కుట్రలకు బెదరం.. సంక్షేమమే లక్ష్యం
సిద్దిపేట టౌన్: ‘సంక్షేమ పథకాల రూపకల్పనలో దూసుకెళ్తున్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు వేగాన్ని తగ్గించేందుకు కుట్రలు జరుగుతున్నాయి. వీటికి ప్రభుత్వం బెదరదు. దీటుగా ఎదుర్కొంటాం. అట్టడుగు వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలను అందిస్తాం’ అని నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు స్పష్టం చేశారు. సిద్దిపేట పీఆర్‌టీయూ భవన్‌లో ఆదివారం జరిగిన సంఘం జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పనులు సాఫీగా జరగకుండా చంద్రబాబు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ఆంధ్రా పాల కుల నుంచి తెలంగాణ రాష్ట్రం విడిపోయినా వారి పీడ తొలిగిపోవడం లేదన్నారు. అడుగడుగునా పాలనకు ఆటంకాలు కలిగిస్తున్న కుట్రలను ఛేదిస్తామన్నారు. సంక్షేమ ప్రణాళికలు సిద్ధం చేసుకోవడానికి, తదనుగుణంగా బడ్జెట్ల కేటాయింపు కోసం ఈ నెల 19న సమగ్ర సర్వేను నిర్వహిస్తుంటే దీనిపై కొందరు దుష్ర్పచారం చేయడం సరికాదన్నారు.
ఎవరి రేషన్ కార్డులను, పింఛన్లను గుంజుకోమన్నారు. అయితే సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. వేర్వేరు సర్వేల వల్ల అస్పష్ట సమాచారం రావడంతో ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ఈ సర్వేను నిర్వహిస్తోందని, ఇందుకు ఉపాధ్యాయులు సంపూర్ణంగా సహకరించాలన్నారు.
ఒకే వ్యవస్థతోనే ఉపయోగం...
ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలకు ఒకే వ్యవస్థ విధానం అనివార్యమన్నారు. ఇందుకు ఉమ్మడి సర్వీస్ రూల్స్‌ను రూపొందించడానికి కృషి చేస్తామని మంత్రి హరీష్ అన్నారు. అన్ని ఖాళీలు భర్తీ అవుతాయన్నారు. కొత్త బడ్జెట్‌లో సిద్దిపేట పీఆర్‌టీయూ భవనానికి నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు.
గజ్వేల్, నారాయణఖేడ్‌లలో డిప్యూటీ ఈఓ ఆఫీసులను ఏర్పాటు చేసి విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామన్నారు. తెలంగాణకు టీఆర్‌ఎస్ ఏ విధంగా బ్రాండ్‌గా మారిందో ఉపాధ్యాయులకు పీఆర్‌టీయూ కూడా బ్రాండ్‌గా ఉందన్నారు. వారి సేవలను బంగారు తెలంగాణ నిర్మాణానికి అందించాలన్నారు. ఉపాధ్యాయులకు మంచి పీఆర్‌సీ అందిస్తామన్నారు.
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి
టీఆర్‌ఎస్ పార్టీకి పీఆర్‌టీయూ అనుబంధంగా పని చేస్తోందని ఎమ్మెల్సీ పూల రవీందర్ చెప్పారు. సంఘం భవిష్యత్తును పార్టీ చేతుల్లో పెడుతున్నామన్నారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. అక్షరాస్యతను పెంచడంలో మరిన్ని గంటలు పని చేస్తామన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ మోహన్‌రెడ్డి, సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి వెంకట్‌రెడ్డి, నరోత్తంరెడ్డి, పీఆర్‌టీయూ భవన శాశ్వత అధ్యక్షుడు రఘోత్తంరెడ్డి తదితరులు ప్రసంగించారు.
కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ రాగుల సారయ్య, పీఆర్‌టీయూ పత్రిక సంపాదకుడు లక్ష్మారెడ్డి, సంఘం జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి, ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్, ప్రాంతీయ కన్వీనర్ నారాయణరెడ్డి, నేతలు ఆస లక్ష్మణ్, రాంరెడ్డి, జిల్లాలోని అన్ని మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మైత్రిమండలి తెలంగాణ సర్వేపై రూపొందించిన కరపత్రాలను మంత్రి హరీష్‌రావు ఆవిష్కరించారు.
మంత్రి చెప్పిన కథ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుట్రలపై మంత్రి తన్నీరు హరీష్‌రావు చెప్పిన కథ ఉపాధ్యాయులను నవ్వించింది, ఆలోచింపజేసింది.
చంద్రబాబు.. ‘నేను బాగా లేకున్నా సరే పక్కింటోళ్లు మాత్రం బాగుండొద్దని కోరుకునే వ్యక్త’ని ఆరోపించారు. ఒక ఊరిలో ఇద్దరు వ్యక్తులు తపస్సు చేసుకుంటుంటే దేవుడు ప్రత్యక్షమై ఏం కావాలని కోరితే.. మొదటి వ్యక్తి తన కోరిక చెప్పకుండా రెండో వ్యక్తి కోరుకున్న వరానికి రెండింతలు తనకు కావాలని కోరాడని చెప్పారు. రెండో వ్యక్తి విషయాన్ని గ్రహించిన దేవుడు అతను ఒక కన్ను కోల్పోయేలా కోరుకున్నాడని చెప్పారన్నారు. దీంతో రెండో వ్యక్తికి ఒక కన్ను, మొదటి వ్యక్తికి రెండు కళ్లు పోయాయని.. ఇది చంద్రబాబు నీతి అని వివరించారు.