Tanniru Harish Rao
-
Economic Survey 2023-24: ప్రతి ఊరికి కావాలి.. ఇలాంటి స్టీల్ బ్యాంక్
పెళ్లయినా శుభకార్యమైనా పార్టీ మీటింగ్ అయినా ప్రభుత్వ హెల్త్ క్యాంప్లైనా భోజనాల దగ్గర ప్లాస్టిక్ వాడకం ఉంటుంది. చెత్త పేరుకు పోతుంది. డబ్బు కూడా వృథా. అదే స్టీల్ గిన్నెలు ఉంటే? ఒకసారి కొంటే ప్రతిసారి ఉపయోగించుకోవచ్చు. ఈ ఆలోచనతో 2020లో తెలంగాణాలోని సిద్దిపేటలో ఏర్పడిన స్టీల్ బ్యాంక్ ‘ఎకానమిక్ సర్వే 2023–24 బుక్’లో తాజాగా చోటు సంపాదించుకుంది. ఇది మహిళా నిర్వహణకు వారి పర్యావరణ దృష్టికి దక్కిన విజయం.ఇది మహిళల విజయం. జాతీయంగా దక్కిన గుర్తింపు. కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టే సమయంలో ఎకనామిక్ సర్వే రిపోర్ట్‌ను విడుదల చేస్తారు. సోమవారం విడుదల చేసిన రిపోర్ట్ 12వ చాప్టర్లో మౌలిక సదుపాయాలు, వృద్ధిలో భాగంగా సిద్దిపేట స్టీల్ బ్యాంక్ వలన జరిగిన ఉపయోగం గురించి వివరించారు. దీనితో స్టీల్ బ్యాంక్ నిర్వాకులైన మహిళలతో పాటు సిద్దిపేట ఎం.ఎల్.ఏ. హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు.ప్లాస్టిక్ వద్దనుకుని2022లో సిద్దిపేట మున్సిపాలిటీలో ‘కంటి వెలుగు కార్యక్రమం’లో భాగంగా వైద్య సిబ్బందికి ఆయా గ్రామ పంచాయతీలు భోజన ఏర్పాట్లు చేశాయి. వైద్య సిబ్బంది భోజనం చేసేందుకు ప్లాస్టిక్‌ను వినియోగించాల్సి వచ్చింది. ఇది ఊళ్లో అనవసర చెత్తను పోగు చేస్తోంది. అదే సమయంలో పర్యావరణానికి హాని కూడా. ఈ పారేసిన ప్లాస్టిక్‌ని పశువులు తింటే ప్రమాదం. అందుకే డీపీఓ దేవకీదేవి ప్లాస్టిక్‌కు బదులు స్టీలు వాడాలని నిర్ణయం తీసుకున్నారు. ఒక్కో గ్రామ పంచాయతీ నుంచి రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకూ సేకరించి స్టీల్ ప్లేట్లు, గ్లాస్లు, స్పూ¯Œ లు, వాటర్ బాటిల్లను కొనుగోలు చేశారు. ఇలా ఏ గ్రామానికి ఆ గ్రామం కొని జిల్లాలోని 499 గ్రామ పంచాయతీల్లో వినియోగించారు. దీంతో రోజుకు 6 కిలోల నుంచి 8 కిలోల ప్లాస్టిక్‌ను వినియోగించకుండా నిర్మూలించారు.సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 34 స్టీల్ బ్యాంక్‌లో ఉన్న పాత్రల వివరాలు భోజనం ప్లేట్లు 25,500, అల్పహార ప్లేట్లు 8,500, వాటర్ గ్లాస్లు 25,500, టీ గ్లాస్లు 8,500, చెంచాలు 25,500, చిన్న గిన్నెలు 25,500, స్టీల్ ట్రేలు 612, బకెట్లు 272, ఇతరములు 3వేలు వస్తువులున్నాయి.– గజవెల్లి షణ్ముఖ రాజు, సిద్దిపేట, సాక్షి– ఫొటోలు: కె. సతీష్ కుమార్సంతోషంగా ఉంది...ప్లాస్టిక్‌ను నిర్మూలించేందుకు గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో స్టీల్ బ్యాంక్‌లను ఏర్పాటు చేయించాం. మనం పాటించి తర్వాత ప్రజలు పాటించాలన్న స్ఫూర్తితో బ్యాంక్‌ల ఏర్పాటు. కంటి వెలుగు కార్యక్రమంలో వైద్య సిబ్బందికి భోజన సదుపాయాలు ఏర్పాటు చేశాం. వీరికి స్టీల్ ప్లేట్, గ్లాస్లు, వాటర్ బాటిల్ల ద్వారానే అందించాం. మా కృషికి గుర్తింపు దొరకడం సంతోషంగా ఉంది– దేవకీదేవి, డీపీఓసంఘం మహిళలు‘మాది సిద్దిపేటలోని వెన్నెల సమైక్య మహిళా సంఘం. శ్రీసాయితేజ సమైక్య మహిళా సంఘంకు చెందిన గడ్డమీది నవ్య ఇద్దరం కలిసి గత నాలుగేళ్లుగా స్టీల్ బ్యాంక్‌ను కొనసాగిస్తున్నాం. మా ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు ప్రత్యేక చొరవతో సిద్దిపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో 34 వార్డుల్లో స్టీల్ బ్యాంక్‌లను ఏర్పాటు చేశారు. 29, ఫిబ్రవరి 2020న మా స్టీల్ బ్యాంక్ ప్రారంభించారు. మా వార్డు పరిధిలో వివాహాలు, ఇతర శుభకార్యాలు, ఇతర కార్యక్రమాలు జరిగితే ముందుగానే సామాగ్రి కోసం సమాచారం ఇస్తారు. వారు ఎంత మందితో కార్యక్రమం నిర్వహిస్తున్నారో చెబితే వారికి సరిపడా సామాగ్రిని అందజేస్తాం. వీటిని ప్రత్యేక సంచిలో వేసి ఇస్తాం. వారి కార్యక్రమం అయిపోయిన తర్వాత క్లీన్ చేసి తీసుకువస్తారు. ఏదైనా వస్తువులు మిస్ అయితే వాటికి డబ్బులు తీసుకుంటాం. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాస్లు, కప్‌లు ధర కంటే తక్కువ అద్దెకే కిరాయికి ఇస్తున్నాం. ప్లాస్టిక్ నిర్మూలిస్తున్నామనే సంతోషంతో పాటు మాకు ఆర్థికంగా సైతం దోహదపడుతుంది. మా కమిషనర్ ప్రసన్న రాణి, చైర్పర్సన్ కడవేర్గు మంజుల, కౌన్సిలర్ దీప్తిల సహకారంతో ముందుకు వెళ్తున్నాం. పెళ్లిళ్ల సీజన్ అయితే ఎక్కువ మంది తాకిడి ఉంటుంది. మా దగ్గర అన్ని కిరాయికి పోతే మా పక్క వార్డులో ఉంటే తీసుకుని వారికి అద్దెను చెల్లిస్తాం. ప్రజల నుంచి బాగా స్పందన వస్తోంది. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి రేపటి తరాలకు మంచి పర్యావరణాన్ని బహుమతిగా ఇవ్వాలనే లక్ష్యంతో వీటి బాధ్యతలను నిర్వర్తిస్తున్నాం.– బాలగోని దీప్తి, వెన్నెల సమైక్య మహిళా సంఘం. -
రిస్క్ వద్దు !
సాక్షి, హైదరాబాద్ : ‘తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయి. తెలంగాణను ఎన్నో రెట్లు అభివృద్ధి చేసుకున్నాం. తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఇంటింటికీ నీళ్లిచ్చాం. 24 గంటల కరెంటు ఇచ్చాం. 69 లక్షల మంది రైతులకు రైతుబంధు, 47లక్షల మందికి ఆసరా పింఛన్లు, 1.10 లక్షల మందికి రైతుబీమా, 13.50 లక్షల మందికి కల్యాణలక్ష్మి లబ్ధి చేకూర్చాం. వెయ్యి రెసిడెన్షియల్ పాఠశాలలు తీసుకొచ్చాం. అక్షరాస్యత 15 నుంచి 20 శాతం పెరిగింది. ఇవన్నీ కొనసాగాలంటే మళ్లీ కేసీఆర్ సీఎంగా ఉండాల్సిన అనివార్యత ఉంది. కాంగ్రెస్, బీజేపీ నాయకుల మాయమాటలు విని రిస్క్ తీసుకోవద్దని చెబుతున్నాం’ అని బీఆర్ఎస్ సీనియర్ నేత, రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు వివరించారు. శాసనసభ ఎన్నికల నేపథ్యంలో సాక్షిటీవీ లైవ్‌షోలో ఆయన పలు అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. వివరాలు ఆయన మాటల్లోనే... కర్ణాటక వైఫల్యాల ప్రచారం ఆత్మరక్షణకు కాదు కర్ణాటక ఇచ్చే ప్రకటనలన్నీ అబద్ధం. యువశక్తి అని యాడ్ ఇచ్చారు. అక్కడ ఉద్యోగాలు ఇచ్చారా? మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నారు. బస్సులు కూడా లేకుండా చేశారు. 10 కిలోల ఉచితబియ్యం అని 5 కిలోలు ఇస్తున్నారు. కర్ణాటకలో జరుగుతున్న విషయాలను చెపుతున్నాం. కర్ణాటక మోడల్ అంటే 3 గంటల కరెంటు, రైతుబంధు తొలగింపు, నోటిఫికేషన్లు ఇవ్వకపోవడమా? కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ కర్ణాటక ప్రకటనలు ఇవ్వటం ఎందుకు. కాంగ్రెస్ మాటలు నమ్మి ఆగం కావొద్దు బీఆర్ఎస్ ప్రజల పార్టీ. బీజేపీ కార్పొరేట్ పార్టీ. ఇక కాంగ్రెస్ దొంగ హామీలు ఇస్తూ ప్రజలను మోసం చేస్తుంది. ఐదు గ్యారంటీల పేరుతో కర్ణాటకలో జనాన్ని మోసం చేసింది. అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అవుతున్నా అక్కడ ఎన్నికల హామీలు అమలు చేయటం లేదు. ఏడాదికి 2లక్షల ఉద్యోగాలు అన్నారు. ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. నోటిఫికేషన్లు లేవు. కర్ణాటకలో 5 గ్యారంటీలు ఏమోగానీ ఉన్న గ్యారంటీలు పోయాయి. గతంలో బీజేపీ ప్రభుత్వం అక్కడ అమలు చేసిన రైతుబంధు, యువశక్తి, 9 గంటల కరెంటును తొలగించింది. విద్యార్థులకు స్కాలర్íÙప్లో 80 శాతం కోత విధించింది. నిరుద్యోగ భృతి కూడా ఇవ్వటం లేదు. కానీ ఇక్కడ కేసీఆర్ 24 గంటల కరెంట్, రైతుబంధుతో వ్యవసాయం పండగ చేశారు. రేవంత్‌రెడ్డి 3 గంటల కరెంట్, కర్ణాటక డిప్యూటీ సీఎం 5 గంటల కరెంట్ చాలు అంటున్నారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే 3 గంటల కరెంట్, 5 గంటల కరెంట్ ఒప్పుకున్నట్టే. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇవన్నీ రద్దు అవుతాయి. ప్రజలు ఆలోచించాలి. కరెంటు, నీళ్లు వచ్చినోళ్లంత కారుకు ఓటేయాలి 24 గంటల కరెంట్, మిషన్ భగీరథతో ఇంటింటికీ నీరు గురించి కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోంది. పూర్తిస్థాయిలో కరెంట్, ఇంటింటికీ నీళ్లు వచ్చినోళ్లంతా కారుకు ఓటేయండి... రాని వారు కాంగ్రెస్‌కు ఓటేయండి. సాఫీగా తెలంగాణపాలన సాగుతోంది. అనేకరంగాల్లో మార్గదర్శకంగా తెలంగాణను దేశంలో నంబర్ 1 స్థానంలో ఉంచారు. కేసీఆర్‌కు వాగు వంక, చెట్టు పుట్ట అన్ని తెలుసు. ప్రతిపక్ష నాయకులకు ఏది తెలియదు. కేసీఆర్ ఫోకస్ రైతులే ఎక్కడా లేనివిధంగా రైతుబంధును రాష్ట్రంలో అమలు చేస్తే కేంద్ర ప్రభుత్వం దానిని పీఎం కిసాన్ సమ్మాన్ యోజన పేరుతో అమలు చేస్తోంది. అధికారంలోకి వస్తే రైతుబంధు కింద కాంగ్రెస్ పార్టీ రూ.15 వేలు ఇస్తామని చెప్తోంది. కానీ మేము రూ.16 వేలు ఇస్తామని చెప్తున్నాం. గతంలో కరెంట్ కష్టాలు ఉండేవి. ఇప్పుడు 24 గంటల కరెంటు వస్తుంది. కరెంటు కావాలా? కాంగ్రెస్ కావాలా అని అందుకే అంటున్నాం. కేసీఆర్ రైతుబిడ్డ. ఆయన ఫోకస్ అంతా రైతులే. వాస్తవాలు చెబుతున్నాం కాంగ్రెస్ ప్రకటనలకో, ప్రచారానికో మేం భయపడడం లేదు. 6 గ్యారంటీల పేరుతో జనాన్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రం ఏమవుతుందో విడమర్చి చెబుతున్నాం. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 12 మంది ముఖ్యమంత్రులు కావడం ఖాయం. ప్రజల్లో అపనమ్మకం సృష్టించే ప్రయత్నం ధరణితోపాటు ప్రభుత్వ పథకాలన్నీ భేష్ అని ప్రజలే చెబుతున్నారు. మా బలం ఏందో ప్రతిపక్షాలకు తెలుసు. మా బలం మీద విమర్శ చేస్తేనే, దు్రష్పచారం చేస్తేనే జనం నమ్ముతారు అని వారి ఆలోచన. ప్రజల్లో అపనమ్మకం సృష్టించి జనాన్ని ఇబ్బందులు పెట్టాలని కాంగ్రెస్ చూస్తోంది. ఇంకా ఆయన ఏమన్నారంటే... ♦ బీఆర్ఎస్ సభలకు ఎక్కడ చూసినా ఇసుక వేస్తే రాలనంత జనం వస్తున్నారు. కానీ రాహుల్, ప్రియాంక సభలు జనం లేక వెలవెలబోతున్నాయి. ఖాళీ కుర్చీలకు ఉపన్యాసం ఇస్తున్నారు. ♦ కాంగ్రెస్‌నేతలు కుటుంబపాలన అనడం విడ్డూరం. ఇందిర, రాజీవ్, సోనియా, రాహుల్‌గాంధీ వీరంతా ఎవరు? మేము ప్రజాక్షేత్రం నుంచి వచ్చిన వాళ్లం. మాది కుటుంబ పార్టీ ఎలా అవుతుంది. ♦ ఉస్మానియా యూనివర్సిటీ వెళ్లడానికి భయపడేది మేము కాదు రేవంత్‌రెడ్డి భయపడుతున్నారు. విద్యార్థులను బీర్లు, బిర్యానీ ఇస్తే ఏమైనా చేస్తారు అని అన్నాడు. ♦ పేపర్ లీకేజీలు ఇతర రాష్ట్రాల్లో జరగటం లేదా? జరిగిన తప్పును మేమే గుర్తించి సీఐడీ విచారణకు ఇచ్చాం. అత్యంత పారదర్శకంగా ఉద్యోగాలు భర్తీ చేస్తాం ♦ మేము ఎవరికి బీ టీమ్ కాదు. కాంగ్రెస్, బీజేపీలు బీఆర్ఎస్కు భయపడుతూ ఒకరిపైఒకరు చెప్పుకుంటూ మా మీద ఆరోపణ చేస్తున్నాయి. ♦ బీఆర్ఎస్ వీక్ అని వచ్చినవన్నీ ఫేక్ సర్వేలు.. పేపర్ల మీద సర్వేలు చేస్తే ఎలా? ♦ కొంతమంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకతనే కాదు. పాజిటివ్ కూడా ఉండొచ్చు కదా. సంక్షేమ పథకాల లబ్ధి ఎమ్మెల్యేల ద్వారానే వెళ్తుంది కదా. 80 సీట్లతో మేమే అధికారంలోకి వస్తాం ♦ కేటీఆర్‌ను సీఎంను చేయాలని పార్టీ అనుకుంటే చేస్తుంది. మాకు కేసీఆరే సీఎం కావాలని అనుకుంటున్నాం. -
కేసీఆర్ రైతుల ఆదాయం పెంచుతున్నారు
సాక్షి, సిద్దిపేట: కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కార్ అంబానీ, అదానీల ఆదాయం మాత్రమే పెంచుతుంటే, సీఎం కేసీఆర్ మాత్రం రైతుల ఆదాయాన్ని పెంచుతున్నారని మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. సంపద పెంచి రైతుబంధు, కేసీఆర్ కిట్, రైతుభీమా, కల్యాణలక్ష్మీ, ఆసరా పింఛన్‌తో పేదలకు పంచుతుంటే, బీజేపీ వారు పేదలదగ్గర పన్నుల పేరుతో గుంజుకుని అంబానీ, అదానీలకు దోచిపెడుతున్నారని విమర్శించారు. నగదు రహిత సేవలు అని ప్రారంభించి ఇప్పుడు గూగుల్ పే, పేటీఎంలు వినియోగించిన వారికి త్వరలో 1.1% పన్ను విధించనున్నారని తెలిపారు. సిద్దిపేట జిల్లా నంగనూరులో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ..పంటలకు అవసరమైన విద్యుత్, టైమ్‌కు ఎరువులు, పంట పెట్టుబడికి రూ.10వేలు, కాళేశ్వరం నీరు సీఎం కేసీఆర్ తెచ్చినందునే నేడు రాష్ట్రంలో రైతులు బాగున్నారని తెలిపారు. మనకు అల్లావుద్దీన్ దీపం లేదు, కేసీఆర్ అనే దీపం ఉందని ఆ దీపం అండతోనే రాష్ట్రంలో అద్భుతమైన అభివృద్ధి జరుగుతోందని పేర్కొన్నారు. కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెడుతూ బీజేపీ సమాధులు తవ్వే పనిలో ఉంటే సమైక్యతతో బలమైన పునాదులు తవ్వే పనిలో సీఎం కేసీఆర్ ఉన్నారని వివరించారు. బీఆర్ఎస్ను కాపాడుకునే బాధ్యత మనదే బీఆర్ఎస్ కన్నతల్లిలాంటిది, కాపాడుకునే బాధ్యత మనందరిపై ఉందని పార్టీ శ్రేణులకు మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. కార్యకర్తల మధ్య చిన్నచిన్న విభేదాలు ఉంటే మాట్లాడుకోవాలని, కేసీఆర్ నాయకత్వాన్ని దేశ వ్యాప్తంగా బలపరచడానికి పార్టీ శ్రేణులందరూ సిద్ధంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. త్వరలోనే గృహ లక్ష్మి కార్యక్రమం ప్రారంభం అవుతుందని ప్రతి పేదవారికి తప్పకుండా ఇళ్లు ఇస్తామని హామినిచ్చారు. దేశవ్యాప్తంగా యాసంగిలో 97లక్షలు వరి సాగైతే తెలంగాణ రాష్ట్రంలో యాసంగిలో 56లక్షల ఎకరాల్లో వరిసాగు అవుతుందన్నారు.సగం దేశానికి అన్నం పెట్టే ధాన్యాగారంగా తెలంగాణ మారిందన్నారు. -
Huzurabad: కంచుకోటలో చావో రేవో
సాక్షి, హైదరాబాద్: ఐదు నెలల వ్యవధిలోనే రూపు మార్చుకున్న హుజూరాబాద్ రాజకీయం తాజాగా ఉప ఎన్నిక షెడ్యూలు వెలువడిన నేపథ్యంలో మరింత వేడెక్కనుంది. పార్టీ పుట్టుక నుంచి కంచుకోటగా ఉన్న హుజూరాబాద్‌లో ప్రస్తుత ఉప ఎన్నికలో విజయం కోసం అధికార టీఆర్ఎస్ సర్వశక్తులూ ఒడ్డుతోంది. మరోవైపు ఇన్నాళ్లూ హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ అభ్యర్థిగా వరుస విజయాలు సాధించిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రస్తుతం ప్రత్యర్థి పార్టీలో చేరి సవాలు విసురుతున్నారు. దీంతో హుజూరాబాద్ నియోజకవర్గాన్ని ఎలాగైనా తిరిగి నిలబెట్టుకునేందుకు టీఆర్ఎస్, ఇన్నాళ్లూ సాధిస్తూ వస్తున్న వరుస విజయాల పరంపరను కొనసాగించేందుకు ఈటల శ్రమిస్తుండటంతో ఉప ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. భూ కబ్జా ఆరోపణల నేపథ్యంలో పార్టీని వీడిన ఈటల.. బీజేపీలో చేరి నియోజకవర్గంలో నాయకులు, కార్యకర్తలు తన వెంటే ఉన్నారని చెబుతున్నారు. టీఆర్ఎస్ కుట్రపూరితంగా బయటకు పంపిందంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు. హుజూరాబాద్‌లో నామమాత్రంగా ఉన్న బీజేపీ.. ఈటల చేరిక నేపథ్యంలో సత్తా చాటాలనే పట్టుదలతో ఉంది. ఆరుసార్లు టీఆర్ఎస్.. నాలుగు పర్యాయాలు ఈటలే టీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత 2004లో హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి తొలిసారి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, 2008లో జరిగిన ఉప ఎన్నికలోనూ ఎన్నికయ్యారు. అయితే పొరుగునే ఉన్న కమలాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2004లో టీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రత్యక్ష ఎన్నికల రాజకీయాల్లోకి అరంగేట్రం చేసి గెలిచిన ఈటల రాజేందర్ కూడా 2008 ఉప ఎన్నికలో విజయం సాధించారు. 2009లో జరిగిన అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనలో కమలాపూర్ అంతర్థానమై హుజూరాబాద్ నియోజకవర్గంలో అంతర్భాగమైంది. కాగా 2009లో హుజూరాబాద్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఈటల విజయం సాధించారు. ఆ తర్వాత 2010 ఉప ఎన్నిక, 2014, 2018 సాధారణ ఎన్నికల్లో కలుపుకుని మొత్తంగా నాలుగుసార్లు ఆ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి టీఆర్ఎస్ అభ్యర్థిగా ఈటల ఎన్నికయ్యారు. అప్పటి ఈటల ప్రత్యర్థులందరూ ఇప్పుడు టీఆర్ఎస్లో..! ఈటల కమలాపూర్ నుంచి రెండుసార్లు, హుజూరాబాద్ నుంచి నాలుగు సార్లు మొత్తంగా ఆరుసార్లు వరుసగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అయితే ఈ ఆరు ఎన్నికల్లోనూ వివిధ పార్టీల తరఫున ఆయనతో పోటీ పడిన ప్రధాన ప్రత్యర్ధులందరూ టీఆర్ఎస్ నుంచి ఈటల నిష్క్రమణ తర్వాత గులాబీ పార్టీ గూటికి చేరుకోవడం గమనార్హం. కమలాపూర్‌లో టీడీపీ నుంచి ప్రధాన ప్రత్యర్ధిగా (2014లో) ఉన్న దివంగత మాజీ మంత్రి కుమారుడు ముద్దసాని కశ్యప్‌రెడ్డి టీఆర్ఎస్లో చేరారు. హుజూరాబాద్‌లో 2009 సాధారణ ఎన్నిక, 2010 ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన వకుళాభరణం కృష్ణమోహన్‌రావు తర్వాతి కాలంలో అధికార పార్టీలో చేరారు. ఇక 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన పాడి కౌశిక్‌రెడ్డి కూడా జూలైలో టీఆర్ఎస్లో చేరారు. ఇదిలా ఉంటే ప్రస్తుత ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గెల్లు శ్రీనివాస్ తండ్రి గెల్లు మల్లయ్య 2004 ఎన్నికలో కమలాపూర్ నుంచి ఈటల రాజేందర్‌పై ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయడం గమనార్హం. ప్రలోభాలు వారివి.. పథకాలు మావి రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమ పార్టీగా ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్న టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రంగాలు, వర్గాల అభివృద్ధి కోసం జాబితాకు కూడా అందనన్ని కార్యక్రమాలు చేపట్టింది. హుజూరాబాద్ ఉప ఎన్నికలో ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఎజెండాగా తీసుకుని ప్రజల్లోకి వెళుతున్నాం. బీజేపీ మాత్రం మోసపూరిత ప్రకటనలు, హామీలు ఇస్తూ కుట్టు మిషన్లు, బొట్టు బిళ్లలు పంచుతూ రాజకీయం చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు బీజేపీ అధికారంలో ఉన్న 18 రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయడం లేదు? అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈటల రాజేందర్ మళ్లీ గెలిచినా నియోజకవర్గానికి ఒరిగేదేమీ లేదు. ఇక హుజూరాబాద్‌లో కాంగ్రెస్ ఉనికే లేదు. ఆ పార్టీకి డిపాజిట్ కూడా దక్కదు. – తన్నీరు హరీశ్‌రావు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి -
కేసీఆర్ వెంటే మేము.. మంత్రి హరీశ్, బి. వినోద్ రాకతో..
సాక్షి, హైదరాబాద్/కమలాపూర్: టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే కొనసాగుతామని హుజూరాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండలానికి చెందిన ఆ పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు స్పష్టం చేశారు. ఈ మేరకు వారు మంత్రి హరీశ్‌రావు, మాజీ ఎంపీ, రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్‌లతో శనివారం హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. భేటీ అయినవారిలో కమలాపూర్ ఎంపీపీ తడక రాణీ శ్రీకాంత్, పీఏసీఎస్ చైర్మన్ పేరాల సంపత్‌రావు, డీసీసీబీ డైరక్టర్ పి.కృష్ణప్రసాద్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా వారికి హరీశ్, వినోద్ కౌన్సెలింగ్ నిర్వహించారు. ‘పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న మీరందరూ అధినేత కేసీఆర్ నిర్ణయాన్ని గౌరవించి టీఆర్ఎస్ వెంటే నడవండి. పార్టీ మీకు అన్నివిధాలా అండగా నిలబడుతుంది. ఈటల రాజేందర్ పట్ల ఎవరికీ వ్యక్తిగతంగా ద్వేషం లేదు. కానీ, పార్టీకి నష్టం చేసే కార్యకలాపాలు చేసినందు వల్లే ముఖ్యమంత్రి ఆయనను మంత్రి పదవి నుంచి భర్తరఫ్ చేశారు’అని పేర్కొన్నారు. అనంతరం కమలాపూర్ నేతలు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఆవిర్భావం నుంచి టీఆర్ఎస్లో ఉన్నామని, రెండో ఆలోచనకు తావు లేకుండా తాము టీఆర్ఎస్ నీడలోనే పనిచేస్తామని స్పష్టం చేశారు. పార్టీ కేడర్ అంతా కేసీఆర్ వెంటే నడుస్తుందని, నియోజకవర్గ అభివృద్ధి టీఆర్ఎస్తోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. కొనసాగుతున్న మంతనాలు పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు హుజూరాబాద్ నియోజకవర్గంలో ఇన్‌చార్జీలుగా పనిచేస్తున్న నేతలు కేడర్‌తో మంతనాలను ముమ్మరం చేశారు. క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, కరీంనగర్ మేయర్ సునీల్‌రావు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావులు పార్టీ ప్రజాప్రతినిధులు, వివిధ స్థాయిల నేతలెవరూ మాజీమంత్రి ఈటల వైపు వెళ్లకుండా కౌన్సెలింగ్ చేస్తున్నారు. జిల్లాస్థాయిలో మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్రస్థాయిలో హరీశ్, వినోద్‌కుమార్‌లు నేతలతో మాట్లాడి నచ్చచెబుతున్నారు. ఇదిలా ఉండగా, శుక్రవారం సీఎం కేసీఆర్ వరంగల్ పర్యటన సందర్భంగా ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు నివాసానికి వెళ్లారు. వారి మధ్య హుజూరాబాద్ నియోజకవర్గ రాజకీయాలు ప్రస్తావనకు వచ్చి ఉంటాయని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. -
సంగారెడ్డిలో పంచాయతీరాజ్ సమ్మేళనం!
సాక్షి, సంగారెడ్డి: గ్రామాల సమగ్ర అభివృద్ధి కోసమే తెలంగాణ ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రామాన్ని అమలు చేస్తున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా జిల్లా స్థాయిలో పంచాయతీ రాజ్ సమ్మేళానాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రితో పాటు ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ: ఎక్కడ లేనివిధంగా.. పారిశుద్ధ్య సమస్య లేకుండా ప్రతి గ్రామానికి ఒక ట్రాక్టర్ ఇచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వందే అన్నారు. ప్రతి గ్రామంలో వైకుంఠ ధామం, డంప్ యార్డ్ నిర్మాణం చేస్తున్న రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. కాగా ప్రతి గ్రామం ఈ నెల 26 లోపు పల్లె ప్రగతి లక్ష్యాలను సాధించాలన్నారు. 26వ తేదీ తర్వాత స్వయంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుతో సహా మంత్రులు, ఉన్నతాధికారులు గ్రామాల్లో పల్లె ప్రగతిపై ఆకస్మిక తనిఖీలు చేయబోతున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో పల్లె ప్రగతి లక్ష్యాలను ప్రతి గ్రామం చేరుకోవాలని... లేదంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇందుకోసం గ్రామాల్లో చెత్త సేకరణ, వైకుంఠ ధామం, డంప్ యార్డ్, ఇంకుడు గుంతలు, నిర్మాణం పూర్తి చేయాలని సూచించారు. హరితహారం, నర్సరీ, ట్రాక్టర్ల ద్వార చెత్త సేకరణతో పాటు పూర్తిస్థాయిలో సంపూర్ణ అక్షరాస్యత సాధించాలన్నారు. ఇక పల్లె ప్రగతితో తెలంగాణ గ్రామాల రూపురేఖలు మారుతున్నాయని, రూ. 500 కోట్లతో గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం చేయబోతున్నట్లు తెలిపారు. వేసవిలో గ్రామాల్లో తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామని, తాగునీటికి శాశ్వత పరిష్కారంగా మిషన్ భగీరథ ద్వారా త్వరలోనే నీళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. పల్లె ప్రగతి అమలులో సంగారెడ్డి జిల్లా మొదటి స్థానంలో నిలవాలి తాను కోరుకుంటున్నానని మంత్రి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ జన్మది కార్యక్రమంలో మొక్కలు నాటిన మంత్రి... సీఎం కేసీఆర్ జన్మదినం వేడుకలో భాగంగా కంది మండలం కవలంపేట గ్రామంలో 2200 మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా మంత్రి హరీష్‌రావు, కలెక్టర్ హనుమంతరావులు ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సాధ్యం అయిందని పేర్కొన్నారు. ఆయన చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో బంగారు తెలంగాణ , ఆదర్శ తెలంగాణ రాష్ట్రంగా మారుతుందని పేర్కొన్నారు. తమ కుటుంబ సభ్యుడి పుట్టినరోజును జరుపుతున్నట్లుగా రాష్ట్రమంతట సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారని మంత్రి వ్యాఖ్యానించారు. -
హరీశ్ ఇల్లు ముట్టడి; అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా 38వ రోజు సోమవారం అధికార పార్టీ ప్రజాప్రతినిధుల ఇళ్ల ముట్టడి కార్యక్రమం జరుగుతోంది. తమ పరిస్థితిని సీఎంకు వివరించి ఆయనలో మార్పు తెచ్చేలా మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు చొరవ తీసుకునేలా చేసేందుకు ఆర్టీసీ కార్మికులు ఈ ఆందోళన చేపట్టారు. సిద్ధిపేటలో మంత్రి తన్నీరు హరిశ్‌రావు ఇంటి ముట్టడికి ఆర్టీసీ కార్మికులు, ప్రజా సంఘాలు, అఖిలపక్ష నాయకులు ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు, ఆందోళనకారులకు మధ్య తోపులాట జరగడంతో ఓ కార్మికురాలు స్పృహ తప్పిపడిపోయింది. ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంగారెడ్డి జిల్లా పఠాన్‌చెరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ఆర్టీసీ కార్మికులు ముట్టడించారు. తమ న్యాయమైన డిమాండ్లను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి తమకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డికి కూడా ఆర్టీసీ కార్మికులు తమ సమస్యను విన్నవించుకున్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులతో కలిసి మంత్రి జగదీశ్‌రెడ్డి ఇంటిని ముట్టడించేందుకు అఖిలపక్ష నేతలు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కరరావు క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించిన ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యాదగిరిగుట్టలో వామపక్షల ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే ఇంటిని ఆర్టీసీ కార్మికులు ముట్టడించారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో కాంగ్రెస్ నాయకులను ముందస్తుగా అరెస్టు చేసి, పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆర్టీసీ కార్మికుల ఆందోళనకు కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించాయి. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని కలసి ఆర్టీసీ జేఏసీ, అఖిలపక్షం నాయకులు వినతిపత్రం సమర్పించారు. తమ డిమాండ్ల పరిష్కారానికి చొరవ చూపాలని అభ్యర్థించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ఇంటి ముట్టడికి ఆర్టీసీ కార్మికులు యత్నించగా బారికేడ్లు ఏర్పాటు చేసి పోలీసులు అడ్డుకున్నారు. రోడ్డుపై బైఠాయించి ఆర్టీసీ కార్మికులు నిరసన తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్, విప్ గంప గోవర్ధన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖ క్యాంప్ కార్యాలయాన్ని ఆర్టీసీ కార్మికులు ముట్టిడించారు. వీరిని పోలీసులు అరెస్ట్ చేశారు. (చదవండి: 18న సడక్ బంద్) -
కుట్రలకు బెదరం.. సంక్షేమమే లక్ష్యం
సిద్దిపేట టౌన్: ‘సంక్షేమ పథకాల రూపకల్పనలో దూసుకెళ్తున్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు వేగాన్ని తగ్గించేందుకు కుట్రలు జరుగుతున్నాయి. వీటికి ప్రభుత్వం బెదరదు. దీటుగా ఎదుర్కొంటాం. అట్టడుగు వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలను అందిస్తాం’ అని నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు స్పష్టం చేశారు. సిద్దిపేట పీఆర్టీయూ భవన్లో ఆదివారం జరిగిన సంఘం జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పనులు సాఫీగా జరగకుండా చంద్రబాబు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ఆంధ్రా పాల కుల నుంచి తెలంగాణ రాష్ట్రం విడిపోయినా వారి పీడ తొలిగిపోవడం లేదన్నారు. అడుగడుగునా పాలనకు ఆటంకాలు కలిగిస్తున్న కుట్రలను ఛేదిస్తామన్నారు. సంక్షేమ ప్రణాళికలు సిద్ధం చేసుకోవడానికి, తదనుగుణంగా బడ్జెట్ల కేటాయింపు కోసం ఈ నెల 19న సమగ్ర సర్వేను నిర్వహిస్తుంటే దీనిపై కొందరు దుష్ర్పచారం చేయడం సరికాదన్నారు. ఎవరి రేషన్ కార్డులను, పింఛన్లను గుంజుకోమన్నారు. అయితే సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. వేర్వేరు సర్వేల వల్ల అస్పష్ట సమాచారం రావడంతో ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ఈ సర్వేను నిర్వహిస్తోందని, ఇందుకు ఉపాధ్యాయులు సంపూర్ణంగా సహకరించాలన్నారు. ఒకే వ్యవస్థతోనే ఉపయోగం... ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలకు ఒకే వ్యవస్థ విధానం అనివార్యమన్నారు. ఇందుకు ఉమ్మడి సర్వీస్ రూల్స్‌ను రూపొందించడానికి కృషి చేస్తామని మంత్రి హరీష్ అన్నారు. అన్ని ఖాళీలు భర్తీ అవుతాయన్నారు. కొత్త బడ్జెట్లో సిద్దిపేట పీఆర్టీయూ భవనానికి నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. గజ్వేల్, నారాయణఖేడ్లలో డిప్యూటీ ఈఓ ఆఫీసులను ఏర్పాటు చేసి విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామన్నారు. తెలంగాణకు టీఆర్ఎస్ ఏ విధంగా బ్రాండ్‌గా మారిందో ఉపాధ్యాయులకు పీఆర్టీయూ కూడా బ్రాండ్‌గా ఉందన్నారు. వారి సేవలను బంగారు తెలంగాణ నిర్మాణానికి అందించాలన్నారు. ఉపాధ్యాయులకు మంచి పీఆర్సీ అందిస్తామన్నారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి టీఆర్ఎస్ పార్టీకి పీఆర్టీయూ అనుబంధంగా పని చేస్తోందని ఎమ్మెల్సీ పూల రవీందర్ చెప్పారు. సంఘం భవిష్యత్తును పార్టీ చేతుల్లో పెడుతున్నామన్నారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. అక్షరాస్యతను పెంచడంలో మరిన్ని గంటలు పని చేస్తామన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ మోహన్‌రెడ్డి, సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి వెంకట్‌రెడ్డి, నరోత్తంరెడ్డి, పీఆర్టీయూ భవన శాశ్వత అధ్యక్షుడు రఘోత్తంరెడ్డి తదితరులు ప్రసంగించారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ రాగుల సారయ్య, పీఆర్టీయూ పత్రిక సంపాదకుడు లక్ష్మారెడ్డి, సంఘం జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి, ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్, ప్రాంతీయ కన్వీనర్ నారాయణరెడ్డి, నేతలు ఆస లక్ష్మణ్, రాంరెడ్డి, జిల్లాలోని అన్ని మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మైత్రిమండలి తెలంగాణ సర్వేపై రూపొందించిన కరపత్రాలను మంత్రి హరీష్‌రావు ఆవిష్కరించారు. మంత్రి చెప్పిన కథ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుట్రలపై మంత్రి తన్నీరు హరీష్‌రావు చెప్పిన కథ ఉపాధ్యాయులను నవ్వించింది, ఆలోచింపజేసింది. చంద్రబాబు.. ‘నేను బాగా లేకున్నా సరే పక్కింటోళ్లు మాత్రం బాగుండొద్దని కోరుకునే వ్యక్త’ని ఆరోపించారు. ఒక ఊరిలో ఇద్దరు వ్యక్తులు తపస్సు చేసుకుంటుంటే దేవుడు ప్రత్యక్షమై ఏం కావాలని కోరితే.. మొదటి వ్యక్తి తన కోరిక చెప్పకుండా రెండో వ్యక్తి కోరుకున్న వరానికి రెండింతలు తనకు కావాలని కోరాడని చెప్పారు. రెండో వ్యక్తి విషయాన్ని గ్రహించిన దేవుడు అతను ఒక కన్ను కోల్పోయేలా కోరుకున్నాడని చెప్పారన్నారు. దీంతో రెండో వ్యక్తికి ఒక కన్ను, మొదటి వ్యక్తికి రెండు కళ్లు పోయాయని.. ఇది చంద్రబాబు నీతి అని వివరించారు. -
సాగర్ నీరొస్తోంది..
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: వర్షాలు కురుస్తున్న ఈ తరుణంలో జిల్లా రైతాంగానికి మరో శుభవార్త. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి ఎడమకాల్వకు నీరు విడుదలయింది. తొలుత తాగునీటి అవసరాలకు మాత్రమే నీటిని విడుదల చేస్తామని చెప్పినా, ఎగువన వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో సాగు అవసరాల నిమిత్తం కృష్ణా జలాలపై ఏర్పాటు చేసిన బోర్డు అనుమతి మేరకు తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు బుధవారం నీరు విడుదల చేశారు. ఈ నీరు వారం రోజుల్లోపే మొదటి జోన్ పరిధిలోనికి వచ్చే జిల్లాలోని 25వేల ఎకరాలకు అందుతుందని ఎన్నెస్పీ అధికారుల సమాచారం. ఎగువ ప్రాంతాల నుంచి వరద ఉధృతి ఉండడం, శ్రీశైలం ప్రాజెక్టుకు మరో 25 అడుగుల నీరు వస్తే నిండే పరిస్థితి ఉండడంతో పాటు ఎడమ కాల్వ పరిధిలోని రైతాంగం ఎక్కువగా కరెంటుపై ఆధారపడుతున్నందున పవర్‌లోడ్ తగ్గించుకునేందుకు కృష్ణా జలాలను ఎడమకాల్వకు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. దీంతో ఎన్నెస్పీ మొదటి జోన్ పరిధిలో ఉన్న నల్లగొండ జిల్లాలోని 3.95 లక్షల ఎకరాలతో పాటు జిల్లాలోని 25 వేల ఎకరాలకు పైగా భూమికి సాగునీరు త్వరలోనే అందనుంది. ఉధృతిని బట్టి రెండోజోన్‌కు కూడా మొదటి జోన్ పరిధిలో జిల్లాలో కూసుమంచి, నేలకొండపల్లి, ముదిగొండ మండలాల్లో 25 వేల ఎకరాలకు పైగా ఉన్నాయి. అయితే, రెండో జోన్లో మాత్రం మొత్తం 13 మండలాలకు చెందిన 2.58 లక్షల ఎకరాలు (లిఫ్ట్‌లతో కలిపి) సాగవుతోంది. రెండో జోన్ వరకు నీరు చేరితే జిల్లాలోని ఎక్కువ శాతం రైతాంగానికి లబ్ధి చేకూరనుంది. శ్రీశైలం ప్రాజెక్టు కూడా త్వరలోనే నిండుతుందని, సాగర్‌లో కూడా ఇప్పుడు 514.5 అడుగుల నీటి మట్టం ఉన్నందున వరద ఉధృతిని బట్టి రెండు మూడు రోజుల్లో రెండోజోన్‌కు కూడా నీరు విడుదల చేసే అవకాశం ఉందని ఎన్నెస్పీ అధికారులు చెపుతున్నారు. అదే జరిగితే రెండో జోన్ పరిధిలోనికి వచ్చే ఖమ్మం రూరల్, రఘునాథపాలెం, చింతకాని, కొణిజర్ల, వైరా, తల్లాడ, కల్లూరు, బోనకల్, మధిర, ఎర్రుపాలెం, సత్తుపల్లి, వేంసూరు, పెనుబల్లి మండలాల రైతులకు కూడా భరోసా కలగనుంది. కరెంటు కష్టాల నుంచి గట్టెక్కేందుకే... ముఖ్యంగా కరెంటు కష్టాల నుంచి గట్టెక్కాలన్న ప్రభుత్వ నిర్ణయం మేరకు వర్షాభావ పరిస్థితుల్లో కూడా జిల్లాకు సాగర్ నీరు అందే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తెలంగాణలో, మరీ ముఖ్యంగా ఎన్నెస్పీ పరిధిలోనికి రాని ప్రాంతాల్లో ఎక్కువగా వ్యవసాయం కోసం విద్యుత్ వినియోగిస్తున్నారు. దీనికి తోడు కాల్వ కింద భూముల్లో కూడా నీరు రాకపోతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అందుబాటులో ఉన్నాయి. బోర్ల ద్వారా పంటల సాగుకు రైతులు యత్నిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో విద్యుత్ వినియోగానికి, సరఫరాకు వ్యత్యాసం భారీగా ఉండడంతో అడ్డగోలు కరెంటు కోతలు తప్పడం లేదు. వ్యవసాయానికి కూడా సరిగా విద్యుత్ ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో రైతాంగం రోడ్డెక్కుతోంది. ఈ పరిస్థితుల్లో ప్రస్తుత నీటి లభ్యతను బట్టి సాగర్ ఎడమకాల్వకు నీరు విడుదల చేయాలని కృష్ణా జలాల వినియోగంపై ఏర్పాటు చేసిన బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న విజ్ఞప్తి మేరకు బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో నీటిని విడుదల చేశారు. -
‘ప్రాణహిత’ డిజైన్ మార్చుతాం: మంత్రి హరీశ్ రావు
సంగారెడ్డి: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్ మార్చేందుకు యోచిస్తున్నట్టు శాసనసభ వ్యవహారాల, నీటిపారుదల శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు చెప్పారు. తెలంగాణలోని ఏడు జిల్లాల్లో 16 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన రిజర్వాయర్లు, కాల్వల ప్రతిపాదనలు సమగ్రంగా లేవని కేంద్ర జలవనరుల సంఘం అభ్యంతరం వ్యక్తం చేసినట్టు ఆయన తెలిపారు. శనివారం మెదక్ జిల్లా కేంద్రం సంగారెడ్డిలో జరిగిన జెడ్పీ సర్వసభ్య సమావేశంలో హరీశ్ మాట్లాడుతూ నీటి ప్రాజెక్టుల నిర్వాసితులను ఆదుకునేందుకు ప్రభుత్వం సరికొత్త చట్టం రూపొందిస్తున్నట్టు ఆయన చెప్పారు. కరువును ఎదుర్కొనేందుకు రూ.వెయ్యికోట్లతోచెరువుల పూడికతీత చేపట్టనున్నట్టు తెలిపారు. ఆగస్టు చివరి వారంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలుంటాయని హరీశ్‌రావు వెల్లడించారు. -
