కామారెడ్డి ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేస్తున్న సీఎం కేసీఆర్
సాక్షి, కామారెడ్డి/గజ్వేల్: తెలంగాణ ప్రజలను ఆగం చేసేందుకు కాంగ్రెస్, బీజేపీల నేతలు వస్తున్నారని.. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని బీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. ఉన్న తెలంగాణను ఆంధ్రాలో కలిపి 50 ఏళ్లు గోసపడేలా చేసిన కాంగ్రెస్ పార్టీ నేతలు ఒకవైపు.. తెలంగాణకు ఏమీ ఇవ్వకుండా గోసపెడుతున్న బీజేపీ వాళ్లు మరోవైపు ఓట్ల కోసం వస్తున్నారని.. వారికి ఓటుతో చురక (వాత) పెట్టాలని పేర్కొన్నారు.
ఏ అభ్యర్థి ఏమిటో, వారి గుణగణాలు, మంచీచెడ్డతోపాటు వారి వెనుక ఉన్న పార్టీని కూడా చూడాలన్నారు. ఎమ్మెల్యేలను కొంటూ యాభై లక్షలతో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ మహాత్ముడు తనపై పోటీకి వస్తున్నారని, ప్రజలు విచక్షణతో ఆలోచించి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. గురువారం గజ్వేల్, కామారెడ్డిలలో బీఆర్‌ఎస్ అభ్యర్థిగా నామినేషన్లు వేసిన సీఎం కేసీఆర్.. అనంతరం కామారెడ్డిలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ మైదానంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే..
‘‘ప్రజలకు ఉండే ఆయుధం ఓటు. తమాషాకు వేయొద్దు. విచక్షణా జ్ఞానంతో ఆలోచించి ఓటేయాలి. ప్రతీ విషయం మీద చర్చ జరగాలన్నదే నా అభిమతం. ఎన్నికల్లో గెలవాల్సింది నాయకులు కాదు. ప్రజలే గెలవాలి. ఎన్నికలు రాగానే అబద్ధాలు, అభాండాలు, గోల్‌మాల్ తిప్పుడు, గోలగాళ్లు తయారవుతున్నరు. అట్లా కాకుండా చర్చించుకుని నిర్ణయం తీసుకోవాలి.
బీడీ కార్మికులందరికీ జీవన భృతి
యాభై ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ చేసిందేమిటో ప్రజలు ఆలోచించాలి. 1956కు ముందు మనం మనంగానే ఉంటే, మనను తీసుకుపోయి ఆంధ్రలో కలిపారు. మనోళ్లు అప్పుడు నెత్తీనోరు కొట్టుకున్నరు. సిటీ కాలేజీ విద్యార్థులు ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అని ఉద్యమం చేస్తే.. ఏడుగురు పిల్లల్ని కాల్చిచంపిన చరిత్ర కాంగ్రెస్‌ది. తెలంగాణ సాధించుకున్న సమయంలో ఇక్కడ పరిస్థితులు ఎట్లా ఉండె.. ఇప్పుడు ఎట్లా ఉన్నయో ఆలోచించాలి. నేను కేంద్ర కార్మిక మంత్రిగా పనిచేసిన. దేశంలో 16 రాష్ట్రాల్లో బీడీ కార్మికులు ఉన్నారు. అందులో బీడీ కార్మికులకు జీవనభృతి ఇస్తున్న రాష్ట్రం ఒక్క తెలంగాణనే. కటాఫ్ డేట్ తొలగించి అందరికీ జీవనభృతి ఇస్తాం. అందరికీ పింఛన్ సొమ్మును రూ. 2 వేల నుంచి రూ.5 వేలకు పెంచుతాం.
కాంగ్రెస్‌కు ఓటుతో బుద్ధి చెప్పాలి
రాష్ట్రం వచ్చాక ఎన్నో విజయాలు సాధించినం. 24 గంటల కరెంటు ఇచ్చి వ్యవసాయాన్ని నిలబెట్టినం. రైతులకు పెట్టుబడి కోసం రైతుబంధు ఇచ్చి అండగా నిలిచినం. ఇప్పుడు రూ.10 వేలు ఇస్తున్నం. రాబోయే రోజుల్లో రూ.16 వేలకు పెంచుకుంటం. దేశంలో ఎక్కడా 24 గంటల కరెంటు లేదు. ఎక్కడా రైతుబంధు లేదు. ఏదైనా పరిస్థితుల్లో రైతు చనిపోతే రైతుబీమాతో రూ.5లక్షలు అందించి ఆ కుటుంబాన్ని ఆదుకుంటున్నాం. కరెంటు మీద, రైతుబంధు మీద కాంగ్రెస్ లీడర్లు ఏమేమో మాట్లాడుతున్నరు.
ఎద్దు ఎవుసం తెలువని రాహుల్‌గాంధీ ధరణిని తీసేస్తనంటడు. ధరణి పోతే మళ్ల వీఆర్వో, గిర్దావర్, నాయబ్ తహసీల్దార్, తహసీల్దార్, ఆర్డీవో.. ఇట్లా అందరి చేతుల్లోకి భూమి పోయి, రికార్డులన్నీ తారుమారై జనం ఆగం కావలన్నదే వాళ్ల ఉద్దేశం. ధరణి వచ్చినంక రైతుఖాతాలోనే భూమి ఉంటోంది, తను వేలిముద్ర వేస్తేగానీ వేరే వారికి మారే పరిస్థితి ఉండదు. కాంగ్రెస్ పార్టీ నేతలకు ఓటుతో బుద్ధి చెప్పాలి.
బీజేపీ నేతలను నిలదీయాలి..
ప్రధాని మోదీ మోటార్లకు మీటర్లు పెట్టాలని ఒత్తిడి చేస్తే మేం పెట్టబోమని స్పష్టం చేసిన. అందుకు రూ.25వేల కోట్లు లాస్ చేశారు. అయినా వెనక్కి తగ్గలేదు. దేశవ్యాప్తంగా కేంద్రం తరఫున 157 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మంజూరు చేసిన మోదీ తెలంగాణకు మాత్రం ఒక్కటి కూడా ఇవ్వలేదు. జిల్లాకో నవోదయ విద్యాలయం ఇవ్వాల్సి ఉన్నా ఒక్కటీ ఇవ్వలేదు.
అలాంటి బీజేపీకి ఒక్క ఓటూ వెయ్యకుండా చురుకు (వాత) పెట్టాలి. బీజేపీ నేతలను ఎక్కడిక్కడ నిలదీయాలి...’’ అని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ఈ సభలో మంత్రి ప్రశాంత్‌రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీలు కేశవరావు, బీబీపాటిల్, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎమ్మెల్యే సింధే, ఎమ్మెల్సీలు సుభాష్ రెడ్డి, రఘోత్తంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తొలుత గజ్వేల్‌లో.. తర్వాత కామారెడ్డిలో..
సీఎం కేసీఆర్ గురువారం ఉదయం ఎర్రవల్లిలోని తన ఫామ్‌హౌస్ నుంచి హెలికాప్టర్‌లో గజ్వేల్‌కు చేరుకున్నారు. అక్కడి ఆర్డీవో కార్యాలయంలో బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిగా రెండు సెట్ల నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. ఆ పత్రాలను పరిశీలించి, స్వీకరించిన అధికారులు కేసీఆర్‌తో ఎన్నికల ప్రతిజ్ఞ చేయించారు. సాదాసీదాగా జరిగిన ఈ కార్యక్రమం అనంతరం కేసీఆర్ హెలికాప్టర్‌లో కామారెడ్డికి చేరుకున్నారు. అక్కడ ఆర్డీవో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా నామినేషన్ పత్రాలను సమర్పించారు. అనంతరం కామారెడ్డిలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ మైదానంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని ప్రసంగించారు.
Comments
Please login to add a commentAdd a comment