డ్రగ్స్, గంజాయి కనిపించకూడదు: సీఎం రేవంత్‌ | Cm Revanth Speech At The Inauguration Ceremony Of Sdrf | Sakshi
Sakshi News home page

డ్రగ్స్, గంజాయి కనిపించకూడదు: సీఎం రేవంత్‌

Published Fri, Dec 6 2024 8:02 PM | Last Updated on Fri, Dec 6 2024 8:51 PM

Cm Revanth Speech At The Inauguration Ceremony Of Sdrf

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన కొనసాగుతోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఎస్‌డీఆర్‌ఎఫ్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం ప్రసంగిస్తూ.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారా తెలంగాణ ఏర్పడిందని.. బాబా సాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిని రాష్ట్రంలో కొనసాగిస్తున్నామని చెప్పారు.

‘‘అంబేద్కర్ సాక్షిగా తెలంగాణ ప్రజలకు ఏడో గ్యారంటీగా స్వేచ్ఛను అందించాం. ఒక నాడు రాజకీయ ఒత్తిడికి తలొగ్గి పోలీసులు పని చేసే పరిస్థితి.. కానీ ఈ ఏడాది కాలంలో ఎలాంటి రాజకీయ ఒత్తిడి, పైరవీలకు తావు లేకుండా సమర్ధత ఆధారంగా అధికారుల నియామకాలు జరిగాయి. పోలీస్ శాఖలో దాదాపు 15 వేల నియామక పత్రాలు అందించాం.. పీజీలు, పీహెచ్‌డీలు చదువుకున్నవారు కూడా పోలీస్ శాఖలో చేరుతున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడేందుకు ముందుకు వస్తున్నారు.

..సైబర్‌ క్రైమ్‌ను నియంత్రించడంతో పాటు డ్రగ్స్‌ను నిరోధించాల్సిన అవసరం ఉంది. డ్రగ్స్ సరఫరా చేసే వారిపట్ల కఠినంగా వ్యవహరించాలి. బీటెక్, ఎంటెక్ చదివిన వారికి సైబర్ క్రైమ్‌లో డాటా అనాలసిస్ చేసేందుకు ప్రత్యేక అవకాశం కల్పించండి. రాబోయే రోజుల్లో సైబర్ క్రైమ్ అత్యంత వేగంగా విస్తరిస్తోంది. సైబర్ క్రైమ్ నియంత్రణకు ప్రత్యేక శిక్షణ అందించాల్సిన అవసరం ఉంది. తెలంగాణలోకి డ్రగ్స్, గంజాయి రావాలంటే భయపడేలా పోలీస్ సిబ్బంది కృషి చేస్తున్నారు. తెలంగాణ ప్రతిష్ట మసకబారొద్దు అంటే హైదరాబాద్ లాంటి మహానగరంలో డ్రగ్స్, గంజాయి లాంటివి కనిపించొద్దు. స్కూల్స్, కాలేజీల్లో డ్రగ్స్ సంబంధిత వాటిని గుర్తించేందుకు యాజమాన్యాలు ప్రత్యేక చర్యలు చేపట్టాలి.

అందుకు సిద్దంగా ఉన్నాం..
..పోలీసులు యాజమాన్యాలకు అవగాహన కల్పించి ప్రభుత్వ ఆలోచనలను వారికి వివరించండి. డ్రగ్స్ కేసుల్లో నిందితులకు  శిక్ష  పడేలా చేయాలి. ఫాస్ట్రాక్ కోర్టుల ద్వారా నేరస్తులకు శిక్ష పడేలా చేసేందుకు చర్యలు చేపడుతున్నాం. ట్రాఫిక్, కాలుష్యం హైదరాబాద్ నగరాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలు. ట్రాన్స్ జెండర్స్‌పై గత ప్రభుత్వాలు మానవీయ కోణంతో వ్యవహరించకపోవడం వల్ల వారు నిరాదరణకు గురయ్యారు. అందుకే ట్రాఫిక్ నియంత్రణకు వారిని నియమించడం ద్వారా వారికి మంచి భవిష్యత్ ఇస్తున్నాం. ఈ ప్రభుత్వం ట్రాన్స్ జెండర్స్‌ను ఆదుకునేందుకు సిద్ధంగా ఉంది.

హోంగార్డుల దినభత్యం పెంపు
..ఐపీఎస్ అధికారి తీవ్రవాదుల దాడిలో మరణిస్తే రూ.2 కోట్లు అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  ఈరోజు (డిసెంబర్ 6) హోంగార్డ్స్ రైజింగ్ డే...ఈ సందర్బంగా వారికి ఒక శుభవార్త చెబుతున్నాం. హోంగార్డుల దినభత్యాన్ని రూ.921 నుంచి రూ.1000కి పెంచుతున్నాం. హోమ్ గార్డ్స్  వీక్లీ పరేడ్ అలవెన్స్‌ను నెలకు రూ.100 నుంచి రూ.200కు పెంచుతున్నాం. హోం గార్డ్స్ దురదృష్టవశాత్తు సహజమరణం పొందినా, ప్రమాదవశాత్తూ మరణించిన రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం.

జనవరి నుంచి వీటన్నింటిని అమలు చేస్తాం. శాంతిభద్రతలను కాపాడటంతో పాటు ప్రభుత్వ ప్రతిష్టను పెంచే బాధ్యత మీ చేతుల్లోనే ఉంది. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా.. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లండి. అయినా పరిష్కారం కాకపోతే డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లండి. ఆపై ఇంకేమైనా సమస్యలుంటే నేను మీకు ఎప్పుడూ అందుబాటులో ఉంటా’’ అని సీఎం రేవంత్‌ చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement