ఈ నెలలోనే ప్రతిష్టాత్మక పథకాలను ప్రారంభించనున్న సర్కారు
వాటి అమలు కోసం తక్షణమే రూ.10వేల కోట్లు అవసరమని అంచనా
రైతు భరోసాకు రూ.8,200 కోట్లు.. ఆత్మీయ భరోసాకు రూ.600 కోట్లు
గ్రామ పంచాయతీల్లో రూ.10లక్షల లోపు బిల్లులు చెల్లిస్తే మరో రూ.800 కోట్లు అవసరం
వీటికి తోడు కొత్త రేషన్‌కార్డులు, సన్నబియ్యం ఇస్తే మరింత భారం
ఇందిరమ్మ ఇళ్ల కోసం రూ.20వేల కోట్లు కావాలని సర్కారు లెక్కలు
మొత్తంగా రూ.45 వేల కోట్లకుపైనే అవసరమని అంచనాలు..
వచ్చే మూడు నెలలపాటు ప్రతి నెలా రూ.10 వేల కోట్లు అప్పు చేసేందుకు ఏర్పాట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన పథకాలకు అవసరమయ్యే నిధులను అన్వేషించే పనిలో ఆర్థిక శాఖ పడింది. ఆయా పథకాల అమలు కోసం తక్షణమే ఎన్ని నిధులు అవసరం? ఏ నెలలో ఎన్ని నిధులు ఇవ్వాల్సి ఉంటుంది? వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఎంత ప్రతిపాదించాల్సి ఉంటుంది? ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పథకాలు, జీతాలు, పింఛన్లకు తోడు కొత్త పథకాలకు కలిపి నిధుల సమీకరణ ఎలా? రిజర్వు బ్యాంకు ద్వారా బహిరంగ మార్కెట్‌లో రుణాలు ఏ మేరకు సాధ్యమవుతాయనే లెక్కలు వేసుకుంటోంది. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలతోపాటు దశల వారీగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, కొత్త రేషన్‌కార్డుల జారీతో పెరిగే సబ్సిడీ వ్యయం కలిపి తక్షణమే రూ.10 వేల కోట్లు అవసరమని ఆర్థిక శాఖ అధికారులు తేల్చారు. ఈ నిధులు సర్దుబాటు చేసే పనిలో నిమగ్నమయ్యారు.
రాబడులకు తోడు అప్పులతో..
పథకాల అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి నెలా వస్తున్న రాబడులకు తోడు గణనీయంగానే అప్పులు చేయాల్సి వస్తోంది. ప్రస్తుతం నెలకు రూ.11 వేల కోట్ల వరకు రాష్ట్ర ప్రభుత్వానికి సొంత ఆదాయం సమకూరుతోంది. వచ్చే మూడు నెలల్లో అదనంగా నెలకు మరో రూ.2వేల కోట్ల వరకు వస్తాయని ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది. మరోవైపు రూ.30 వేల కోట్లు బహిరంగ మార్కెట్ రుణాలను రిజర్వు బ్యాంకు ద్వారా సేకరించనుంది. ఈ మేరకు జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో ప్రతి నెలా రూ.10 వేల కోట్ల చొప్పున కావాలని ఆర్‌బీఐకి ఇండెంట్ కూడా పెట్టింది.
మొత్తంగా సమకూరే నిధుల నుంచి ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పింఛన్లు, సామాజిక పింఛన్లు, ఇతర సంక్షేమ పథకాలు, రెవెన్యూ ఖర్చుతోపాటు రుణ వాయిదాలను చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఖర్చులన్నింటినీ సర్దుబాటు చేసుకుంటూనే కొత్త పథకాలకు నిధులను సమకూర్చడంపై ఆర్థిక శాఖ దృష్టి పెట్టింది. ఇప్పటికే గత రెండు నెలలుగా పెద్ద పెద్ద బిల్లుల చెల్లింపును నిలిపివేసినట్టు తెలిసింది. వచ్చే మూడు నెలలు కూడా ఇదే పద్ధతిని అవలంబిస్తామని, ప్రస్తుతానికి నిధుల లోటు లేకుండా సర్దుబాటు చేస్తామని ఆ శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఎలాంటి ప్రణాళికతో వెళ్లాలన్న దానిపై రూట్ మ్యాప్ సిద్ధమైందని వెల్లడించారు.
మొత్తంగా రూ.45 వేల కోట్ల దాకా...
ఈ నెల 26వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను ప్రారంభించబోతోంది. రైతు భరోసా కింద రాష్ట్రంలోని సుమారు 70లక్షల మంది రైతులకు ఎకరానికి రూ.6 వేల చొప్పున రూ.8,200 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని అంచనా. ఇక భూమి లేని పేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద తొలి విడత సాయంగా రూ.6 వేల చొప్పున ఇచ్చేందుకు మరో రూ.600 కోట్లు అవసరమని భావిస్తున్నారు. ఈ పథకం కింద 10 లక్షల మంది రైతు కూలీలు లబ్ధిపొందుతారని అంచనా. ఈ రెండు పథకాలకు ఈనెల 31లోపు నిధులు వెచ్చించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రూ.8,800 కోట్లను ఖజానాకు సమకూర్చడం కోసం ఆర్థిక శాఖ రెండు నెలలుగా కార్యాచరణ అమలు చేస్తోంది.
⇒ మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లేలోపు గ్రామ పంచాయతీల్లో పనులు చేసిన మాజీ సర్పంచ్‌లకు చెల్లించాల్సిన రూ.10లక్షలలోపు బిల్లులను చెల్లించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇవి సుమారు రూ.800 కోట్ల వరకు ఉంటాయని అంచనా.
⇒ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం (తొలి విడతలో స్థలమున్న పేదలకు రూ.5 లక్షల సాయం) కోసం ఒక్క ఆర్థిక సంవత్సరంలో రూ.20 వేల కోట్లకుపైగా అవసరమని భావిస్తున్నారు. దశల వారీగా ఈ నిధులు విడుదల చేసే నేపథ్యంలో... ఏ నెలలో ఎంత అవసరమన్న దానిపైనా ఆర్థిక శాఖ లెక్కలు వేసుకుంటోంది.
⇒ ఇక జనవరి 26 నుంచే కొత్త రేషన్‌కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఆ కార్డుల జారీ పూర్తయ్యాక మార్చి నెల నుంచి రేషన్‌షాపుల్లో సన్నబియ్యం పథకాన్ని అమలు చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 90లక్షల వరకు రేషన్‌కార్డులు ఉండగా.. మరో 10లక్షల వరకు కొత్తవి జారీ చేసే అవకాశం ఉందని పౌరసరఫరాల శాఖ అంచనా వేస్తోంది. మొత్తమ్మీద కోటి కార్డులకు గాను ఒక్కొక్కరికి 6 కేజీల చొప్పున సన్నబియ్యం ఇచ్చేందుకు గణనీయంగా నిధులు కావాలి.
⇒ మొత్తంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం (జనవరి నుంచి మార్చి నెలాఖరు)లోనే రూ.45 వేల కోట్లు కావాలని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు నిధులు సమకూర్చుకోవడంపై దృష్టిపెట్టినట్టు వివరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment