సాక్షి, కామారెడ్డి: ‘ఇది దొరలకు, తెలంగాణ ప్రజలకు మధ్యన యుద్ధం అని రాహుల్‌గాంధీ అంటుండు. రాహుల్ సవాల్‌ను స్వీకరిస్తున్నం. ఈ యుద్ధం ఢిల్లీ దొరలకు, తెలంగాణ ప్రజలకు మధ్యనే. ఇందులో తెలంగాణ ప్రజలదే విజయం..’అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. కామారెడ్డి జిల్లాలోని భిక్కనూరు, దోమకొండ మండల కేంద్రాల్లో బుధవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో కేటీఆర్ మాట్లాడారు. ‘తెలంగాణ ప్రజలను నాటి నుంచి నేటి దాకా కాంగ్రెస్ దొరలే వంచనకు గురిచేశారు. 1952లో తెలంగాణను ఆంధ్రలో కలపొద్దని మనోళ్లు కొట్లాడితే, రాహుల్‌గాంధీ ముత్తాత నెహ్రూ ఉద్యమాన్ని అణచివేయడంలో భాగంగా ఐదుగురిని పొట్టన పెట్టుకున్నాడు.
1956లో ‘అమాయకపు అమ్మాయి తెలంగాణకు గడసరి అబ్బాయి ఆంధ్రతో బలవంతపు పెళ్లి’అని నెహ్రూ ఆనాడే చెప్పారు. అప్పుడే తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా గుర్తించాలని ఎన్నో ఉద్యమాలు నడిచాయి. 1968లో తెలంగాణ కోసం పెద్ద ఎత్తున విద్యార్థులు ఉద్యమం లేవదీస్తే, రాహుల్‌గాంధీ నాయనమ్మ ఇందిరాగాంధీ 370 మందిని కాల్చి చంపిన చరిత్రను తెలంగాణ సమాజం మరిచిపోలేదు. 1971లో తెలంగాణ ప్రజలంతా రాష్ట్రం కోసం 11 మంది ఎంపీలను గెలిపించి ఢిల్లీకి పంపితే ఆరు సూత్రాల పథకం అంటూ ఆగం జేసి ఎంపీలను గొర్రెలను లాక్కున్నట్టు లాక్కున్న చరిత్ర కూడా ఇందిరదే.
చివరకు దేశంలో ఎమర్జెన్సీ విధించింది కూడా కాంగ్రెస్ పార్టీ, ఇందిరాగాంధీయే. ప్రత్యేక రాష్ట్రం కోసం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సమాజం పోరాటం చేస్తుంటే, 2004లో రాష్ట్రం ఇస్తామన్న హామీతో పొత్తు కుదుర్చుకుని అధికారం చేపట్టిన తర్వాత.. రాహుల్ తల్లి సోనియా గాంధీ మాట తప్పి ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేశారు. 2004 నుంచి 2014 దాకా రాష్ట్ర ఉద్యమాలను అణచివేసి, వందలాది మంది యువతను బలితీసుకున్న బలిదేవత సోనియాగాందీ. చివరకు రాష్ట్రం ఇయ్యకపోతే తెలంగాణ ప్రజలు ఊకోరు, వీపు మోత మోగిస్తరని భయపడి రాష్ట్రం ఇచ్చారే తప్ప ప్రేమతో కాదు..’అని కేటీఆర్ చెప్పారు.
ప్రజలే విజయం సాధిస్తారు..
‘ఢిల్లీలో మరో దొర నరేంద్ర మోదీతోనూ కొట్లాడుతున్నం. తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి మేలు చేయకపోగా, అన్నింటా అడ్డంకులు సృష్టిస్తున్న బీజేపీతో పోరాటం కొనసాగిస్తూనే ఉన్నాం. గుజరాత్ దొంగ పైసలు బీజేపీ వాళ్లకు వస్తున్నయి. ఆ పైసలతోనే సలాకలు, సిమెంటు ఇస్తున్నరు. అవన్నీ మన పైసలే.. తీసుకోండ్రి.. ఓటు మాత్రం కారుకు వెయ్యుండ్రి..’అని కేటీఆర్ ప్రజలను కోరారు.
కేసీఆర్ నామినేషన్ కోసం రూ.50 వేలు
కామారెడ్డి నుంచి ఎన్నికల బరిలో నిలుస్తున్న కేసీఆర్ నామినేషన్ ఖర్చుల కోసం కేసీఆర్ అమ్మ పుట్టిన ఊరు కోనాపూర్ గ్రామస్తులు సర్పంచ్ చెప్యాల నర్సవ్వ ఆధ్వర్యంలో రూ.50 వేలను మంత్రి కేటీఆర్‌కు అందించారు. ఊరంతా ఏకపక్షంగా ఓట్లు వేసి గెలిపిస్తామని చెప్పారు. సభల్లో ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.
రేవంత్‌రెడ్డిని గంప కింద కమ్ముడే..
‘తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకీ ఎక్కుపెట్టిన రైఫిల్‌రెడ్డి (రేవంత్‌రెడ్డి) కొడంగల్‌కు వస్తవా లేకుంటే తననే కామారెడ్డికి రమ్మంటవా అని కేసీఆర్‌ను సవాల్ చేస్తున్నడు. తెలంగాణ ద్రోహులకు ఓటుతో గుణపాఠం చెప్పేందుకు కామారెడ్డి ప్రజలు రెడీగా ఉన్నారు. గంప గోవర్ధన్ పలుమార్లు షబ్బీర్ అలీని గంప కింద కమ్మిండు. ఇప్పుడు రేవంత్‌రెడ్డిని కూడా గంప కింద కమ్ముడే.
కాంగ్రెస్ వస్తే నాలుగు వేల పింఛన్ ఇస్తదంటే ఎవరు నమ్ముతరు. 55 ఏళ్లు అధికారం ఇస్తే రూ.200 పింఛన్ ఇచ్చేందుకే మనసు రాలేదు. అసుంటోళ్లు ఇప్పుడు నాలుగువేలు ఇస్తరంట. కానీ కేసీఆర్ రెండు వేల పింఛన్‌ను ఐదు వేలకు చేస్తా అంటుండు. అందుకే అవ్వ, తాతలు కేసీఆర్ పెద్దకొడుకని మూడోసారి గెలిపించేందుకు తయారుగ ఉన్నరు..’అని కేటీఆర్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment