సాక్షి, హైదరాబాద్ : ‘తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయి. తెలంగాణను ఎన్నో రెట్లు అభివృద్ధి చేసుకున్నాం. తొమ్మిదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ఇంటింటికీ నీళ్లిచ్చాం. 24 గంటల కరెంటు ఇచ్చాం. 69 లక్షల మంది రైతులకు రైతుబంధు, 47లక్షల మందికి ఆసరా పింఛన్లు, 1.10 లక్షల మందికి రైతుబీమా, 13.50 లక్షల మందికి కల్యాణలక్ష్మి లబ్ధి చేకూర్చాం. వెయ్యి రెసిడెన్షియల్ పాఠశాలలు తీసుకొచ్చాం.
అక్షరాస్యత 15 నుంచి 20 శాతం పెరిగింది. ఇవన్నీ కొనసాగాలంటే మళ్లీ కేసీఆర్ సీఎంగా ఉండాల్సిన అనివార్యత ఉంది. కాంగ్రెస్, బీజేపీ నాయకుల మాయమాటలు విని రిస్క్ తీసుకోవద్దని చెబుతున్నాం’ అని బీఆర్‌ఎస్ సీనియర్ నేత, రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు వివరించారు. శాసనసభ ఎన్నికల నేపథ్యంలో సాక్షిటీవీ లైవ్‌షోలో ఆయన పలు అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. వివరాలు ఆయన మాటల్లోనే...
కర్ణాటక వైఫల్యాల ప్రచారం ఆత్మరక్షణకు కాదు
కర్ణాటక ఇచ్చే ప్రకటనలన్నీ అబద్ధం. యువశక్తి అని యాడ్ ఇచ్చారు. అక్కడ ఉద్యోగాలు ఇచ్చారా? మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నారు. బస్సులు కూడా లేకుండా చేశారు. 10 కిలోల ఉచితబియ్యం అని 5 కిలోలు ఇస్తున్నారు. కర్ణాటకలో జరుగుతున్న విషయాలను చెపుతున్నాం. కర్ణాటక మోడల్ అంటే 3 గంటల కరెంటు, రైతుబంధు తొలగింపు, నోటిఫికేషన్లు ఇవ్వకపోవడమా? కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ కర్ణాటక ప్రకటనలు ఇవ్వటం ఎందుకు.
కాంగ్రెస్ మాటలు నమ్మి ఆగం కావొద్దు
బీఆర్‌ఎస్ ప్రజల పార్టీ. బీజేపీ కార్పొరేట్ పార్టీ. ఇక కాంగ్రెస్ దొంగ హామీలు ఇస్తూ ప్రజలను మోసం చేస్తుంది. ఐదు గ్యారంటీల పేరుతో కర్ణాటకలో జనాన్ని మోసం చేసింది. అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అవుతున్నా అక్కడ ఎన్నికల హామీలు అమలు చేయటం లేదు. ఏడాదికి 2లక్షల ఉద్యోగాలు అన్నారు. ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. నోటిఫికేషన్లు లేవు. కర్ణాటకలో 5 గ్యారంటీలు ఏమోగానీ ఉన్న గ్యారంటీలు పోయాయి.
గతంలో బీజేపీ ప్రభుత్వం అక్కడ అమలు చేసిన రైతుబంధు, యువశక్తి, 9 గంటల కరెంటును తొలగించింది. విద్యార్థులకు స్కాలర్íÙప్‌లో 80 శాతం కోత విధించింది. నిరుద్యోగ భృతి కూడా ఇవ్వటం లేదు. కానీ ఇక్కడ కేసీఆర్ 24 గంటల కరెంట్, రైతుబంధుతో వ్యవసాయం పండగ చేశారు.
రేవంత్‌రెడ్డి 3 గంటల కరెంట్, కర్ణాటక డిప్యూటీ సీఎం 5 గంటల కరెంట్ చాలు అంటున్నారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే 3 గంటల కరెంట్, 5 గంటల కరెంట్ ఒప్పుకున్నట్టే. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇవన్నీ రద్దు అవుతాయి. ప్రజలు ఆలోచించాలి.
కరెంటు, నీళ్లు వచ్చినోళ్లంత కారుకు ఓటేయాలి
24 గంటల కరెంట్, మిషన్ భగీరథతో ఇంటింటికీ నీరు గురించి కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోంది. పూర్తిస్థాయిలో కరెంట్, ఇంటింటికీ నీళ్లు వచ్చినోళ్లంతా కారుకు ఓటేయండి... రాని వారు కాంగ్రెస్‌కు ఓటేయండి. సాఫీగా తెలంగాణపాలన సాగుతోంది. అనేకరంగాల్లో మార్గదర్శకంగా తెలంగాణను దేశంలో నంబర్ 1 స్థానంలో ఉంచారు. కేసీఆర్‌కు వాగు వంక, చెట్టు పుట్ట అన్ని తెలుసు. ప్రతిపక్ష నాయకులకు ఏది తెలియదు.
కేసీఆర్ ఫోకస్ రైతులే
ఎక్కడా లేనివిధంగా రైతుబంధును రాష్ట్రంలో అమలు చేస్తే కేంద్ర ప్రభుత్వం దానిని పీఎం కిసాన్ సమ్మాన్ యోజన పేరుతో అమలు చేస్తోంది. అధికారంలోకి వస్తే రైతుబంధు కింద కాంగ్రెస్ పార్టీ రూ.15 వేలు ఇస్తామని చెప్తోంది. కానీ మేము రూ.16 వేలు ఇస్తామని చెప్తున్నాం. గతంలో కరెంట్ కష్టాలు ఉండేవి. ఇప్పుడు 24 గంటల కరెంటు వస్తుంది. కరెంటు కావాలా? కాంగ్రెస్ కావాలా అని అందుకే అంటున్నాం. కేసీఆర్ రైతుబిడ్డ. ఆయన ఫోకస్ అంతా రైతులే.
వాస్తవాలు చెబుతున్నాం
కాంగ్రెస్ ప్రకటనలకో, ప్రచారానికో మేం భయపడడం లేదు. 6 గ్యారంటీల పేరుతో జనాన్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రం ఏమవుతుందో విడమర్చి చెబుతున్నాం. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 12 మంది ముఖ్యమంత్రులు కావడం ఖాయం.
ప్రజల్లో అపనమ్మకం సృష్టించే ప్రయత్నం
ధరణితోపాటు ప్రభుత్వ పథకాలన్నీ భేష్ అని ప్రజలే చెబుతున్నారు. మా బలం ఏందో ప్రతిపక్షాలకు తెలుసు. మా బలం మీద విమర్శ చేస్తేనే, దు్రష్పచారం చేస్తేనే జనం నమ్ముతారు అని వారి ఆలోచన. ప్రజల్లో అపనమ్మకం సృష్టించి జనాన్ని
ఇబ్బందులు పెట్టాలని కాంగ్రెస్ చూస్తోంది.
ఇంకా ఆయన ఏమన్నారంటే...
♦ బీఆర్‌ఎస్ సభలకు ఎక్కడ చూసినా ఇసుక వేస్తే రాలనంత జనం వస్తున్నారు. కానీ రాహుల్, ప్రియాంక సభలు జనం లేక వెలవెలబోతున్నాయి. ఖాళీ కుర్చీలకు ఉపన్యాసం ఇస్తున్నారు.
♦ కాంగ్రెస్‌నేతలు కుటుంబపాలన అనడం విడ్డూరం. ఇందిర, రాజీవ్, సోనియా, రాహుల్‌గాంధీ వీరంతా ఎవరు? మేము ప్రజాక్షేత్రం నుంచి వచ్చిన వాళ్లం. మాది కుటుంబ పార్టీ ఎలా అవుతుంది.
♦ ఉస్మానియా యూనివర్సిటీ వెళ్లడానికి భయపడేది మేము కాదు రేవంత్‌రెడ్డి భయపడుతున్నారు. విద్యార్థులను బీర్లు, బిర్యానీ ఇస్తే ఏమైనా చేస్తారు అని అన్నాడు.
♦ పేపర్ లీకేజీలు ఇతర రాష్ట్రాల్లో జరగటం లేదా? జరిగిన తప్పును మేమే గుర్తించి సీఐడీ విచారణకు ఇచ్చాం. అత్యంత పారదర్శకంగా ఉద్యోగాలు భర్తీ చేస్తాం
♦ మేము ఎవరికి బీ టీమ్ కాదు. కాంగ్రెస్, బీజేపీలు బీఆర్‌ఎస్‌కు భయపడుతూ ఒకరిపైఒకరు చెప్పుకుంటూ మా మీద ఆరోపణ చేస్తున్నాయి.
♦ బీఆర్‌ఎస్ వీక్ అని వచ్చినవన్నీ ఫేక్ సర్వేలు.. పేపర్ల మీద సర్వేలు చేస్తే ఎలా?
♦ కొంతమంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకతనే కాదు. పాజిటివ్ కూడా ఉండొచ్చు కదా. సంక్షేమ పథకాల లబ్ధి ఎమ్మెల్యేల ద్వారానే వెళ్తుంది కదా. 80 సీట్లతో మేమే అధికారంలోకి వస్తాం
♦ కేటీఆర్‌ను సీఎంను చేయాలని పార్టీ అనుకుంటే చేస్తుంది. మాకు కేసీఆరే సీఎం కావాలని అనుకుంటున్నాం.
Comments
Please login to add a commentAdd a comment