధికారాన్ని కాపాడుకుంటారా? పోగొట్టుకుంటారా? మీరే నిర్ణయించుకోవాలి. ధరణి తీసివేస్తే వీఆర్‌ఓలు వస్తారు, అధికారుల రాజ్యం వస్తుంది. పహాణి నకళ్ల కోసం తిరగాలి. రైతుబం«ధు రూ.10 వేలు వస్తే రూ.3 వేలు ఇమ్మంటారు. గతంలో చూసిన దోపిడీ దొంగల రాజ్యమే రావాలా? ధరణి ఉండి రైతులకే అధికారం ఉండాలా? ఆలోచించండి. ధరణిలో భూమి ఉందంటే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు కూడా కొంటున్నారు..’ అని సీఎం చెప్పారు. 

తెలంగాణ సల్లగ గావాలి..
‘కాంగ్రెస్‌ నాయకుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రైతుబంధు వృధా అంటున్నాడు. ప్రజలు చెల్లిస్తున్న పన్నుల డబ్బును దుబారా చేస్తున్నామని అంటున్నాడు. రైతుబంధు ఉంచాలా..? తీసి వేయాలా..? ఉండాలంటే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని గెలిపించాలి. రైతుబంధు అనేది ఒట్టిగా ప్రకటించలేదు. ఎంతో ఆలోచించి ప్రారంభించాం. ఓట్ల కోసం తేలేదు. ఎక్కడకెళ్లి అడిగినా రైతుబంధు ఉండాలని లక్షల మంది సభల్లో చెబుతున్నారు.

తెలంగాణ రాకముందు 40, 50 లక్షల టన్నుల వడ్లు పండితే.. ఇçప్పుడు 3 కోట్ల టన్నుల వడ్లు పండుతున్నాయి. ఎక్కడిక క్కడే కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి. ఒకనాడు రైతు కుటుంబాలకు పిల్లను ఇచ్చేవారు కాదు, ఇప్పుడు పిల్లను ఇవ్వాలంటే భూమి ఉందా? అని అడుగుతున్నారు. హైదరాబాద్‌లో ఉన్నవారు కూడా వచ్చి వ్యవసాయం చేస్తున్నారు. తెలంగాణ సల్లగ గావాలి..రైతుల ముఖాలు తెల్లగ గావాలి.. అప్పుల బాధలు పోవాలి..’ అని ఆకాంక్షించారు. 

శివకుమార్‌.. ఇజ్జత్‌ తీసుకోవడానికి వచ్చాడా?
‘24 గంటల కరెంట్‌ దేశంలో ఒక్క తెలంగాణలోనే ఇస్తున్నాం. వ్యవసాయ స్థిరీకరణ జరగాలని నాలుగైదేళ్లుగా ఒక పాలసీ ప్రకారం ఇస్తున్నాం. కేంద్రం ఎన్నో ఇబ్బందులు పెట్టింది. మీటర్లు పెట్టాల ని వత్తిడి తెచ్చి పెట్టకపోతే ఏడాదికి రూ.25 వేల కోట్ల కోత పెట్టింది. ఇంకో పది వేల కోట్లు కోత పెట్టినా.. నా ప్రాణం పోయినా మోటార్లకు మీటర్లు పెట్టనని చెప్పా. పీసీసీ అధ్యక్షుడేమో 24 గంటల కరెంటు ఇచ్చి కేసీఆర్‌ దుబారా చేస్తున్నారని అంటున్నాడు.

3 గంటలే సరిపోతుందని చెబుతున్నాడు. 3 గంటలు ఉండాలా? 24 గంటలు ఉండాలా? 24 గంటలు ఉండాలంటే బీఆర్‌ఎస్‌కే ఓటు వేయండి. కర్ణాటక ఉప ముఖ్యమంతి శివకుమార్‌.. మా రాష్ట్రంలో ఐదు గంటల కరెంటు ఇస్తున్నాం.. మా గొప్పతనం చూడమంటున్నాడు. నవ్వాలో ఏడ్వాలో తెలవడం లేదు. ఆయన ప్రచారానికి వచ్చాడా.. ఇజ్జత్‌ తీసుకోవడానికి వచ్చాడా?’ అని సీఎం ఎద్దేవా చేశారు. 

దళిత బిడ్డల దరిద్రాలు పోవాలనే దళితబంధు
‘జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రధానమంత్రి అయిన నాడే దళితుల పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో అంబేడ్కర్‌ మాట గౌరవించి దళితుల అభివృద్ధికి శ్రీకారం చుడితే 75 ఏళ్ల స్వాతంత్య్రం తరువాత కూడా దళితులకు ఈ దరిద్రం ఎందుకు ఉండేది? తెలంగాణ వచ్చాక, ఒక దశకు వెళ్లాక దళిత బిడ్డల దరిద్రాలు పోవాలనే దళితబంధు పథకం తీసుకొచ్చాం.

ఎన్నికలు రావ డంతో కొంతమంది వస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌ నుంచి ఒకాయన వస్తున్నాడు. ఆయన రాష్ట్రంలో అన్నా నికే గతి లేదు. యూపీ, బిహార్, బెంగాల్‌ కూలీలు నాట్లు వేయడానికి, బతకడానికి మన రాష్ట్రానికి వస్తుంటే.. ఆ రాష్ట్రాల సీఎంలు వచ్చి మనకు పాఠాలు చెబుతున్నారు..’ అని విమర్శించారు.  

సంక్షేమంలో ముందున్నాం..
‘గతంలో తెలంగాణలో ఆత్మహత్యలు, వలసలు ఉండేవి. వీటన్నింటికీ రాష్ట్రం ఏర్పడిన తరువాత చరమగీతం పాడాం. తొమ్మిది, పదేళ్లలోనే దేశానికి తలమానికమైన తలసరి ఆదాయంలో నంబర్‌ వన్‌ అయ్యాం. పేదల సంక్షేమం, వ్యవసాయ విప్లవం, ఐటీ విప్లవం రావడంతో అన్ని రంగాల్లో ముందంజలో ఉన్నాం. పేదల పెన్షన్లను పెంచుకున్నాం. కళ్యాణలక్ష్మి ప్రవేశపెట్టి పెంచుకున్నాం. మత్స్య సంపద రూ.33 వేల కోట్లకు పెరిగింది.  రైతుబంధును యూఎన్‌ఓ ప్రశంసించింది..’ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు.    

పింఛన్లు సహా అన్నీ పెంచుకుందాం
‘సమైక్య పాలనలో రూ.40 నుంచి రూ.200 పింఛన్‌ ఇచ్చేవారు. తెలంగాణ రాగానే రూ.1,000 వరకు పెంచి దాన్ని రూ.2,016 వరకు తీసుకొచ్చాం. మరోసారి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వస్తే రూ.5 వేల వరకు పెంచుకుందాం. రైతుబంధు కూడా దశల వారీగా పెంచుకుంటూ పోతాం. రైతులు పండించిన పంటను ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లోకి డబ్బులను నేరుగా పంపుతుంది. ఇలా ప్రభుత్వం ప్రతి విషయంలో రైతులకు అండగా ఉంటుంది..’ అని సీఎం హామీ ఇచ్చారు.

తుంగతుర్తిలో కిషోర్‌ను లక్ష మెజారిటీతో గెలిపించాలని కోరారు. నియోజకవర్గం మొత్తం దళితబంధు అమలు చేస్తామని చెప్పారు. యాదగిరిగుట్ట గోపురం అంత ఎత్తున ఓట్లు వేసి ఆలేరులో గొంగిడి సునీతను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఎంతమంది వ్యతిరేకించినా కోదాడ నుంచి బీసీ బిడ్డ మల్లయ్య యాదవ్‌కు టికెట్‌ ఇచ్చానని, బీసీలందరూ కష్టపడి అత్యధిక మెజారిటీతో ఆయన్ను గెలిపించాలని చెప్పారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement