‘డబుల్’ స్పీడ్‌తో పని చేస్తాం | We will work in double speed | Sakshi
Sakshi News home page

‘డబుల్’ స్పీడ్‌తో పని చేస్తాం

Published Thu, Jun 2 2016 1:26 AM | Last Updated on Tue, Aug 14 2018 10:59 AM

‘డబుల్’ స్పీడ్‌తో పని చేస్తాం - Sakshi

‘డబుల్’ స్పీడ్‌తో పని చేస్తాం

2022నాటికి ఆకుపచ్చ తెలంగాణ చేసి చూపిస్తా
2017నాటికి పల్లెపల్లెకూ తాగునీరు అందిస్తాం

 - ఉన్న చోటనే సచివాలయం..ఎర్రగడ్డలో పరేడ్ గ్రౌండ్
- నియత, ప్రయుత చండీ యాగం చేస్తా
- వచ్చే దసరా నాటికి కొత్త జిల్లాలు
- జోనల్ వ్యవస్థ రద్దుపై ఆలోచిస్తున్నాం
- 40 ఏళ్ల సుదీర్ఘ అనుభవాలపై పుస్తకం రాస్తా

 ప్రజల ఆశీర్వాదముంది.. అనుకున్నది సాధిస్తా: సీఎం కేసీఆర్
 ‘రాబోయే మూడేళ్లలో ఈ రెండేళ్ల కంటే రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తాం. డబుల్ స్పీడ్‌తో ముందుకు పోతాం. తెలంగాణ ఆర్థిక వనరులు, బలాలు, బలహీనతలపై ఇప్పుడు పరిపూర్ణమైన స్పష్టత వచ్చింది. ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజల సంపూర్ణ మద్దతు ఉంది. వారి ఆశలు ఆకాంక్షలన్నీ కచ్చితంగా నెరవేరుస్తాం. అనుకున్నవన్నీ సాధిస్తామనే నమ్మకం నాకుంది. అనుక్షణం నిబద్ధతతో పని చేస్తాం...’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. రెండేళ్ల పాలనలో తనకు సంతృప్తినిచ్చిన కార్యక్రమాలతోపాటు తమ ప్రభుత్వం ఎంచుకున్న కీలకమైన లక్ష్యాలన్నింటినీ ఆయన వివరించారు.
 ఆ వివరాలు ఆయన మాటాల్లోనే..     
- సాక్షి, హైదరాబాద్
 
 ఆరేళ్లలో ఆకుపచ్చ తెలంగాణ
 రాబోయే ఆరేళ్లలో ఆకుపచ్చ తెలంగాణను ఆవిష్కరిస్తాం. కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులు అత్యంత ప్రధానమైనవి. వీటిని 2018 చివరి వరకు పూర్తి చేస్తాం. కాళేశ్వరం ఎత్తిపోతల నీటిని మల్లన్నసాగర్ వరకు.. పాలమూరు నీటిని ఉద్దండాపూర్ వరకు తీసుకొస్తాం.. చెరువులన్నింటినీ నీటితో నింపుతాం. కేవలం ఫీల్డ్ ఛానల్స్, డిస్ట్రిబ్యూటరీల నిర్మాణం మిగిలి ఉంటుంది. తర్వాత నాలుగేళ్లలో వాటిని పూర్తి చేస్తాం. 2022 నాటికి తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీటిని అందిస్తాం. ఆకుపచ్చ తెలంగాణను చేసి చూపిస్తా.. మూడు, నాలుగు హెలికాప్టర్లలో మీడియా ప్రతినిధులను సైతం తీసుకెళ్లి పచ్చని పొలాలను కళ్లారా చూపిస్తా. ఇదేం ఆషామాషీగా చెప్పడం లేదు. రాష్ట్రంలో కరెంటు కోత లేనే లేదు. ఇక ముందు ఉండదు. 2017కల్లా రాష్ట్రంలో తాగునీటికి కొరత ఉండదు. మిషన్ భగీరథ ద్వారా పల్లెపల్లెకు తాగునీటిని అందించే ప్రక్రియ అప్పటికల్లా పూర్తవుతుంది. కేవలం ఇంటింటికీ నల్లాలు బిగించే ప్రక్రియ ఉంటుంది. అదే వరుసలో ఆ పనులు జరుగుతాయి.

 జోనల్ వ్యవస్థను రద్దు చేస్తాం
 జిల్లాల ఏర్పాటుకు అడ్డంకిగా ఉన్న జోనల్ వ్యవస్థను రద్దు చేయాలనే ఆలోచన చేస్తున్నాం. తెలంగాణలో అసలు జోనల్ వ్యవస్థ ఎందుకు.. జిల్లాస్థాయి, రాష్ట్ర స్థాయి పోస్టులుంటే సరిపోతుందనే అభిప్రాయాలున్నాయి. వీటిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం. జోనల్ వ్యవస్థను రద్దుకు రాష్ట్రపతి ఆమోదం పొందాలి. ఈ ప్రక్రియకు తెలంగాణ ప్రభుత్వం తీర్మానం చేసి పంపిస్తే సరిపోతుంది.

 బాబు వైఖరితోనే విభజన ఆగింది
 తొమ్మిది, పదో షెడ్యూలు సంస్థలకు చెందిన విభజన చంద్రబాబు వితండవాదంతోనే పెండింగ్‌లో పడింది. రెండు రాష్ట్రాల సీఎస్‌లు కలిసి చర్చించుకుంటే ఒక్కరోజులోనే ఈ సమస్య పరిష్కారమయ్యేది. అదే  విషయాన్ని గవర్నర్ సమక్షంలో నేను చంద్రబాబుకు చెప్పాను. కానీ అన్నీ ఒప్పుకుంటే ఎలా.. అంటూ చంద్రబాబు అంగీకరించలేదు. వీటిద్వారా వేల కోట్లు వస్తాయనే భ్రమలు.. ఊహాల్లో వాళ్లు ఉన్నారు. కానీ అలాంటి భ్రమలేవీ తెలంగాణకు లేవు. మొత్తం విభజన చేసినా రూ.వంద, రెండు వందల కోట్లు ఇవ్వాల్సి వస్తుంది తప్ప.. అంతకు మించి ఏమీ లేదు.

 కేంద్రం ఏమీ ఇవ్వలేదు..
 హార్టికల్చర్ యూనివర్సిటీ తప్ప విభజన చట్టంలో ప్రకటించినవేవీ కేంద్రం ఇప్పటికీ తెలంగాణకు ఇవ్వలేదు. ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారీ ప్రధానికి చెప్పినా. ఎయిమ్స్ తెలంగాణకే కాదు.. రాష్ట్రానికొకటి ఇవ్వండని సూచన చేసిన. ఈ ఏడాది ఇస్తామన్నారు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమను నెలకొల్పేందుకు సెయిల్ సర్వే చేసింది. ఆ గ్రేడ్ సరిపోదని వెనక్కి వెళ్లారు. సింగరేణికి బయ్యారం గనులు ఇచ్చి... మైనింగ్ చేయించి ఐరన్ ఓర్‌ను మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా విక్రయించాలనే ఆలోచనలు చేస్తున్నం. లేకుంటే మైనింగ్ చేయించి ప్రైవేటు వాళ్లకు అమ్ముతాం. ఐటీఐఆర్‌కు సంబంధించి మౌలిక వసతుల కల్పనకు కేంద్రం నిధులు విడుదల చేస్తే సరిపోతుంది. కానీ వీటికి గత ప్రభుత్వం పునాదిరాళ్లు వేసిందని ప్రధాని మోదీ తప్పుడు ఆలోచనతో ఉన్నారు. రూ.3,000 కోట్ల కరువుసాయం అడిగితే రూ.700 కోట్లు ఇచ్చారు. రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చేందుకు మరో రూ.1,000 కోట్లు అవసరం. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు ఆర్థిక సాయం కావాలని, రాష్ట్రంలో ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని అడిగాం.. ఇవేవీ రాలేదు. కేంద్రం నిధులు కత్తిరించినా ఐసీడీఎస్ పథకాలను కొనసాగిస్తున్నాం. మోడల్ స్కూళ్లను నడిపిస్తున్నాం. అది రాష్ట్ర ప్రభుత్వం నిబద్ధత.

 సంక్షేమ పథకాలు తృప్తినిచ్చాయి
 రెండేళ్ల పాలనలో నాకు అత్యంత సంతృప్తిని ఇచ్చింది సంక్షేమ పథకాలే. పేదలను ఆదుకునేందుకు ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, కార్యక్రమాలన్నీ అనుకున్న ఫలితాలను అందించాయి. సంక్షేమంలో కేంద్ర ప్రభుత్వం కంటే ఎంతో ముందంజలో ఉన్నాం. రూపాయికి కిలోబియ్యం, విద్యార్థులకు సన్న బియ్యం, రైతు కుటుంబాలకు రుణమాఫీ, ఆడపిల్లల పెళ్లిల్లకు కళ్యాణలక్ష్మి, ఆసరా పెన్షన్లు.. ఇవన్నీ ఎంతో ఫలితాలను అందించాయి. అందుకే రాష్ట్ర ప్రభుత్వం కరువును సమర్థంగా ఎదుర్కోగలిగింది. ఈ పథకాలే వరుసగా జరిగిన ఎన్నికల్లో మాకు ఓట్ల రూపంలో ప్రతిఫలాన్ని తెచ్చిపెట్టాయి.

 పారిశ్రామిక విధానం అపూర్వ విజయం
 రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన నూతన పారిశ్రామిక విధానం అపూర్వ విజయం సాధించింది. టీఎస్‌ఐపాస్ విధానంతో ఇప్పటివరకు 1798 కంపెనీలకు దరఖాస్తు చేసుకున్న నెల రోజుల్లోనే అవినీతికి తావు లేకుండా అనుమతులు మంజూరు చేశాం. దీంతో రూ.24,698 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి. 1.11 లక్షల మందికి ఉపాధి లభించనుంది. అనుమతులు పొందిన కంపెనీలు తమంతట తాముగా తెలంగాణ ప్రభుత్వ పనితీరును దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నాయి. చెన్నైలోని టీసీఎస్ కంపెనీ సైతం హైదరాబాద్‌లో అనుకూల వాతావరణాన్ని చూసి తమ కార్యకలాపాలను విస్తరించే ఆలోచనలో ఉంది.
 
 నా అనుభవాలపై పుస్తకం రాస్తా
 నలభై ఏళ్ల నా సుదీర్ఘ రాజకీయ అనుభవాలను పుస్తక రూపంలో తెచ్చే ఆలోచన ఉంది. నేను రాయకున్నా.. మీరు చెపితే మేం రాస్తాం.. అని కొందరు మిత్రులు ముందుకు వస్తున్నారు. ఇప్పటికీ తీరిక దొరికినప్పుడు పుస్తకాలు చదువుతున్నా. అందుకే అనుభవాలను పంచుకునే ఆలోచన చేస్తున్నా.
 
 నియత, ప్రయుత చండీయాగాలు చేస్తా
 చండీయాగం కంటే నియతచండీ యాగం నాలుగైదు రెట్లు పెద్దది. ప్రయుత చండీ యాగం దానికన్నా చాలా పెద్దది. భవిష్యత్తులో ఈ రెండు యాగాలను చేయాలని ఉంది. అన్నీ అనుకూలించగానే చేస్తా. యాగం చేయడం కేసీఆర్‌కు కొత్తేమీ కాదు. తెలంగాణ ప్రజలందరూ బాగుండాలని చండీయాగం చేశాను.
 
 కొత్తజిల్లాలకు ఇదిగో రూట్ మ్యాప్
 వ్యక్తుల కోరిక మేరకు కొత్త జిల్లాలు ఏర్పాటు చేయటం లేదు. ప్రజలకు చేరువగా ఉండటం.. పరిపాలనా సౌలభ్యం ప్రాతిపదికన కొత్త జిల్లాలు ఏర్పాటవుతాయి. ఇప్పుడున్న జిల్లాలు, మండలాలు సైతం అటుదిటుగా మారిపోతాయి. ఒక్కో జిల్లా రెండు మూడుగా విడిపోయే అవకాశముంది. కొన్ని జిల్లాలు పక్క జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు కలిసి కొత్తగా ఏర్పడుతాయి. ఉదాహరణకు ఇప్పుడున్న మెదక్ జిల్లా పొడుగ్గా ఉంది. దీన్ని మూడు జిల్లాలుగా చేయాలనే ఆలోచన ఉంది. వరంగల్‌కు చెందిన చేర్యాల, కరీంనగర్‌కు చెందిన హుస్నాబాద్, ఇల్లంతకుంట మండలాలు, దుబ్బాక, గజ్వేల్ నియోజకవర్గాలతో సిద్దిపేటను జిల్లాగా చేయాల్సి వస్తుంది. అదే తీరుగా కరీంనగర్‌లోని భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాలను వరంగల్ జిల్లాలో కలిపేందుకే అక్కడి ప్రజలు మొగ్గు చూపుతున్నారు. వరంగల్ జిల్లాలో రైల్వే మార్గం ఉండటంతో పాటు గిరిజన పరిసర ప్రాంతాలున్న మహబూబాబాద్‌ను జిల్లాగా మార్చే ఆలోచన ఉంది. రాష్ట్ర రాజధాని నుంచి వివిధ జిల్లాలకు ఉన్న ప్రధాన రహదారుల వెంట ఉన్న పట్టణాలను జిల్లా కేంద్రాలుగా చేసేందుకు పరిగణనలోకి తీసుకుంటున్నాం. దీంతో అవి మరింత వేగంగా అభివృద్ధి చెందుతాయనేది ఆలోచన. హైదరాబాద్-నిజామాబాద్ మార్గంలో కామారెడ్డి, హైదరాబాద్-కరీంనగర్ మార్గంలో సిద్దిపేటను, మరో మార్గంలో వికారాబాద్‌ను జిల్లాలుగా చేసే ప్రతిపాదనలున్నాయి.

హైదరాబాద్-బోధన్ మార్గంలో ఒక్క జిల్లా కేంద్రం కూడా లేదు. అందుకే మెదక్ కేంద్రంగా కొత్త జిల్లా ఆలోచన ఉంది. ఇదే వరుసలో హైదరాబాద్-వరంగల్ మార్గంలో జనగాం కొత్త జిల్లా చేసే ఆలోచన చేసినం. కానీ అందులో చేరేందుకు చుట్టుపక్కల వాళ్లెవరూ ఇష్టంగా లేరు. స్టేషన్‌ఘన్‌పూర్ వాళ్లు జనగాం మాకెందుకు.. వరంగల్‌లోనే ఉంటామని అంటున్నరు. ఆలేరు వాళ్లు హైదరాబాద్ వైపు వస్తరట.. కానీ జనగాంలో ఉండేందుకు ఒప్పుకోవటం లేదు. మధ్యే మార్గంగా యాదాద్రి కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటుకే ఎక్కువ మొగ్గు కనబడుతోంది. ఈ ఏడాదిలోనే కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తాం. దసరా నుంచే ఇవి అమల్లోకి వస్తాయి.

అన్ని మండలాలకు సమీపంలో జిల్లా కేంద్రం ఉండేలా ఈ పునర్వవ్యవస్థీకరణ కసరత్తు జరుగుతుంది. మండలాలు, డివిజన్లను పునర్వవ్యస్థీకరిస్తాం. సగటున 20 మండలాలకు, 4-5 నియోజకవర్గాలకో జిల్లా ఏర్పాటవుతుంది. సిరిసిల్లను, వేములవాడను జిల్లా చేయాలని డిమాండ్ చేస్తే ఎలా.. వాటి మధ్య పది కిలోమీటర్ల దూరం కూడా లేదు. అలా అంటే గ్రామానికో జిల్లా చేయాలని గొంతెమ్మ కోరికలొస్తాయి. అందుకే వ్యక్తుల ఇష్టాయిష్టాలకు సంబంధం లే కుండా ప్రజల సౌలభ్యం, సుపరిపాలన లక్ష్యంగా ఈ కసరత్తు పూర్తి చేస్తాం.
 
 అవినీతికి చెక్ పెట్టేలా విధానాలు
 టీఎస్‌ఐపాస్‌కు అనుసరించిన తరహాలోనే కొత్త విధానాలతో ప్రభుత్వ శాఖల్లో జరిగే అవినీతిని అరికడతాం. తండ్రి చనిపోతే వారసులకు భూములను మ్యుటేషన్ చేసేందుకు ఎకరానికి కొంత లంచంగా తీసుకోవటం రుగ్మతగా మారింది. అందుకే పది రోజుల్లోనే మ్యుటేషన్ ఇచ్చే విధానం అమలు చేస్తున్నాం. తిరస్కరించాల్సి వస్తే తొమ్మిది రోజులు ఆగకుండా రెండోరోజునే తెలియజేస్తారు. ఎమ్మార్వోలు ఈ వివరాలను వెంటనే కలెక్టరేట్‌కు అప్‌లోడ్ చేస్తారు. దీంతో అవినీతికి అడ్డుకట్ట పడుతుంది. జీహెచ్‌ఎంసీలోనూ తగిన ఫీజులు, దరఖాస్తులు సమర్పించి ఆన్‌లైన్‌లోనూ భవన నిర్మాణ అనుమతులు పొందే విధానం అమల్లోకి తెచ్చాం.
 
 ఎర్రగడ్డలో పరేడ్ గ్రౌండ్స్..ఉన్న చోటే కొత్త సచివాలయం
 జూబ్లీహాల్ తప్ప హైదరాబాద్‌లో ఎక్కడా కలెక్టర్ల సదస్సుకు సరిపోయేంత హాల్ కూడా లేదు. సచివాలయంలో మంత్రివర్గ సహచరులందరూ కలిసి భోజనం చేద్దామంటే జాగా లేదు. నిజాం రాజులు లక్షల ఎకరాల స్థలాలు ఇస్తే ఉమ్మడి రాష్ట్రంలో వాటిని కబ్జాలు చేయటం తప్ప పట్టించుకున్న పాపాన పోలేదు. కనీసం ప్రభుత్వానికి పరేడ్ గ్రౌండ్ లేదు. హైదరాబాద్‌లో ఉన్న ప్రభుత్వ ఆఫీసులు కూడా హబ్సీగూడలో ఒకటి, నాంపల్లిలో ఒకటి.. అన్నట్లుగా చెట్టుకొకటి.. పుట్టకొకటిగా ఉన్నాయి. అందుకే మంత్రి, మంత్రి పేషీ, సెక్రెటరీ, సెక్రెటరీ పేషీ. సెక్రెటేరియట్ సిబ్బంది, హెచ్‌వోడీ, హెచ్‌వోడీ కార్యాలయ సిబ్బంది ఒకేచోట ఉండేలా కొత్త సచివాలయం నిర్మిస్తాం. ఒక్కో శాఖకు ఒక ఫ్లోర్, ఎక్కువ ఉద్యోగులుండే శాఖలకు రెండు ఫ్లోర్లు కేటాయిస్తాం. ఏడాది, ఏడాదిన్నర వ్యవధిలోనే ఈ నిర్మాణాలు పూర్తవుతాయి. అప్పటివరకు సచివాలయాన్ని తాత్కాలికంగా బూర్గుల రామకృష్ణారావు భవన్‌కు మార్చుతాం. అక్కడ  రెండు లక్షల చదరపు అడుగుల స్థలం ఉందని అధికారులు చెప్పారు. కొత్త భవనం నిర్మాణం అయ్యేంత వరకు తెలంగాణ సచివాలయంతో పాటు ఆంధ్రా సచివాలయానికి అక్కడ తాత్కాలిక ఏర్పాట్లు చేస్తాం. ఆగస్టులో మంచి రోజులొస్తాయి. అప్పుడు ఈ నిర్మాణం మొదలవుతుంది. ఎర్రగడ్డకు సచివాలయాన్ని తరలించాలని ముందుగా అనుకున్నాం. ఇప్పుడున్న చోటనే సచివాలయం నిర్మించి ఎర్రగడ్డ టీబీ ఆసుపత్రి స్థలంలో పరేడ్ గ్రౌండ్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాం.
 
 అన్యాక్రాంతమైన భూమిని రికవరీ చేస్తాం
 అసైన్డ్ భూములు నిరుపేదలకు జీవనాధారంగా ఉండాలి. ప్రభుత్వాలు 25 లక్షల ఎకరాలు పంపిణీ చేసినా... చాలా వరకు అన్యాక్రాంతం అయ్యాయి. అశాస్త్రీయంగా పంపిణీ జరిగింది. కమతాల ఏకీకరణ జరగాలనేది సీఎం కాకముందు నుంచే నాకున్న ఆలోచన. అందుకే దళితులకు మూడెకరాల పంపిణీ పథకం అమలు చేశాం. ఇప్పటికే 9,000 ఎకరాలు పంపిణీ చేశాం. ఇందుకోసం నీటి వనరులున్న భూమి కొంటున్నం. భూమి ఇవ్వడమే కాదు.. ఏడాది పాటు పెట్టుబడి సాయం ఇస్తున్నం. దళిత కుటుంబాలన్నీ రైతు కుటుంబాలుగా మారాయి. ఎంత మందికి ఈ సాయం అందినా గొప్పే. ఇది నిరంతరం కొనసాగిస్తాం. గతంలో ఇచ్చిన అసైన్డ్ భూముల్లో అన్యాక్రాంతమైన భూమిని రికవరీ చేస్తాం.
 
 ఇళ్ల అవినీతికి జైళ్లు సరిపోవు
 ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భారీగా అవినీతి జరిగింది. ఒక్క మంథనిలోనే 140 శాతం మందికి ఇళ్లు కట్టారట. పరకాల మండలం వరికోలులో 600 ఇళ్లు, ఇప్పగూడెంలో 736 ఇళ్లు కట్టకున్నా కట్టినట్లు చూపించారు. కొన్ని గ్రామాల్లో విచారణ చేసిన సీఐడీ నివేదిక ఇచ్చింది. కానీ చర్యలు తీసుకోవాలంటే నిరుపేద లబ్ధిదారుల పేర్లున్నాయి. అందరినీ అరెస్టు చేయాలంటే జైళ్లు కూడా సరిపోని పరిస్థితి. అందుకే పునరాలోచించినం. అర్హులైన నిరుపేద లబ్ధిదారులూ ఉన్నారు. అర్ధాంతరంగా వాళ్ల ఇళ్లు ఆగిపోతే పూర్తి చేసేందుకు బిల్లులు ఇవ్వాలని కలెక్టర్లకు చెప్పినం. డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాన్ని అన్ని జిల్లాల్లోనూ ఒకే మోడల్‌లో నిర్మిస్తాం. తక్కువ కమీషన్ ఉండటంతో బడా కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. అందుకే ఎక్కడికక్కడే టెండర్లు పిలవాలని చెప్పాం.
 
 కోటీశ్వరులుగా మత్స్యకారులు
 రాబోయే రోజుల్లో మత్స్యసంపదలో తెలంగాణ దేశంలో నంబర్ వన్‌గా నిలుస్తుంది. చెరువుల పునరుద్ధరణ వ్యవసాయానికి, భూగర్భ జలాలు పెరిగేందుకే కాకుండా చేపల పెంపకానికీ ఉపయోగపడుతుంది. చెరువులు, కుంటలన్నీ నిండి మత్స్య సంపద  వృద్ధి చెందుతుంది. మత్స్యకారులు దళారుల బా రిన పడకుండా ప్రభుత్వం అండగా ఉంటుంది. మత్స్య అభివృద్ధి కార్పొరేషన్ ద్వారా చేపల మార్కెటింగ్ చేస్తం.  మత్స్యకారుల ను లక్షాధికారులు, కోటీశ్వరులు గా మార్చాలనే ది ఆలోచన.
 
కొత్తగా చిన్న విమానాశ్రయాలు కట్టాలె..
 హైదరాబాద్‌లో బ్రహ్మండమైన విమానాశ్రయం ఉంది. దేశీయ విమానాల కోసం బేగంపేట ఉంది. అత్యవసర పరిస్థితులకు హకీంపేట, దిండిగల్ ఎయిర్‌పోర్ట్ ఉన్నాయి. ఎయిర్‌పోర్ట్‌ల అవసరం కంటే ఎయిర్‌స్ట్రిప్‌ల (చిన్న విమానాశ్రయాల) అవసరం తెలంగాణకు ఉంది. నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి, ఆదిలాబాద్ జిల్లాలో, కొత్తగూడెం, వరంగల్ జిల్లా మామునూర్‌లో ఎయిర్‌స్ట్రిప్‌లు వస్తే చాలు. హైదరాబాద్ నుంచి వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్‌కు వెళ్లడానికి అవసరం లేదు. టెక్స్‌టైల్ పార్కు ఉండే వరంగల్‌కు కలకత్తా నుంచో, బెంగళూరు నుంచో వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు నేరుగా వెళ్లాలనుకుంటే ఇవి ఉపయోగపడుతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement