హుజూర్‌నగర్‌లో జరిగిన సభలో ప్రసంగిస్తున్న సీఎం కేసీఆర్. దేవరకొండ ప్రజా ఆశీర్వాద సభకు హాజరైన జనం
హుజూర్‌నగర్, మిర్యాలగూడ, దేవరకొండ: ‘ప్రజాస్వామ్యం పరిణతి సంతరించుకోవాలంటే ప్రజలు ఆలోచించి ఓటు వేయాలి. అప్పుడే ప్రజలు గెలుస్తారు. లేదంటే నాయకులు గెలుస్తారు..’ అని బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. ‘ఎన్నికలు వస్తుంటాయి.. పోతుంటాయి. నాయకులు కాదు ప్రజలు గెలవాలి. ఎన్నికల్లో ప్రజలు గెలిస్తే వారికి న్యాయం, అభివృద్ధి జరుగుతుంది. అందువల్ల ఓటు వేసేటప్పుడు అభ్యర్థి వ్యక్తిత్వం, మనస్తత్వం గుర్తుంచుకోవాలి.
అతను ఏ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాడో ఆ పార్టీ చరిత్ర, ధృక్పథం, సరళిని దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకుని ఓటు వేయాలి..’ అని సూచించారు. ఎన్నికలు వచ్చినప్పుడు మాయగాళ్లు వస్తుంటారని, ఒక్క చాన్స్ అని మభ్యపెట్టి గెలిచాక మోసం చేస్తారని, వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని హుజూర్‌నగర్, మిర్యాలగూడ, దేవరకొండ నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభల్లో కేసీఆర్ మాట్లాడారు.
కాంగ్రెస్ హయాంలో ఒరిగిందేమీ లేదు..
‘1956లో తెలంగాణను ఆంధ్రాలో కలపాలని ప్రతిపాదన వస్తే ప్రజలు వ్యతిరేకించారు. అప్పుడు పోలీస్ ఫైరింగ్ జరిగింది. ఏడుగురు విద్యార్థులు చనిపోయారు. అప్పుడు నోరు మూసుకుంది కాంగ్రెస్ నాయకత్వం. ఢిల్లీకి పోయి ఉన్న తెలంగాణను ఊడగొట్టి ఆంధ్రాలో కలిపిన పాపాత్ములు ఈ తెలంగాణ కాంగ్రెస్ నాయకులు. వారు చేసిన చిన్న పనికి 50 ఏళ్లు ఏడ్చాం..గోసపడ్డాం. 2014లో తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో అని ఉద్యమిస్తే తెలంగాణ వచ్చింది. వచ్చిన తెలంగాణలో ప్రస్తుతం మూడోసారి ఎన్నికలు జరుగుతున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో డజన్ మంది ముఖ్యమంత్రి అభ్యర్థులు ఉన్నారు. వారిలో వారు కొట్టుకుంటున్నారు. కానీ అసలు రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచే పరిస్థితే లేదు. కాంగ్రెస్ వారి ధోరణి, వైఖరి, ఆలోచన ప్రజలకు తెలుసు. పేదలను కేవలం ఓటు బ్యాంక్‌గా మాత్రమే కాంగ్రెస్ వాడుకుంది. కాంగ్రెస్ హయాంలో పేదలకు ఒరిగిందేమీ లేదు. తెలంగాణ వచ్చాక మిషన్ భగీరథ ద్వారా ఫ్లోరైడ్ బాధలు తప్పించుకుని మంచినీరు తాగుతున్నాం. పల్లెలు పచ్చబడాలని, పంటలు రావాలని, రైతులకు స్వేచ్చ ఉండాలని, రైతులు బాగుపడాలని రైతుబంధు తెచ్చాం.
ఈ పథకం బాగుందని దివంగత వ్యవసాయవేత్త స్వామినాథన్‌తో పాటు యూఎన్‌ఓ పొడిగింది. కాంగ్రెస్ నాయకులు రైతుబంధు దండుగ అంటున్నారు. రైతుబంధు ఉండాలా.. తీసివేయాలా?.. ప్రజలు ఆలోచించుకోవాలి. గతంలో రైతులకు అన్నీ పైరవీల బాధలు ఉండేవి. ఇప్పడు హైదరాబాద్‌లో రైతుబంధు డబ్బులు వేస్తే మీ సెల్‌ఫోన్‌లో మెసేజ్ వస్తుంది. రైతులను ఆదుకోవడం వల్ల దేశంలో 3 కోట్ల టన్నుల ధాన్యం పండిస్తూ పంజాబ్ తర్వాత తెలంగాణ రెండవ స్థానంలో ఉంది. అంతకుముందు 30 లక్షలు, 50 లక్షల టన్నులు మాత్రమే పండించేవారు..’ అని సీఎం తెలిపారు.
కరెంటు 3 గంటలు సరిపోతదా?
‘కరెంటు వేస్టు చేస్తున్నారని ఒకాయన అంటాడు.. 3 గంటలు చాలని మరొకాయన అంటున్నాడు. 3 గంటలు సరిపోతదా.. ఆలోచించాలి. కర్ణాటక నుంచి డీకే శివకుమార్ వచ్చి తమ రాష్ట్రంలో రైతులకు 5 గంటల విద్యుత్ ఇస్తున్నామని, వచ్చి చూసుకోవాలంటూ ప్రగల్భాలు పలుకుతున్నాడు. అలాంటి వారిని నమ్మితే మోసపోయి గోస పడతాం. తెలంగాణలో ప్రభుత్వం 24 గంటల కరెంట్ ఇస్తోంది. కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాందీ, రేవంత్, భట్టి ధరణి తీసివేయాలని మాట్లాడుతున్నారు.
భూరికార్డుల్లో పారదర్శకత కోసం ధరణి పోర్టల్‌ను తెచ్చాం. ఒక రైతును ఏడెమినిది మంది రెవెన్యూ అధికారుల బాధలు, అవినీతి నుంచి తప్పించేందుకు ధరణి తెచ్చాం. భవిష్యత్తులో పింఛన్లు క్రమంగా రూ.6 వేల వరకు, రైతుబంధు రూ.16 వేలకు పెంచుతాం, రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం, బడి పిల్లలకు టిఫిన్, కంటి వెలుగు తదితర పథకాలు అమలు చేస్తామని మేనిఫెస్టోలో పెట్టాం..’ అని సీఎం వివరించారు.
ఇప్పుడు బతుకులు ఎలా ఉన్నాయో ఆలోచించాలి
‘రాష్ట్రంలో గిరిజనుల సంక్షేమానికి కట్టుబడిన ప్రభుత్వం బీఆర్‌ఎస్ ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తెలంగాణ ప్రజల బతుకులు ఎలా ఉన్నాయో ఒక్కసారి ఆలోచించాలి. దళిత బిడ్డలు అనాదిగా అణచివేతకు గురవుతున్నారు. మా తండాలో మా రాజ్యం అని ఎల్‌హెచ్‌పీఎస్ (లంబాడీ హక్కుల పోరాట సమితి) ఆధ్వర్యంలో కొట్లాడారు. అయినా వారిని ఎవరూ పట్టించుకోలేదు. యువత ఆలోచన చేయాలి. దేశం మీది, భవిష్యత్ మీది.. మీ చేతుల్లో ఉంది..’ అని కేసీఆర్ పేర్కొన్నారు.
నల్లగొండకు గోదావరి జాలాలు..
‘గోదావరి జలాలను నల్లగొండ జిల్లాకు అందించి సాగు, తాగునీటి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. గోదావరి జలాలను ఉదయసముద్రం ద్వారా పెద్దదేవులపల్లి రిజర్వాయర్‌కు తీసుకువస్తాం. కాంగ్రెసోళ్ల కేసుల వల్లే డిండి లిఫ్టు పనులు ఆలస్యం అయ్యాయి. రానున్న కొద్దిరోజుల్లోనే లిఫ్టు పనులు పూర్తి చేసి దేవరకొండ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తాం.
పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ఒక్కొక్కటిగా అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. దేశం, రాష్ట్రం బాగుపడాలంటే తలసరి ఆదాయం, విద్యుత్ వినియోగం గీటురాయి. ఈ విషయంలో నాడు పదవ స్థానంలో ఉన్న తెలంగాణ నేడు మొదటి స్థానంలో నిలిచింది. కడుపు, నోరు కట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసుకున్నాం. పదేళ్ల వయస్సున్న తెలంగాణ దేశంలోనే నం.1గా నిలిచింది..’ అని సీఎం చెప్పారు.
కేసీఆర్ బతికున్నంత కాలం సెక్యులర్ రాష్ట్రమే..
‘తెలంగాణ వచ్చిన తర్వాత పది సంవత్సరాల కాలంలో కర్ఫ్యూలు, మత కల్లోలాలు లేవు. కేసీఆర్ బతికున్నంత కాలం తెలంగాణ సెక్యులర్ రాష్ట్రంగానే ఉంటుంది. ఇటీవల దుబ్బాకలో బీఆర్‌ఎస్ అభ్యర్థి ప్రభాకర్‌రెడ్డిపై దాడి చేశారు. మేము ఏనాడూ అరాచకాలు చేయలేదు. దుర్మార్గాలు, దౌర్జన్యం, కుట్రలకు పాల్పడలేదు. అభివృద్ధికి ఆటంకం కలగకుండా మరోసారి బీఆర్‌ఎస్‌ను గెలిపించాలి..’ కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. ఆయా సభల్లో మంత్రి జగదీశ్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బడుగులు లింగయ్య యాదవ్, టీఎస్‌ఐఎస్‌సీ చైర్మన్ బాలమల్లు, బీఆర్‌ఎస్ అభ్యర్థులు శానంపూడి సైదిరెడ్డి, నలమోతు భాస్కరరావు, రవీంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment