మీరే గెలిపించాలి.. | CM KCR Comments In Satthupalli and Yellandu Public Meeting | Sakshi
Sakshi News home page

మీరే గెలిపించాలి..

Published Thu, Nov 2 2023 3:55 AM | Last Updated on Thu, Nov 2 2023 3:55 AM

CM KCR Comments In Satthupalli and Yellandu Public Meeting - Sakshi

మేం స్వార్థంగా ఆలోచించలేదు.. 
దళిత బంధు మొదలుపెట్టాక హుజూరాబాద్‌ నియోజకవర్గంలో వంద శాతం అమలు చేశాం. ఆ తర్వాత ప్రతిపక్ష నేత భట్టి విక్రమార్క నియోజకవర్గంలోని చింతకాని మండలంలో వంద శాతం కుటుంబాలకు ఇచ్చాం. ఈ పథకం కావాలని మాకు మల్లు భట్టి విక్రమార్క దరఖాస్తు ఇవ్వలేదు. స్వార్థంగా మేం ఆలోచించలేదు. ప్రతిపక్ష నేత ఉన్న నియోజకవర్గంలోనూ అమలుచేశాం. మా నిజాయితీకి ఇది గీటురాయి. ఇవాళ పెడబొబ్బలు పెడుతున్న మూడు రంగుల జెండాలు, ఎర్ర జెండాలు, పచ్చ జెండాలు దళితులకు ఏం చేశాయి? అరచేతికి బెల్లం పెడతా.. చక్కెర గోలీలిస్తా.. చాక్లెట్లు ఇస్తా.. అన్నట్టుగా ఎప్పటికప్పుడు ఎన్నికల ముందు బులిపించి, మురిపించి దశాబ్దాల తరబడి ఓటుబ్యాంక్‌గా వాడుకున్నారు. 

సాక్షి ప్రతినిధి, ఖమ్మం/సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం:  రాష్ట్ర ఆదాయం పెరుగుతుంటే.. ప్రజాసంక్షేమ కార్యక్రమాలు పెంచుకుంటూ వెళ్తున్నామని, అందులో భాగంగా వచ్చిందే దళితబంధు అని బీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెప్పారు. దళితుల ఓట్ల కోసమే ఈ పథకం తెచ్చామని కొందరు విమర్శిస్తుండటం సరికాదని.. అలాంటి చిల్లర రాజకీయాలు తాము చేయబోమని స్పష్టం చేశారు. అలా చేసే వాళ్లమే అయితే మొదటి టర్మ్‌ చివరిలో పెట్టేవాళ్లమని.. కానీ పక్కా ప్రణాళికతో, పద్ధతిగా అమలు చేసేందుకు రెండోసారి గెలిచాక ఈ కార్యక్రమం మొదలుపెట్టాలని నిర్ణయం తీసుకున్నామని వివరించారు. అండగా నిలిచిన బీఆర్‌ఎస్‌ను అధికారంలో కొనసాగించే బాధ్యతను దళిత జాతి తీసుకోవాలని పిలుపునిచ్చారు. బుధవారం ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం కల్లూరులో, భద్రాద్రి జిల్లా ఇల్లెందు మండలం మొట్లగూడెంలో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్‌ మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. 

‘‘రాష్ట్రం ఏర్పడినప్పుడు ఇక్కడ కరెంటు లేదు, నీళ్లు లేవు. రెండు, మూడు నెలలు మేధోమథనం చేసి.. ఒక్కో పథకాన్ని అమలు చేసుకుంటూ సంక్షేమం, అభివృద్ధిలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాం. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్, నీరు, రైతు బంధు, ధరణి వంటివి తెచ్చాం. రాష్ట్ర విభజనతో మనం ఎట్లా బతుకుతామని కొందరు మాట్లాడారు. పరిపాలన వస్తదా అన్నారు. అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అయితే తెలంగాణ చీకటి అవుతుందన్నారు. మరి ఈ రోజున మనం అందరికన్నా ముందున్నాం. హెలికాప్టర్‌లో వస్తూ కిందికి చూస్తే లక్ష్మి అమ్మవారు నేలపై నాట్యం చేసినట్టు కనిపించింది. ఒకప్పుడు అన్నమో రామచంద్రా అని అల్లాడిన నేలపై ధాన్యపు రాశులు కనిపిస్తున్నాయి. 

విచక్షణతో ప్రజలు ఓటేయాలి.. 
ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌తోపాటు కాంగ్రెస్, బీజేపీ, ఎల్లయ్య, పుల్లయ్య బరిలో ఉంటారు. వ్యక్తులతోపాటు వారి చరిత్ర ఏమిటి? వారి కార్యదక్షత ఏమిటి? అనుభవం ఏమిటనేది ప్రజలు చూడాలి. వారిని గెలిపించడం ద్వారా తమ నియోజకవర్గానికి ఏం జరుగుతుందనేది చూడాలి. అలాంటి వ్యక్తుల వెనుక ఏ పార్టీ ఉంది, ఆ పార్టీ చరిత్ర, వైఖరి, దృక్పథం ఏమిటనేది ప్రజలు గమనించాలి. ఎవరో చెప్పారని, మా కులం వాడు నిల్చున్నాడని ఓటు వేయడం సరికాదు. ఒక కులాన్ని ద్వేషించడం కూడా సరికాదు. కూరగాయలు కొనేప్పుడే కాదు.. కుండనో, కూజానో కొనేప్పుడు కూడా చేతితో తడిమి చూసి మంచిదా, కాదా అని పరిశీలిస్తాం. అలాంటిది మీ జీవితాలను మార్చే ఓటు హక్కును వినియోగించుకునే అంశంలో మరింతగా ఆలోచన చేయాలి. 

దళితబంధును పుట్టించిందే కేసీఆర్‌.. 
దేశంలో దళితబంధు పథకాన్ని పుట్టించిన మొగోడు కేసీఆర్‌. కేసీఆర్‌ రాక ముందు ఇలాంటి పథకం ఉందా? ఈ పథకం పెట్టాలని నన్ను ఎవరూ అడగలేదు. అది పెట్టినప్పుడు ఎన్నికలు లేవు. దేశానికి 70ఏళ్ల కింద స్వాతంత్య్రం వస్తే.. ఇప్పటికీ దళితుల పరిస్థితి బాగోలేదు. వివక్షకు, అణచివేతకు గురవుతున్నారు. భారత సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన అంశం. జాషువా వంటి మహాకవి కూడా బాధపడి, గాయపడి దళితుల గురించి కావ్యాలు రాశారు. ఉత్తర భారతంలో రోజూ దళితుల మీద దాడులు జరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, రాజస్తాన్, ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్‌లో కూడా ఈ దాడులు భయంకరంగా ఉన్నాయి. ఇలాంటివెన్నో ఆలోచన చేసి నేను సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే దళిత చైతన్యజ్యోతి అనే కార్యక్రమం పెట్టుకున్నా.. దాని నుంచి పుట్టిందే దళితబంధు. 

బీఆర్‌ఎస్‌ను అధికారంలో కొనసాగించాలి 
సత్తుపల్లి నియోజకవర్గాన్ని దళితబంధు కింద తీసుకున్న కొద్దిరోజుల తర్వాత ఎన్నికల కోడ్‌ వచ్చింది. కొందరు దుర్మార్గులు దళితబంధు లాంటి పథకాలను ఆపాలని ఫిర్యాదులు ఇచ్చారు. మిషన్‌ భగీరథ, రైతు బంధు, దళితబంధు పథకాలు ఎన్నికల కోసం పెట్టామా? మొత్తం తెలంగాణ దళిత సమాజానికి అప్పీల్‌ చేస్తున్నా. మీ కోసం మంచి చేసిన, మిమ్మల్ని జాగృత పరిచే, మీ వికాసాన్ని మనసు నిండా కోరుకునే కేసీఆర్‌ లాంటి నాయకుడ్ని పోగొట్టుకోవద్దని మనవి చేస్తున్నా. బీఆర్‌ఎస్‌ను అధికారంలో కొనసాగించే బాధ్యతను దళిత జాతి తీసుకోవాలని కోరుతున్నాను. 

పైరవీకారుల రాజ్యం వస్తుంది 
రాహుల్‌ గాందీకి ఎద్దు లేదు, ఎవుసం ఎరుకలేదు. ఎవరో సన్నాసి రాసిస్తే అజ్ఞానంతో మాట్లాడుతున్నాడు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ధరణిని తీసేస్తామంటున్నాడు. మళ్లీ వీఆర్వోలు, పహణీ నకళ్లు, ఎమ్మార్వో కార్యాలయం, మళ్లీ వ్యవసాయ కార్యాలయం చుట్టూ రైతులు తిరగాలా? కాంగ్రెస్‌కు ఓటేస్తే దళారుల రాజ్యం, పైరవీకారుల రాజ్యం వస్తుంది. మీ భూమి మీద పెత్తనం ప్రభుత్వానికి వస్తుంది. అదే బీఆర్‌ఎస్‌కు ఓటేస్తే మీ భూమి మీద పెత్తనం మీకే ఉంటుంది. తెలంగాణ ప్రజలే బీఆర్‌ఎస్‌ పార్టీకి బాసులు. అదే కాంగ్రెస్‌ పార్టీ ఏం చేయాలన్నా ఢిల్లీ వైపు చూడాలి.

వాళ్ల స్విచ్‌ అక్కడే ఉంటుంది. ఇంతకు ముందు అరవై ఏళ్లు రాష్ట్రాన్ని పాలించి ప్రజలను వారి ఖర్మానికి వదిలేసింది. ఇప్పుడు మళ్లీ మోసం చేసేందుకు వస్తోంది..’’ అని కేసీఆర్‌ పేర్కొన్నారు. ఈ సభల్లో మంత్రులు పువ్వాడ అజయ్, సత్యవతి రాథోడ్, ఎంపీలు నామా నాగేశ్వరరావు, బండి పార్థసారథిరెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, మాలోతు కవిత, ఎమ్మెల్సీలు తాతా మధు, మధుసూదనాచారి, రఘోత్తమరెడ్డి, ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, రేగా కాంతారావు, మెచ్చా నాగేశ్వరరావు, రాములునాయక్‌ తదితరులు పాల్గొన్నారు. 
 
ప్రధాని మోదీకి అహంకారం! 
ప్రధాని నరేంద్ర మోదీకి అహంకారం ఉంది. ఎల్‌ఐసీ, రైల్వే, విమానాశ్రయాలు మొత్తం ప్రైవేటైజేషన్‌ అంటున్నరు. అదే పిచ్చిలో కరెంట్‌ రంగాన్ని కూడా ప్రైవేటైజేషన్‌ చేస్తామంటున్నరు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలన్నడు. నేను చచ్చినా పెట్టనని చెప్పిన. మన రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలోనే కరెంట్‌ ఉంది. ఏడాదికి రూ.25 వేల కోట్లు భారం పడినా నష్టం భరించామే కానీ రైతుల మోటార్లకు మీటర్లు పెట్టలేదు. 
 
నాకు కూడా అంత అహంకారం లేదు 
ఇటీవల బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావులను ఉద్దేశించి సీఎం కేసీఆర్‌ ఘాటుగా విమర్శలు చేశారు.‘‘ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒకరిద్దరు దుర్మార్గులు ఉన్నారు. ఒకరు బీఆర్‌ఎస్‌ నుంచి నిలబడిన వారిని అసెంబ్లీ గేటు తొక్కనివ్వమని అంటున్నారు. తెలంగాణ తెచ్చి, సీఎంగా ఇన్ని పనులు చేసిన నేను కూడా అంత అహంకారంగా రానివ్వ, లేవనివ్వ, వాడిని కూర్చోనివ్వ అని మాట్లాడలేదు. నాలుగు పైసలు జేబులోకి రాగానే ఇంత అహంకారమా? ఖమ్మం జిల్లా దీన్ని సహిస్తదా? ఈ డబ్బు రాజకీయాలు, అహంకార రాజకీయాలు ఇంకా ఎన్ని రోజులు?’’ అని మండిపడ్డారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement