నారాయణపేట సభలో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: తెలంగాణ ప్రజల 50 ఏళ్ల గోసకు కారణం కాంగ్రెస్ పార్టీయేనని.. సమైక్య పాలకులు ఉన్న తెలంగాణను ఊడగొట్టి ఆంధ్రప్రదేశ్‌లో కలిపి మన ప్రాజెక్టులను రద్దు చేశారని బీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మండిపడ్డారు. నదులు పారే పాలమూరు జిల్లాకు గంజి కేంద్రాల గతి పట్టించినది కాంగ్రెస్ పార్టీయేనని విమర్శించారు. 2004లో తెలంగాణ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ మోసం చేసిందని.. మొండి పట్టుదలతో 14 ఏళ్లు పోరాటాలు చేస్తే, వందలాది మంది పిల్లలు చనిపోతే తప్పని పరిస్థితిలో తెలంగాణ ఇచ్చిందని చెప్పారు.
కాంగ్రెస్ వస్తే మళ్లీ కరెంటు, నీళ్ల సమస్యలు, దోపిడీ, కమీషన్ల రాజ్యం వస్తుందని.. అలాంటి పాలన మళ్లీ కావాలా అని ప్రశ్నించారు. అభ్యర్థులతోపాటు వారి వెనుక ఉన్న పార్టీలు, వాటి చరిత్రను చూసి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి పాలమూరులోని దేవరకద్ర, గద్వాల, మక్తల్, నారాయణపేట నియోజకవర్గ కేంద్రాల్లో సోమవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే..
‘‘పిడికెడు మందితో తెలంగాణ అంతా తిరిగి అందరినీ చైతన్యవంతం చేశాం. 2004లో తెలంగాణ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ మోసం చేసింది. నాని్చవేత ధోరణితో టీఆర్‌ఎస్‌ను ముంచేందుకు ప్రయత్నించింది. మొండి పట్టుదలతో 14 ఏళ్లు పోరాటాల తర్వాత.. నేను ఆమరణ దీక్ష చేస్తే తట్టుకోలేక దిగొచ్చి తెలంగాణ ప్రకటన చేశారు. మళ్లీ వెనుకకు పోవడంతో వందలాది మంది పిల్లలు చనిపోయారు.
తప్పని పరిస్థితిలో కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ వల్లే తెలంగాణకు ఈ దుస్థితి. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ పచ్చబడింది. పచ్చబడ్డ రాష్ట్రాన్ని మరోసారి ఖతం పట్టించాలని కుట్రలు చేస్తున్నారు. నేను చెప్పేవన్నీ నిజం కాకపోతే మమ్మల్ని ఓడించండి. మేమెప్పుడూ అబద్ధాలు చెప్పం.. చెప్పే అవసరం మాకు లేదు.
కాంగ్రెస్ వాళ్లు ఏ గతి పట్టించారో అందరికీ తెలుసు
ఒకప్పుడు పాలమూరు జిల్లా పాలుగారిన జిల్లా. సమైక్య రాష్ట్రంలో ఈ జిల్లాకు ఏ గతి పట్టించారో అందరికీ తెలుసు. పాలమూరును సర్వ నాశనం చేసిన పార్టీ కాంగ్రెస్. ఉన్న తెలంగాణను ఊడగొట్టి ఆంధ్రప్రదేశ్‌లో కలిపి సమైక్య పాలకులు మన ప్రాజెక్టులను రద్దు చేశారు. ఒక్క ప్రాజెక్టు కావాలని ఏ కాంగ్రెస్ నాయకుడూ నోరు తెరిచి అడగలేదు. బచావత్ ట్రిబ్యునల్ 1974లో నది నీళ్ల పంపకం చేస్తే.. పాలమూరుకు నీళ్ల గురించి ఏ నాయకుడూ అడగలేదు. ఈ ప్రాంతం ఏపీలో కలవకపోయి ఉంటే బాగుపడేదని బచావత్ ట్రిబ్యునల్ రికార్డుల్లోనే రాసి ఉంది.
పాలమూరుకు జరుగుతున్న అన్యాయాన్ని ట్రిబ్యునల్ గమనించి అప్పట్లో జూరాలకు 17 టీఎంసీలు మంజూరు చేసింది. ఎవరూ పట్టించుకోకపోతే.. తెలంగాణ ప్రాంతవాసి అంజయ్య ముఖ్యమంత్రి అయ్యాక శంకుస్థాపన చేశారు. అయినా కర్ణాటకకు నష్టపరిహారం చెల్లించకుండా నిర్లక్ష్యం చేశారు. 2001లో గులాబీ జెండా ఎగిరాకే అడుగు ముందుకుపడింది. నాటి ముఖ్యమంత్రులు జిల్లాను దత్తత తీసుకున్నామంటూ పునాది రాళ్లు వేసిపోయారే తప్ప ఎవరూ కశికెడు నీళ్లు తెచ్చివ్వలేదు.
కృష్ణా, తుంగభద్ర నదులు ఒరుసుకుంట పారే జిల్లాకు గంజి కేంద్రాల గతి పట్టించింది కాంగ్రెస్ పార్టీ కాదా? ప్రజలు ఆలోచించాలి. ఇప్పుడు పాలమూరు ఎలా అయిందో ప్రజలు గమనించాలి. ఇక్కడి మంత్రులు, ఎమ్మెల్యేలు పట్టుబట్టి నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయించారు. కోయిల్‌సాగర్ లిఫ్ట్‌నూ పూర్తి చేసుకున్నాం. అధికారంలోకి రాగానే పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కాల్వలను పూర్తిచేసి చెరువుల్లో నీళ్లు నింపుతాం.
మరో ఉద్యమం వస్తదేమో..
వాల్మీకి బోయలను ఎస్టీల్లో చేర్చాలని నాలుగు సార్లు అసెంబ్లీలో తీర్మానం చేసి పంపినా కేంద్రం స్పందిస్తలేదు. మరో ఉద్యమం వస్తదేమో. సమైక్య రాష్ట్రంలో మొదటి సీఎం నీలం సంజీవరెడ్డి వాల్మీకి బోయలను ఆంధ్ర ప్రాంతంలో ఎస్టీల్లో పెట్టి, ఇక్కడ బీసీల్లో పెట్టింది నిజం కాదా? ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాదా? ఆనాటి మంత్రి రఘువీరారెడ్డి పాలమూరుకు వస్తే.. మంగళహారతులు పట్టి మరీ నీళ్లు తీసుకుపొమ్మని ఎవరు చెప్పారో అందరికీ తెలుసు.
బాగా ఆలోచించి ఓటేయాలి
నేను కూడ రైతునే, వారికష్టాలు నాకు తెలుసు. అందుకే వ్యవసాయానికి ఉచితంగా 24 గంటల కరెంటు ఇస్తున్నాం. గతంలో రాత్రిళ్లు ఇచ్చే అరకొర కరెంటుతో పాములు కుట్టి, కరెంటు షాక్ తగిలి వేల మంది రైతులు మృత్యువాత పడ్డారు. రైతు బంధు దుబారా అని పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ అంటే.. మూడు గంటల కరెంటు చాలని పీసీసీ చీఫ్ రేవంత్ రైతులపై విషం చిమ్ముతున్నారు. ఎన్నికలు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ ప్రజల దగ్గర ఓటు అనే వజ్రాయుద్ధం ఐదేళ్ల భవిష్యత్‌ను నిర్దేశిస్తుంది. రాష్ట్రానికి, సమాజానికి ఎవరుంటే మేలు జరుగుతుందో విచక్షణతో ఆలోచించి ఓటు వేయాలి.
గద్వాలలో తడబడిన కేసీఆర్
కేసీఆర్ గద్వాలలో తన ప్రసంగం సందర్భంగా తడబడ్డారు. ‘‘ఎన్నికలు వస్తాయి, పోతాయి. మూడు పార్టీల నుంచి ముగ్గురు ఉంటారు. అభ్యర్థుల గుణం చూడాలి. ముఖ్యంగా వారి వెనుక ఉన్న పార్టీలను చూడాలి. బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి వెనుక బీఆర్‌ఎస్ ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి వెనుక కాంగ్రెస్ ఉంటది’’అని చెప్తూ.. ‘బీజేపీ వెనుక బీఆర్‌ఎస్ ఉంటది’అన్నారు. వెంటనే సవరించుకుని ‘బీజేపీ అభ్యర్థి వెనుక బీజేపీ ఉంటది’అంటూ ప్రసంగం కొనసాగించారు.
నారాయణపేటలో ఉర్దూలో ప్రసంగం
సీఎం కేసీఆర్ నారాయణపేట సభలో ప్రసంగించిన సందర్భంగా చివరిలో ముస్లింలను ఉద్దేశించి ఉర్దూలో మాట్లాడారు. ‘‘గత పదేళ్లలో ఒక్క కర్ఫ్యూ లేదు. తెలంగాణ సెక్యులర్ రాష్ట్రంగా ఉండాలన్నదే బీఆర్‌ఎస్ ప్రభుత్వ లక్ష్యం. కేసీఆర్ బతికున్నంత కాలం తెలంగాణ సెక్యులర్ రాష్ట్రంగా ఉంటది. తెలంగాణ ఆవిర్భావానికి ముందు పదేళ్ల కాంగ్రెస్ పాలనలో మైనార్టీల సంక్షేమానికి రూ.900 కోట్లు ఖర్చు చేస్తే.. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఈ తొమ్మిదేళ్లలో రూ.12వేల కోట్లు ఖర్చు చేసింది’’అని చెప్పారు.
హెలికాప్టర్‌లో సమస్యతో సభలు ఆలస్యం
మర్కూక్ (గజ్వేల్): సోమవారం మధ్యాహ్నం సీఎం కేసీఆర్ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పర్యటనకు బయలుదేరిన హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రం నుంచి హెలికాప్టర్ బయల్దేరిన కాసేపటికే అందులో సాంకేతిక సమస్య తలెత్తినట్టు పైలట్ గుర్తించాడు. వెంటనే వెనక్కి తిప్పి వ్యవసాయ క్షేత్రంలోని హెలిప్యాడ్ వద్ద ల్యాండింగ్ చేశారు. సీఎం కేసీఆర్ ప్రచార సభలకు వెళ్లాల్సిన నేపథ్యంలో అధికారులు మరో హెలికాప్టర్‌ను తెప్పించారు. కేసీఆర్ అందులో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పర్యటనకు వెళ్లారు.
తిరిగి రోడ్డు మార్గంలో హైదరాబాద్‌కు..
షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 1.30 గంటలకు కేసీఆర్ దేవరకద్ర సభకు రావాల్సి ఉండగా.. హెలికాప్టర్ సమస్య వల్ల 3.35 గంటలకు చేరుకున్నారు. అక్కడ ప్రజలను ఉద్దేశించి 12 నిమిషాలు ప్రసంగించారు. అక్కడి నుంచి గద్వాలకు చేరుకుని 15 నిమిషాలు, మక్తల్‌లో ఎనిమిది నిమిషాలు ప్రసంగించారు. చివరగా నారాయణపేటలో 29 నిమిషాలు మాట్లాడారు. సాయంత్రం 6.45 గంటల సమయంలో ప్రత్యేక బస్సులో బయల్దేరి రోడ్డుమార్గంలో హైదరాబాద్‌కు చేరుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment