గృహిణికి అండగా ఉన్నందుకు...అంతమొందించాడు | Know Shocking Details About Advocate Incident Case In Hyderabad Champapet | Sakshi
Sakshi News home page

గృహిణికి అండగా ఉన్నందుకు...అంతమొందించాడు

Published Tue, Mar 25 2025 8:33 AM | Last Updated on Tue, Mar 25 2025 10:12 AM

Advocate incident Case in Champapet

హైదరాబాద్: లైంగిక వేధింపులకు గురవుతున్న ఓ మహిళకు అండగా ఉన్న లాయర్‌ను కక్షగట్టి దారుణంగా హత్య చేశాడు. చంపాపేటలో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు, మృతుడి బంధువులు తెలి్పన వివరాల ప్రకారం..మహేశ్వరం మండల కేంద్రానికి చెందిన సీనియర్‌ న్యాయవాది ఎర్రబాబు ఇజ్రాయిల్‌ (56) నగరంలోని చంపాపేట డివిజన్‌ న్యూమారుతీనగర్‌ కాలనీలో నివసిస్తున్నాడు. తన ఇంటి సమీపంలోనే ఓ అపార్ట్‌మెంట్‌లో ఇటీవల ఫ్లాట్‌ను కొనుగోలు చేసి..ఓ గృహిణి కుటుంబ సభ్యులకు అద్దెకు ఇచ్చాడు. అదే కాలనీ సమీపంలోని సుల్తానా అల్వా కాలనీ శ్మశాన వాటిక కాపలాదారుడుగా పని చేస్తున్న గులాం దస్తగిరి ఖాళీ సమయంలో ప్రైవేట్‌ ఎలక్ట్రీషియన్‌గా కూడా పనిచేస్తున్నాడు.

ఇజ్రాయిల్‌ కొనుగోలు చేసిన ఫ్లాట్‌లో దస్తగిరి విద్యుత్‌ మరమ్మతు పనులకు వెళ్తుండే వాడు. ఈ క్రమంలోనే ఫ్లాట్‌లో అద్దెకు ఉంటున్న గృహిణితో పరిచయం ఏర్పడింది. దీన్ని అలుసుగా తీసుకున్న దస్తగిరి తనను ప్రేమించాలని, అండగా ఉంటానని ఆమెను వేధించసాగాడు. వేధింపులు భరించలేని ఆ గృహిణి ఫ్లాట్‌ యజమాని ఇజ్రాయిల్‌కు ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన ఆయన దస్తగిరిని మందలించాడు. 

పోలీసులకు ఫిర్యాదు చేయించి.. 
దస్తగిరి వేధింపులు ఎక్కువ అవడంతో 25 రోజుల క్రితం ఇజ్రాయిల్‌ ఐఎస్‌సదన్‌ పోలీసులకు గృహిణితో ఫిర్యాదు చేయించాడు. ఆమెకు దస్తగిరి నుంచి ప్రాణహాని ఉందని హెచ్చరించాడు. ఆమెను బంధువుల ఇంటికి పంపించి వేశాడు. ఈ క్రమంలో  పోలీసులు దస్తగిరిని స్టేషన్‌కు పిలిపించి..నామమాత్రంగా మందలించి, కౌన్సిలింగ్‌ చేసి పంపించేశారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన దస్తగిరి..ఇజ్రాయిల్‌పై కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా అతన్ని అంతం చేయాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. గత మూడు రోజులుగా ఇజ్రాయిల్‌ ఇంటి ముందు రెక్కీ నిర్వహించిన దస్తగిరి సోమవారం ఉదయం 9 గంటలకు ఇజ్రాయిల్‌ తన స్కూటీపై ఒంటరిగా రావటాన్ని పసిగట్టి..ఒక్కసారిగా తన వెంట తెచ్చుకున్న కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. అనంతరం పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయాడు.

విషయం తెలసుకున్న స్థానికులు రక్తపు మడుగులో కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఇజ్రాయిల్‌ను సమీపంలోని డీఆర్‌డీఓ అపోలో ఆసుపత్రిలో చేరి్పంచారు. పరీక్షించిన వైద్యులు ఇజ్రాయిల్‌ అప్పటికే మృతిచెందాడని నిర్ధారించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరించి కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. కాగా పోలీసులు గృహిణి ఫిర్యాదును సీరియస్‌గా తీసుకోలేదని, తీసుకుని ఉంటే ఈ హత్య జరిగేది కాదని స్థానికులు విమర్శిస్తున్నారు. కాగా ఇజ్రాయిల్‌ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం రాష్ట్ర మాజీ డైరెక్టర్‌గా పనిచేశాడు. అలాగే కాంగ్రెస్‌ పార్టీ తరపున జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేశారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement