నమ్మితే ఉల్టా పల్టానే!  | | Sakshi
Sakshi News home page

నమ్మితే ఉల్టా పల్టానే! 

Published Tue, Oct 31 2023 12:46 AM | Last Updated on Tue, Oct 31 2023 4:06 AM

CM KCR Fires On Congress Party At Banswada Kamareddy - Sakshi

సాక్షి, కామారెడ్డి/ సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/ నారాయణఖేడ్‌:  ఎన్నికలు అనగానే కొందరు ఏమేమో చెబుతూ వస్తుంటారని, వాళ్ల మాటలు విని ఆగమాగం కావొద్దని ప్రజలకు బీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ వాళ్లను నమ్మితే అంతా ఉల్టాపల్టా అవుతుందని, వారికి అధికారమిస్తే నిండా ముంచుతారని ఆరోపించారు. ఆలోచనతో, విచక్షణతో ఓటు వేయాలన్నారు.

రాష్ట్రం ఏర్పడక ముందు, ఇప్పటి పరిస్థితులను బేరీజు వేసుకోవాలని సూచించారు. ఈసారి ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ గెలిచి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సోమవారం కామారెడ్డి జిల్లా జుక్కల్, బాన్సువాడ నియోజకవర్గాల్లో, సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో జరిగిన బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్‌ ప్రసంగించారు. ఈ వివరాలు ఆయన మాటల్లోనే.. 

‘‘2004లో తెలంగాణ రాష్ట్రం ఇచ్చి ఉంటే పదేండ్లు ముందుకు వెళ్లేవాళ్లం. కాంగ్రెస్‌ పార్టీ ద్రోహం వల్ల మరో పదేండ్లు కొట్లాడాల్సి వచ్చింది. 1969 లెక్కనే ఈసారి కూడా ఆగం జేయాలని చూశారు. అలాంటి సమయంలో కేసీఆర్‌ శవయాత్రనో, జైత్రయాత్రనో తేల్చుకుందామని ఆమరణ దీక్ష చేపడితే.. కేంద్రం దిగివచ్చింది. 

రాష్ట్రాన్ని బాగు చేసుకుంటున్నాం 
తెలంగాణ ఏర్పడక ముందు పరిస్థితులు, ఇప్పుడున్న పరిస్థితులను అంతా బేరీజు వేసుకోవాలి. అప్పుడు కరెంటు ఉండేది కాదు. నీళ్లు ఉండేవి కాదు. బోర్లు తవ్వి ఎంతో మంది బోర్లా పడ్డారు. నేను గూడా 27 బోర్లు వేసి నష్టపోయినోడినే. ఎన్నో బాధలు అనుభవించినం. మిషన్‌ కాకతీయతో చెరువులు బాగు చేసుకున్నం. 24 గంటలు కరెంటు ఇçచ్చుకుంటున్నం.

మిషన్‌ కాకతీయతో ఇంటింటికీ నల్లాల ద్వారా నీళ్లు అందిస్తున్నం. పదేళ్లలో దేశంలో అగ్రగామిగా నిలిచినం. అప్పట్లో నిజాంసాగర్‌ ప్రాజెక్టులో నీళ్లు లేకపోవడంతో సింగూరు నీళ్ల కోసం ఎన్నో కొట్లాటలు చేయాల్సి వచ్చేది. ఇప్పుడా పరిస్థితులు లేవు. జుక్కల్‌ ప్రాంతం కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణల మధ్యలో ఉంది. పొరుగు రాష్ట్రాల ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్నారో మీరు చూస్తూనే ఉన్నరు. అక్కడికి, ఇక్కడికి పరిస్థితులను బేరీజు వేసుకోవాలి. 

ఎక్కడా లేనట్టుగా కరెంటు ఇస్తున్నాం 
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చి తమ రాష్ట్రంలో ఐదు గంటల కరెంటు ఇస్తున్నాం చూసి పొమ్మంటున్నారు. మనం ఇక్కడ 24 గంటలు కరెంటు ఇస్తుంటే.. వాళ్లు ఐదు గంటల గురించి చెబితే ఏమనాలి? దేనితో నవ్వాలి? మహారాష్ట్రలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అక్కడ అన్నీ బాగుంటే రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారో ఆలోచించాలి.

ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్‌లో కూడా 24 గంటల కరెంటు ఇవ్వడం లేదు. పీసీసీ మాజీ అధ్యక్షుడు, పీసీసీ అధ్యక్షుడు రైతుబంధు దుబారా అంటున్నారు. రైతు బంధు ఇవ్వడం దుబారానా? రైతులకు 24 గంటల కరెంటు ఇవ్వడం దుబారానా? ఆలోచించాలి. రెండు దఫాలుగా రూ.37 వేల కోట్ల రుణమాఫీ చేశాం. ఏమైనా మిగిలి ఉంటే ఎన్నికల తర్వాత పూర్తవుతాయి. కేసీఆర్‌ బతికున్నన్ని రోజులు తెలంగాణ రాష్ట్రం సెక్యులర్‌గా ఉంటుంది. 

బసవేశ్వర ద్వారా 1.80 లక్షల ఎకరాలకు నీరు 
కాంగ్రెస్‌ పాలనలోని నారాయణఖేడ్‌కు, ఇప్పటి బీఆర్‌ఎస్‌ పాలనలోని నారాయణఖేడ్‌కు దునియా ఆస్మాన్‌ తేడా ఉంది. గతంలో ఇక్కడ అన్నీ రేకు డబ్బాలే కనిపించేవి. ఇప్పుడన్నీ భవంతులు కనిపిస్తున్నాయి. గతంలో తాగేందుకు నీళ్లు కూడా లేక ప్రజలు ఇబ్బందులు పడేవారు. గిరిజన మహిళా చిమ్నిబాయి మేం ఓటెందుకు వేయాలని అప్పటి ప్రభుత్వాలను ప్రశ్నించిన విషయం అందరికీ తెలుసు. బసవేశ్వర ఎత్తిపోతల పథకం పనులు పూర్తయితే 1.80 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది.

ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టును సింగూరు జలాశయానికి లింకు చేసుకున్నాం. నర్సాపూర్‌ వరకు కాల్వ తవ్వకం పూర్తయింది. ఆ నీళ్లు వస్తే సింగూరు శాశ్వత జల వనరుగా తయారవుతుంది. నల్లవాగు ప్రాజెక్టు ఆయకట్టు కింద రెండు పంటలు పండేలా ఎత్తిపోతల పథకం మంజూరు చేస్తా..’’ అని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ఈ సభల్లో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు హన్మంత్‌ సింధే, ఎం.భూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 
 
హత్యా రాజకీయాలు సిగ్గుచేటు 
ఎన్నికల్లో ప్రజా తీర్పును ఎదుర్కొనలేక భౌతిక దాడులు, హత్యా రాజకీయాలకు తెగబడటం సిగ్గుచేటని బీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. ఎంపీ, దుబ్బాక బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిపై జరిగిన దాడిని బాన్సువాడ, నారాయణఖేడ్‌ సభల్లో తీవ్రంగా ఖండించారు. ‘‘అది ప్రభాకర్‌రెడ్డిపై జరిగిన దాడి కాదు. కేసీఆర్‌ మీద జరిగిన దాడి చేసినట్టే. ప్రజాక్షేత్రంలో గెలవడం చేతగాని దద్దమ్మలు కొత్త ప్రభాకర్‌రెడ్డిపై కత్తితో దాడి చేశారు. చేతగాని కాంగ్రెస్‌ దద్దమ్మలు ఇదే హింస అనుకుంటున్నారు.

మా సహనాన్ని పరీక్షించవద్దు. మాకు తిక్కరేగితే.. ఏం జరుగుతుందో ఊహించుకోవాలి. మొండి కత్తో, లండు కత్తో మాకూ దొరుకుతుంది. మేం కత్తులు పట్టుకుంటే రాçష్ట్రం దుమ్ము దుమ్ము అవుతుంది. ఇన్నేళ్లలో ఎన్నో ఎలక్షన్లు జరిగాయి. బీఆర్‌ఎస్‌ ఎక్కడా ఇలాంటి ఘటనలకు పాల్పడలేదు. గత తొమ్మిదేళ్లు కర్ఫ్యూలు, కొట్లాటలు లేకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటూ వస్తే.. కాంగ్రెస్‌ నాయకులు కండ్లలో నిప్పులు పోసుకుంటున్నారు. ఇలాంటి వారికి తెలంగాణ సమాజం బుద్ధి చెప్పాలి..’’ అని కేసీఆర్‌ పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement