వాళ్లొస్తే కాటగలుస్తం! | CM KCR Fires On Congress In Jadcharla and Medchal Public Meeting | Sakshi
Sakshi News home page

వాళ్లొస్తే కాటగలుస్తం!

Oct 19 2023 3:57 AM | Updated on Oct 19 2023 3:57 AM

CM KCR Fires On Congress In Jadcharla and Medchal Public Meeting - Sakshi

బుధవారం మేడ్చల్‌లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ప్రజలకు అభివాదం చేస్తున్న సీఎం కేసీఆర్‌

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌/ సాక్షి, మేడ్చల్‌ జిల్లా: నిన్నగాక మొన్న కర్ణాటకలో గెలిచిన కాంగ్రెస్‌ పార్టీ 20 గంటలు కరెంటు ఇస్తామని మాట తప్పిందని.. ఒకవేళ ఇక్కడ కూడా కాంగ్రెస్‌ వస్తే కాటగలుస్తామని బీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యానించారు. వ్యవసాయానికి మూడు గంటల కరెంటు చాలని కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడే మాట్లాడాడని గుర్తు చేశారు.

వాళ్లొస్తే కరెంటుకు కటకట తప్పదని..  రైతుబంధుకు రాంరాం, దళితబంధుకు జైభీం అంటూ ఆపేస్తారని ఆరోపించారు. అడ్డం పొడుగు ఏదో మాట్లాడి గోల్‌మాల్‌ చేయాలని చూస్తున్న వారి మాటలను నమ్మి మోసపోవద్దని పేర్కొన్నారు. అందరికీ మేలు చేసే పార్టీ బీఆర్‌ఎస్‌ ఒక్కటేనని, కారుకు ఓటేసి గెలిపించాలని కోరారు. బుధవారం జడ్చర్ల, మేడ్చల్‌లలో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్‌ ప్రసంగించారు. ఆ అంశాలు ఆయన మాటల్లోనే.. 

‘‘కాంగ్రెస్‌ పార్టీ నిన్నగాక మొన్న కర్ణాటకలో గెలిచింది. 20 గంటలు ఉచిత కరెంట్‌ ఇస్తామని హామీ ఇచ్చింది. ఏమైంది? కర్ణాటక ముఖ్యమంత్రి ఐదు గంటల కరెంటు ఇస్తామంటున్నారు. పొద్దున సగం, రాత్రి సగమని చెప్తున్నారు. ఉచిత కరెంటు ప్రధాన మంత్రికి సైతం చేతకావడం లేదు. ఆయన సొంత రాష్ట్రంలోనూ కరెంట్‌ లేదు. రైతులు రోడ్ల మీద నిరసనలు చేస్తున్నారు. దేశం మొత్తంలో రైతాంగానికి 24 గంటలు కరెంట్‌ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటే.

కాళేశ్వరం పూర్తి చేసుకున్నాం. సీతారామ పూర్తవుతోంది. మంచినీళ్ల బాధ కూడా పోయింది. తలసరి ఆదాయంలో, విద్యుత్‌ వినియోగంలో దేశంలోనే నంబర్‌ వన్‌గా ఉన్నాం. కులమతాలకు అతీతంగా పేదలందరినీ ఆదుకుంటున్నాం. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా డబుల్‌ బెడ్రూం ఇళ్లు ఇచ్చిన ఘనత బీఆర్‌ఎస్‌కే దక్కుతుంది. ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగాలి. అలాంటిది కాంగ్రెస్‌ పార్టీకి ఓటేస్తే మళ్లీ కరెంట్‌ బాధలు వస్తాయి, పరిశ్రమలు దెబ్బతింటాయి. 

ఇక్కడి బాధలు చూసి పాట రాశా.. 
ఒకనాడు జయశంకర్‌ సార్, నేను నారాయణపేట ప్రాంతం పోయి హైదరాబాద్‌ వెళ్లడానికి నవాబ్‌పేట అడవి గుండా వస్తున్నాం. అమ్మవారి గుడి ఉంది అక్కడ. పక్కన చిన్న అడవిలో ఉన్న ఆ దేవాలయం దగ్గర లైట్ల వెలుగు అంత దూరం కనిపించింది. మహబూబ్‌నగర్‌లో మనుషులే కాదు.. చివరికి అడవి కూడా బక్కపడిందని బాధపడ్డాం. మహబూబ్‌నగర్‌లో గంజి, అంబలి కేంద్రాలు పెడుతుంటే గుండెలవిసేలా బాధకలిగేది.

పక్కనే కృష్ణానది పారుతున్నా ఎందుకీ దుర్గతి? ఆ బాధలు చూసి ‘‘పక్కన కృష్ణమ్మ ఉన్నా ఫలితమేమి లేకపాయె.. పాలమూరు, నల్లగొండ, ఖమ్మం ఎట్టా పంటలు ఎండిపాయె..’’ అంటూ పాట రాశా. మహబూబ్‌నగర్‌ దరిద్రం పోవాలంటే పాలమూరు నుంచి ఎంపీగా పోటీ చేయాలని, ప్రజలు గెలిపిస్తారని జయశంకర్‌ సార్‌ చెప్పారు. ఇదే జిల్లా నుంచి పోటీ చేశా. ఆనాడు నన్ను గెలిపించినది లక్ష్మారెడ్డిగారే. 15 ఏళ్లు పోరాటం చేసినప్పటికీ మహబూబ్‌నగర్‌ ఎంపీగా ఉంటూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కీర్తి నిలిచిపోయింది. 

దద్దమ్మ ఎమ్మెల్యేలు అడగక నష్టపోయాం 
ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరులోని దద్దమ్మ ఎమ్మెల్యేలు నోరు తెరవక, అడగలేక నష్టపర్చారు. అడిగేవారు లేక నాటి పాలకులు జూరాల నుంచి పాలమూరుకు నీళ్లు తీసుకోవాలని సోర్స్‌ ఇచ్చారు. జూరాల బెత్తెడు ప్రాజెక్టు.. అందులో ఉండే నీళ్లు 9–10 టీఎంసీలే. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా మనం రోజుకు రెండు టీఎంసీలు తీసుకోవాల్సి ఉంది. ఆ లెక్కన జూరాలలో నీళ్లు మూడ్నాలుగు రోజుల్లో అయిపోతాయి.

అందుకే పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుకు శ్రీశైలంను సోర్సుగా ఎంపిక చేశాం. ఆ ప్రాజెక్టు ఎవరి జాగీరు కాదు. రైతుల బాధలు తీర్చేందుకు ప్రాజెక్టుకు నేనే డిజైన్‌ చేశా. కానీ ఇక్కడి దద్దమ్మ కాంగ్రెస్‌ నాయకులు కేసులు వేసి పాలమూరు ప్రాజెక్టును ఆపాలని చూశారు. ప్రాజెక్టు పూర్తయితే బీఆర్‌ఎస్‌కు పేరొస్తుందని కుట్రలు చేశారు. అయినా మొండిపట్టుతో రిజర్వాయర్లు, టన్నెల్స్‌ పూర్తి చేసుకున్నాం. రెండు, మూడు నెలల్లో బ్రహా్మండంగా నీళ్లను చూడబోతున్నాం. 

కాంగ్రెస్‌ వల్లే తెలంగాణకు 60ఏళ్ల గోస.. 
1956లో కాంగ్రెస్‌ తెలంగాణను ఆంధ్రలో కలిపి 60 ఏళ్ల గోసకు కారణమైంది. సమైక్య రాష్ట్రంలో ఆ బాధలు కళ్లారా చూశా. అందరం కలిసి కొట్లాడితే తెలంగాణ వచ్చింది. అనేక మంది విద్యార్థులు బలిదానాలు చేశారు. నేను సైతం చావు నోట్లో తలకాయ పెడితే తెలంగాణ వచ్చింది. 60ఏళ్లు గోస పడేట్టు చేసిన కాంగ్రెస్‌ వాళ్లు ఇప్పుడు మళ్లీ వచ్చి పెద్ద మాటలు మాట్లాడుతుండటం సిగ్గుచేటు.  

రైతుల బతుకులు మారాలనే.. 
నిన్నగాక మొన్ననే మేనిఫెస్టో విడుదల చేశాం. రైతుల బతుకులు మారాలన్నదే నా లక్ష్యం. నేను పుట్టించిందే రైతు బంధు పథకం. ప్రపంచంలో ఎక్కడా లేదు. ఇండియాలోనూ ఎక్కడా లేదు. రైతుల కోసం రూ.37 వేలకోట్ల రుణమాఫీ చేశాం. ఇప్పుడిప్పుడే తెల్లగవుతున్నాం. ఇంకో పదేళ్లు కష్టపడితే.. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రైతుల జీవితాలు బాగుపడతాయి. బీఆర్‌ఎస్‌ మళ్లీ గెలవగానే.. రాష్ట్రంలో 93 లక్షల తెల్లరేషన్‌ కార్డుదారులకు రైతు బీమా తరహాలో జీవిత బీమా సౌకర్యం కల్పిస్తాం. సన్న బియ్యం అందిస్తాం. ఆసరా పెన్షన్లను రూ.5 వేల వరకు పెంచుతాం.

సౌభాగ్యలక్ష్మి పథకం కింద అర్హులైన మహిళలకు రూ.3 వేలు అందిస్తాం. రైతుబంధు సాయాన్ని రూ.16 వేల వరకు పెంచుతాం. అగ్రవర్ణాల పిల్లలకు 110 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తాం. మరో లక్ష డబుల్‌ బెడ్రూం ఇళ్లు నిర్మించి పంపిణీ చేస్తాం’’ అని కేసీఆర్‌ హామీ ఇచ్చారు. జడ్చర్ల సభలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, మేడ్చల్‌ సభలో మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు, కుత్బుల్లాపూర్, ఉప్పల్, మల్కాజిగిరి అభ్యర్థులు వివేకానంద, బండారి లక్ష్మారెడ్డి, మర్రి రాజశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 
 
ఒంటరిగా పోరాడి సాధించా.. 
నాడు తెలంగాణలో తాగు, సాగునీరు లేక ప్రజలు వలసపోయారు. పోచంపల్లిలో ఒకే రోజు ఏడుగురు చేనేత కార్మికులు చనిపోతే.. అక్కడి వెళ్లిన. వాళ్లకు సాయం చేయాలంటూ నాటి సీఎంను జోలె పట్టి అడిగినా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. అంత దుర్మార్గపు పాలనను అనుభవించాం. తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇచ్చేది లేదని నాడు సీఎంగా ఉన్న కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ఒక్కరు కూడా మాట్లాడలేదు.

అలాంటి వారిపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. 20ఏళ్ల కింద తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిప్పుడు ప్రతి ఒక్కరూ నవ్వులాటగా చూశారు. హేళనగా మాట్లాడారు. నా మీద ఎన్నో నిందలు వేసి అవమానించారు. తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు, ఇతర పార్టీల నేతలు ఉద్యమంలో నాతో కలసి రాకపోయినా ఒంటరిగా పోరాటం చేశాను. దాని ఫలితమే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చింది. నేడు అదే తెలంగాణను దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దుకున్నాం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement