తెలంగాణలో భారీ పెట్టుబడులకు ఒప్పందం | Revanth Japan Tour: Agreement For Huge Investments In Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణలో భారీ పెట్టుబడులకు ఒప్పందం

Apr 18 2025 5:46 PM | Updated on Apr 18 2025 8:10 PM

Revanth Japan Tour: Agreement For Huge Investments In Telangana

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో భారీ పెట్టుబడులకు ఒప్పందం కుదిరింది. హైదరాబాద్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటుకు ఒప్పందం చేసుకున్నారు. ఎన్​టీటీ డేటా, నెయిసా సంయుక్తంగా రూ.10,500 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయి.  హైదరాబాద్‌లో నిర్మించబోయే 400 మెగావాట్ల డేటా సెంటర్ క్లస్టర్‌.. 25,000 జీపీయూలతో దేశంలోనే అత్యంత శక్తివంతమైన ఏఐ సూపర్‌ కంప్యూటింగ్ మౌలిక సదుపాయాలను సమకూర్చనుంది. దేశంలో తెలంగాణను అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాజధానిగా మార్చాలనే లక్ష్యానికి అనుగుణంగా ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకోనున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు

500 మెగావాట్ల వరకు గ్రిడ్, పునరుత్పాదక విద్యుత్తు మిశ్రమంతో ఈ క్లస్టర్ నిర్వహిస్తారు. లిక్విడ్ ఇమ్మర్షన్ వంటి అత్యాధునిక కూలింగ్ టెక్నాలజీలను అవలంబిస్తారు. ఈ ప్రాజెక్ట్‌ను అత్యున్నత ఈఎస్‌జీ (ఎన్విరాన్‌మెంటల్, సోషల్, గవర్నెన్స్) ప్రమాణాలతో అభివృద్ధి చేస్తారు.  ఈ క్యాంపస్ తెలంగాణలోని విద్యా సంస్థల భాగస్వామ్యంతో ఏఐ ప్రతిభను పెంపొందిస్తుంది. రాష్ట్ర డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్‌కు దోహదం చేస్తుంది. ఈ భారీ పెట్టుబడుల ఒప్పందంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక విధానాలు పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయని సీఎం రేవంత్‌ అన్నారు. నమ్మకమైన, నాణ్యమైన విద్యుత్ సరఫరా, సింగిల్‌ విండో అనుమతులను ప్రభుత్వం అందిస్తుందన్నారు. వీటితో పాటు రాష్ట్రంలో ప్రతిభావంతులైన నిపుణులు అందుబాటులో ఉండటంతో ఏఐ సంబంధిత డిజిటల్ సేవల్లో రాష్ట్రం అగ్రగామిగా నిలుస్తుందన్నారు. ఎడబ్ల్యూఎస్, ఎస్‌టీటీ, టిల్‌మన్ హోల్డింగ్స్, సీటీఆర్‌ఎల్‌ఎస్ వంటి పెద్ద కంపెనీల డేటా సెంటర్ ప్రాజెక్టుల వరుసలో ఎన్‌టీటీ భారీ పెట్టుబడుల ఒప్పందంతో  దేశంలో ప్రముఖ డేటా సెంటర్ హబ్ గా హైదరాబాద్ స్థానం మరింత బలపడిందన్నారు.

కాగా, టోక్యోలో ప్రధాన కార్యాలయం కలిగిన ఎన్‌టీటీ డేటా, ఐటీ సేవలు, డేటా సెంటర్లు, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్‌లో పేరొందిన కంపెనీ. 50 కంటే ఎక్కువ దేశాల్లో 193,000 మంది ఉద్యోగులతో, ప్రపంచంలోని టాప్ 3 డేటా సెంటర్ ప్రొవైడర్లలో ఈ కంపెనీ ఒకటి. పబ్లిక్ సర్వీసెస్, బీఎఫ్‌ఎస్‌ఐ, హెల్త్‌కేర్, మాన్యుఫాక్చరింగ్, టెలికాం వంటి రంగాలకు ఈ సంస్థ సేవలు అందిస్తోంది. నెయిసా నెట్​ వర్క్​ ఏఐ-ఫస్ట్ క్లౌడ్ ప్లాట్‌ఫాం సంస్థ, నిర్దిష్ట ఏఐ కంప్యూటర్ సొల్యూషన్స్ అందించటంపై ఈ కంపెనీ దృష్టి సారిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement