SDRF
-
సరస్సులో పడిపోయిన పారాగ్లైడర్.. వీడియో వైరల్
డెహ్రాడూన్:పారాగ్లైడింగ్ శిక్షణ తీసుకుంటున్న ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు సరస్సులో పడిపోయిన ఘటన ఉత్తరాఖండ్‌లో జరిగింది. పర్యాటక శాఖ నిర్వహిస్తున్న పారాగ్లైడింగ్ శిక్షణ కార్యక్రమంలో రిషి అనే వ్యక్తి అదుపుతప్పి తెహ్రీ సరస్సులో పడిపోయాడు.వెంటనే స్పందించిన ఎస్డీఆర్ఎఫ్ బృందం సభ్యులు రిషిని రక్షించారు. పారాగ్లైడింగ్ చేస్తూ రిషి సరస్సులో పడిపోవడం, అతడిని ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది బోటులో వచ్చి కాపాడడం చకచకా జరిగిపోయాయి. ఈ దృశ్యాలను కొందరు కెమెరాలో బంధించి సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. కొద్దిసేపటికే ఈ వీడియో వైరల్‌గా మారింది. ఇదీ చదవండి: విమానంలో మహిళకు వేధింపులు.. వ్యక్తి అరెస్ట్ -
14 రాష్ట్రాలకు వరద సాయం నిధులు విడుదల చేసిన కేంద్రం
ఢిల్లీ: దేశ వ్యాప్తంగా వరద ప్రభావిత ప్రాంతాలకు కేంద్రం రూ.5,858.60 కోట్లు వరద సాయం నిధులను విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ వాటాలో భాగంగా స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (ఎస్డీఆర్ఎఫ్), నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (ఎన్డీఆర్ఎఫ్) నుంచి 14 రాష్ట్రాలకు ఈ మేరకు కేంద్ర హోంశాఖ నిధులు మంజూరు చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అస్సాం, మిజోరాం, కేరళ, త్రిపుర, నాగాలాండ్, గుజరాత్, మణిపూర్ రాష్ట్రాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర బృందాలు.. నష్టాన్ని అంచనా వేస్తూ ఇచ్చిన నివేదిక మేరకు తక్షణసాయంగా ఈ నిధులు కేటాయించింది.అత్యధికంగా మహారాష్ట్రకు 1,492 కోట్ల వరద సాయం ప్రకటించింది.ఆంధ్రప్రదేశ్‌కు రూ.1,036 కోట్లు, తెలంగాణకు రూ.416. కోట్లు మంజూరు చేసింది. అయితే కేంద్ర బృందాల నుంచి పూర్తిస్థాయి నివేదిక వచ్చిన తర్వాత మరిన్ని నిధులు మంజూరు చేయనున్నట్లు హోంశాఖ పేర్కొంది. Ministry of Home Affairs releases ₹ 5858.60 crore to 14 flood-affected as a central share from the State Disaster Response Fund (SDRF) and an advance from the National Disaster Response Fund (NDRF)Government stands shoulder to shoulder with the states affected by natural…— PIB India (@PIB_India) October 1, 2024 -
ఎస్డీఆర్ఎఫ్ కింద రూ.3,448 కోట్లు
సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన రెండు తెలుగు రాష్ట్రాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ నిధి (ఎస్డీఆర్ఎఫ్) కింద రూ.3,448 కోట్లు వెంటనే విడుదల చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని వరద ప్రాంతాల్లో పర్యటించడంతో పాటు అక్కడి రైతులను, ప్రజలను కలిసి పరిస్థితులను అంచనా వేసిన అనంతరం.. రెండు రాష్ట్రాల సీఎంలు రేవంత్‌రెడ్డి, చంద్రబాబులతో చర్చించిన తర్వాత ఈ మేరకు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.రెండు రాష్ట్రాలకు పూర్తిస్థాయిలో సాయం అందించడానికి కట్టుబడి ఉన్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. తెలంగాణలో పంటలు దెబ్బతిన్న మీనవాలు, పెద్దగోపవరం, మన్నూరు, కట్టలేరు పరిశీలించడంతో పాటు ఖమ్మంలో మున్నేరు వరదను ఏరియల్ సర్వే చేసినట్లు వెల్లడించారు. ఎవరూ నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని, ప్రధాని నరేంద్ర మోదీ అందర్నీ ఆదుకుంటారని భరోసా ఇచ్చారు. నష్టం అంచనా వేసిన తర్వాత పరిహారంపై నిర్ణయం వరదల వల్ల జరిగిన పంటనష్టాన్ని అంచనా వేసిన తర్వాత ఏ మేరకు నష్టపరిహారం ఇవ్వాలన్నది నిర్ణయిస్తామని చౌహాన్ చెప్పారు. వరదల్లో అరటి, పసుపు, కూరగాయ ల పంటలు పూర్తిగా దెబ్బతిన్నట్లు తెలిపారు. ఇది ఊహించని విపత్తు అని మంత్రి వ్యాఖ్యానించారు. రైతులను ఆదుకోవడం, పంటల బీమా పథకం అమలు, రైతులు పొలాల్లో పనిచేసుకునే పరిస్థితులు కలి్పంచడం, తదుపరి పంటలు వేసుకునేలా సహకరించడం.. కేంద్ర ప్రభుత్వ నాలుగు ప్రాథమ్యాలని పేర్కొన్నారు. ఎరువులు, విత్తనాలకు ఎలాంటి లోటు లేకుండా చూస్తామని మంత్రి హామీ ఇచ్చారు. -
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకుంటాయి
రైతులకు, కౌలుదారులకు అండగా నిలుస్తాం. రైతులను ఆదుకునేందుకు కేంద్ర వాటాతో కూడిన ఎస్డీఆర్ఎఫ్ నిధులు రూ.3,400 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్నాయి. ఢిల్లీ వెళ్లిన తర్వాత రాష్ట్ర పరిస్థితిని ప్రధానికి వివరిస్తా. – కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి చౌహాన్కేసరపల్లి(గన్నవరం)/సాక్షి, అమరావతి: వరదల వల్ల పంట నష్టపోయిన రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకుంటాయని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ తెలిపారు. కృష్ణాజిల్లా, గన్నవరం మండలంలోని కేసరపల్లి–సావరగూడెం రోడ్డులో ముంపునకు గురైన వరి పొలాలను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు తమ గోడును కేంద్ర మంత్రికి విన్నవించుకున్నారు. వారం రోజులుగా నీట మునిగిపోవడం వల్ల వరిపైరు కుళ్లిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఎకరానికి రూ.25 వేల వరకు ఖర్చు చేశామని తెలిపారు. ప్రభుత్వాలు ఆదుకోకపోతే తీవ్రంగా నష్టపోవాల్సిన ఉంటుందని జిల్లాలోని పలు గ్రామాల నుంచి వచ్చిన పసుపు, పత్తి, అరటి, మినుము రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం చౌహన్ మాట్లాడుతూ రైతులకు, కౌలుదారులకు అండగా నిలుస్తామని చెప్పారు. రైతులను ఆదుకునేందుకు కేంద్ర వాటాతో కూడిన ఎస్డీఆర్ఎఫ్ నిధులు రూ.3,400 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్నాయని తెలిపారు. ఢిల్లీ వెళ్లిన తర్వాత రాష్ట్ర పరిస్థితిని ప్రధానికి వివరిస్తానని చెప్పారు. పసల్ బీమా యోజన కింద రైతులకు ఆదుకుంటామని పేర్కొన్నారు. ఎంపీలు, మంత్రులు, కలెక్టర్లు పాల్గొన్నారు. ఆయిల్ పామ్ రంగాన్ని ఆదుకోండిసంక్షోభంలో ఉన్న ఆయిల్ పామ్ రంగాన్ని ఆదుకోవాలని కోరుతూ జాతీయ ఆయిల్ ఫార్మర్స్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జీవీఎస్ఆర్ ప్రసాద్, కే.క్రాంతి కుమార్ రెడ్డి కేంద్ర మంత్రిని కలిసి శుక్రవారం వినతిపత్రం సమర్పించారు. క్రూడ్ ఆయిల్ ఉత్పత్తులపై తక్షణమే దిగుమతి సుంకాన్ని పునరుద్ధరించాలని, డైనమిక్ డ్యూటీ మెకానిజమ్‌ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. -
ట్రెక్కింగ్‌కు వెళ్లి నలుగురు మృతి..?
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ ఉత్తరకాశీలో ట్రెక్కింగ్(పర్వతారోహణ)కు వెళ్లిన 22 మంది సభ్యుల టీమ్‌లో నలుగురు గల్లంతయ్యారు. ప్రతికూల వాతావరణం వల్ల వారు దారితప్పి మిస్సయినట్లు తెలుస్తోంది. వీరంతా సహస్రతాల్ ప్రాంతంలో మే29న ట్రెక్కింగ్ ప్రారంభించారు. వీరంతా సాహస యాత్ర ముగించుకుని జూన్7న తిరిగి రావాల్సి ఉంది. అయితే యాత్ర మధ్యలోనే నలుగురు దారితప్పి కనిపించకుండా పోవడంతో మిగిలిన వారిని వెనక్కి తీసుకురావాల్సిందిగా ట్రెక్రింగ్ ఏజెన్సీ ఎస్డీఆర్ఎఫ్ను కోరింది. 4100 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న సహస్రతాల్ ప్రాంతంలో మొత్తం ఏడు సరస్సులుంటాయి. ఇక్కడి నుంచే పాండవులు స్వర్గానికి వెళ్లారని నమ్ముతారు. -
బాపట్లలో అత్యధికంగా వర్షపాతం నమోదు
-
విపత్తులు ఎదుర్కొనే యంత్రాంగం బలోపేతం
సాక్షి, అమరావతి: ప్రకృతి విపత్తులను సమర్థంగా ఎదుర్కొనే వ్యవస్థాగత యంత్రాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం బలోపేతం చేస్తోంది. ఇందుకోసం శాశ్వత ప్రాతిపదికన రాష్ట్ర విపత్తుల నిర్వహణ బలగాల (ఎస్డీఆర్ఎఫ్) ప్రధాన కేంద్రాన్ని ఏర్పాటుచేయనుంది. యుద్ధప్రాతిపదికన సహాయ, పునరావాస చర్యలు చేపట్టేందుకు అత్యాధునిక మౌలిక వసతులతో ఏర్పాటుచేసే ఈ ప్రధాన కేంద్రంలోనే శిక్షణా కేంద్రాన్ని కూడా నెలకొల్పనుంది. కృష్ణాజిల్లా గన్నవరం మండలం కొండపావులూరులో 50 ఎకరాల్లో ఎస్డీఆర్ఎఫ్ ప్రధాన కేంద్రం, శిక్షణ కేంద్రం నిర్మాణానికి సవరించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (రివైజ్డ్ డీపీఆర్)ను ఖరారు చేసింది. ఈ మేరకు హోంశాఖ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. రూ.99.73 కోట్లతో ప్రధాన కేంద్రం దేశంలో గుజరాత్ తర్వాత అతి పొడవైన సముద్రతీరం (దాదాపు 972 కి.మీ) ఆంధ్రప్రదేశ్‌లోనే ఉంది. దీంతో ఏటా తుపాన్లు, వరదల ముప్పును రాష్ట్రం ఎదుర్కొంటోంది. విపత్తులు సంభవించినప్పుడు ప్రజలను యుద్ధప్రాతిపదికన ఆదుకునేందుకు.. విపత్తులను సమర్థంగా ఎదుర్కొనేందుకు ఎల్లప్పుడూ పూర్తిస్థాయిలో సన్నద్ధంగా ఉండే వ్యవస్థను ఏర్పాటుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన జాతీయ విపత్తుల నిర్వహణ బలగాలు (ఎన్డీఆర్ఎఫ్), జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ (ఎన్ఐడీఎం)లతోపాటు రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఎస్డీఆర్ఎఫ్ ప్రధాన కేంద్రాలను కృష్ణాజిల్లా గన్నవరం మండలం కొండపావులూరులో ఏర్పాటుచేయనున్నారు. ఇందుకోసం ఎన్డీఆర్ఎఫ్కు 50 ఎకరాలు, ఎన్ఐడీఎంకు 10 ఎకరాలు, ఎస్డీఆర్ఎఫ్కు 50 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. ఎస్డీఆర్ఎఫ్కు కేటాయించిన 50 ఎకరాల్లో ప్రధాన కేంద్రం, కమాండ్ కంట్రోల్ సెంటర్, శిక్షణ కేంద్రాలను నెలకొల్పుతారు. ఈ మేరకు ఎస్డీఆర్ఎఫ్ ప్రణాళికకు సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. ప్రధాన కేంద్రంలో 154 మంది.. ఎస్డీఆర్ఎఫ్ ప్రధాన కేంద్రంలో 154 మంది అధికారులు, సిబ్బందిని నియమించాలని నిర్ణయించారు. వీరిలో పర్యవేక్షణ స్థాయి ఉన్నతాధికారులు నలుగురు ఉంటారు. అలాగే, రెండు రెస్క్యూ టీమ్‌లలో అత్యవసర సేవలు అందించే అధికారులు, సిబ్బంది 94 మంది ఉండనున్నారు. అదేవిధంగా క్వార్టర్ మాస్టర్ గ్రూప్ సభ్యులు 15 మంది, కమాండ్ కంట్రోల్ సెంటర్ అధికారులు, సిబ్బంది 8 మంది, రవాణా విభాగం అధికారులు, సిబ్బంది 15 మంది, ప్రధాన కేంద్రంలోని ఆరోగ్య కేంద్రంలో వైద్య అధికారులు ఇద్దరు, ఫార్మసిస్టులు నలుగురు, మినిస్టీరియల్ సిబ్బంది 12 మంది ఉంటారు. ఆధునిక మౌలిక వసతులతో.. తుపాన్లు, వరదలు, ఇతర విపత్తులు సంభవించినప్పుడు సమర్థంగా రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహించేందుకు ఆధునిక మౌలిక వసతులను ఎస్డీఆర్ఎఫ్కు సమకూర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రూ.65 కోట్లతో ప్రతిపాదనలకు సూత్రప్రాయంగా ఇప్పటికే ఆమోదం తెలిపింది. రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహించేందుకు ఎస్డీఆర్ఎఫ్ ప్రధాన కేంద్రంలో 309 అధునాతన పరికరాలను రూ.21.74 కోట్లతో కొనుగోలు చేయనున్నారు. అలాగే, రూ.39 కోట్ల వ్యయంతో వాహనాలను కూడా కొంటారు. ఇక కమాండ్ కంట్రోల్ సెంటర్ కోసం రూ.77 లక్షలతో కంప్యూటర్లు, జీపీఎస్ ట్రాకర్లు, ఇతర సాంకేతిక పరికరాలను కొనుగోలు చేస్తారు. అలాగే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమాచారాన్ని అనుసంధానించేందుకు అధునాతన సాంకేతిక, సమాచార పరికరాలను రూ.1.50 కోట్లతో కొంటారు. అదేవిధంగా శిక్షణ కేంద్రంలో 10 రకాల శిక్షణ అందించేందుకు రూ.2 కోట్లతో పరికరాలను కొనుగోలు చేస్తారు. -
Andhra Pradesh: వరద ప్రాంతాల్లో వేగంగా సాయం
సాక్షి, అమరావతి / సాక్షి నెట్వర్క్: గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ముంపు బారిన పడిన జిల్లాల్లోని 211 గ్రామాల ప్రజల కోసం ప్రభుత్వం 74 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసింది. 46,170 మంది బాధితులను అక్కడికి యుద్ధ ప్రాతిపదికన తరలించింది. అత్యధికంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 51 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి అక్కడికి 43,587 మందికి తాత్కాలికంగా పునరావాసం కల్పించారు. ఏలూరు జిల్లాలో 4 కేంద్రాల్లోకి 1,528 మందిని, బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 18 కేంద్రాలకు 758, తూర్పుగోదావరి జిల్లాలో ఒక కేంద్రం ఏర్పాటు చేసి 306 మందిని తరలించారు. ఆయా ప్రాంతాల్లో తక్షణ వైద్య సౌకర్యం కల్పించేందుకు 68 వైద్య శిబిరాలు నెలకొల్పారు. మొత్తం 178 బోట్లు, 10 లాంచీలను సహాయక చర్యల కోసం ఏర్పాటు చేశారు. ఐదు జిల్లాలకు ప్రభుత్వం తక్షణ అవసరాల కోసం రూ.12 కోట్లు విడుదల చేయడంతో పునరావాసకేంద్రాల ఏర్పాటు, బాధితుల తరలింపు, వారికి అవసరమైన ఆహారం, తాగు నీరు ఇతర సౌకర్యాల కల్పన వేగంగా జరిగింది. ఐదు జిల్లాల్లో మొత్తం 26 మండలాల్లోని 211 గ్రామాలపై గోదావరి వరద ముంపు ప్రభావం పడినట్లు నిర్ధారించి, ముందస్తు సహాయక చర్యలు చేపట్టారు. అత్యధికంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 96 గ్రామాలు ప్రభావితమయ్యాయి. ఈ నేపథ్యంలో 10 ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను వరద ప్రభావిత ప్రాంతాల్లో అందుబాటులో ఉంచారు. ఏలూరు జిల్లా వేలేరుపాడు, కుక్కునూరులో రెండు, అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని మామిడికుదురు, అయినవిల్లి, ముమ్మిడివరం, ఐ పోలవరంలో ఒక్కొక్కటి చొప్పున ఎన్టీఆర్ఎఫ్ బృందాలను అందుబాటులో ఉంచారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో కూనవరం, చింతూరు, పి గన్నవరం, అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పి గన్నవరం, ఏలూరు జిల్లాలోని వేలేరుపాడులో ఒక్కొక్కటి చొప్పున ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచారు. ఇప్పటికే ఆ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. వరద ప్రభావిత ప్రాంతాల పరిస్థితిని తాడేపల్లిలోని విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్టేట్ ఎమర్జెన్సీ సెంటర్ నుంచి నిరంతరం అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఆయా జిల్లాలకు ఎప్పటికప్పుడు అవసరమైన సూచనలు జారీ చేస్తున్నారు. ఎక్కడికక్కడ పర్యవేక్షణ ♦ వరద తాకిడికి గురైన చింతూరు, వీఆర్‌పురం, కూనవరం ఎటపాక మండలాల్లోని వరద ప్రభావిత గ్రామాల ప్రజలకు సంబంధించి ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో బాధితులకు తాగునీటితో పాటు వాడుక నీటి సౌకర్యం కల్పించారు. విద్యుత్ అందుబాటులో లేని ప్రాంతాల్లో జనరేటర్ సౌకర్యం కల్పించారు. బాధితులకు నిత్యావసరాలతో పాటు కూరగాయలు, పాలు అందిస్తున్నారు. అంటువ్యాధులు ప్రబలకుండా కేంద్రాల పరిసరాల్లో బ్లీచింగ్, ఫాగింగ్ వంటి పారిశుధ్య చర్యలు చేపట్టారు. గ్రామ సచివాలయ సిబ్బంది, గ్రామ వలంటీర్లను అందుబాటులో వుంచారు. ఎక్కడికక్కడ వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. ప్రత్యేక అధికారులు, మండల స్థాయి అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ♦ చింతూరు మండలంలో బాధితులకు కూరగాయలు, పాలతో పాటు కొవ్వొత్తులు పంపిణీ చేశారు. కిరోసిన్ పంపిణీకి కలెక్టర్ ఏర్పాట్లు చేస్తున్నారు. సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకుంటున్న వారికి 10 వేల టార్పాలిన్లను సిద్ధం చేస్తున్నారు. కూనవరం మండలంలో 12, వీఆర్‌పురం మండలంలో 10, చింతూరు మండలంలో 8 మర పడవలను సహాయక చర్యలకు వినియోగిస్తున్నారు. ఇళ్లు దెబ్బతిన్న వారికి పరిహారం పంపిణీ చేసేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ♦ వరద ముంపు ప్రాంతాలకు లాంచీలు, పడవల ద్వారా కూరగాయలను పంపించారు. చింతూరు జీసీసీ గోడౌను నుంచి వీఆర్‌పురం, కూనవరం మండలాలకు మూడు టన్నుల చొప్పున ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, రెండు టన్నుల చొప్పున వంకాయలు, దొండకాయలు పంపించారు. నడి గోదావరిలో ఆరుగురు గర్భిణుల తరలింపు నడి గోదావరిలో శనివారం రాత్రి 10.30 గంటలకు బోట్‌పై ఆరుగురు గర్భిణులను ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఏలూరు జిల్లా వేలేరుపాడు మండల కేంద్రానికి తరలించాయి. డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓ రాజీవ్ వేలేరుపాడు మండలంలో అత్యంత మారుమూల గ్రామాలైన టేకుపల్లి, టేకూరు గ్రామాల్లో ఆరుగురు గర్భిణులను గుర్తించారు. వీరిని వెంటనే పునరావాస కేంద్రానికి తరలించేందుకు బోట్‌పై ప్రయత్నించగా, తిర్లాపురం గ్రామానికి వచ్చేసరికి చీకటి పడి అక్కడే బోట్ ఆగిపోయింది. దీంతో ఎన్డీఆర్ఎఫ్ బృందానికి సమాచారం అందించారు. రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ ఇన్స్పెక్టర్ మోహన్‌యాదవ్, మిగిలిన బృంద సభ్యులు.. ఆరుగురు గర్భిణులను వేలేరుపాడుకు తరలించారు. అక్కడి నుంచి అంబులెన్స్‌లో జంగారెడ్డిగూడెం ఆసుపత్రికి వారిని తీసుకెళ్లారు. నిత్యావసర వస్తువుల పంపిణీ ♦ పశ్చిమగోదావరి జిల్లాలోని ఆచంట మండలంలో అయోధ్య లంక, మర్రిమూల, పెదమల్లం గ్రామాల్లో మాజీ మంత్రి, ఆచంట ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు పర్యటించి, బాధితులకు భరోసా ఇచ్చారు. యలమంచిలి మండలంలోని లంక గ్రామాలైన దొడ్డిపట్ల, కనకాయలంక, పెదలంక, లక్ష్మీపాలెం, ఏనుగువాని లంక, బాడవ గ్రామాలు ముంపు బారిన పడ్డాయి. పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి లంక గ్రామాల్లో పర్యటించారు. ♦ ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలో 35 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. శనివారం రాత్రి ఇళ్లలోకి వరద నీరు చేరుతుండటంలో ఐదు గ్రామాలు నీటమునిగాయి. పాత నార్లవరం, ఎడవల్లి, టేకూరు, రుద్రమకోట, వేలేరుపాడు సంతబజారుల్లో 30 ఇళ్ల వరకు నీటమునగడంతో జనం పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. వీరందరికీ భోజన వసతి కల్పించారు. వేలేరుపాడులో పది దేశీయ బోట్లు, రెండు పెద్ద బోట్లు, మరో రెండు ఫైర్ బోట్లు వినియోగిస్తున్నారు. వరద బారిన పడిన కుటుంబాలన్నిటికీ ఆదివారం 3900 లీటర్ల వంట నూనె, 4 వేల కేజీల కందిపప్పు, కుటుంబానికి 25 కేజీల బియ్యం, కూరగాయలు పంపిణీ చేయనున్నారు. నూజివీడు సబ్ కలెక్టర్ ఆదర్‡్ష రాజేంద్రన్, జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ఝాన్సీ దగ్గరుండి వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. ♦ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పలు గ్రామాల్లో ఇళ్ల మధ్య వరద చేరింది. స్థానికులు పడవల మీద రాకపోకలు సాగిస్తున్నారు. అధికార యంత్రాంగం ప్రజలకు నిత్యావసర వస్తువులు అందజేశారు. వైద్య సేవలకు ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర రవాణా శాఖమంత్రి పినిపే విశ్వరూప్ అల్లవరం మండలం బోడసుకుర్రు పల్లిపాలెంలో పునరావస కేంద్రంలో బాధితులతో మాట్లాడారు. వారి కోసం తయారు చేసిన భోజనాన్ని పరిశీలించారు. జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణు గోపాలరావు, ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబులు మామిడికుదురు, అయినవిల్లి మండలాల్లో పర్యటించి వరద ఉధృతిని పరిశీలించారు. ♦ అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతూరు, కూనవరం, వీఆర్‌పురం, ఎటపాక మండలాల్లోని పలు గ్రామాల్లోకి వరదనీరు ప్రవేశిస్తోంది. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌కు రాకపోకలు నిలిచిపోయాయి. రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి, ఎమ్మెల్సీ అనంత ఉదయ్‌భాస్కర్ శనివారం కూనవరం, వీఆర్‌పురం మండలంలో వరదముంపు ప్రాంతాల్లో పర్యటించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని 30 పాఠశాలలకు సోమవారం సెలవు ప్రకటించారు. దెబ్బతిన్న ఇళ్లకు పరిహారం పెంపు సాక్షి, అమరావతి: గోదావరి వరద ముంపు గ్రామాలకు చెందిన బాధితులు పునరావాస కేంద్రాల నుంచి తిరిగి ఇళ్లకు వెళ్లేటప్పుడు ప్రత్యేక ఆర్థిక సాయం కింద రూ.1,000 నుంచి రూ.2,000 వరకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో సీఎం వైఎస్ జగన్ నిర్వహించిన సమీక్షలో ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ సొమ్మును పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలకు ఆర్ధికసాయంపై రెవిన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. అదే విధంగా ఈ జిల్లాల్లో ముంపునకు గురైన కుటుంబాలకు ఉచితంగా 25 కేజీల బియ్యం, కేజీ కందపప్పు, లీటర్ పామాయిల్, కేజీ ఉల్లిపాయలు, కేజీ బంగాళాదుంపలు ఇవ్వాలని మరో ఉత్తర్వు జారీ చేశారు. ఈ సరుకులను సమకూర్చాల్సిందిగా మార్కెటింగ్‌కు ఆదేశాలిచ్చారు. దెబ్బతిన్న, పాడైన ఇళ్లకు ఇచ్చే పరిహారాన్ని సీఎం జగన్ ఆదేశాల మేరకు రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతూ మరో ఉత్తర్వు జారీ చేశారు. -
'ఆ తేడా తెలియని కిషన్‌రెడ్డి కేంద్ర మంత్రిగా ఉండటం దురదృష్టకరం'
సాక్షి, హైదరాబాద్: ఎన్డీఆర్ఎఫ్ (నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్), ఎస్డీఆర్ఎఫ్ (స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్)కు తేడా తెలియని కిషన్‌రెడ్డి కేంద్ర మంత్రిగా ఉండటం దురదృష్టకరమని మంత్రి కె.తారకరామారావు మండిపడ్డారు. తెలంగాణకు చేయాల్సిన వరద సాయంపై కిషన్‌రెడ్డి చెప్పేవన్నీ తప్పుడు లెక్కలేనని ఆరోపించారు. కేంద్రం ఎన్డీఆర్ఎఫ్ కింద ఇచ్చిన ప్రత్యేక, అదనపు నిధులపై సమాధానం చెప్పాలని తాము డిమాండ్ చేస్తే.. రాష్ట్రానికి రాజ్యాంగ హక్కుగా దక్కే ఎస్డీఆర్ఎఫ్ లెక్కలు చెప్తూ కిషన్‌రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నారని గురువారం ఒక ప్రకటనలో విమర్శించారు. తెలంగాణ పట్ల కేంద్రం చూపుతున్న వివక్ష నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. ఆ నిధులు రాజ్యాంగ హక్కు తెలంగాణ నుంచి కేంద్రానికి చెల్లించే పన్నుల నుంచి తిరిగి రాష్ట్రానికి దక్కే మార్గాల్లో ఎస్డీఆర్ఎఫ్ ఒకటని, ఈ విషయంపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి అవగాహన లేదని కేటీఆర్ విమర్శించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 280 ప్రకారం ఫైనాన్స్ కమిషన్ ద్వారా రాష్ట్రాలకు ఎస్డీఆర్ఎఫ్ నిధులు కేటాయించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంటుందన్నారు. లోక్‌సభలో ఈ నెల 19న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ చేసిన ప్రకటనను కిషన్‌రెడ్డి ఒకసారి చదువుకోవాలన్నారు. 2018 నుంచి ఇప్పటిదాకా తెలంగాణకు ఎన్డీఆర్ఎఫ్ ద్వారా అదనంగా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని నిత్యానంద్రాయ్ ప్రకటించిన మాట అబద్ధమా? కిషన్‌రెడ్డి చేసిన ప్రకటన అబద్ధమా? ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ వరదలప్పుడు ఒక్క పైసా ఇవ్వలే.. గతంలో భారీ వర్షాలతో హైదరాబాద్ మునిగి కష్టాలు పడ్డప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రూ.3,500 కోట్లు కోరితే.. కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని కేటీఆర్ మండిపడ్డారు. ఇప్పుడు కూడా భారీ వర్షాలతో ప్రాథమికంగా రూ.1,400 కోట్ల నష్టం వచ్చిందని, తెలంగాణకు ప్రత్యేక ఎన్డీఆర్ఎఫ్ నిధులు అందించాలని కోరితే.. కేవలం పరిశీలన బృందాలను పంపించి చేతులు దులుపుకొనే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. 2021లో బీజేపీ పాలిత రాష్ట్రాలతోపాటు తౌక్టే తుఫాన్ వల్ల గుజరాత్లో వరదలు వచ్చినప్పుడు.. ప్రధాని ఆగమేఘాల మీద సర్వే జరిపించి రూ.1,000 కోట్ల ఎన్డీఆర్ఎఫ్ ప్రత్యేక అదనపు సాయాన్ని అడ్వాన్స్ రూపంలో విడుదల చేశారని కేటీఆర్ గుర్తు చేశారు. వేరే పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు అధికార బృందాలను పంపడం.. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలకు మాత్రం నిధులు మూటలు పంపడం దారుణమన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న 4 రాష్ట్రాలకు 2018 నుంచి ఇప్పటిదాకా రూ.15,270 కోట్లు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం.. తెలంగాణకు నిధులు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ.. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు విరుద్ధంగా కిషన్‌రెడ్డి అబద్ధాలు చెప్తున్నారని, ఆయన వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సొంత రాష్ట్రంపై ఏ మాత్రం ప్రేమ ఉన్నా.. కేంద్రం నుంచి ఎన్డీఆర్ఎఫ్ అదనపు నిధుల కోసం ప్రయత్నించాలని, లేకుంటే నయా పైసా సాయం తీసుకురాలేని చేతకాని మంత్రిగా కిషన్‌రెడ్డి చరిత్రలో మిగిలిపోతారని వ్యాఖ్యానించారు. -
రాష్ట్రప్రభుత్వం సరైన పత్రాలు సమర్పించలేదు: కిషన్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: ఎస్డీఆర్ఎఫ్ నిధుల విడుదలపై తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి సరైన పత్రాలు సమర్పించలేదని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖమంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. ఇప్పటికే తెలంగాణకు ఎస్డీఆర్ఎఫ్ నిధులను కేంద్రం కేటాయించినప్పటికీ, మొదటి విడత నిధులను విడుదల చేయడానికి అవసరమైన యుటిలై జేషన్ సర్టిఫికెట్లను రాష్ట్రప్రభుత్వం ఇప్పటివరకు అందించలేదన్నారు. ఈ సర్టిఫికెట్లు అందిన వెంటనే నిధులు విడుదల చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని చెప్పారు. ఈ మేరకు సోమవారం కిషన్‌రెడ్డి ఒక మీడియా ప్రకటన విడుదల చేశారు. గోదావరి నది కి వచ్చిన వరదలతో తెలంగాణ, ఏపీలోని ప్రజలకు జరిగిన నష్టాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. -
ఎస్డీఆర్ఎఫ్ ఆపన్నహస్తం
సాక్షి, అమరావతి: గోదావరి వరద బాధితులకు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్డీఆర్ఎఫ్) బృందాలు ఆపన్నహస్తం అందిస్తున్నాయి. ప్రాణనష్టం లేకుండా చూసేందుకు అవసరమైన చర్యలను యుద్ధప్రాతిపదికన చేపడుతున్నాయి. ఏలూరు, అల్లూరి సీతారామరాజు, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ, పునరావాస కార్యక్రమాల్లో ఎస్డీఆర్ఎఫ్ బృందాలు క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాయి. వరద తీవ్రత దృష్ట్యా 150 మంది సభ్యులతో కూడిన 5 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ముంపు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు సురక్షితంగా తరలిస్తున్నాయి. పోలవరం ప్రాజెక్టు కింద ఏడు ముంపు మండలాలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించడంతోపాటు ఏలూరు, అల్లూరి, కోనసీమ జిల్లాల్లో పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపడుతున్నాయి. అల్లూరి జిల్లాలోని కూనవరం, వీఆర్ పురం, రాజుపేట ఎస్సీ కాలనీ, ఏలూరు జిల్లాలోని సుడిగుమ్మరీపగుమ్మ, కోనసీమ జిల్లాలోని టేకుల సెట్టిపాలెం, వీరవల్లిపాలెం, కొట్టిలంక, గుంజరామేక తదితర గ్రామాల ప్రజలను గురువారం సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పోలవరం ముంపు మండలాల పరిధిలో పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే 30 మంది విద్యార్థులకు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు భద్రత కల్పించాయి. పునరావాస కేంద్రాల్లో ఉంటున్న వారికి ఆహారం పంపిణీ చేశాయి. -
Rain Alert: బలపడిన అల్పపీడనం.. పలుచోట్ల భారీ వర్షాలు
సాక్షి, అమరావతి: ఒడిశా తీరంలో అల్పపీడనం మరింత బలపడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 7.6కి.మీ ఎత్తులో విస్తరించి ఉన్నట్లు తెలిపింది. వీటి ప్రభావంతో కోస్తా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయి. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మంగళవారం అల్లూరి సీతారామరాజు, పల్నాడు, అనకాపల్లి, నెల్లూరు, వైఎస్సార్, చిత్తూరు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. ఎస్డీఆర్ఎఫ్ సహాయక చర్యలు గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎస్డీఆర్ఎఫ్ (స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) బృందాలు చురుగ్గా పనిచేస్తున్నాయి. మంగళవారం పలు గ్రామాల నుంచి 1,125 మందిని బోట్లలో సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. కూనవరం మండలం టేకులముండి నుంచి 275 మంది, రాజుపేట, వడ్డిగూడెం గ్రామాల నుంచి 200 మంది, టేకులబోరు, కూనవరం, గిన్నెల బజార్, రేఖపల్లి గ్రామాల నుంచి 300 మంది, ధర్మతులగూడెం నుంచి 350 మందిని బోట్ల ద్వారా బయటకు తీసుకువచ్చి షెల్టర్లకు తరలించారు. -
పంట నష్టపరిహారం చెల్లించాల్సిందే
సాక్షి, హైదరాబాద్: గత ఏడాది వర్షాల కారణంగా జరిగిన పంట నష్టానికి రైతులకు పరిహారం చెల్లించాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు తేల్చిచెప్పింది. అప్పుడు రాష్ట్రంలో ఎక్కడా పంట నష్టం జరగలేదన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనను తప్పుబట్టింది. విపత్తులతో పంటలు నష్టపోయి తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తేల్చిచెప్పింది. పంట నష్టం జరిగిందనేందుకు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని తెలిపింది. నష్టాన్ని నివారించామనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి ఆధారాలను చూపలేదని పేర్కొంది. ఈ నేపథ్యంలో గత ఏడాది వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పంట నష్టాన్ని మూడు నెలల్లో అంచనా వేయాలని ఆదేశించింది. ఆ తర్వాత నెల రోజుల్లో రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధి (ఎస్డీఆర్ఎఫ్), జాతీయ విపత్తుల నిర్వహణ నిధి (ఎన్డీఆర్ఎఫ్) నుంచి కౌలు రైతులతో పాటు నష్టపోయిన రైతుందరికీ ఇన్పుట్ సబ్సిడీగా పరిహారం అందించాలని ఆదేశించింది. పంట బీమా లేక తీవ్రంగా నష్టపోయిన సన్న, చిన్నకారు రైతులకు అదనపు ఆర్థిక సాయం అందించాలని స్పష్టం చేసింది. గత ఏడాది పంటలు నష్టపోయిన రైతులకు ఆర్థిక సాయం అందించేలా ఆదేశించాలంటూ రైతు స్వరాజ్య వేదిక ప్రతినిధులు విస్సా కిరణ్‌కుమార్, కన్నెగంటి రవి, ఆశాలతలు దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని విచారించిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ రామచందర్‌రావు, జస్టిస్ టి.వినోద్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం తీర్పునిచ్చింది. నష్టం లేకుండా చేయడం అసాధ్యం ‘భారీ వర్షాలు పడ్డాయని, పంట పొలాల్లో భారీగా నీరు నిలిచిందని రాష్ట్ర ప్రభుత్వమే అంగీకరించింది. అయితే వెంటనే చేపట్టిన నష్టనివారణ చర్యలతో పంటలు నష్టపోలేదన్న రాష్ట్ర ప్రభుత్వ వాదన సమర్థనీయం కాదు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలతో నష్టాన్ని కొంతవరకు తగ్గించవచ్చేమో. అంతేగానీ అసలు నష్టమే జరగకుండా చేయడం అన్నది అసాధ్యం. వాస్తవానికి భారీ వర్షాలతో పంటలు తీవ్రంగా నష్టపోయాయని, ఆర్థిక సాయం చేయాలంటూ సీఎం, సీఎస్ వేర్వేరుగా కేంద్రానికి లేఖలు రాశారు. ఈ మేరకు కేంద్ర ప్రతినిధి బృందం కూడా రాష్ట్రంలో పర్యటించి పంట నష్టాన్ని అంచనా చేసింది. ఇప్పుడేమో రాష్ట్ర ప్రభుత్వం పొంతన లేని వాదనలు చేస్తోంది. కేంద్రం నుంచి ఎటువంటి సాయం అందలేదన్న వాదన కూడా సరికాదు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ కింద కేంద్ర ప్రభుత్వం తన వాటాను రాష్ట్రానికి కేటాయించింది. రైతు బంధు భూమి యజమానులకు మాత్రమే ఇస్తున్నారు. కౌలు రైతులకు సాయం అందడం లేదు. విపత్తులు సంభవించినప్పుడు సన్న, చిన్నకారు, కౌలు రైతులే తీవ్రంగా నష్టపోతారు. వారిని ఆదుకోవడం ప్రభుత్వం బాధ్యత..’అని ధర్మాసనం పేర్కొంది. పిల్ అన్నింటికీ మాత్ర కాదు ‘ఈ వ్యాజ్యంలో ప్రజాప్రయోజనం లేదు. రైతులకు నష్టపరిహారం ఇవ్వాలా లేదా అన్నది రాష్ట్ర ప్రభుత్వ విచక్షణాధికారం. గత ఏడాది.. ముందు నష్టం జరిగిందని భావించి సీఎం, సీఎస్ కేంద్రానికి లేఖ రాశారు. తర్వాత పరిశీలించగా ఎక్కడా నష్టం జరగలేదని తెలిసింది. కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎటువంటి సాయం అందలేదు..’అని అంతకుముందు అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదించారు. ఇందులో ప్రజా ప్రయోజనం ఉంది ఏజీ వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్లో ఎక్కడా ఈ అభ్యంతరం వ్యక్తం చేయలేదని, పిల్‌ను విచారణకు స్వీకరించిన దాదాపు 10 నెలల తర్వాత విచారణార్హం కాదనడం సరికాదని పేర్కొంది. ఈ పిటిషన్లో ప్రజాప్రయోజన ఉందని తేల్చిచెప్పింది. ఎలాంటి సాయం అందించలేదు ‘5.97 లక్షల ఎకరాల్లో దాదాపు 33 శాతం పంటలు దెబ్బతిన్నాయని, దీంతో రూ. 5 వేల కోట్ల నష్టం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించింది. తక్షణ సాయంగా రూ.1,350 కోట్లు ఇవ్వాలని సీఎం, సీఎస్ కోరారు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ కింద కేంద్ర ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. అయినా రైతులకు ఎటువంటి సాయం అందించలేదు..’అని పిటిషనర్ల తరఫున న్యాయవాది సీహెచ్ రవికుమార్ వాదనలు వినిపించారు. నష్టం జరిగిందని లేఖ రాశారు గత ఏడాది వర్షాలకు రాష్ట్రంలో లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోయాయని సీఎం కేసీఆర్, సీఎస్‌లు కేంద్రానికి గత ఏడాది అక్టోబర్ 16న లేఖలు రాసినట్లు కేంద్రం తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ ఎన్.రాజేశ్వర్‌రావు నివేదించారు. రైతులకు ఇన్పుట్ సబ్సిడీగా పరిహారం ఇచ్చేందుకు రూ.7,219.5 కోట్లు అవసరమని కోరిందని తెలిపారు. లక్షలాది మంది రైతులకు ప్రయోజనం ‘హైకోర్టు చారిత్రక తీర్పుతో లక్షలాది మంది రైతులకు న్యాయం జరుగుతుంది. ఈ తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిది. బేషజాలకు పోకుండా ఇప్పటికైనా తీర్పును అమలు చేయాలి. అలాగే ఈ ఏడాది వర్షాలతో నష్టపోయిన పంటల వివరాలు సేకరించి బాధిత రైతులను ఆదుకోవాలి. ఈ ఏడాది యాసంగికి పంటల బీమాను నోటిఫై చేయాలి..’అని రైతు స్వరాజ్య వేదిక ప్రతినిధులు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. -
విజయనగరం : ముంపు ప్రాంతాలను నిరంతరం పర్యవేస్తున్నఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది
-
నివర్ బాధితులకు రూ.500 ప్రత్యేక సాయం
సాక్షి, అమరావతి: నివర్ తుపాను వల్ల పునరావాస శిబిరాల్లో గడిపిన ప్రతి ఒక్కరికీ రాష్ట్ర విపత్తు సహాయ నిధి (ఎస్డీఆర్ఎఫ్) సహాయ ప్యాకేజీలకు అదనంగా రూ.500 ప్రత్యేక సాయాన్ని ప్రభుత్వం విడుదల చేసింది. తుపాను వల్ల భారీ వర్షాలు, వరదలు సంభవించిన ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, వైఎస్సార్, చిత్తూరు జిల్లాలకు ఈ సాయం వర్తిస్తుంది. ట్రెజరీ రూల్ (టీఆర్)– 27 కింద వెంటనే వీరికి రూ.500 చొప్పున ప్రత్యేక సహాయం అందించాలని ఈ నాలుగు జిల్లాల కలెక్టర్లకు రాష్ట్ర రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖల ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నాలుగు జిల్లాల్లో తుపాను సమయంలో భారీ వర్షాలతో సహాయ శిబిరాల్లో తలదాచుకున్న వారందరికీ నగదు ఇవ్వాలని ఆదేశించారు. కాగా, ఈ జిల్లాల్లో 49,123 మందికి రూ.500 ప్రత్యేక సాయం ఇవ్వాలని జిల్లా కలెక్టర్లు ప్రతిపాదించగా ప్రభుత్వం ఆమోదించింది. వరదల్లో చనిపోయిన వారి వారసులకు ఎక్స్‌గ్రేషియా కోసం ప్రతిపాదనలు పంపిన కలెక్టర్లు.. బాధితుల బ్యాంకు అకౌంట్, ఆధార్, లీగల్ హెయిర్ సర్టిఫికెట్లు పంపించాలని వారికి సూచించారు. ఇళ్లు కూలిపోయినవారికి సంబంధించిన ఆధార్ కార్డు, బ్యాంకు అకౌంట్, వీధి, ఇంటి నంబర్ వివరాలను పంపించాలన్నారు. -
మరో 24 గంటల పాటు పోలీసు శాఖ అప్రమత్తం
సాక్షి, అమరావతి: ఏపీ వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో పోలీసు శాఖ మరో 24 గంటలపాటు అప్రమత్తంగా ఉండాలని డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు. మరో రెండు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు, వరద తీవ్రత ఎక్కవగా ఉండే ప్రాంతాలను ప్రత్యేకంగా పర్వవేక్షించాలని సూచించారు. ఈరోజు కురిసిన వర్షానికి ప్రజల ప్రాణాలు కాపాడటంతో పాటు ముంపు ప్రాంతాల బాధితులను పునరావాస కేందరాలకు తరలించడంలో పోలీసు శాఖ చోరవ ప్రశంసనీయం అన్నారు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో సమన్వయంతో పోలీసులు పని చేయాడం అభినందనీయమని డీజీపీ వ్యాఖ్యానించారు. తప్పనిసరిగా 100/112కు డయల్ చేయాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చెరువు తలపించిన వెలగపూడి హైకోర్టు ప్రాంగణం: ఒక్కరోజు కురిసిన వర్షానికి వెలగపూడి తాత్కాలిక హైకోర్టు ప్రాంగణం చెరువును తలపిస్తోంది. హైకోర్టుకి వెళ్లే మార్గంలో వెలగపూడి వద్ద రోడ్డుపై దాదాపు మూడు అడుగుల మేర నీరు ప్రవహిస్తోంది. దీంతో హైకోర్టుకి వచ్చే ఉద్యోగులు, న్యాయవాదులు, కక్షిదారులు చెరువుగా మారిన రోడ్లపై ప్రయాణిస్తూ నానా ఇబ్బంధులు ఎదుర్కొన్నారు. -
భారీ వర్షాలు : ఉద్యోగులకు సెలవులు రద్దు
సాక్షి, విజయవాడ : రాష్ట్రంలోని భారీ వర్షాలపై పంచాయతీ రాజ్ శాఖ కమీషనర్ గిరిజా శంకర్ మంగళవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని జిల్లాల డీపీవోలు, పంచాయతీరాజ్ ఉన్నతాధికారులతో దీనిపై సమీక్షించారు. ఈ క్రమంలో పంచాయతీ రాజ్ అధికారులు, ఉద్యోగులందరికి సెలవులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అన్ని జిల్లాల్లో మంచి నీటి సరఫరాకు ఎటువంటి ఆటంకం కలగకుండా చర్యలు చేపట్టాలని గిరిజా శంకర్ ఆదేశించారు. వర్షాల కారణంగా పేరుకుపోయిన డ్రైన్‌ను శుభ్ర పరచాలని సూచించారు. అన్ని గ్రామాల్లోనూ క్లోరినషన్ చేపట్టాలని స్థానిక అధికారులను ఆదేశించారు. నిరంతరం వర్షాల పరిస్థితులు సమీక్షించేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని ఈ సందర్భంగా గిరిజా శంకర్ వెల్లడించారు. ఇక కాకినాడ సమీపాన వాయుగుండం తీరాన్ని తాకింది. దీంతో రాగల 24 గంటల్లో కోస్తాంధ్ర అంతటా వర్షాలు పడనున్నాయి. విశాఖ, తూర్పు గోదావరి జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, తీర ప్రాంత ప్రజలు లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. దీనిపై ఏపీ విపత్తు నిర్వహణ శాఖ కమిషనర్ కన్నబాబు మాట్లాడుతూ, ఇది డీప్ డిప్రెషన్ మాత్రమేనని, తుఫానులా మారలేదని చెప్పారు. ఫలితంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ప్రస్తుతం కాకినాడ ప్రాంతంలో వర్షాలు తగ్గుముఖం పట్టాయని, రాగల మూడు నాలుగు గంటలు పశ్చిమ గోదావరి, కృష్ణ, గుంటూరు ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయని పేర్కొన్నారు. కృష్ణా, గుంటూరుల మీదుగా వర్షాలు తెలంగాణా వైపు వెళతాయన్నారు. ప్రస్తుతం గంటకు 45 నుంచి 50 కిలో మీటర్ల మేర గాలులు వీస్తున్నాయన్నారు. తీర ప్రాంతంలో 60 నుంచి 65 కిలో మీటర్ల వేగం ఉండొచ్చు అని తెలిపారు. అన్ని జిల్లాల్లో సహాయకచర్యలు అందించడానికి ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. మంగళగిరిలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సర్వం సిద్ధం చేసుకొని ఉన్నాయని తెలిపారు. రెండు రోజుల క్రితమే కాకినాడకు ఒక ప్లటూన్ ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని పంపామని వెల్లడించారు. మంగళవారం మధ్యాహ్నానానికి ఏపీలో వర్షాలు తగ్గే అవకాశం ఉందని పేర్కొన్నారు. చదవండి: భారీ వర్షాలు: తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం (function(w,d,s,u,n,i,f,g,e,c){w.WDMObject=n;w[n]=w[n]||function(){(w[n].q=w[n].q||[]).push(arguments);};w[n].l=1*new Date();w[n].i=i;w[n].f=f;w[n].g=g;e=d.createElement(s);e.async=1;e.src=u;c=d.getElementsByTagName(s)[0];c.parentNode.insertBefore(e,c);})(window,document,"script","//api.dmcdn.net/pxl/cpe/client.min.js","cpe","5f686da28ba2a6d8cbff0ede",{scroll_to_pause: true}); -
కృష్ణాజిల్లా రొయ్యూరులో విషాదం
సాక్షి, కృష్ణా జిల్లా: తోట్లవల్లూరు మండలం రొయ్యూరు ఇసుక రీచ్ వద్ద కృష్ణా నదిలో శనివారం గల్లంతైన వారి మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతదేహాలను రంజిత్, సూర్యప్రకాష్, వీరయ్య, వెంకటేశ్వరరావుగా గుర్తించారు. శనివారం కృష్ణానదిలో వేటకు వెళ్లిన నలుగురు గల్లంతయిన సంగతి తెలిసిందే. మృతులంతా కంకిపాడు వైకుంఠపురం వాసులు. ఆదివారం ఘటనా స్థలంలో సాగిన రెస్క్యూ ఆపరేషన్‌ను ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్ పరిశీలించారు. మృతుల కుటుంబ సభ్యులను ఆయన ఓదార్చి ధైర్యం చెప్పారు. -
ఎమ్మెల్యేకు తృటిలో తప్పిన ప్రమాదం
-
ఎమ్మెల్యేకు తృటిలో తప్పిన ప్రమాదం
సాక్షి, ప.గో(యలమంచిలి): ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న పడవ ఇంజిన్ పాడైపోవడంతో వరద ఉధృతికి కొట్టుకుపోయింది. యలమంచిలి మండలం బాడవ వరద ప్రాంతం నుంచి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. తూర్పు గోదావరి వైపు చెట్టుకు లంగర్ వేసి పడవను ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది అదుపు చేసింది. ఎమ్మెల్యే ముంపు గ్రామాలకు వెళ్లేటప్పుడు తమకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదని డీఎస్పీ నాగేశ్వరరావు అన్నారు. సమాచారం ఇచ్చిన వెంటనే ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందితో కాపాడగలిగామన్నారు. -
కరోనా.. రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్
సాక్షి, విజయవాడ : ఆంధప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు ఒక్కసారిగా పెరగడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎలాంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సర్వసన్నాహాలు చేస్తోంది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించేందుకు సిద్ధమైంది. మరోవైపు సమన్వయంతో కరోనా కట్టడికి వీఎంసీ ప్రణాళిక సిద్ధం చేసింది. మొండికేసిన కరోనా పెషేంట్‌ను ఎలా తీసుకురావాలి, డిసిన్ఫెక్షన్ ఎలా చేయాలి అన్న విషయాలపై మాక్ డ్రిల్ ఏర్పాటు చేసింది. నగరంలోని మున్సిపల్ స్టేడియంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందాల డెమో నిర్వహించి అవగాహన కల్పించాయి. ఈ మాక్ డ్రిల్‌లో మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేశ్, ఎన్డీఆర్ఎఫ్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ బీవీరావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ.. కరోనాపై అవగాహన పెంచేందుకే ఐదు శాఖల సిబ్బందితో మాక్ డ్రిల్ నిర్వహించినట్టు తెలిపారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొని కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేస్తామని అన్నారు. ఢిల్లీ నుంచి వచ్చివారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని కోరారు. రెస్క్యూ సిబ్బంది కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. బీవీ రావు మాట్లాడుతూ.. కరోనాపై యుద్ధానికి తాము సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. ప్రభుత్వ సూచనల ప్రకారం ప్రజలు ఇంటిపట్టునే ఉంటే కరోనా కట్టడి సులభతరమౌతుందన్నారు. -
సాయానికి ఆర్నెల్లు ఆగాల్సిందే!
న్యూఢిల్లీ/కొచ్చి: ప్రకృతి ప్రకోపానికి తీవ్రంగా దెబ్బతిన్న కేరళకు పూర్తిస్థాయిలో ఆర్థిక సాయం లేదా ప్యాకేజీ అందించేందుకు కనీసం 3 నుంచి 6 నెలల సమయం పట్టే అవకాశముందని హోంశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. నష్టాన్ని పూర్తిగా అంచనా వేయడం దగ్గరి నుంచి నిధుల విడుదల వరకూ ఇదో సుదీర్ఘ ప్రక్రియ అని వెల్లడించారు. విపత్తుల సందర్భంగా నిధుల విడుదలపై ప్రస్తుతం అమల్లో ఉన్న మార్గదర్శకాల ప్రకారం.. సాధారణ రాష్ట్రాల విపత్తు సహాయ నిధి(ఎస్డీఆర్ఎఫ్)కి 75 శాతం, ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు 90 శాతం నిధులను కేంద్రం అందజేస్తుందన్నారు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ఆయా రాష్ట్రాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని కేంద్రం భావిస్తే సదరు రాష్ట్రాలకు ఇవ్వాల్సిన సాయంలో గరిష్టంగా 25 శాతం నిధుల్ని ముందస్తుగా విడుదల చేయొచ్చు. ఈ మొత్తాన్ని ఆ తర్వాతి వాయిదాలో సర్దుబాటు చేస్తారు. భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన కేరళ పునర్నిర్మాణానికి నెల రోజుల వేతనాన్ని విరాళంగా ఇవ్వాలని దేశ, విదేశాల్లో ఉన్న మలయాళీలకు ఆ రాష్ట్ర సీఎం విజయన్ పిలుపునిచ్చారు. ఓ నెల వేతనం మొత్తాన్ని వదులుకోవడం కష్టమైన విషయమనీ, నెలకు 3 రోజుల వేతనం చొప్పున పది నెలల పాటు అందించి ప్రజలను ఆదుకోవాలన్నారు. కేరళ కోసం గాంధీజీ విరాళాలు సేకరించిన వేళ.. తిరువనంతపురం: దాదాపు వందేళ్ల క్రితం కూడా కేరళలో ఇప్పటి స్థాయిలో వరదలు విధ్వంసం సృష్టించాయి. దీంతో మహాత్మా గాంధీ కేరళ ప్రజలను ఆదుకోవాలని దేశ ప్రజలకు పిలుపునివ్వగా చాలామంది ఉదారంగా స్పందించారు. 1924, జూలైలో మలబార్ (కేరళ)లో వరదలు విలయతాండవం సృష్టించాయి. ఈ నేపథ్యంలో ఊహకందని నష్టం సంభవించిందని యంగ్ ఇండియా, నవజీవన్ పత్రికల్లో గాంధీజీ వ్యాసాలు రాశారు. మలయాళీలను ఆదుకోవడానికి ముందుకు రావాలని కోరారు. దీంతో చాలామంది స్త్రీలు తమ బంగారు ఆభరణాలు, దాచుకున్న నగదును దానం చేయగా, మరికొందరు రోజుకు ఒకపూట భోజనం మానేసి మిగిల్చిన సొమ్మును సహాయ నిధికి అందించారు. ఈ విషయాన్ని గాంధీజీ స్వయంగా తాను రాసిన కథనాల్లో ప్రస్తావించారు. ఓ చిన్నారి అయితే మూడు పైసలను దొంగలిం చి వరద బాధితుల కోసం ఇచ్చిందని గాంధీ వెల్లడించారు. 6,994 రూపాయల 13 అణాల 3 పైసలు వసూలైనట్లు చెప్పారు. -
‘విపత్తుల దళం’ ఏర్పాటుకు ప్రతిపాదనలు
► కేంద్రం మొట్టికాయలతో రాష్ట్రంలో కదలిక హైదరాబాద్: స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(ఎస్డీఆర్ఎఫ్) ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక వచ్చింది. కేంద్రం మొట్టికాయలు వేయడంతో ఉన్నతా ధికారులు స్పందించి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ప్రకృతి విపత్తులు, అత్యవసర సహాయ పరిస్థితుల్లో సహాయచర్యల కోసం పనిచేసే డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్‌ను 2005లో కేంద్రం ఏర్పాటు చేసింది. ప్రతీ రాష్ట్ర ప్రభు త్వం తమ పరిధిలోనూ రాష్ట్ర డిజాస్టర్ రెస్పా న్స్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని చట్టంలో పేర్కొంది. కానీ, ఉమ్మడి ఏపీలో డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఏర్పాటు చేయకపోవడంతో 2013లో సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ మేరకు ఉమ్మడి ఏపీ తోపాటు మరో 6 రాష్ట్రాలకు నోటీసులు జారీ అయ్యాయి. త్వరలోనే ఏర్పాటు చేస్తామని గతంలోని ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో అఫిడ విట్ దాఖలు చేశాయి. దీనిపై ఇటీవల కేంద్ర హోంశాఖ సమీక్ష నిర్వహించింది. ఇప్పటి వరకు ఎస్డీఆర్ఎఫ్ ఎందుకు ఏర్పాటు చేయ లేదని తెలంగాణ, ఏపీలకు మొట్టికాయలు వేసింది. దీంతో ఉన్నతాధికారులు తెలంగాణ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఏర్పాటు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. రాష్ట్ర అగ్ని మాపక శాఖ నేతృత్వంలో ఉన్న డిజాస్టర్ మేనేజ్మెంట్లోని సిబ్బంది, పోలీస్ శాఖలో ని బెటాలియన్ సిబ్బందిని 8 బృందాలుగా ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తున్నారు. ఎన్ డీఆర్ఎఫ్ రీతిలో పనిచేసేందుకు ఇవ్వాల్సిన శిక్షణ, కావల్సిన నిధులు, వాహనాలు, పరిక రాలు, మౌలిక సదుపాయాల కోసం రూ.200 కోట్లు కేటాయించాలని ప్రతిపాదనల్లో స్పష్టం చేశారు. ఈ విభాగం ఏర్పడితే పోలీస్ శాఖ కింద లేక అగ్నిమాపక శాఖ కింద పనిచే యాల్సి ఉంటుందా అన్న అంశాలపై 2 విభాగాల మధ్య కోల్డ్‌వార్ నడుస్తోంది. -
విపత్తు సహాయ నిధికి రూ.108 కోట్లు
♦ నెల ముందుగానే తొలివిడత నిధులు విడుదల చేసిన కేంద్రం ♦ ఇన్పుట్ సబ్సిడీకి ఖర్చు చేయాలని రాష్ట్ర నిర్ణయం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విపత్తు సహాయ నిధి (ఎస్డీఆర్ఎఫ్)కి కేంద్రం రూ.108 కోట్లు కేటాయించింది. ఈ మేరకు విపత్తు నిర్వహణ శాఖకు సమాచారం అందింది. 2016-17కి కేంద్ర ప్రభుత్వం 14వ ఆర్థిక సంఘం నుంచి ఎస్డీఆర్ఎఫ్కు రూ.288 కోట్లు కేటాయిం చిన సంగతి తెలిసిందే. అందులో రాష్ట్ర వాటా పోను కేంద్రం రూ.216 కోట్లు ఇవ్వాలి. ప్రస్తుతం అందులో నుంచి తొలి విడత సాయం కింద రూ. 108 కోట్లు కేటాయించింది. వాస్తవంగా ఎస్డీఆర్ఎఫ్ నిధులను ప్రతీ ఏడాది జూన్, డిసెంబర్ నెలల్లో 2 విడతలుగా విడుదల చేస్తారు. అయితే తీవ్ర కరువు పరిస్థితులు ఉన్నందున ముందస్తుగానే సాయం చేయాలని రాష్ట్రం కోరిన మేరకు కేంద్రం ఈ నెలలోనే నిధులు విడుదల చేసినట్లు విపత్తు నిర్వహణశాఖ అధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. రెండో విడత సొమ్మును కేంద్రం డిసెంబర్లో విడుదల చేయనుంది. కరువు ఉన్నందున ఈ నిధులను రైతులకు ఇన్పుట్ సబ్సిడీగా ఇవ్వాలని నిర్ణయించారు. సీఎం ఢిల్లీ వెళ్లి మరింత కరువు సాయం చేయాలని కోరిన సంగతి తెలిసిందే. మొత్తంగా రూ.1,515 కోట్లు 2015-2020 సంవత్సరాల కోసం 14వ ఆర్థిక సంఘం విపత్తు నిర్వహణ శాఖకు రూ.1,515 కోట్లు కేటాయించింది. అందు లో భాగంగా 2016-17కు రూ. 288 కోట్లు కేటాయించింది. 12 రకాల విపత్తులు సంభవించినప్పుడు రాష్ట్రాలకు ఈ సాయాన్ని ప్రతీ ఏడాది కేటాయిస్తుంది. విపత్తుల తీవ్రతను బట్టి కేటాయించిన సొమ్ము చాలకపోతే రాష్ట్రాల విన్నపం మేరకు కేంద్రం అదనపు నిధులు కేటాయిస్తుంది. -
ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఏర్పాటు
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ(SDMA), రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధి (SDRF)ను ఏర్పాటు చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం చిన రాజప్ప వెల్లడించారు. విశాఖపట్నంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ...రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధి ఏర్పాటుకు ప్రపంచ బ్యాంక్ తొలి విడతగా రూ.23.58 కోట్ల సాయం అందిస్తుందన్నారు. ప్రకృతి వైపరిత్యాలను ఎదుర్కొనేందుకు 600 మందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన చెప్పారు. ప్రపంచ బ్యాంక్ అందించిన సాయంతో మిషనరీ, వాహనాలు, శిక్షణ, టెక్నాలజీ అంశాల ఏర్పాటు కోసం ఖర్చు చేస్తామన్నారు. వీటి కోసం త్వరలో టెండర్లను ఆహ్వానిస్తామని చిన రాజప్ప తెలిపారు.