సాక్షి ప్రతినిధి, వరంగల్: రైతులకు తమ భూమిపై పూర్తి హక్కులు ఉండాలని ధరణిని తెచ్చామని.. రైతు వేలిముద్ర లేకుండా భూమి జోలికి ఎవరూ పోలేరని బీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెప్పారు. రైతుల కష్టాలు తెలుసు కాబట్టే రెవెన్యూ అధికారుల అధికారాలను ధరణితో రైతుల చేతికి అందించామని.. అలాంటి ధరణిని బంగాళాఖాతంలో కలుపుతామని కాంగ్రెస్ వాళ్లు అంటున్నారని మండిపడ్డారు. ధరణిని రద్దు చేసి అధికారులను రైతుల నెత్తిన రుద్దుదామని, మళ్లీ పైరవీల రాజ్యం తేవాలనేది కాంగ్రెస్ ఉద్దేశమని ఆరోపించారు.
అలాంటి కాంగ్రెస్ వాళ్లనే బంగాళాఖాతంలో కలిపితే అందరం బాగుంటామని వ్యాఖ్యానించారు. పదేళ్ల అభివృద్ధిని ఆగం చేయాలని చూసే వాళ్లకు ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ సోమవారం జనగామ, భువనగిరిలలో నిర్వహించిన బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభల్లో ప్రసంగించారు. అందులో జనగామ సభలో కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే..
‘‘తెలంగాణ రాకముందు అరిగోసపడ్డాం. జనగామ ప్రాంతాన్ని చూసి కండ్లనీళ్లు పెట్టుకున్నా.. తెలంగాణలో చాలా ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఉండేది. ఎక్కడికి వెళ్లి చూసినా వలసలు, ఎండిపోయిన పంటలు, ఇబ్బందులు చూస్తే దుఃఖం ఆగకపోయేది. నిలబడి, కలబడి అందరి ఆశీర్వాదం, మద్దతుతో తెచ్చుకున్న తెలంగాణలో.. చీకట్లో బాణం వేసినట్టు పనులు మొదలుపెట్టాం. మేధోమథనం చేసి పథకాలు తెచ్చాం. పదేళ్లలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్‌గా నిలిచింది. ఒకప్పుడు కరువున్న తెలంగాణలో ఇవాళ రెండు నెలల పాటు వేలాది లారీల్లో ధాన్యం తరలివెళ్తుంటే సంతోషమేస్తోంది.
ఎన్నికల కోసం మేనిఫెస్టోలు తేలేదు
తెలంగాణ ప్రజల గోస, బాధలను చూసినవాడిగా ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే తపనతో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. ఎన్నికల కోసం అబద్ధాల మేనిఫెస్టోలను తేవడం లేదు. మేనిఫెస్టోలో పేర్కొన్నవే కాకుండా చెప్పని అనేక పథకాలను ప్రజలకు అందుబాటులో తెచ్చాం. బీఆర్‌ఎస్ మళ్లీ గెలిస్తే.. 93లక్షల మందికి కేసీఆర్ బీమా అమలు చేస్తాం. రైతుబీమా తరహాలోనే ఎవరైనా చనిపోతే వారంలోనే రూ.5 లక్షల బీమా సొమ్ము అందుతుంది. స్వాతంత్య్రం వచ్చాక అత్యధిక కాలం ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించిన ప్రభుత్వాలు ఏనాడూ దళితులను పట్టించుకోలేదు. అందుకే దళితులతో కోసం దళితబంధు ప్రారంభించాం. కేసీఆర్ గొంతులో ప్రాణమున్నంత వరకు దళితబంధు సహా అన్ని అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలవుతాయి.
రోల్ మోడల్‌గా జనగామ
ఉద్యమ సమయంలో సిద్దిపేట నుంచి సూర్యాపేటకు వెళ్తూ బచ్చన్నపేటలో ఆగాను. ఆ ఊరిలో ఒక్క యువకుడు కూడా కనిపించలేదు. నా దగ్గరకు వచ్చిన వాళ్లను అడిగితే.. ఊరిలో యువకులంతా పొట్ట చేతబట్టుకొని వలస వెళ్లారని చెప్పారు. అలాంటి బచ్చన్నపేటలో ఇప్పుడు 365 రోజులు నీళ్లు ఉంటున్నాయి. జనగామ జిల్లాను అభివృద్ధిలో పథంలో రోల్‌మోడల్‌గా మారుస్తాం. మెడికల్ కశాశాల మంజూరుతో అనివార్యంగా నర్సింగ్, పారామెడికల్ కళాశాల కూడా వస్తాయి. మళ్లీ గెలిచిన నెలలోపే చేర్యాల రెవెన్యూ డివిజన్ ఇస్తా. నాడు చంద్రబాబు మోసపూరిత విధానాలతో దేవాదుల ప్రాజెక్టుకు పూజలు చేసి వదిలేశారు. మేం సమ్మక్క బ్యారేజీని 7.5 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించి ఉమ్మడి వరంగల్ జిల్లాకు అంకితం చేశాం.
ముత్తిరెడ్డిని నేనే వద్దన్నా..
ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి నాకు మంచి మిత్రుడు. కొన్ని అంశాల వల్ల పోటీచేసి సీటు పోగొట్టుకోవద్దని నేనే చెప్పి వద్దన్నాను. జనగామను అగ్రగామి నిలిపేందుకు మన ఇంట్లో మనిíÙలా ఉండే పల్లా రాజేశ్వర్‌రెడ్డిని అభివృద్ధి దూతగా పంపాను. ఆయనను లక్ష మెజారీ్టతో గెలిపించుకోవాలి..’’ అని కేసీఆర్ పిలుపునిచ్చారు.
45 ఏళ్లు ఉండి అవమానాలకు గురయ్యా: పొన్నాల
కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య సోమవారం జనగామ సభా వేదికపై గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం కేసీఆర్ ఆయనకు గులాబీ కండువా కప్పి బీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పొన్నాల మాట్లాడుతూ.. కాంగ్రెస్‌లో 45 ఏళ్లు ఉండి అవమానాలకు గురయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు. జనగామ నియోజకవర్గ అభివృద్ధి కోసమే బీఆర్‌ఎస్‌లో చేరినట్టు చెప్పారు.
జనగామ ప్రాంతంలో కేసీఆర్ ఏడు రిజర్వాయర్లు నిర్మించారన్నారు. ఇక్కడ పాడి పరిశ్రమ అభివృద్ధికి సహకరించాలని సీఎం కేసీఆర్‌ను కోరారు. ఈ సభలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, జనగామ బీఆర్‌ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు బండా ప్రకాశ్, దేశపతి శ్రీనివాస్, మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, టి.రాజయ్య తదితరులు పాల్గొన్నారు.
కరెంటు మాయం.. దళితబంధు ఆగం
– కాంగ్రెస్ వస్తే రైతుల భూములకు ఎసరు: భువనగిరి సభలో కేసీఆర్
సాక్షి, యాదాద్రి: ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రాష్ట్రంలో కరెంటు మాయమవుతుందని.. దళిత బంధు ఆగమవుతుందని బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. అన్నీ పోయి మళ్లీ దళారుల రాజ్యం వస్తుందని పేర్కొన్నారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రజాశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. సభలో కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే..
‘‘రైతులను పైరవీకారుల పాలుచేసిన కాంగ్రెస్ రాజ్యం మళ్లీ రావాలా?.. మళ్లీ అదే పాట పాడాలా? దయచేసి రైతు సోదరులు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. రైతుల భూముల మీద రైతులకే హక్కులుండాలని ధరణి పోర్టల్‌ను తెచ్చాం. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణిని రద్దు చేస్తామంటున్నది. పొరపాటున అదే జరిగితే.. రైతులపై రాబందులు పడతారు. మళ్లీ కౌలు రైతులు, వీఆర్వోలు, మళ్లీ రికార్డుల కెక్కియ్యడం వంటి వాటితో రైతుల భూములన్నీ ఆగమైపోతయ్. అదే జరిగితే ఒకరి భూమి మరొకరి పేర్ల మీదకు వస్తుంది. మళ్లీ తహసీల్ ఆఫీసులు, కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉంటుంది.
మూడు గంటల కరెంటు చాలంటున్నరు
నేనూ రైతు బిడ్డనే.. వ్యవసాయం చేస్తా. ఒకప్పుడు కరెంటు లేదు, మంచినీళ్లు లేవు, సాగునీళ్లు లేవు. ఇవ్వాళ 24 గంటల కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. 24 గంటల కరెంటు ఎందుకు? మూడు గంటలు చాలు అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. చాలా పెద్ద ప్రమాదం పొంచి ఉంది. దయచేసి ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఆలోచించి ఓటు వేయాలి..’’ అని పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రణాళికలో అన్ని వర్గాలకు ప్రాధాన్యం కల్పించామని చెప్పారు. ఈ సభలో కేసీఆర్ 12 నిçమిషాలు మాత్రమే ప్రసంగించారు. మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, గొంగిడి సునీత, చిరుమర్తి లింగయ్య తదితరులు సభలో పాల్గొన్నారు.
సభలో గుండెపోటుతో వ్యక్తి మృతి
భువనగిరి నియోజకవర్గంలోని భూదాన్ పోచంపల్లి మండలం జూలూరుకు చెందిన మెట్టు సత్తయ్య (55) బీఆర్‌ఎస్ కార్యకర్తలతో కలసి ఈ సభకు వచ్చారు. ఈ క్రమంలో ఆకస్మికంగా కుప్పకూలిపోయారు. పక్కనే ఉన్న వారు గమనించి ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. సత్తయ్య వ్యవసాయ పనులు చేస్తూ జీవిస్తున్నారని, ఆయన భార్య ఇప్పటికే మృతిచెందారని, ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారని స్థానికులు తెలిపారు.
నేడు సిరిసిల్ల, సిద్దిపేటల్లో కేసీఆర్ సభలు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: బీఆర్‌ఎస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని సిరిసిల్లలో మంగళవారం ప్రజా ఆశీర్వాద సభను నిర్వహించనుంది. ఇది సీఎం కుమారుడు, మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడం గమనార్హం. మధ్యాహ్నం 2 గంటలకు జరిగే బహిరంగ సభ కోసం మొదటి బైపాస్‌రోడ్డులో స్థలాన్ని సిద్ధం చేశారు. కేసీఆర్ హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో సిరిసిల్లకు చేరుకుని సభలో పాల్గొంటారు. తర్వాత సిద్దిపేటలో జరిగే సభకు వెళతారు.
మతం పేరిట విభేదాలు సృష్టించే కుట్ర
ఒకప్పుడు కుల, మత ఘర్షణలతో అట్టుడికిపోయే హైదరాబాద్‌లో గత పదేళ్లుగా ఎలాంటి మతకలహాలు లేవు. శాంతి సామరస్యాల రాష్ట్రంగా తెలంగాణ రూపుదిద్దుకుంది. రాష్ట్రంలో పరిస్థితులు బాగున్నందువల్లే భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. కానీ కొందరు వచ్చి మతం పేరిట విభేదాలు సృష్టించేందుకు కుట్రలు చేస్తున్నారు. ఓటంటే వజ్రాయుధం. ఓటు మన తలరాతను, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తుంది. అబద్ధాలు చెప్పేవారిని నమ్మి అలవోకగా ఓటేస్తే పరిణామాలు వేరే తీరుగా ఉంటాయి. ఆలోచించి వేస్తేనే మంచి ఫలితాలు వస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment