ఐదోసారి హరీష్‌కే జై
సిద్దిపేట జోన్, న్యూస్‌లైన్: తెలంగాణ ఉద్యమానికి పురిటిగడ్డగా పేరొందిన సిద్దిపేట ప్రజలు మరోసారి తాజా మాజీ ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావుకే జై కొట్టారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో సిద్దిపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసిన హరీష్‌రావు మరోసారి భారీ మెజార్టీతో విజయం సాధించారు. హరీష్‌రావుకు 1,08,699 ఓట్లు రాగా, ఆయనకు 93,328 ఓట్ల మెజార్టీ దక్కగా, ప్రత్యర్థులందరి డిపాజిట్లు గల్లంతయ్యాయి. దీంతో హరీష్‌రావు ఐదోసారి సిద్దిపేట నుంచి గెలిచి రికార్డు సృష్టించారు. సంగారెడ్డిలోని ఎంఎన్‌ఆర్ కళాశాలలో శుక్రవారం జరిగిన సిద్దిపేట నియోజకవర్గ ఓట్ల లెక్కింపులో ఆద్యంతం టీఆర్‌ఎస్ హవానే కొనసాగింది. ఏప్రిల్ 30న జరిగిన సార్వత్రి ఎన్నికల్లో సిద్దిపేట నియోజకవర్గంలోని మూడు మండలాలకు చెందిన లక్షా 50 వేల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోగా, వీటిలో అత్యధికంగా టీఆర్‌ఎస్‌కే దక్కాయి.
పెరిగిన మెజార్టీ
2004 ఉప ఎన్నికల్లో సిద్దిపేట నుంచి రాజకీయ ఆరంగేట్రం చేసిన హరీష్‌రావుకు అప్పట్లోనే 24,827 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఉద్యమ నేపథ్యంలో జరిగిన ఎన్నికలన్నింటిలోనూ ఆయన తన మెజార్టీని మరింత పెంచుకుంటూ పోయారు. ఈ క్రమంలోనే 2008లో 58,935 ఓట్ల మెజార్టీ, 2009 జమిలి ఎన్నికల్లో 64,014 ఓట్ల మెజార్టీని సాధించారు. ఇక 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో హరీష్‌రావు 95,858 ఓట్ల మెజార్టీని సాధించి రాష్ట్రస్థాయిలో రికార్డు సొంతం చేసుకున్నారు. ఇక ప్రస్తుత ఎన్నికల్లోనూ హరీష్‌రావు 93,328 ఓట్ల మెజార్టీ సాధించారు.
అందరూ ఔట్!
సిద్దిపేట అసెంబ్లీ స్థానం నుంచి హరీష్ రికార్డు మెజార్టీ సాధించగా, ఇక్కడ బీఎస్పీ తరఫున పోటీ చేసిన కర్రొల్ల బాబుకు 5,035 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి తాడూరి శ్రీనివాస్‌గౌడ్‌కు 15,371, బీజేపీ అభ్యర్థి విద్యాసాగర్‌కు 13,003, వైఎస్సార్‌సీపీ అభ్యర్థి తడక జగదీశ్వర్‌కు 555, రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి కమలాకర్‌కు 1,140, లోక్‌సత్తా అభ్యర్థి తుమ్మలపల్లి శ్రీనివాస్‌కు 627 ఓట్లు పోలయ్యాయి. స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో దిగిన బత్తుల చంద్రంకు 3,774 ఓట్లు, నర్సింహారెడ్డికి 615, ఉడుత మల్లేశంకు 245, బాల్‌రాజ్‌కు 592 ఓట్లు వచ్చాయి. సిద్దిపేట నియోజకవర్గంలో పోలైన ఓట్లలో 1,658 ఓట్లు నోటా కింద నమోదు కావడం విశేషం.
పోస్టల్‌బ్యాలెట్ లూ టీఆర్‌ఎస్‌కే
పోస్టల్ బ్యాలెట్‌లలోనూ అధికశాతం టీఆర్‌ఎస్‌కే అనుకూలంగా వచ్చాయి. పోస్టల్ బ్యాలెట్‌లలో టీఆర్‌ఎస్ అభ్యర్థి హరీష్‌రావుకు 790 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్‌గౌడ్‌కు 26, బీజేపీ అభ్యర్థి విద్యాసాగర్‌కు 77 ఓట్లు వచ్చాయి. కౌంటింగ్ ప్రక్రియ ఉదయం 8 గంటలకు ప్రారంభమైనప్పటికీ సిద్దిపేట నియోజకవర్గానికి సంబంధించిన లెక్కింపు, ఫలితాల వెల్లడిలో కొంత జాప్యం చోటు చేసుకుంది. దీంతో మధ్యాహ్నం 3 గంటల వరకు సిద్దిపేట నియోజకవర్గ ఫలితాలపై స్పష్టత రాలేదు. హరీష్‌రావు తరఫున టీఆర్‌ఎస్ ప్రతినిధి దేవునూరి రవీందర్ రిటర్నింగ్ అధికారి చేతుల మీదుగా ధృవీకరణ పత్రాన్ని అందుకున్నారు. హరీష్‌రావు విజయాన్ని అధికారికంగా ప్రకటించగానే స్థానిక కౌంటింగ్ కేంద్రం బయట నియోజకవర్గానికి చెందిన నాయకులు సంబరాలు జరుపుకున్నారు.