
సాక్షి, హైదరాబాద్: రైతుభరోసా(Rythu Bharosa) మార్గదర్శకాలను తెలంగాణ సర్కార్ (Telangana Government) విడుదల చేసింది. ఈ నెల 26 నుంచి ఎకరాకు రూ.12 వేలు రైతు భరోసా పెట్టుబడి సాయం పంపిణీ చేయనున్నారు. భూ భారతిలో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూములకే ఈ సాయం దక్కనున్నట్లు ప్రకటించింది. భూ విస్తీర్ణం ఆధారంగా పట్టాదారులకు అందించనున్నారు. ఆర్‌వోఎఫ్‌ఆర్ పట్టాదారులకు కూడా ప్రభుత్వం సాయం అందించనుంది. సాగు యోగ్యం కాని భూములను రైతు భరోసా నుంచి తొలగించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఫిర్యాదుల పరిష్కారం బాధ్యత కలెక్టర్లకు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
కాగా ధరణి స్థానంలో భూభారతి చట్టాన్ని వచ్చేనెల 15 నుంచి 28వ తేదీలోపు అమల్లోకి తీసుకొచ్చేలా విధివిధానాలు ఖరారు చేస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. మేధావులు, ఉద్యోగులు, రైతులు, పార్టీల నాయకుల అభిప్రాయాలను సేకరించి భూభారతి చట్టం తీసుకు వచ్చినట్లు తెలిపారు. ప్రభుత్వాలు ఏ చట్టం చేసినా కొన్ని నిబంధనలు ఉంటాయని, అయితే గత ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ధరణి’లోపభూయిష్టంగా ఉందని అన్నారు.
ఇదీ చదవండి: హైదరాబాద్‌లో లక్ష ఇళ్లు @సేల్!
ప్రజాపాలన సభల్లో రాష్ట్రవ్యాప్తంగా 1.15 కోట్ల దరఖాస్తులు వస్తే.. అందులో ఇందిరమ్మ ఇళ్ల కోసం 80.60 లక్షల దరఖాస్తులు ఉన్నాయని మంత్రి పొంగులేటి తెలిపారు. ఇందులో అర్హులను గుర్తించేందుకు ఇప్పటి వరకు జీహెచ్‌ఎంసీ మినహా సుమారు 72 లక్షల దరఖాస్తులపై సర్వే చేపట్టామని, ఈ పథకానికి సంబంధించిన అర్హులను ఈనెల 26న గ్రామసభల్లో నిర్ణయిస్తామని చెప్పారు. అదేరోజు రైతుభరోసాతో పాటు తెల్లరేషన్ కార్డుల ప్రక్రియ, భూమి లేని నిరుపేదలకు ఏటా రూ.12 వేలు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని వివరించారు. ఈ పథకాలకు అర్హుల గుర్తింపునకు ఈనెల 16 నుంచి కసరత్తు చేపట్టనున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment