కూటమి సర్కార్ తీరుపై వైఎస్ జగన్ మండిపాటు
వరుసగా కేబినెట్ మీటింగ్‌లు.. అమలుకు నోచుకోని పథకాలు
తల్లికి వందనం, రైతు భరోసా ఎక్కడ చంద్రబాబూ?
ఎంత మంది పిల్లలుంటే అంత మందికీ రూ.15 వేలు ఇస్తామనలేదా?
తల్లికి వందనం ఈ ఏడాదికి ఇవ్వం.. అని కేబినెట్లోనే తేల్చి చెప్పేశారు
ఇంతకన్నా మోసం, దగా ఏమైనా ఉంటుందా?
ప్రజలను నమ్మించి.. అధికారంలోకి వచ్చాక వంచనా?
రైతులకు కేంద్రం ఇచ్చేది కాకుండా ఏటా రూ.20 వేలు ఇస్తామన్నారు
ఖరీఫ్ పోయింది.. రబీ కూడా ముగుస్తోంది.. పైసా ఇవ్వలేదు
పెట్టుబడి సాయం, కనీస మద్దతు ధర, ఉచిత పంటల బీమా.. ఏదీ లేదు
పిల్లలు, తల్లులు, రైతులు, యువత, వలంటీర్లు.. అందరినీ మోసం చేశారు
పైగా బాదుడే బాదుడు.. అడుగడుగునా స్కామ్‌లు
ఆగ్రహంతో రగిలిపోతున్న ప్రజల గొంతుకగా వైఎస్సార్‌సీపీ నిలుస్తుంది
సాక్షి, అమరావతి : ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో అలసత్వం, నిర్లక్ష్యం, ఎగవేత ధోరణి ప్రదర్శిస్తున్న కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తాజాగా తల్లికి వందనం ఎగవేతపై కూటమి సర్కార్‌ను నిలదీశారు. లక్షలాది మంది తల్లులు, పిల్లలు.. అన్నదాతలంటే మీకు అలుసా.. అని ప్రశ్నించారు. మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేయడం, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను తుంగలో తొక్కడం మీకు అలవాటుగా మారిపోయిందని నిప్పులు చెరిగారు. ఈ మేరకు శనివారం ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
⇒ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలపై ఇంతటి బరితెగింపా? మేనిఫెస్టోపై ఇంతటి తేలిక తనమా? ప్రజలకు ఇచ్చిన మాటను అమలు చేయకుండా టేక్ ఇట్ గ్రాంటెడ్‌గా తీసుకుంటారా? లక్షల మంది తల్లులకు, పిల్లలకు, రైతులకు ఇంతటి ద్రోహం తలపెడతారా?
⇒ అధికారంలోకి వస్తే తల్లికి వందనం అని, ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికీ ఏడాదికి రూ.15 వేలు చొప్పున ఇస్తామన్నారు. అధికారంలోకి రాగానే అంతకు ముందు మేం ఇస్తున్న అమ్మ ఒడి పథకాన్ని సైతం ఆపేశారు. వరుసగా కేబినెట్ సమావేశాలు జరుగుతున్నాయి కానీ, తల్లికి వందనం పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తారో నిర్దిష్టంగా చెప్పలేదు. తీరా ఈ ఏడాదికి ఇవ్వం అని కేబినెట్లో తేల్చి చెప్పేశారు. ఇంతకన్నా మోసం ఏమైనా ఉంటుందా? ఇంతకన్నా పచ్చి దగా ఏమైనా ఉంటుందా?
⇒ చంద్రబాబు గారూ.. ఎన్నికల వేళ మీరు, మీ కూటమి నాయకులు రాష్ట్రంలోని ప్రతి చోటా తల్లికి వందనంపై చేసిన ప్రచారం అంతా
ఇంతా కాదు. ఇంటింటికీ తిరిగి కనిపించిన ప్రతి పిల్లాడినీ పట్టుకుని నీకు రూ.15 వేలు.. నీకు రూ.15వేలు.. నీకు రూ.15వేలు అన్నారు. ఇద్దరుంటే రూ.30 వేలు ఇస్తామన్నారు. ముగ్గురుంటే రూ.45 వేలు ఇస్తామన్నారు. నలుగురు ఉంటే రూ.60 వేలు ఇస్తామన్నారు. ప్రజలకు మీరు చేసిన వాగ్దానం, మీరు చెప్పిన మాటలు ఆడియో, వీడియోల రూపంలో సాక్ష్యాధారాలుగా ప్రతి ఒక్కరి సెల్‌ఫోన్‌లో ఉన్నాయి.
వైఎస్సార్‌సీపీ హయాంలో 44.48 లక్షల మంది తల్లులకు, దాదాపు 84 లక్షల మంది పిల్లలకు రూ.26,067 కోట్లను మేము అందించి, అత్యంత విజయవంతంగా అమలు చేసిన అమ్మ ఒడిని ఆపేసినా, మీరు ఇస్తామన్న పథకం వస్తుందేమోనని బడికి వెళ్లే ఆ పిల్లలు, వారి తల్లులు ఏడెనిమిది నెలలుగా ఎదురు చూస్తూనే ఉన్నారు. చివరకు వారి ఆశలపై నీళ్లు జల్లి, ఈ ఏడాది ఇవ్వం అని నిస్సిగ్గుగా చెబుతున్నారు. ప్రజలకు ఒక మాట ఇచ్చి, దాన్ని నమ్మించి, వారి ద్వారా అధికారాన్ని తీసుకుని, ఇప్పుడు ఇవ్వలేమంటూ ఎలాంటి సంకోచం లేకుండా చెబుతున్నారు. మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేయడం, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను తుంగలో తొక్కడం మీకు అలవాటుగా మారిపోయింది.
⇒ ఇక రైతు భరోసా తీరు కూడా అలానే ఉంది. ఈ ఏడాది ఖరీఫ్, రబీ రెండు సీజన్లు అయిపోతున్నా ఇవ్వకుండా గడిపేశారు. అదిగో, ఇదిగో అంటూ లీకులు ఇస్తున్నారు కానీ, ఇప్పటి వరకు రైతులకు పెట్టుబడి సహాయం కింద ఒక్కపైసా ఇవ్వలేదు. మేము అధికారంలోకి వచ్చిన ఆ ఏడాదే.. అంటే 2019 అక్టోబర్‌లో ప్రారంభించి నప్పటి నుంచి క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం రూ.13,500 చొప్పున 53.58 లక్షల మంది రైతుల చేతిలో, రూ.34,378 కోట్లు పెట్టాం. కేంద్రం ఇచ్చేది కాకుండా మీరు ఏడాదికి రూ.20 వేలు ఇస్తామన్నారు.
ఇప్పుడు ఖరీఫ్ అయిపోయిందీ, రబీ కూడా అయిపోయింది. ఒక్క పైసా ఇవ్వలేదు. ఇన్ని కేబినెట్ మీటింగ్‌లు పెట్టుకున్నాం ఎప్పుడు ఇస్తారో చెప్పడం లేదు. ఇది రైతులను నిలువెల్లా మోసం చేయడం కాదా? రైతులకు పెట్టుబడి సహాయం లేదు.. కనీస మద్దతు ధరా అందడం లేదు.. ఉన్న ఉచిత పంటల బీమాను కూడా రద్దు చేశారు.. ఆర్బీకేలను సైతం నిర్వీర్యం చేశారు. సంక్షోభంలో ఎవరైనా రైతులు దురదృష్టవశాత్తు ఆత్మహత్య చేసుకుంటే కనీసం ఆ కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందడం లేదు కదా, కనీసం పరామర్శకు కూడా నోచుకోవడం లేదు.
⇒ ప్రతి పిల్లాడికి రూ.15 వేలు చొప్పున ఎంత మంది పిల్లలు ఉంటే, అంత మందికీ ఇస్తామన్న తల్లికి వందనం మోసమే. రైతులకు పెట్టుబడి సాయంగా రూ.20 వేలు ఇస్తామన్నదీ మోసమే. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకూ రూ.18 వేలు ఇస్తామన్నదీ మోసమే. నిరుద్యోగ భృతి కింద యువతీ యువకులకు రూ.36 వేలు చొప్పున ఇస్తామన్నది కూడా మోసమే. 50 సంవత్సరాలు నిండిన ప్రతి అక్కకూ రూ.48 వేలు అయినా మోసమే. ఇంటింటికీ సేవలు అందిస్తూ మంచికి అర్థం చెప్పిన వలంటీర్లకూ మీరు చేసింది మోసమే. ఈ మోసాలు అన్నింటికీ తోడు, మీ పాలనలో ప్రజలపై ఛార్జీలతో బాదుడే బాదుడు కనిపిస్తోంది. ప్రతి అడుగులోనూ స్కామ్‌లే. ఇసుకను వదలడం లేదు, మద్యాన్నీ వదలడం లేదు.
⇒ చంద్రబాబూ గారూ.. రోజులు గడుస్తున్న కొద్దీ, మీరు చేస్తున్న మోసాలు ఒక్కొక్కటీ బయటకు వస్తూనే ఉన్నాయి. ఇవి ప్రజల్లో తీవ్ర ఆగ్రహానికి దారితీస్తున్నాయి. ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి, వారి గొంతుకై నిలుస్తోంది. ప్రజలకు మీరు ఇచ్చిన వాగ్దానాల అమలు కోసం వారి తరఫున నిలబడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment