సాక్షి, హైదరాబాద్: గత ఏడాది వర్షాల కారణంగా జరిగిన పంట నష్టానికి రైతులకు పరిహారం చెల్లించాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు తేల్చిచెప్పింది. అప్పుడు రాష్ట్రంలో ఎక్కడా పంట నష్టం జరగలేదన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనను తప్పుబట్టింది. విపత్తులతో పంటలు నష్టపోయి తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తేల్చిచెప్పింది. పంట నష్టం జరిగిందనేందుకు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని తెలిపింది.
నష్టాన్ని నివారించామనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి ఆధారాలను చూపలేదని పేర్కొంది. ఈ నేపథ్యంలో గత ఏడాది వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పంట నష్టాన్ని మూడు నెలల్లో అంచనా వేయాలని ఆదేశించింది. ఆ తర్వాత నెల రోజుల్లో రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధి (ఎస్‌డీఆర్‌ఎఫ్), జాతీయ విపత్తుల నిర్వహణ నిధి (ఎన్‌డీఆర్‌ఎఫ్) నుంచి కౌలు రైతులతో పాటు నష్టపోయిన రైతుందరికీ ఇన్‌పుట్ సబ్సిడీగా పరిహారం అందించాలని ఆదేశించింది.
పంట బీమా లేక తీవ్రంగా నష్టపోయిన సన్న, చిన్నకారు రైతులకు అదనపు ఆర్థిక సాయం అందించాలని స్పష్టం చేసింది. గత ఏడాది పంటలు నష్టపోయిన రైతులకు ఆర్థిక సాయం అందించేలా ఆదేశించాలంటూ రైతు స్వరాజ్య వేదిక ప్రతినిధులు విస్సా కిరణ్‌కుమార్, కన్నెగంటి రవి, ఆశాలతలు దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని విచారించిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ రామచందర్‌రావు, జస్టిస్ టి.వినోద్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం తీర్పునిచ్చింది.
నష్టం లేకుండా చేయడం అసాధ్యం
‘భారీ వర్షాలు పడ్డాయని, పంట పొలాల్లో భారీగా నీరు నిలిచిందని రాష్ట్ర ప్రభుత్వమే అంగీకరించింది. అయితే వెంటనే చేపట్టిన నష్టనివారణ చర్యలతో పంటలు నష్టపోలేదన్న రాష్ట్ర ప్రభుత్వ వాదన సమర్థనీయం కాదు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలతో నష్టాన్ని కొంతవరకు తగ్గించవచ్చేమో. అంతేగానీ అసలు నష్టమే జరగకుండా చేయడం అన్నది అసాధ్యం. వాస్తవానికి భారీ వర్షాలతో పంటలు తీవ్రంగా నష్టపోయాయని, ఆర్థిక సాయం చేయాలంటూ సీఎం, సీఎస్ వేర్వేరుగా కేంద్రానికి లేఖలు రాశారు.
ఈ మేరకు కేంద్ర ప్రతినిధి బృందం కూడా రాష్ట్రంలో పర్యటించి పంట నష్టాన్ని అంచనా చేసింది. ఇప్పుడేమో రాష్ట్ర ప్రభుత్వం పొంతన లేని వాదనలు చేస్తోంది. కేంద్రం నుంచి ఎటువంటి సాయం అందలేదన్న వాదన కూడా సరికాదు. ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్‌డీఆర్‌ఎఫ్ కింద కేంద్ర ప్రభుత్వం తన వాటాను రాష్ట్రానికి కేటాయించింది. రైతు బంధు భూమి యజమానులకు మాత్రమే ఇస్తున్నారు. కౌలు రైతులకు సాయం అందడం లేదు. విపత్తులు సంభవించినప్పుడు సన్న, చిన్నకారు, కౌలు రైతులే తీవ్రంగా నష్టపోతారు. వారిని ఆదుకోవడం ప్రభుత్వం బాధ్యత..’అని ధర్మాసనం పేర్కొంది.
పిల్ అన్నింటికీ మాత్ర కాదు
‘ఈ వ్యాజ్యంలో ప్రజాప్రయోజనం లేదు. రైతులకు నష్టపరిహారం ఇవ్వాలా లేదా అన్నది రాష్ట్ర ప్రభుత్వ విచక్షణాధికారం. గత ఏడాది.. ముందు నష్టం జరిగిందని భావించి సీఎం, సీఎస్ కేంద్రానికి లేఖ రాశారు. తర్వాత పరిశీలించగా ఎక్కడా నష్టం జరగలేదని తెలిసింది. కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎటువంటి సాయం అందలేదు..’అని అంతకుముందు అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదించారు.
ఇందులో ప్రజా ప్రయోజనం ఉంది
ఏజీ వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్‌లో ఎక్కడా ఈ అభ్యంతరం వ్యక్తం చేయలేదని, పిల్‌ను విచారణకు స్వీకరించిన దాదాపు 10 నెలల తర్వాత విచారణార్హం కాదనడం సరికాదని పేర్కొంది. ఈ పిటిషన్‌లో ప్రజాప్రయోజన ఉందని తేల్చిచెప్పింది.
ఎలాంటి సాయం అందించలేదు
‘5.97 లక్షల ఎకరాల్లో దాదాపు 33 శాతం పంటలు దెబ్బతిన్నాయని, దీంతో రూ. 5 వేల కోట్ల నష్టం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించింది. తక్షణ సాయంగా రూ.1,350 కోట్లు ఇవ్వాలని సీఎం, సీఎస్ కోరారు. ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్‌డీఆర్‌ఎఫ్ కింద కేంద్ర ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. అయినా రైతులకు ఎటువంటి సాయం అందించలేదు..’అని పిటిషనర్ల తరఫున న్యాయవాది సీహెచ్ రవికుమార్ వాదనలు వినిపించారు.
నష్టం జరిగిందని లేఖ రాశారు
గత ఏడాది వర్షాలకు రాష్ట్రంలో లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోయాయని సీఎం కేసీఆర్, సీఎస్‌లు కేంద్రానికి గత ఏడాది అక్టోబర్ 16న లేఖలు రాసినట్లు కేంద్రం తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ ఎన్.రాజేశ్వర్‌రావు నివేదించారు. రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీగా పరిహారం ఇచ్చేందుకు రూ.7,219.5 కోట్లు అవసరమని కోరిందని తెలిపారు.
లక్షలాది మంది రైతులకు ప్రయోజనం
‘హైకోర్టు చారిత్రక తీర్పుతో లక్షలాది మంది రైతులకు న్యాయం జరుగుతుంది. ఈ తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిది. బేషజాలకు పోకుండా ఇప్పటికైనా తీర్పును అమలు చేయాలి. అలాగే ఈ ఏడాది వర్షాలతో నష్టపోయిన పంటల వివరాలు సేకరించి బాధిత రైతులను ఆదుకోవాలి. ఈ ఏడాది యాసంగికి పంటల బీమాను నోటిఫై చేయాలి..’అని రైతు స్వరాజ్య వేదిక ప్రతినిధులు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment