పెళ్లయినా శుభకార్యమైనా పార్టీ మీటింగ్ అయినా ప్రభుత్వ హెల్త్ క్యాంప్‌లైనా భోజనాల దగ్గర ప్లాస్టిక్ వాడకం ఉంటుంది. చెత్త పేరుకు పోతుంది. డబ్బు కూడా వృథా. అదే స్టీల్ గిన్నెలు ఉంటే? ఒకసారి కొంటే ప్రతిసారి ఉపయోగించుకోవచ్చు. ఈ ఆలోచనతో 2020లో తెలంగాణాలోని సిద్దిపేటలో ఏర్పడిన స్టీల్ బ్యాంక్
‘ఎకానమిక్ సర్వే 2023–24 బుక్’లో తాజాగా చోటు సంపాదించుకుంది. ఇది మహిళా నిర్వహణకు వారి పర్యావరణ దృష్టికి దక్కిన విజయం.
ఇది మహిళల విజయం. జాతీయంగా దక్కిన గుర్తింపు. కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టే సమయంలో ఎకనామిక్ సర్వే రిపోర్ట్‌ను విడుదల చేస్తారు. సోమవారం విడుదల చేసిన రిపోర్ట్ 12వ చాప్టర్‌లో మౌలిక సదుపాయాలు, వృద్ధిలో భాగంగా సిద్దిపేట స్టీల్ బ్యాంక్ వలన జరిగిన ఉపయోగం గురించి వివరించారు. దీనితో స్టీల్ బ్యాంక్ నిర్వాకులైన మహిళలతో పాటు సిద్దిపేట ఎం.ఎల్.ఏ. హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు.
ప్లాస్టిక్ వద్దనుకుని
2022లో సిద్దిపేట మున్సిపాలిటీలో ‘కంటి వెలుగు కార్యక్రమం’లో భాగంగా వైద్య సిబ్బందికి ఆయా గ్రామ పంచాయతీలు భోజన ఏర్పాట్లు చేశాయి. వైద్య సిబ్బంది భోజనం చేసేందుకు ప్లాస్టిక్‌ను వినియోగించాల్సి వచ్చింది. ఇది ఊళ్లో అనవసర చెత్తను పోగు చేస్తోంది. అదే సమయంలో పర్యావరణానికి హాని కూడా. ఈ పారేసిన ప్లాస్టిక్‌ని పశువులు తింటే ప్రమాదం. అందుకే డీపీఓ దేవకీదేవి ప్లాస్టిక్‌కు బదులు స్టీలు వాడాలని నిర్ణయం తీసుకున్నారు.
ఒక్కో గ్రామ పంచాయతీ నుంచి రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకూ సేకరించి స్టీల్ ప్లేట్‌లు, గ్లాస్‌లు, స్పూ¯Œ లు, వాటర్ బాటిల్‌లను కొనుగోలు చేశారు. ఇలా ఏ గ్రామానికి ఆ గ్రామం కొని జిల్లాలోని 499 గ్రామ పంచాయతీల్లో వినియోగించారు. దీంతో రోజుకు 6 కిలోల నుంచి 8 కిలోల ప్లాస్టిక్‌ను వినియోగించకుండా నిర్మూలించారు.
సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 34 స్టీల్ బ్యాంక్‌లో ఉన్న పాత్రల వివరాలు భోజనం ప్లేట్లు 25,500, అల్పహార ప్లేట్లు 8,500, వాటర్ గ్లాస్‌లు 25,500, టీ గ్లాస్‌లు 8,500, చెంచాలు 25,500, చిన్న గిన్నెలు 25,500, స్టీల్ ట్రేలు 612, బకెట్లు 272, ఇతరములు 3వేలు వస్తువులున్నాయి.
– గజవెల్లి షణ్ముఖ రాజు, సిద్దిపేట, సాక్షి
– ఫొటోలు: కె. సతీష్ కుమార్
సంతోషంగా ఉంది...
ప్లాస్టిక్‌ను నిర్మూలించేందుకు గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో స్టీల్ బ్యాంక్‌లను ఏర్పాటు చేయించాం. మనం పాటించి తర్వాత ప్రజలు పాటించాలన్న స్ఫూర్తితో బ్యాంక్‌ల ఏర్పాటు. కంటి వెలుగు కార్యక్రమంలో వైద్య సిబ్బందికి భోజన సదుపాయాలు ఏర్పాటు చేశాం. వీరికి స్టీల్ ప్లేట్, గ్లాస్‌లు, వాటర్ బాటిల్‌ల ద్వారానే అందించాం. మా కృషికి గుర్తింపు దొరకడం సంతోషంగా ఉంది
– దేవకీదేవి, డీపీఓ
సంఘం మహిళలు
‘మాది సిద్దిపేటలోని వెన్నెల సమైక్య మహిళా సంఘం. శ్రీసాయితేజ సమైక్య మహిళా సంఘంకు చెందిన గడ్డమీది నవ్య ఇద్దరం కలిసి గత నాలుగేళ్లుగా స్టీల్ బ్యాంక్‌ను కొనసాగిస్తున్నాం. మా ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు ప్రత్యేక చొరవతో సిద్దిపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో 34 వార్డుల్లో స్టీల్ బ్యాంక్‌లను ఏర్పాటు చేశారు. 29, ఫిబ్రవరి 2020న మా స్టీల్ బ్యాంక్ ప్రారంభించారు.
మా వార్డు పరిధిలో వివాహాలు, ఇతర శుభకార్యాలు, ఇతర కార్యక్రమాలు జరిగితే ముందుగానే సామాగ్రి కోసం సమాచారం ఇస్తారు. వారు ఎంత మందితో కార్యక్రమం నిర్వహిస్తున్నారో చెబితే వారికి సరిపడా సామాగ్రిని అందజేస్తాం. వీటిని ప్రత్యేక సంచిలో వేసి ఇస్తాం. వారి కార్యక్రమం అయిపోయిన తర్వాత క్లీన్ చేసి తీసుకువస్తారు. ఏదైనా వస్తువులు మిస్ అయితే వాటికి డబ్బులు తీసుకుంటాం. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ప్లేట్‌లు, గ్లాస్‌లు, కప్‌లు ధర కంటే తక్కువ అద్దెకే కిరాయికి ఇస్తున్నాం.
ప్లాస్టిక్ నిర్మూలిస్తున్నామనే సంతోషంతో పాటు మాకు ఆర్థికంగా సైతం దోహదపడుతుంది. మా కమిషనర్ ప్రసన్న రాణి, చైర్‌పర్సన్ కడవేర్గు మంజుల, కౌన్సిలర్ దీప్తిల సహకారంతో ముందుకు వెళ్తున్నాం. పెళ్లిళ్ల సీజన్ అయితే ఎక్కువ మంది తాకిడి ఉంటుంది. మా దగ్గర అన్ని కిరాయికి పోతే మా పక్క వార్డులో ఉంటే తీసుకుని వారికి అద్దెను చెల్లిస్తాం. ప్రజల నుంచి బాగా స్పందన వస్తోంది. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి రేపటి తరాలకు మంచి పర్యావరణాన్ని బహుమతిగా ఇవ్వాలనే లక్ష్యంతో వీటి బాధ్యతలను నిర్వర్తిస్తున్నాం.
– బాలగోని దీప్తి, వెన్నెల సమైక్య మహిళా సంఘం.
Comments
Please login to add a commentAdd a comment