ఐదోసారి హరీష్‌కే జై
సిద్దిపేట జోన్, న్యూస్‌లైన్: తెలంగాణ ఉద్యమానికి పురిటిగడ్డగా పేరొందిన సిద్దిపేట ప్రజలు మరోసారి తాజా మాజీ ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావుకే జై కొట్టారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో సిద్దిపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసిన హరీష్‌రావు మరోసారి భారీ మెజార్టీతో విజయం సాధించారు. హరీష్‌రావుకు 1,08,699 ఓట్లు రాగా, ఆయనకు 93,328 ఓట్ల మెజార్టీ దక్కగా, ప్రత్యర్థులందరి డిపాజిట్లు గల్లంతయ్యాయి. దీంతో హరీష్‌రావు ఐదోసారి సిద్దిపేట నుంచి గెలిచి రికార్డు సృష్టించారు. సంగారెడ్డిలోని ఎంఎన్ఆర్ కళాశాలలో శుక్రవారం జరిగిన సిద్దిపేట నియోజకవర్గ ఓట్ల లెక్కింపులో ఆద్యంతం టీఆర్ఎస్ హవానే కొనసాగింది. ఏప్రిల్ 30న జరిగిన సార్వత్రి ఎన్నికల్లో సిద్దిపేట నియోజకవర్గంలోని మూడు మండలాలకు చెందిన లక్షా 50 వేల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోగా, వీటిలో అత్యధికంగా టీఆర్ఎస్కే దక్కాయి. పెరిగిన మెజార్టీ 2004 ఉప ఎన్నికల్లో సిద్దిపేట నుంచి రాజకీయ ఆరంగేట్రం చేసిన హరీష్‌రావుకు అప్పట్లోనే 24,827 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఉద్యమ నేపథ్యంలో జరిగిన ఎన్నికలన్నింటిలోనూ ఆయన తన మెజార్టీని మరింత పెంచుకుంటూ పోయారు. ఈ క్రమంలోనే 2008లో 58,935 ఓట్ల మెజార్టీ, 2009 జమిలి ఎన్నికల్లో 64,014 ఓట్ల మెజార్టీని సాధించారు. ఇక 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో హరీష్‌రావు 95,858 ఓట్ల మెజార్టీని సాధించి రాష్ట్రస్థాయిలో రికార్డు సొంతం చేసుకున్నారు. ఇక ప్రస్తుత ఎన్నికల్లోనూ హరీష్‌రావు 93,328 ఓట్ల మెజార్టీ సాధించారు. అందరూ ఔట్! సిద్దిపేట అసెంబ్లీ స్థానం నుంచి హరీష్ రికార్డు మెజార్టీ సాధించగా, ఇక్కడ బీఎస్పీ తరఫున పోటీ చేసిన కర్రొల్ల బాబుకు 5,035 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి తాడూరి శ్రీనివాస్‌గౌడ్‌కు 15,371, బీజేపీ అభ్యర్థి విద్యాసాగర్‌కు 13,003, వైఎస్సార్సీపీ అభ్యర్థి తడక జగదీశ్వర్‌కు 555, రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి కమలాకర్‌కు 1,140, లోక్‌సత్తా అభ్యర్థి తుమ్మలపల్లి శ్రీనివాస్‌కు 627 ఓట్లు పోలయ్యాయి. స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో దిగిన బత్తుల చంద్రంకు 3,774 ఓట్లు, నర్సింహారెడ్డికి 615, ఉడుత మల్లేశంకు 245, బాల్‌రాజ్‌కు 592 ఓట్లు వచ్చాయి. సిద్దిపేట నియోజకవర్గంలో పోలైన ఓట్లలో 1,658 ఓట్లు నోటా కింద నమోదు కావడం విశేషం. పోస్టల్‌బ్యాలెట్ లూ టీఆర్ఎస్కే పోస్టల్ బ్యాలెట్లలోనూ అధికశాతం టీఆర్ఎస్కే అనుకూలంగా వచ్చాయి. పోస్టల్ బ్యాలెట్లలో టీఆర్ఎస్ అభ్యర్థి హరీష్‌రావుకు 790 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్‌గౌడ్‌కు 26, బీజేపీ అభ్యర్థి విద్యాసాగర్‌కు 77 ఓట్లు వచ్చాయి. కౌంటింగ్ ప్రక్రియ ఉదయం 8 గంటలకు ప్రారంభమైనప్పటికీ సిద్దిపేట నియోజకవర్గానికి సంబంధించిన లెక్కింపు, ఫలితాల వెల్లడిలో కొంత జాప్యం చోటు చేసుకుంది. దీంతో మధ్యాహ్నం 3 గంటల వరకు సిద్దిపేట నియోజకవర్గ ఫలితాలపై స్పష్టత రాలేదు. హరీష్‌రావు తరఫున టీఆర్ఎస్ ప్రతినిధి దేవునూరి రవీందర్ రిటర్నింగ్ అధికారి చేతుల మీదుగా ధృవీకరణ పత్రాన్ని అందుకున్నారు. హరీష్‌రావు విజయాన్ని అధికారికంగా ప్రకటించగానే స్థానిక కౌంటింగ్ కేంద్రం బయట నియోజకవర్గానికి చెందిన నాయకులు సంబరాలు జరుపుకున్నారు.