NDRF
-
150 అడుగుల బోరుబావిలో బాలుడు.. కొనసాగుతున్న సహాయక చర్యలు
జైపూర్: ఆడుకుంటూ ప్రమాదవశాత్తు పొలంలోని బోరు బావిలో పడిపోయిన ఐదేళ్ల బాలుడి కోసం రెస్క్యూ టీం సుమారు 17 గంటల పాటు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు. ఈ సంఘటన రాజస్థాన్ రాష్ట్రం దౌస జిల్లాలో చోటు చేసుకుంది.జిల్లాలోని కలిఖడ్ గ్రామంలో సోమవారం (డిసెంబర్9న) ఘటన చోటు చేసుకోగా మంగళవారం (డిసెంబర్ 10) ఉదయం వరకు నిర్విరామంగా బాలుడిని బావి నుంచి బయటకు తీసేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు,పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో సోమవారం ఐదేళ్ల ఆర్యన్ బోరుబావిలో పడిపోయాడు. ఈ ఘటనపై జిల్లా యంత్రాంగం కదిలి వచ్చింది. ఓ వైపు బాలుడి కోసం బోరు బావికి సమాంతరంగా జేసీబీలతో నిర్విరామంగా మట్టి తవ్వుతుంటే మరోవైపు బోరుబావిలోకి పైపుల ద్వారా ఆక్సిజన్ పంపుతుంది. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. #WATCH दौसा, राजस्थान: दौसा में खेलते समय एक 5 वर्षीय बच्चा बोरवेल में गिर गया। बचाव अभियान जारी है।DM देवेंद्र कुमार ने बताया, "बच्चा करीब 150 फीट गहराई में है, उसे लगातार ऑक्सीजन दिया जा रहा है। मेडिकल टीम मौके पर मौजूद है। SDRF, NDRF और सिविल डिफेंस की टीमें मौके पर पहुंच गई… pic.twitter.com/JECEDzVtxv— ANI_HindiNews (@AHindinews) December 9, 2024బోరు బావి ఘటనపై జిల్లా మేజిస్ట్రేట్ దేవేంద్ర కుమార్ కొద్ది సేపటి క్రితం మాట్లాడుతూ.. ‘‘150 అడుగుల లోతులో ఉన్న బాలుడు ఆర్యన్ ఆరోగ్యం బాగుంది. ఆక్సీజన్ పంపుతున్నాం. బాలుడి ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు బావిలోకి కెమెరాలను పంపాము. బాలుడిని రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు నిర్విరామంగా పనిచేస్తున్నాయి. ఎంతవీలైతే అంత తొందరగా బాలుడిని రక్షించాలనే’’ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు.బోరుబావిలో బాలుడు పడ్డాడనే సమాచారంతో స్థానికులు, జిల్లా ప్రతినిధులు ఘటనా స్థలానికి చేరుకుంటున్నారు. బాలుడి ఆచూకీ గురించి ఆరా తీస్తున్నారు. ఆర్యన్ క్షేమంగా తిరిగి రావాలని ప్రార్ధిస్తున్నారు. -
మేఘాలయలో ఆకస్మిక వరదలు..10 మంది మృతి
షిల్లాంగ్:మేఘాలయలో ఆకస్మిక వరదలు పోటెత్తాయి. భారీ వర్షాల ప్రభావంతో ఒక్కసారిగా సౌత్‌గారో హిల్స్ జిల్లాలో వరదలు వచ్చాయి. కేవలం 24 గంటలపాటు కురిసిన వర్షాలకే వరదలు రావడంతో ప్రాణనష్టం జరిగింది.వరదల వల్ల సౌత్‌గారో హిల్స్ జిల్లాలో కొండచరియలు విరిగిపడ్డాయి. కొండ చరియలు విరిగిపడడంతో మొత్తం 10 మంది మరణించారు. ఒకే కుంటుంబానికి చెందిన ఏడుగురు మృతి చెందడంతో విషాదం నెలకొంది. భారీ వర్షాలు, వరదలపై ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా సమీక్ష నిర్వహించారు.ప్రాణ నష్టంపై విచారం వ్యక్తం చేశారు.ఎన్డీఆర్ఎఫ్తో పాటు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది వరద సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ఇదీ చదవండి: ఆహారంలో బల్లి..50 మందికి అస్వస్థత -
అడిగింది రూ.10,320 కోట్లు.. ఇచ్చింది 416 కోట్లే
సాక్షి, హైదరాబాద్/సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో ఇటీవలి భారీ వర్షాలు, వరదల వల్ల రూ. 10,320.72 కోట్ల భారీ నష్టం జరగ్గా కేంద్రం మాత్రం జాతీయ విపత్తుల సహాయ నిధి (ఎన్డీఆర్ఎఫ్) నుంచి కేవలం రూ. 416.8 కోట్ల అత్తెసరు నిధులనే విడుదల చేసింది. కేంద్రం కేటాయించిన నిధులు ఏమాత్రం సరిపోవని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్ర చరిత్రలో ఈ స్థాయిలో భీకర వరదలు ఎన్నడూ రాలేదని, తగిన రీతిలో నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరగా కేంద్రం నామమాత్రంగా నిధుల కేటాయింపులు జరిపిందని విమర్శిస్తున్నాయి. ఇటీవల వరదల బారిన పడిన 14 రాష్ట్రాలకు సంబంధించిన రాష్ట్ర విపత్తుల సహాయ నిధి (ఎస్డీఆర్ఎఫ్)లో కేంద్రం వాటా కింద మొత్తం రూ. 5,858.6 కోట్లను ఎన్డీఆర్ఎఫ్ నుంచి కేంద్ర హోంశాఖ మంగళవారం విడుదల చేసింది. బీజేపీ, ఎన్డీయేపాలిత రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఏపీ, అస్సాం, బిహార్, గుజరాత్‌కు అధిక నిధులు అందించింది. విపక్షాల పాలనలో ఉన్న తెలంగాణ, కేరళ, హిమాచల్ ప్రదేశ్ తదితర రాష్ట్రాలకు కేంద్రం మొండిచేయి చూపిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
14 రాష్ట్రాలకు వరద సాయం నిధులు విడుదల చేసిన కేంద్రం
ఢిల్లీ: దేశ వ్యాప్తంగా వరద ప్రభావిత ప్రాంతాలకు కేంద్రం రూ.5,858.60 కోట్లు వరద సాయం నిధులను విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ వాటాలో భాగంగా స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (ఎస్డీఆర్ఎఫ్), నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (ఎన్డీఆర్ఎఫ్) నుంచి 14 రాష్ట్రాలకు ఈ మేరకు కేంద్ర హోంశాఖ నిధులు మంజూరు చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అస్సాం, మిజోరాం, కేరళ, త్రిపుర, నాగాలాండ్, గుజరాత్, మణిపూర్ రాష్ట్రాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర బృందాలు.. నష్టాన్ని అంచనా వేస్తూ ఇచ్చిన నివేదిక మేరకు తక్షణసాయంగా ఈ నిధులు కేటాయించింది.అత్యధికంగా మహారాష్ట్రకు 1,492 కోట్ల వరద సాయం ప్రకటించింది.ఆంధ్రప్రదేశ్‌కు రూ.1,036 కోట్లు, తెలంగాణకు రూ.416. కోట్లు మంజూరు చేసింది. అయితే కేంద్ర బృందాల నుంచి పూర్తిస్థాయి నివేదిక వచ్చిన తర్వాత మరిన్ని నిధులు మంజూరు చేయనున్నట్లు హోంశాఖ పేర్కొంది. Ministry of Home Affairs releases ₹ 5858.60 crore to 14 flood-affected as a central share from the State Disaster Response Fund (SDRF) and an advance from the National Disaster Response Fund (NDRF)Government stands shoulder to shoulder with the states affected by natural…— PIB India (@PIB_India) October 1, 2024 -
TG: అమిత్‌షా ఆదేశాలతో రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో భారీ వర్షాలు, ముఖ్యంగా ఖమ్మం జిల్లా వరద పరిస్థితిని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దృష్టికి ఆ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీసుకెళ్లారు. ఖమ్మం జిల్లాలో 110 గ్రామాలు ముంపునకు గురవడంతోపాటు పట్టణంలోని ప్రకాశ్ నగర్ గుట్టపై 9 మంది, పాలేరు అజ్మీరాతండ గుట్టపైన 68 మంది, పట్టణంలోని ఇతర భవనాలపై 42 మంది చిక్కుకున్న విషయాన్ని అమిత్ షాకు వివరించారు. దీంతో తెలంగాణలో ప్రాణ నష్టం లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఎన్డీఆర్ఎఫ్ను అమిత్‌షా ఆదేశించారు. చెన్నై, వైజాగ్, అసోం నుంచి 3 చొప్పున మొత్తం 9 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను తెలంగాణకు పంపుతున్నట్లు అమిత్‌షా తెలిపారు. షా ఆదేశాల తర్వాత ఎన్డీఆర్ఎఫ్ ఉన్నతాధికారులతో బండి సంజయ్ మాట్లాడారు. రాష్ట్ర అధికారులతో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలు చేపట్టాలని ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు బండి సూచించారు. కేంద్ర ఆదేశాలతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తక్షణమే రంగంలోకి దిగాయి. -
బాపట్లలో అత్యధికంగా వర్షపాతం నమోదు
-
వాళ్లు సొరంగాన్ని జయించారు!.. ఎప్పుడేం జరిగింది?
ఉత్తరకాశీ/న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మతాలకు అతీతంగా కోట్లాది మంది చేసిన ప్రార్థనలు ఫలించాయి. 17 రోజుల సుదీర్ఘ నిరీక్షణ ముగిసింది. ఉత్కంఠకు తెరపడింది. ప్రమాదవశాత్తూ సొరంగంలో చిక్కుకొని ఆశ నిరాశల మధ్య క్షణమొక యుగంలా బిక్కుబిక్కుమంటూ గడిపిన 41 మంది కార్మికులు ప్రాణాలతో బయటపడ్డారు. 60 మీటర్ల పొడవైన ఎస్కేప్ రూట్లో ఏర్పాటు చేసిన స్టీల్ పైపు గుండా కార్మికులను ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. గుహ లాంటి సొరంగం నుంచి బయటకు వచ్చిన కార్మికులు బాహ్య ప్రపంచాన్ని కళ్లారా తిలకించి, గుండెనిండా హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. ఉత్తరాఖండ్‌లో సిల్క్యారా సొరంగంలో సహాయక చర్యలు మంగళవారం పూర్తయ్యాయి. ర్యాట్–హోల్ మైనింగ్ నిపుణులు సొరంగం లోపల మిగిలిన 12 మీటర్ల మేర శిథిలాల డ్రిల్లింగ్ పనులు పూర్తిచేశారు. వెంటనే భారీ స్టీల్ పైపును ఏర్పాటు చేసి, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కార్మికుల వద్దకు చేరుకున్నారు. ఒక్కొక్కరిని స్ట్రెచ్చర్లపై బయటకు చేర్చారు. స్టీల్ పైపు నుంచి బయటకు రాగానే కార్మికులకు వైద్య సిబ్బంది కొన్ని పరీక్షలు చేశారు. వారందరి ఆరోగ్యం మెరుగ్గానే ఉందని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామీ చెప్పారు. అయినప్పటికీ వారిని ఇళ్లకు పంపించడానికి ముందు కొన్నిరోజులపాటు వైద్యుల పరిశీలనలో ఉంచాలని నిర్ణయించామని తెలిపారు. 41 మంది కార్మికులకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటించారు. సహాయక ఆపరేషన్‌లో పాల్గొన్నవారికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మద్దతు లేకుంటే ఈ ఆపరేషన్ ఇంత త్వరగా విజయవంతమయ్యేది కాదని పుష్కర్‌సింగ్ ధామీ అన్నారు. ఘటనా స్థలంలో ఉద్వి గ్న వాతావరణం సొరంగం ముఖద్వారం వద్ద మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో కార్మికులకు కేంద్ర మంత్రి వి.కె.సింగ్, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్‌సింగ్ సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ కొందరు కార్మికులతో ఫోన్లో మాట్లాడారు. ఘటనా స్థలంలో ఉద్వి గ్న వాతావరణం నెలకొంది. హర హర మహాదేవ, భారత్ మాతాకీ జై అనే నినాదాలు మిన్నంటాయి. సొరంగం బయట ఉన్నవారంతా పరస్పరం ఆలింగనాలతో ఆనందం పంచుకున్నారు. కార్మికుల కుటుంబ సభ్యులు సైతం అభినందనలు తెలుపుకున్నారు. సహాయక సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు. భగవంతుడు తమ మొర ఆలకించాడని చెమర్చే కళ్లతో వారు చెప్పారు. అధికారులు అప్పటికే సిద్ధంగా ఉంచిన అంబులెన్స్‌ల్లో కార్మికులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఆసుపత్రిలో కార్మికుల కోసం ఇంతకుముందే 41 పడకలతో ప్రత్యేక వార్డు సిద్ధం చేశారు. ఈ నెల 12వ తేదీన కార్మికులు సిల్ క్యారా సొరంగంలో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. సొరంగంలో రెస్క్యూ ఆపరేషన్ విజయవంతమై, కార్మికులు క్షేమంగా బయటకు రావడం పట్ల దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. సహాయక సిబ్బందిని అభినందిస్తూ సోషల్ మీడియాలోనూ నెటిజన్లు పోస్టులు పెట్టారు. చదవండి: ఆ నలుగురు.. సొరంగం రెస్క్యూ ఆపరేషన్‌లో కీలక పాత్ర వీరిదే.. ‘ర్యాట్–హోల్’పై నిషేధం.. అదే ప్రాణాలు కాపాడింది ఎలుకలాగా కలుగును తవ్వేసే ర్యాట్–హోల్ మైనింగ్ అనేది నిజానికి చట్టవిరుద్ధమే. కానీ, సిల్క్యారా టన్నెల్లో ఇదే ప్రక్రియ 41 మంది కార్మికుల ప్రాణాలు కాపాడిందని నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ(ఎన్డీఎంఏ) సభ్యుడు లెఫ్టినెంట్ జనరల్(రిటైర్డ్) సయ్యద్ అతా హస్నెయిన్ మంగళవారం వెల్లడించారు. ఈ సొరంగంలో ర్యాట్–హోల్ మైనింగ్ నిపుణులు 12 మీటర్ల శిథిలాలను 24 గంటల వ్యవధిలో తవ్వేశారని చెప్పారు. వారి కృషి వల్లే కార్మికులు త్వరగా బయటకు వచ్చారని ప్రశంసించారు. బొగ్గు గనుల్లో 3 నుంచి 4 అడుగుల ఎత్తయిన సొరంగాలను అడ్డంగా తవ్వడానికి ర్యాట్–హోల్ మైనింగ్ టెక్నాలజీ వాడుతుంటారు. కేవలం ఒక్క మనిషి పట్టేందుకు వీలుగా ఈ సొరంగాలు ఉంటాయి. మేఘాలయ బొగ్గు గనుల్లో ఈ సాంకేతికతను వాడడాన్ని 2014లో జాతీయ హరిత ట్రిబ్యునల్ నిషేధించింది. దేశవ్యాప్తంగా బొగ్గు గనుల్లో ర్యాట్–హోల్ మైనింగ్‌పై నిషేధం అమలవుతోంది. కానీ, ఇతర నిర్మాణ పనుల్లో అనధికారికంగా ఉపయోగిస్తూనే ఉన్నారు. సిల్క్యారా సొరంగంలో మట్టి శిథిలాలను తవ్వడానికి 12 మంది ర్యాట్–హోల్ మైనింగ్ నిపుణులను రప్పించారు. ఎప్పుడేం జరిగింది? నవంబర్ 12 దీపావళి పండుగ రోజే ఉదయం 5.30 గంటలకు సిల్క్యారా–దందల్‌గావ్ మధ్య నిర్మాణంలో ఉన్న సొరంగం కూలిపోయింది. 41 మంది కార్మికులు అందులో చిక్కుకుపోయారు. అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. సొరంగంలోకి ఎయిర్–కంప్రెస్డ్ పైపుల ద్వారా ఆక్సిజన్, విద్యుత్, ఆహార పదార్థాలు పంపించడానికి ఏర్పాట్లు చేశారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, బీఆర్ఓ, ఎన్హెచ్ఐడీసీఎల్, ఐటీబీపీ తదితర సంస్థలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. నవంబర్ 13 సొరంగంలో ఉన్న కార్మికులతో మాట్లాడేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఆక్సిజన్ కోసం ఉద్దేశించిన పైపుల గుండా అధికారులు మాట్లాడారు. క్షేమంగా ఉన్నామని కార్మికులు బదులిచ్చారు. అదేరోజు సొరంగం పైభాగం నుంచి మట్టి కూలింది. టన్నెల్ లోపల 60 మీటర్ల మేర మట్టి విస్తరించింది. నవంబర్ 14 దాదాపు 900 మిల్లీమీటర్ల వ్యాసార్ధం ఉన్న స్టీల్ పైపులను సొరంగం వద్దకు చేర్చారు. మట్టి శిథిలాల గుండా సొరంగంలోకి ఈ పైపులను పంపించాలని నిర్ణయించారు. సొరంగంలో పైభాగం నుంచి మరింత మట్టి కూలడం ఆందోళన కలిగించింది. ఇద్దరు కార్మికులు స్వల్పంగా గాయపడ్డారు. నవంబర్ 15 కార్మికులను బయటకు తీసుకురావడానికి డ్రిల్లింగ్ యంత్రంతో తవ్వకం పనులు చేపట్టారు. అవి సవ్యంగా సాగకపోవడంతో అత్యాధునిక అగర్ మెషీన్‌ను రంగంలోకి దింపాలని నిర్ణయించారు. ఢిల్లీ నుంచి విమానంలో తీసుకొచ్చారు. నవంబర్ 16 అగర్ మెషీన్‌తో డ్రిల్లింగ్ పనులు ప్రారంభించారు. నవంబర్ 17 సొరంగంలో 57 మీటర్ల మేర మట్టి శిథిలాలు ఉండగా, 24 మీటర్ల మేర తవ్వకాలు జరిపారు. నాలుగు ఎంఎస్ పైపులను శిథిలాల గుండా పంపించారు. ఐదో పైపునకు అవరోధాలు ఎదురుకావడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. మరో అగర్ మెషీన్‌తో పనులు ప్రారంభించారు. ఐదో పైపును అమర్చే క్రమంలో సొరంగంలో భారీగా పగుళ్ల శబ్ధాలు వినిపించాయి. సొరంగం మొత్తం కుప్పకూలే అవకాశం ఉండడంతో ఆ పనులు వెంటనే నిలిపివేశారు. నవంబర్ 18 1,750 హార్స్పవర్ కలిగిన అమెరికన్ అగర్ మెషీన్ వల్ల టన్నెల్ లోపల ప్రకంపనలు పుట్టుకొస్తున్నట్లు గుర్తించారు. ప్రత్యామ్నాయం కోసం అన్వేíÙంచారు. సహాయక చర్యల్లో ఆలస్యం జరుగుతుండడంతో ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) అధికారులు కూడా రంగంలోకి దిగారు. ఐదు రకాల మార్గాలపై దృష్టి పెట్టారు. టన్నెల్ ఉపరితలం నుంచి లోపలికి నిలువుగా డ్రిల్లింగ్ చేయాలని నిర్ణయించారు. నవంబర్ 19 ఘటనా స్థలంలో సహాయక చర్యలను కేంద్ర మంతి నితిన్ గడ్కరీ స్వయంగా సమీక్షించారు. నిలువుగా కాకుండా అగర్ మెషీన్‌తో అడ్డంగా డ్రిల్లింగ్ చేస్తే బాగుంటుందని సూచించారు. నవంబర్ 20 సహాయక చర్యలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరా తీశారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రితో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. టన్నెల్లో అడ్డంగా డ్రిల్లింగ్ చేస్తుండగా, అగర్ మెషీన్‌కు పెద్ద రాయి అడ్డుపడింది. పనులు నిలిచిపోయాయి. నవంబర్ 21 సొరంగంలో చిక్కుకుపోయిన కార్మికుల మొదటి వీడియోను అధికారులు విడుదల చేశారు. ఆహారం తీసుకుంటూ, ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ కార్మికులు కనిపించారు. తమ కుటుంబ సభ్యులతోనూ వారు మాట్లాడారు. సిల్కియారా వైపు నుంచి అగర్ యంత్రంలో అడ్డంగా డ్రిల్లింగ్ పనులను అధికారులు పునఃప్రారంభించారు. నవంబర్ 22 800 వ్యాసార్ధం కలిగిన స్టీల్ పైపులను శిథిలాల గుండా 45 మీటర్ల వరకు పంపించారు. మరో 12 మీటర్లే మిగిలి ఉంది. ఇంతలో మరో అవాంతరం వచ్చిపడింది. అగర్ మెషీన్‌కు కొన్ని ఇనుప కడ్డీలు అడ్డం వచ్చాయి. నవంబర్ 23 అడ్డంగా ఉన్న ఐరన్ రాడ్లను తొలగించారు. శిథిలాల్లో అడ్డంగా 48 మీటర్ల మేర డ్రిల్లింగ్ పూర్తయ్యింది. ఇక్కడ మరో ఉపద్రవం తప్పలేదు. అగర్ మెషీన్‌ను ఏర్పాటు చేసిన వేదికకు పగుళ్లు వచ్చాయి. నవంబర్ 24 పగుళ్లను సరిచేసి, డ్రిల్లింగ్ మళ్లీ ప్రారంభించారు. ఈసారి మెటల్ గిర్డర్ అడ్డుపడింది. దాన్ని తొలగించారు. నవంబర్ 25 అగర్ మెషీన్ బ్లేడ్లు శిథిలాల్లో ఇరుక్కున్నాయి. దీంతో రెస్క్యూ ఆపరేషన్ పూర్తి కావడానికి మరికొన్ని వారాలు పడుతుందని భావించారు. మరో 12 మీటర్ల మేర డ్రిల్లింగ్ మిగిలి ఉంది. కానీ, ఆ పనులు ఆపేయాలని నిర్ణయించారు. నవంబర్ 26 కార్మికులను క్షేమంగా బయటకు తీసుకురావడానికి ప్రత్యామ్నాయ మార్గం కోసం 19.2 మీటర్ల మేర నిలువుగా డ్రిల్లింగ్ పూర్తిచేశారు. 700 మిల్లీమీటర్ల వ్యాసార్ధం కలిగిన పైపులు పంపించే పనులు ప్రారంభించారు. నవంబర్ 27 12 మీటర్ల మేర డ్రిల్లింగ్ కోసం ర్యాట్–హోల్ మైనింగ్ నిపుణులను రప్పించారు. అదే సమయంలో టన్నెల్ పై భాగం నుంచి నిలువుగా డ్రిల్లింగ్ 36 మీటర్ల మేర పూర్తయ్యింది. నవంబర్ 28 సాయంత్రం 7 గంటలకల్లా డ్రిల్లింగ్ ఆపరేషన్ మొత్తం పూర్తయ్యింది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది స్టీల్ పైపు గుండా కార్మికుల వద్దకు చేరుకున్నారు. వీల్డ్–్రస్టెచ్చర్లపై ఒక్కొక్కరిని భద్రంగా బయటకు తీసుకొచ్చారు. -
సిక్కిం వరదలు.. 26కు చేరిన మరణాలు
గ్యాంగ్‌టక్: సిక్కింలోని తీస్తా నదికి బుధవారం సంభవించిన ఆకస్మిక వరదల్లో గల్లంతైన వారి ఆచూకీ కోసం ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు నిరి్వరామంగా గాలిస్తున్నాయి. ఇప్పటి దాకా 26 మృతదేహాలను వెలికి తీశారు. ఇందులో ఏడుగురు జవాన్ల మృతదేహాలున్నాయి. బర్దంగ్ ఏరియాలో సంభవించిన వరదల్లో 23 మంది ఆర్మీ సిబ్బంది గల్లంతైన విషయం తెలిసిందే. జవాన్లు సహా మొత్తం 143 మంది జాడ తెలియాల్సి ఉంది. జల దిగ్బంధానికి గురైన మొత్తం 2,413 మందిని రక్షించి, సహాయక శిబిరాలకు తరలించామని అధికారులు చెప్పారు. బర్దంగ్ ప్రాంతంలో ఇసుక మేటను తొలగించి ఆయుధ డిపోను వెలికితీసినట్లు రక్షణ శాఖ తెలిపింది. అన్వేషణ కార్యకలాపాల్లో స్పెషల్ రాడార్లు, జాగిలాలను రప్పించామని తెలిపింది. సింగ్టమ్–బర్దంగ్ మధ్య ధ్వంసమైన రహదారిని వాహనాల రాకపోకలకు వీలుగా పునరుద్ధరించినట్లు తెలిపింది. ఇలా ఉండగా, రాష్ట్రానికి అవసరమైన సాయం అందజేస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారని సీఎం తమాంగ్ చెప్పారు. అడ్వాన్సుగా రూ.44.8 కోట్లు విడుదల చేస్తున్నట్లు హోం మంత్రి అమిత్ షా చెప్పారన్నారు. ఆకస్మిక వరద నష్టం అంచనాకు హోం శాఖ, ఇతర విభాగాల అధికారులతో కూడిన బృందాన్ని కూడా పంపుతామని అమిత్ షా తెలిపినట్లు సీఎం వెల్లడించారు. -
Andhra Pradesh: వరద ప్రాంతాల్లో వేగంగా సాయం
సాక్షి, అమరావతి / సాక్షి నెట్వర్క్: గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ముంపు బారిన పడిన జిల్లాల్లోని 211 గ్రామాల ప్రజల కోసం ప్రభుత్వం 74 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసింది. 46,170 మంది బాధితులను అక్కడికి యుద్ధ ప్రాతిపదికన తరలించింది. అత్యధికంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 51 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి అక్కడికి 43,587 మందికి తాత్కాలికంగా పునరావాసం కల్పించారు. ఏలూరు జిల్లాలో 4 కేంద్రాల్లోకి 1,528 మందిని, బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 18 కేంద్రాలకు 758, తూర్పుగోదావరి జిల్లాలో ఒక కేంద్రం ఏర్పాటు చేసి 306 మందిని తరలించారు. ఆయా ప్రాంతాల్లో తక్షణ వైద్య సౌకర్యం కల్పించేందుకు 68 వైద్య శిబిరాలు నెలకొల్పారు. మొత్తం 178 బోట్లు, 10 లాంచీలను సహాయక చర్యల కోసం ఏర్పాటు చేశారు. ఐదు జిల్లాలకు ప్రభుత్వం తక్షణ అవసరాల కోసం రూ.12 కోట్లు విడుదల చేయడంతో పునరావాసకేంద్రాల ఏర్పాటు, బాధితుల తరలింపు, వారికి అవసరమైన ఆహారం, తాగు నీరు ఇతర సౌకర్యాల కల్పన వేగంగా జరిగింది. ఐదు జిల్లాల్లో మొత్తం 26 మండలాల్లోని 211 గ్రామాలపై గోదావరి వరద ముంపు ప్రభావం పడినట్లు నిర్ధారించి, ముందస్తు సహాయక చర్యలు చేపట్టారు. అత్యధికంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 96 గ్రామాలు ప్రభావితమయ్యాయి. ఈ నేపథ్యంలో 10 ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను వరద ప్రభావిత ప్రాంతాల్లో అందుబాటులో ఉంచారు. ఏలూరు జిల్లా వేలేరుపాడు, కుక్కునూరులో రెండు, అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని మామిడికుదురు, అయినవిల్లి, ముమ్మిడివరం, ఐ పోలవరంలో ఒక్కొక్కటి చొప్పున ఎన్టీఆర్ఎఫ్ బృందాలను అందుబాటులో ఉంచారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో కూనవరం, చింతూరు, పి గన్నవరం, అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పి గన్నవరం, ఏలూరు జిల్లాలోని వేలేరుపాడులో ఒక్కొక్కటి చొప్పున ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచారు. ఇప్పటికే ఆ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. వరద ప్రభావిత ప్రాంతాల పరిస్థితిని తాడేపల్లిలోని విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్టేట్ ఎమర్జెన్సీ సెంటర్ నుంచి నిరంతరం అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఆయా జిల్లాలకు ఎప్పటికప్పుడు అవసరమైన సూచనలు జారీ చేస్తున్నారు. ఎక్కడికక్కడ పర్యవేక్షణ ♦ వరద తాకిడికి గురైన చింతూరు, వీఆర్‌పురం, కూనవరం ఎటపాక మండలాల్లోని వరద ప్రభావిత గ్రామాల ప్రజలకు సంబంధించి ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో బాధితులకు తాగునీటితో పాటు వాడుక నీటి సౌకర్యం కల్పించారు. విద్యుత్ అందుబాటులో లేని ప్రాంతాల్లో జనరేటర్ సౌకర్యం కల్పించారు. బాధితులకు నిత్యావసరాలతో పాటు కూరగాయలు, పాలు అందిస్తున్నారు. అంటువ్యాధులు ప్రబలకుండా కేంద్రాల పరిసరాల్లో బ్లీచింగ్, ఫాగింగ్ వంటి పారిశుధ్య చర్యలు చేపట్టారు. గ్రామ సచివాలయ సిబ్బంది, గ్రామ వలంటీర్లను అందుబాటులో వుంచారు. ఎక్కడికక్కడ వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. ప్రత్యేక అధికారులు, మండల స్థాయి అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ♦ చింతూరు మండలంలో బాధితులకు కూరగాయలు, పాలతో పాటు కొవ్వొత్తులు పంపిణీ చేశారు. కిరోసిన్ పంపిణీకి కలెక్టర్ ఏర్పాట్లు చేస్తున్నారు. సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకుంటున్న వారికి 10 వేల టార్పాలిన్లను సిద్ధం చేస్తున్నారు. కూనవరం మండలంలో 12, వీఆర్‌పురం మండలంలో 10, చింతూరు మండలంలో 8 మర పడవలను సహాయక చర్యలకు వినియోగిస్తున్నారు. ఇళ్లు దెబ్బతిన్న వారికి పరిహారం పంపిణీ చేసేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ♦ వరద ముంపు ప్రాంతాలకు లాంచీలు, పడవల ద్వారా కూరగాయలను పంపించారు. చింతూరు జీసీసీ గోడౌను నుంచి వీఆర్‌పురం, కూనవరం మండలాలకు మూడు టన్నుల చొప్పున ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, రెండు టన్నుల చొప్పున వంకాయలు, దొండకాయలు పంపించారు. నడి గోదావరిలో ఆరుగురు గర్భిణుల తరలింపు నడి గోదావరిలో శనివారం రాత్రి 10.30 గంటలకు బోట్‌పై ఆరుగురు గర్భిణులను ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఏలూరు జిల్లా వేలేరుపాడు మండల కేంద్రానికి తరలించాయి. డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓ రాజీవ్ వేలేరుపాడు మండలంలో అత్యంత మారుమూల గ్రామాలైన టేకుపల్లి, టేకూరు గ్రామాల్లో ఆరుగురు గర్భిణులను గుర్తించారు. వీరిని వెంటనే పునరావాస కేంద్రానికి తరలించేందుకు బోట్‌పై ప్రయత్నించగా, తిర్లాపురం గ్రామానికి వచ్చేసరికి చీకటి పడి అక్కడే బోట్ ఆగిపోయింది. దీంతో ఎన్డీఆర్ఎఫ్ బృందానికి సమాచారం అందించారు. రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ ఇన్స్పెక్టర్ మోహన్‌యాదవ్, మిగిలిన బృంద సభ్యులు.. ఆరుగురు గర్భిణులను వేలేరుపాడుకు తరలించారు. అక్కడి నుంచి అంబులెన్స్‌లో జంగారెడ్డిగూడెం ఆసుపత్రికి వారిని తీసుకెళ్లారు. నిత్యావసర వస్తువుల పంపిణీ ♦ పశ్చిమగోదావరి జిల్లాలోని ఆచంట మండలంలో అయోధ్య లంక, మర్రిమూల, పెదమల్లం గ్రామాల్లో మాజీ మంత్రి, ఆచంట ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు పర్యటించి, బాధితులకు భరోసా ఇచ్చారు. యలమంచిలి మండలంలోని లంక గ్రామాలైన దొడ్డిపట్ల, కనకాయలంక, పెదలంక, లక్ష్మీపాలెం, ఏనుగువాని లంక, బాడవ గ్రామాలు ముంపు బారిన పడ్డాయి. పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి లంక గ్రామాల్లో పర్యటించారు. ♦ ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలో 35 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. శనివారం రాత్రి ఇళ్లలోకి వరద నీరు చేరుతుండటంలో ఐదు గ్రామాలు నీటమునిగాయి. పాత నార్లవరం, ఎడవల్లి, టేకూరు, రుద్రమకోట, వేలేరుపాడు సంతబజారుల్లో 30 ఇళ్ల వరకు నీటమునగడంతో జనం పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. వీరందరికీ భోజన వసతి కల్పించారు. వేలేరుపాడులో పది దేశీయ బోట్లు, రెండు పెద్ద బోట్లు, మరో రెండు ఫైర్ బోట్లు వినియోగిస్తున్నారు. వరద బారిన పడిన కుటుంబాలన్నిటికీ ఆదివారం 3900 లీటర్ల వంట నూనె, 4 వేల కేజీల కందిపప్పు, కుటుంబానికి 25 కేజీల బియ్యం, కూరగాయలు పంపిణీ చేయనున్నారు. నూజివీడు సబ్ కలెక్టర్ ఆదర్‡్ష రాజేంద్రన్, జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ఝాన్సీ దగ్గరుండి వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. ♦ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పలు గ్రామాల్లో ఇళ్ల మధ్య వరద చేరింది. స్థానికులు పడవల మీద రాకపోకలు సాగిస్తున్నారు. అధికార యంత్రాంగం ప్రజలకు నిత్యావసర వస్తువులు అందజేశారు. వైద్య సేవలకు ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర రవాణా శాఖమంత్రి పినిపే విశ్వరూప్ అల్లవరం మండలం బోడసుకుర్రు పల్లిపాలెంలో పునరావస కేంద్రంలో బాధితులతో మాట్లాడారు. వారి కోసం తయారు చేసిన భోజనాన్ని పరిశీలించారు. జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణు గోపాలరావు, ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబులు మామిడికుదురు, అయినవిల్లి మండలాల్లో పర్యటించి వరద ఉధృతిని పరిశీలించారు. ♦ అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతూరు, కూనవరం, వీఆర్‌పురం, ఎటపాక మండలాల్లోని పలు గ్రామాల్లోకి వరదనీరు ప్రవేశిస్తోంది. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌కు రాకపోకలు నిలిచిపోయాయి. రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి, ఎమ్మెల్సీ అనంత ఉదయ్‌భాస్కర్ శనివారం కూనవరం, వీఆర్‌పురం మండలంలో వరదముంపు ప్రాంతాల్లో పర్యటించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని 30 పాఠశాలలకు సోమవారం సెలవు ప్రకటించారు. దెబ్బతిన్న ఇళ్లకు పరిహారం పెంపు సాక్షి, అమరావతి: గోదావరి వరద ముంపు గ్రామాలకు చెందిన బాధితులు పునరావాస కేంద్రాల నుంచి తిరిగి ఇళ్లకు వెళ్లేటప్పుడు ప్రత్యేక ఆర్థిక సాయం కింద రూ.1,000 నుంచి రూ.2,000 వరకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో సీఎం వైఎస్ జగన్ నిర్వహించిన సమీక్షలో ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ సొమ్మును పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలకు ఆర్ధికసాయంపై రెవిన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. అదే విధంగా ఈ జిల్లాల్లో ముంపునకు గురైన కుటుంబాలకు ఉచితంగా 25 కేజీల బియ్యం, కేజీ కందపప్పు, లీటర్ పామాయిల్, కేజీ ఉల్లిపాయలు, కేజీ బంగాళాదుంపలు ఇవ్వాలని మరో ఉత్తర్వు జారీ చేశారు. ఈ సరుకులను సమకూర్చాల్సిందిగా మార్కెటింగ్‌కు ఆదేశాలిచ్చారు. దెబ్బతిన్న, పాడైన ఇళ్లకు ఇచ్చే పరిహారాన్ని సీఎం జగన్ ఆదేశాల మేరకు రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతూ మరో ఉత్తర్వు జారీ చేశారు. -
వరద బీభత్సం: ములుగు జిల్లాలో 8 మంది మృతి
సాక్షి, ములుగు జిల్లా: వరదలతో ములుగు జిల్లాలో 8 మంది మృతి చెందగా, మరో 8 మంది గల్లంతయ్యారు. జంపన్న వాగు వరద ఉధృతితో కొండాయి గ్రామం జల దిగ్భంధంలో చిక్కుకుంది. గ్రామంలోని 150 మందికి హెలికాఫ్టర్ ద్వారా ఆహారం, మెడిసిన్ సరఫరా చేశారు. వరద ఉధృతితో కొండాయి గ్రామానికి ప్రత్యేక బృందాలు వెళ్లలేకపోతున్నాయి. గుండ్లవాగు వద్ద జాతీయ రహదారిపై బిడ్జ్రి కొట్టుకుపోవడంతో రాకపోకలు బంద్ అయ్యాయి. రికార్డు స్థాయిలో వెంకటాపూర్ మండలంలో 70 సెం.మీ వర్షపాతం నమోదైంది. జంపన్న వాగు దాటే క్రమంలో నలుగురు గల్లంతయ్యారు. ఐదుగురిని ఎన్డీఆర్ఎఫ్ కాపాడారు. వర్షం, వరదలు ఉమ్మడి వరంగల్ జిల్లాకు అపారనష్టం మిగిల్చింది. 14 మంది మృతి చెందగా మరో 8 మంది గల్లంతయ్యారు. అనేక గ్రామాలు, గ్రేటర్ వరంగల్ పరిధిలోని 40 కాలనీలు జలదిగ్బంధంలో ఉన్నాయి. వర్షం, వరదలు తగ్గుముఖం పట్టడంతో సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ముంపు ప్రాంతాల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పర్యటించి బాధితులకు భరోసా కల్పించారు. గ్రేటర్ వరంగల్ లో పలు కాలనీలు నీటమునగడానికి కబ్జాలు అక్రమ నిర్మాణాలే కారణమని మంత్రి అన్నారు. చదవండి: ఎంపీ వివరాలు అడిగితే ఇవ్వకపోవడమేంటి?: హైకోర్టు గోదావరికి ఎగునున్న ప్రాజెక్టుల నుంచి ఉధృతంగా నీరు రావడంతో ఈ రోజు సాయంత్రం వరకు భద్రాచలం వద్ద గోదావరి 60 అడుగులకు చేరే అవకాశం ఉందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రియాంక అన్నారు. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు. ముంపుకు గురయ్యే ప్రాంత ప్రజలు జాప్యం చేయక యంత్రాంగానికి సహకరించి పునరావాస కేంద్రాలకు రావాలని సూచిస్తున్నారు. అలాగే వాగులు, వంకలు దాటే ప్రయత్నం చెయొద్దని, అత్యవసరమైతే కంట్రోల్ రూంలకు కాల్ చేయాలన్నారు. ఏమైనా ప్రమాదాలు ఏర్పడినప్పుడు వెంటనే అధికారులకు తెలియజేయాలని, జలాశయాల వద్దకు ప్రజలు రావద్దని సూచించారు. వరద నిలిచిన రహదారుల్లో రవాణా నియంత్రణకు ట్రాక్టర్లను అడ్డు పెట్టాలని అధికారులను ఆదేశించారు కలెక్టర్ ప్రియాంక. -
10,696 మంది తరలింపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ముంపునకు గురైన 108 గ్రామాల నుంచి 10,696 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని ప్రభుత్వ ప్రధా న కార్యదర్శి శాంతికుమారి తెలి పారు. భూపాలపల్లి జిల్లాలోని మోరంచ వాగు ఉప్పొంగడంతో మోరంచపల్లి గ్రామం పూర్తిగా నీట మునిగిందని, అక్కడికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపించి 600 మందిని, మంథనిలోని గోపాల్పూర్ ఇసుక క్వారీ లో చిక్కుకున్న 19 మంది కార్మికులను సుర క్షిత ప్రాంతాలకు తరలించామని చెప్పారు. ఆర్మీ హెలికాప్టర్‌ను మోరంచపల్లికి పంపించి అక్కడ చిక్కుకున్న ఆరుగురిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చామన్నారు. మరో 4 హెలికాప్టర్లు, 10 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపాల్సిందిగా కేంద్రాన్ని కోరామన్నారు. డీజీపీ అంజనీ కుమార్‌తో కలిసి గురువారం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎస్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాల్లోని అన్ని పీహెచ్ సీలు, సీహెచ్‌సీలు, జిల్లా ఆసుపత్రులు, ప్రైవేటు ఆసుప త్రులను 24 గంటలు తెరచి ఉంచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు ఖమ్మం పట్టణానికి ఒక ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని, బూరు గుంపాడుకు హెలికాప్టర్‌ను వెంటనే పంపిస్తున్నామని తెలిపారు. ప్రయా ణికులు చిక్కుకున్న రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, రహదారుల్లో సహాయ కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. ప్రత్యేకాధికారులుగా ఐఏఎస్‌లు... వరద ప్రభావిత జిల్లాలకు పలువురు ఐఏఎస్ అధికారులను ప్రత్యేకాధికారులుగా ప్రభుత్వ ం నియమించింది. ములుగుకు కృష్ణ ఆదిత్య, భూపాలపల్లికి పి.గౌతమ్, నిర్మల్‌కు ముషా రఫ్ అలీ, మంచిర్యాలకు భారతి హోలికేరి, పెద్దపల్లికి సంగీత సత్యనారాయణ, ఆసిఫా బాద్‌కు హన్మంతరావును కేటాయించింది. వరద చూసేందుకు వెళ్లి చిక్కుకుంటున్నారు వర్షాల నేపథ్యంలో ప్రజలు నీటి ప్రవాహం ఉన్న రోడ్లు, కల్వర్టులు, బ్రిడ్జీలపై ప్రయాణించ వద్దని సీఎస్ సూచించారు. చాలాచోట్ల వరద పరిస్థితులను చూసేందుకు వెళ్లినవారు అనూ హ్యంగా ప్రమాదాల్లో చిక్కుకుంటున్నారని చెప్పారు. ప్రత్యేక కంట్రోల్ రూమ్.. సహాయ, పునరావాస కార్యక్రమాల పర్య వేక్షణకు ముగ్గురు సీనియర్ అధికారులతో సచివాలయంలో 7997950008, 7997 959782, 040 – 23450779 అనే ఫోన్ నంబర్లతో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశామని సీఎస్ తెలిపారు. అన్ని జిల్లా కలెక్టరేట్లలోనూ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశామన్నారు. ములుగు జిల్లా ముత్యాలధార జలపాతంలో చిక్కుకుపో యిన 80 మంది పర్యాటకులను బుధవా రం రాత్రి ఒంటి గంట ప్రాంతంలో సురక్షి తంగా బయటకు తెచ్చామని తెలిపారు. -
ములుగు NDRF రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్
సాక్షి, ములుగు: ఉత్కంఠకు తెర దించుతూ పర్యాటకులందరినీ ఎన్డీఆర్ఎఫ్ రక్షించింది. ములుగు అడవుల్లో చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్ అయినట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రకటించారు. వీరభద్రం అడవుల్లో చిక్కుకున్న మొత్తం పర్యాటకులంతా క్షేమంగా ఉన్నట్లు ప్రకటించారు. వర్షాకాలం సీజన్ కావడంతో వీరభద్రం గ్రామం సమీపంలోని ముత్యంధార Muthyaladhara Waterfall జలపాతం చూసేందుకు వెళ్లి.. తిరుగు ప్రయాణంలో నీటి ప్రవాహం పెరగడంతో కొందరు పర్యాటకులు అడవుల్లో చిక్కుకుపోయారు. దీంతో వీలైనంత త్వరగా వాళ్లను రక్షించాలని మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను అప్రమత్తం చేశారు. ఈ తరుణంలో పోలీసులతో పాటు రెస్క్యూ టీం వాళ్లను రక్షించే యత్నం చేశారు. కానీ, వీలుకాలేదు. దీంతో ఎన్డీఆర్ఎఫ్ రంగంలోకి దిగింది. దాదాపు ఎనిమిది గంటలపాటు శ్రమించిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వాళ్లను రక్షించారు. బాధితులను అంకన్నగూడెంకు చేర్చగా.. అక్కడి జిల్లా కలెక్టర్, ఎస్పీ వాళ్లను రిసీవ్ చేసుకున్నారు. ముత్యంధార జలపాతం దేశంలోనే అతిపెద్ద జలపాతాల్లో ఒకటిగా పేరుంది. జూలై నుండి సెప్టెంబర్ వరకు వర్షాకాలం సీజన్లో దీనిని చూసేందుకు జనం ఎక్కువగా వస్తుంటారు. వీరభద్రం గ్రామం నుంచి ట్రెక్కింగ్ ద్వారా ఈ జలపాతానికి చేరుకుంటారు పర్యాటకులు. -
అప్రమత్తంగా ఉండండి
సాక్షి, హైదరాబాద్:రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటం, గోదావరి నది ఉగ్రరూపం దాల్చడం నేపత్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగాన్ని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఉన్నతాధికారులను అప్రమత్తం చేస్తూ, తక్షణ చర్యలకు ఉపక్రమించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి సూచించారు. భద్రా చలంలో ముంపునకు గురయ్యే అవకాశాలున్న లోతట్టు ప్రాంతాల ప్రజలను యుద్ధ ప్రాతిపదికన సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని.. గతంలో వరదల సందర్భంగా సమర్థవంతంగా పనిచేసిన అధికారుల సేవలను వినియోగించు కోవాలని చెప్పారు. సహాయక చర్యల కోసం హెలికాప్టర్లు, ఎన్డీఆర్ఎఫ్ దళాలను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఇక తక్షణమే భద్రాచలం వెళ్లి అక్కడి పరిస్థితులకు అనుగుణంగా సహాయక చర్యలు చేపట్టాలని హైదరాబాద్ కలెక్టర్ దుర్శెట్టి అనుదీప్‌ను సీఎం ఆదేశించారు. రాష్ట్ర సచివాలయం, కొత్తగూడెం కలెక్టరేట్, భద్రాచలం తహసీల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూంలను ఏర్పాటు చేయాలన్నారు. ఎలాంటి పరిస్థితులు తలెత్తినా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సీఎస్, డీజీపీ సమీక్ష సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సీఎస్ శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్‌తో కలసి గోదావరి పరీవాహక జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. భారీ వర్షాలు, గోదావరి వరద నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని శాంతికుమారి ఆదేశించారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలను, సరిపడా మందులు, విద్యుత్ పరికరాలను సిద్ధంగా ఉంచాలని సూచించారు. ఏవిధమైన సహాయ, సహకారాలైనా రాజధాని నుంచి అందించేందుకు సిద్ధంగా ఉన్నామని.. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. గోదావరి పరీవాహక ప్రాంతాల పోలీసు అధికారులతో ఇప్పటికే సమీక్షించామని.. సహాయ కార్యక్రమాలకు అవసరమైన ఏర్పాట్లు చేశామని డీజీపీ అంజనీకుమార్ చెప్పారు. ఐజీ చంద్రశేఖర్‌రెడ్డిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వెంటనే వెళ్లి పరిస్థితులను సమీక్షించాలని ఆదేశించామని వెల్లడించారు. ‘అవసరమైతే హెలికాప్టర్ సేవలు’ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటం, గోదావరి ఉగ్రరూపం దాల్చడం నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగాన్ని సీఎం కేసీఆర్ ఆదేశించారు. సంబంధిత శాఖల ఉన్నతాధికారులను అప్రమత్తం చేస్తూ తక్షణ చర్యలకు ఉపక్రమించాలని సీఎస్ శాంతికుమారికి సూచించారు. భద్రాచలంలో ముంపునకు గురయ్యే అవకాశాలున్న లోతట్టు ప్రాంతాల ప్రజలను యుద్ధప్రాతిపదికన సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని.. గతంలో వరదల సందర్భంగా సమర్థంగా పనిచేసిన అధికారుల సేవలను వినియోగించుకోవాలని చెప్పారు. సహాయక చర్యల కోసం హెలికాప్టర్లు, ఎన్డీఆర్ఎఫ్ దళాలను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఇక తక్షణమే భద్రాచలం వెళ్లి అక్కడి పరిస్థితులకు అనుగుణంగా సహాయక చర్యలు చేపట్టాలని హైదరాబాద్ కలెక్టర్ దుర్శెట్టి అనుదీప్‌ను సీఎం ఆదేశించారు. ‘వారం రోజులు నిరసనలు వాయిదా’ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో బీఆర్ఎస్ చేపట్టిన రైతు నిరసనలను వారం రోజులు వాయిదా వేస్తున్నట్లు ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీ రామారావు ప్రకటించారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మూడు గంటల కరెంటు విధానానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసన కార్యక్రమాలను భారీ వర్షాల నేపథ్యంలో వారంపాటు వాయిదా వేయాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఈ మేరకు కేటీఆర్ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత రైతులందరినీ కలుపుకొని కాంగ్రెస్ పార్టీ విధానాలను ఎండగట్టేలా నిరసన కార్యక్రమాలను పార్టీ కొనసాగిస్తుందని తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు, రైతులకు ఈ వారం రోజులపాటు అండగా ఉండాలని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను, నాయకులను, కార్యకర్తలను కేటీఆర్ కోరారు. -
తుపాన్లు తలొంచుతున్నాయ్..! వారం రోజుల ముందే హెచ్చరికలతో..
మాండాస్, సిత్రాంగ్, అసానీ, గులాబ్, బిపర్ జోయ్. పేరు ఏదైనా కానివ్వండి ఆ తుపాను ఎంత తీవ్రమైనదైనా కానివ్వండి మనం తట్టుకొని నిలబడుతున్నాం. 1990,–2000నాటి పరిస్థితి ఇప్పుడు లేదు. ఒకప్పుడు తుపాన్లు, వరదలంటే భారీగా ప్రాణ నష్టాలే జరిగేవి. ఇప్పుడు ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. సాంకేతిక పరిజ్ఞానం పెరగడంతో ముందస్తుగా తుపాన్లను గుర్తించి పకడ్బందీగా చర్యలు తీసుకోవడంతో సత్ఫలితాల్ని ఇస్తోంది. గుజరాత్లో ఏకంగా లక్ష మందిని సురక్షిత ప్రాంతాలకు యుద్ధ ప్రాతిపదికన తరలించడంతో ఒక్కరంటే ఒక్కరు కూడా ప్రాణాలు కోల్పోలేదు. తుపాన్ల సన్నద్ధతలో ఒడిశా ఇతర రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా నిలుస్తోంది. ఆ రాష్ట్ర చర్యలకు ఐక్యరాజ్య సమితి కూడా శభాష్ అనడం విశేషం. అది 1999 సంవత్సరం అక్టోబర్ 29. ఒడిశా ప్రజలకు అదో కాళరాత్రి. పారాదీప్ సూపర్ సైక్లోన్ రాష్ట్రంపై విరుచుకుపడింది. సముద్రం అలల ధాటికి 14 జిల్లాల్లో భారీ విధ్వంసం జరిగింది. జగత్సింగ్పూర్ జిల్లాకి జిల్లాయే తుడిచిపెట్టుకుపోయింది. తుపాను దెబ్బకి 10 వేల మంది జలసమాధి అయ్యారని అధికారిక లెక్కలే చెబుతున్నాయి. 30 వేల మంది వరకు ప్రాణాలు పోగొట్టుకుని ఉంటారని ఒక అంచనా. అప్పట్లో భారత వాతావరణ కేంద్రం దగ్గర ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేదు. దీంతో తుపాను ముంచుకొస్తోందని కేవలం 48 గంటల ముందు మాత్రమే తెలిసింది. వాతావరణ శాఖ అధికారులు ఒడిశా ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసినప్పటికీ సన్నద్ధత లేని కారణంగా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 10 వేలు నుంచి 30 వేల మంది మరణిస్తే, 3.5 లక్షల ఇళ్లు ధ్వంసమయ్యాయి. గ్రామాలకు గ్రామాలే నీళ్లలో కొట్టుకుపోయాయి. 25 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. రెండు లక్షల జంతువులు మరణించాయి. గంటకి 250 కి.మీ. వేగంతో ప్రచండ గాలులు వీయడంతో కమ్యూనికేషన్ వ్యవస్థ నాశనమైంది. ఒడిశాతో ఇతర ప్రాంతాలకు సంబంధాలు తెగిపోయాయి. ఈ పెను విధ్వంసంతో అప్పటి ఒడిశా ముఖ్యమంత్రి గిరిధర్ గొమాంగో తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. తుపాన్లు ఎదుర్కోవడంలో నవీన పంథా సూపర్ సైక్లోన్ ముంచెత్తిన తర్వాత సంవత్సరం 2000లో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన నవీన్ పట్నాయక్ తుపాన్లు ఎదుర్కోవడంపైనే ప్రధానంగా దృష్టి సారించారు. సూపర్ సైక్లోన్ తుపాను బీభత్సం నుంచి అప్పటికి ఇంకా రాష్టం కోలుకోలేదు. భౌగోళికంగా ఒడిశా తుపాన్ల తాకిడిని తప్పించుకోవడం అసాధ్యం. 1891 నుంచి 100కి పైగా తుపాన్లు ఒడిశాను వణికించాయి. ఈ విషయాన్ని గుర్తించిన సీఎం నవీన్ పట్నాయక్ ప్రాణ నష్టం జరగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు ► రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో విపత్తు నిర్వహణ సంస్థను ఏర్పాటు చేశారు. ఇలా ఒక రాష్ట్రం విపత్తు నిర్వహణ కోసం ఒక అథారిటీని ఏర్పాటు చేయడం అదే మొదటి సారి. జిల్లాలు, బ్లాక్ స్థాయిలో కూడా విపత్తు కమిటీలు ఏర్పాటు చేశారు. 22 వేల గ్రామాల్లో కమిటీలు ఏర్పాటు చేసి స్థానిక యువకుల్ని సభ్యులుగా నియమించారు. తుపాను హెచ్చరికలు అందిన వెంటనే లోతట్టు ప్రాంతాలను సురక్షిత ప్రాంతాలకు తరలించడమే వీరు చేయాల్సిన పని ► రాష్ట్రంలోని 480 కి.మీ. పొడవైన తీర ప్రాంతంలో ప్రకృతి వైపరీత్యాలు, తుపాన్లపై ప్రజల్ని అప్రమత్తం చేయడానికి 2018లో ప్రభుత్వం ఎర్లీ వార్నింగ్ డిస్సెమినేషన్ సిస్టమ్ (ఈడబ్ల్యూడీఎస్) ఏర్పాటు చేసింది. తుపాన్లు ముంచుకొస్తే లోతట్టు ప్రాంత ప్రజలకి కనీసం అయిదారు రోజుల ముందే హెచ్చరికలు అందుతాయి. ► తీర ప్రాంతాల్లో నివసించే వారందరికీ పక్కా ఇళ్లు నిర్మించి ఇచ్చింది ► ఒడిశా డిజాస్టర్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌లో బాగా విస్తరించి సుశిక్షితులైన సిబ్బందిని 20 రెట్లు పెంచింది. వారి దగ్గర 66 రకాల ఆధునిక పరికరాలు అంటే జనరేటర్లు, చెట్లను కట్ చేసే, రోడ్లను శుభ్రం చేసే యంత్రాలు, పడవలు, ఫస్ట్ ఎయిడ్ మెడికల్ వంటివి ఎప్పుడూ ఉండేలా చర్యలు తీసుకుంది. ► 1999 సూపర్ సైక్లోన్ సమయం నాటికి ఒడిశాలో కేవలం ఆరు జిల్లాల్లో కేవలం 23 శాశ్వత తుపాను శిబిరాలు ఉండేవి. తీర ప్రాంతాల్లో అడుగడుక్కీ బహువిధాలుగా ఉపయోగపడే శిబిరాలు నిర్మించారు. ఇప్పుడు వాటి సంఖ్య 870కి చేరుకుంది. ఒక్కో శిబిరంలో వెయ్యి మంది వరకు తలదాచుకునేలా ఏర్పాట్లు ఉన్నాయి. ఐక్యరాజ్యసమితి ప్రశంసలు 2013 సంవత్సరంలో ఫాలిని అత్యంత తీవ్రమైన తుపానుగా ఒడిశాను ముంచెత్తింది. అప్పుడు భారీగా ప్రాణ నష్టం జరుగుతుందని ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఆ తుపాను సమయంలో లక్షలా ది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో 44 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో ఒడిశా ప్రభుత్వ సహాయక చర్యలకు ఐక్యరాజ్యసమితి ఫిదా అయింది. ఒడిశా ప్రభుత్వం చారిత్రక విజయాన్ని సాధించిందని అభినందించింది. కేంద్రం మూడంచెల వ్యవస్థ బిపర్జోయ్ మహా తుపాను గుజరాత్లో విధ్వంసం సృష్టించినా ప్రాణ నష్టం జరగలేదు. దీనికి తుపాన్లపై ముందస్తు సన్నద్ధతే కారణం. తుపాను ముప్పుని ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం మూడంచెల వ్యవస్థని ఏర్పాటు చేసింది. ఈ వ్యవస్థ పనితీరుతో ఏకంగా లక్ష మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించి ప్రాణాలు కాపాడగలిగారు. తుపాన్లు ఎప్పుడు ఏర్పడతాయి? ఏ దిశగా ప్రయాణిస్తాయి, ఎక్కడ తీరం దాటుతాయన్న అంశాలను వారం రోజులు ముందుగానే గుర్తించే ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ ఉంది. దీంతో లోతట్టు ప్రాంత ప్రజల్లో తుపాన్లపై అవగాహన పెరుగుతుంది. ఇక రెండో అంచెగా శిబిరాల నిర్మాణం, ప్రజల్ని తరలించడం ఒక యుద్ధంలా చేస్తారు. ఇక మూడో దశలో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో అండర్ గ్రౌండ్లో విద్యుత్ లైన్లు, మంచినీటి పైపుల నిర్మాణం, రైల్వే, విమానాశ్రయాల్లో రాకపోకలు సాగేలా ఏర్పాట్లు వంటి వాటిపై దృష్టి పెట్టింది. ఫలితాలు ఇలా..! ప్రకృతి వైపరీత్యాలతో జరిగే ఆర్థిక నష్టాన్ని నివారించలేకపోయినా ప్రాణలైతే కాపాడగలుగుతున్నాం. గత కొద్ది ఏళ్లలో ఒడిశాను అల్లకల్లోలం చేసిన తుపాన్లలో ప్రాణనష్టం తగ్గుతూ వస్తోంది. -
ఒడిశా దుర్ఘటన.. శవాలా గుట్టలు చూశాక ఆకలేస్తుందా?
ఒడిశా బాలాసోర్ రైలు ప్రమాదం దుర్ఘటన.. 278 కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవాళ్లలో మరికొందరి పరిస్థితి విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవైపు ఇంకా వంద దాకా మృతదేహాల్ని గుర్తించాల్సిన పరిస్థితి. ఎంబాంబింగ్ ద్వారా మృతదేహాల్ని ఎంతో కాలం భద్రపర్చలేమని అంటున్నారు అధికారులు. మరోవైపు గుర్తుపట్టలేని విధంగా మారిన మృతదేహాల్లో తమ వారిని వెతుక్కునేందుకు అయినవాళ్లు పడుతున్న ఆరాటం దృశ్యాలు మనసుల్ని కలిచివేస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఇంకోపక్క ఆ మృతదేహాలు తమవాళ్లవేనంటూ నాటకాలతో పరిహారం దక్కించుకునేందుకు కొందరు చేస్తున్న దుర్మార్గ ప్రయత్నాలు సైతం వెలుగు చూస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో.. సహాయక చర్యలు చేపడుతున్న ఎన్డీఆర్ఎఫ్ (NDRF) సిబ్బంది కూడా తీవ్రంగా కలత చెందుతున్నారు. తమ భావోద్వేగాలను ప్రదర్శిస్తున్నారు. నీళ్లను చూసిన ప్రతిసారి దాన్ని రక్తంగా ఒకాయన భావిస్తుంటే.. మరో సిబ్బంది ఆ శవాల గుట్టలను చూశాక ఆకలి కోరికే మరచిపోయారట. ఇలా తమ సిబ్బంది ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడికి సంబంధించిన విషయాలను ఎన్డీఆర్ఎఫ్ డీజీ వెల్లడించారు. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఎన్డీఆర్ఎఫ్ డీజీ అతుల్ కర్వాల్ బాలాసోర్ యాక్సిడెంట్ ఆ పరిస్థితులను వివరిస్తూ.. ‘ఘటనా స్థలాన్ని పరిశీలించడానికి వెళ్లినప్పుడు.. సహాయక చర్యల్లో పాల్గొన్న తమ సిబ్బంది అక్కడి పరిస్థితులను చూసి చలించిపోయారు. నీటిని చూసిన ప్రతిసారి రక్తమేనని ఒక సిబ్బంది భ్రమ పడుతుంటే.. మరొకరు మాత్రం ఆ రెస్క్యూ ఆపరేషన్ తర్వాత ఆకలి కోరికే పోయిందని చెప్పారు. ఇలా మా సిబ్బంది ఎదుర్కొంటున్న ఈ తరహా సవాళ్లను దృష్టిలో పెట్టుకొని వారికి మానసిక నిపుణులతో కౌన్సిలింగ్ ఏర్పాటు చేస్తాం’ అని తెలిపారు. ఒడిశా రైలు ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే రంగంలోకి దిగారు 300మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది. సహాయక చర్యల్లో ముమ్మరంగా పాల్గొన్నారు. వీళ్లకు స్థానికులు కొందరు సహకరించడం గమనార్హం. బోగీల్లో చిక్కుకున్న వారిని బయటకు తీయడంలో ఎన్డీఆర్ఎఫ్ కీలకంగా వ్యవహరించింది. దాదాపు 44 మంది బాధితులను సురక్షితంగా బయటకు తీయగా.. 121 మృతదేహాలను వెలికి తీశారు. విపత్తుల వేళ ఎంతో గుండె నిబ్బరం ప్రదర్శించే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిలో.. కొందరు మానసిక వేదనకు గురవుతున్నట్లు స్వయానా ఎన్డీఆర్ఎఫ్ డీజీ వెల్లడించడం గమనార్హం. ఇదీ చదవండి: ఒడిశా రైలు ప్రమాదంలో 40 మంది కరెంట్ షాక్‌తో మృతి? -
వివిధ సంస్థలు.. బాధితులకు సేవలు
కొరాపుట్/భువనేశ్వర్: రైలు దుర్ఘటన జరిగిన విషయం సామాజిక మాధ్యమాల్లో ప్రసారమైన వెంటనే బాలేశ్వర్, బద్రక్ జిల్లాల యువత స్పందించారు. ఎటువంటి పిలుపు లేకుండానే తమకు తాముగా సాయం అందించేందుకు ముందుకు కదిలారు. బద్రక్, బాలేశ్వర్ జిల్లా కేంద్రాల అస్ప త్రుల వద్దకు చేరుకొని, అవసరమైన క్షతగ్రాతులకు రక్తదానం చేసేందుకు సిద్ధమయ్యారు. రాత్రి నుంచి ఉదయం వరకు క్యూలోనే ఉండి రక్తదానం చేశారు. సుమారు వేయి మంది యువత రక్తదానం చేసి, ప్రాణదాతలుగా నిలిచారు. సత్యసాయి భక్తుల సేవలు రైల్వే దుర్ఘటన జరిగిన వెంటనే సత్యసాయి భక్తుల సేవలు మొదలయ్యాయి. ఘటన జరిగిన వెంటనే సత్యసాయి సేవా సమితి అఖిల భారత సమన్వయకర్త నిమిష్ పాండ్యా, జాతీయ సేవా సమన్వయకర్త కోటేశ్వరరావు వ్యక్తిగతంగా రంగంలోకి దిగారు. వారి సూచనతో సుమారు 70 మంది సత్యసాయి సేవాదళ్ కార్యకర్తలు ఘటనా స్థలానికి చేరుకున్నారు. తాము తెచ్చిన ట్రాక్టర్ల మీద క్షతగాత్రులు, మృతదేహాలను అస్పత్రులకు తరలించారు. వైద్య సిబ్బంది తగినంతమంది లేకపోవడంతో బాధితులకు తామే సపర్యలు చేసి, ప్రాథమిక చికిత్స అందజేశారు. అలాగే బాధితులకు ఆహారం, తాగునీరు అందించి, అందరి మన్ననలు పొందారు. 300 మందిని రక్షించిన ఎన్డీఆర్ఎఫ్ రైలు దుర్ఘటన జరిగిన వెంటనే ఎన్డీఆర్ఎఫ్ దళాలు అత్యంత వేగంగా అప్రమత్తం కావడంతో సుమారు 300 ప్రాణాలు నిలిచాయి. ఘటన జరిగిన నిమిషాల వ్యవధిలో 9 బృందాలు రంగంలోకి దిగాయి. అత్యంత వేగంగా ప్రాణా పాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న 300 మందిని ఆస్పత్రులకు తరలించడంతో ప్రాణాపా యం తప్పింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు పోలీసు జాగిలాలు తోడ్పాటునందించాయి. -
Turkey–Syria Earthquake: శిథిలాల కింద బాధితుల వేదన
ఆంటాక్యా/జందారిస్: ఆశలు అడుగంటుతున్నాయి. శిథిలాల కింద సహాయం కోసం ఆర్తనాదాలు చేస్తున్న వారిని కాపాడగలమన్న నమ్మకం తగ్గిపోతోంది. ఉష్ణోగ్రతలు మైనస్ అయిదు డిగ్రీలకు చేరుకోవడంతో సహాయ చర్యలకి తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఇప్పటివరకు తుర్కియే, సిరియాల్లో 19 వేల మందికి పైగా మరణించారని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఇంకా శిథిలాల కింద లక్షలాది మంది ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు. సహాయ చర్యల్లో లోపాలున్నాయని తుర్కియే అధ్యక్షుడు తయిపీ ఎర్డోగన్ స్వయంగా అంగీకరించారు. ఈ స్థాయిలో ప్రళయం సంభవిస్తే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం అసాధ్యమని వ్యాఖ్యానించారు. భూకంపం వచ్చిన ప్రాంతం దేశంలో ఒక మారుమూల ఉండడంతో సహాయ బృందాలను పంపించడంలో ఆలస్యమైందని అన్నారు. మరోవైపు భూకంపానికి ఇళ్లు కోల్పోయిన వారు వీధుల్లోనే కాలం గడుపుతున్నారు. చలి తట్టుకోలేక వారంతా తీవ్రంగా అవస్థలు పడుతున్నారు. చాలా మంది రాత్రి వేళల్లో రోడ్లపై పార్క్ చేసి ఉంచిన కార్లలో ఉంటున్నారు. ఆ 72 గంటలు ముగిశాయ్..! భూకంపం వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు మొదటి మూడు రోజులే అత్యంత కీలకం. ఈ 72 గంటల్లో ఎంతమందిని కాపాడారన్నదే ముఖ్యం. ఆ తర్వాత శిథిలాలు తొలగించినా ప్రాణాలతో బయటపడేవారి సంఖ్య చాలా తక్కువ. గురువారం ఉదయానికి 72 గంటలు గడిచిపోవడంతో ఇంకెన్ని మరణాలు సంభవిస్తాయోనన్న ఆందోళన అందరిలోనూ నెలకొంది. భూకంపాల సమయంలో మొదటి మూడు రోజుల్లో సర్వ సాధారణంగా 90శాతం మందిని బాధితుల్ని రక్షిస్తారు. మూడు రోజులు దాటితే శిథిలాల కింద ఉన్న వారికి మంచినీళ్లు, ఆహారం అందించాలి. అవి అందక మిగిలిన వారు ప్రాణాలతో బయటపడడం కష్టంగా మారుతుంది. ఆరేళ్ల బాలికను కాపాడిన ఎన్డీఆర్ఎఫ్ బృందం తుర్కియేలో సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్న భారత నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్) శిథిలాల కింద నలిగిపోతున్న ఆరేళ్ల బాలికను కాపాడాయి. మన దేశం నుంచి వెళ్లిన మూడు బృందాలు అలుపెరుగకుండా సహాయ కార్యక్రమాలు అందిస్తున్నాయని కేంద్ర హోంశాఖ ట్వీట్ చేసింది. ‘‘భారత్‌కు చెందిన సహాయ బృందం నర్డగి ప్రాంతంలో ఆరేళ్ల బాలికను కాపాడింది. ఎన్డీఆర్ఎఫ్ చేస్తున్న సహాయానికి గర్వపడుతున్నాం’’ అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ట్వీట్ చేశారు. ఆ బాలికను కాపాడిన వీడియోను కూడా షేర్ చేశారు. హైపోథెర్మియా ముప్పు తుర్కియేలో భూకంపం తీవ్రత ఎక్కువగా ఉన్న అడియమాన్ ప్రావిన్స్‌లో బాధితులు దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. భూకంపం వచ్చి నాలుగు రోజులైనా సహాయ సిబ్బంది ఎవరూ రాలేదని రెసాట్ గొజ్లు అనే బాధితుడు తన గోడు వెళ్లబోసుకున్నాడు. శిథిలాల కింద ఉన్న వారిలో చాలా మంది హైపోథెర్మియా పరిస్థితులతో మరణించారని తెలిపారు. శరీరంలో ఉష్ణం పుట్టే వేగం కంటే, ఉష్ణం కోల్పోయే వేగం ఎక్కువగా ఉంటే దానిని హైపోథెర్మియా అని అంటారు. గట్టకట్టించే చలిలో బాధితుల శరీర ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గిపోయి మరణిస్తారు. దేశమే జరిగింది...! తుర్కియే (టర్కీ)లో సంభవించిన భూకంపం ధాటికి ఆ దేశం భౌగోళికంగా అయిదు నుంచి ఆరు మీటర్లు పక్కకి జరిగి ఉంటుందని భూగర్భ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమి పొరల్లో ఉన్న టెక్టోనిక్ ప్లేట్స్ (ఫలకాలు) తీవ్రమైన రాపిడి కారణంగానే ఇది సంభవించినట్టు తెలిపారు. సిరియాతో పోల్చి చూస్తే తుర్కియేలో రెండు ఫలకాల మధ్య ఏర్పడిన ఒత్తిడి వల్ల రిక్టర్ స్కేలుపై 7.8 తీవ్రతతో భూకంపం కుదిపేసిందని, ఫలితంగా దేశమే కాస్త జరిగిందని ఇటలీకి చెందిన సెసిమాలజిస్ట్ ప్రొఫెసర్ కార్లో డొగ్లోని చెప్పారు. భూ పొరల్లో ఉన్న అనతోలియా ప్లేట్ వాయవ్య దిశగా ఉన్న అరేబికా ప్లేట్ వైపు జరగడంతో ఇలా దేశమే భౌగోళికంగా కదిలే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఒక టెక్టోనిక్ ప్లేట్ పశ్చిమ వైపు, మరో ప్లేట్ తూర్పు వైపు కదలడంతో భారీ భూకంపం సంభవించిందని ఆయన వివరించారు. వాలీబాల్ ఆట కోసం అడియామాన్‌కు వచ్చిన కాలేజీ అమ్మాయిలు, అబ్బాయిలు 39 మంది ప్రాణాలు కోల్పోయినట్టుగా భావిస్తున్నారు. ఫమగుస్తా కాలేజీకి చెందిన ఈ బృందం ఏడంతస్తులున్న ఒక హోటల్లో బస చేశారు. కాపాడడమూ కష్టమే..! భూకంపం శిథిలాల కింద ఉన్నవారిని గుర్తించి వారిని కాపాడడం అంత తేలిౖMðన విషయం కాదు. సహాయ సిబ్బందితో పాటు బాధితులు కూడా సహకరించాలి. అందుకు ఈ ఫొటో నిదర్శనం. తుర్కియేలోని తీవ్ర విధ్వంసం జరిగిన హతేలో ఇంటి పైకప్పు మొత్తం మీద పడిపోవడంతో కాళ్లు కదల్చలేని స్థితిలో అబ్దుల్అలీమ్ అనే వ్యక్తి ఉన్నాడు. అంత పెద్ద శ్లాబుని తొలగించి అతనిని బయటకు తీసుకురావడం సహాయ సిబ్బందికి కష్టమైంది. అబ్దుల్‌ను కాపాడినా అతని భార్య, పిల్లలు ప్రాణాలు కోల్పోవడం విషాదం. శిథిలాల్లో చిక్కుకున్న వారిలో ఒక ప్రాణాన్ని కాపాడడానికి 10 లక్షల డాలర్లు ఖర్చు అవుతుందని తుర్కియే ప్రభుత్వం అంచనా వేస్తోంది. సిరియాలో సహాయానికి అంతర్యుద్ధమే అడ్డు భూకంపం సంభవించిన ప్రాంతాలు ఎవరి అధీనంలో? అంతర్యుద్ధంతో అతలాకుతలమవుతున్న సిరియాలో సంభవించిన భూకంపంలో సహాయ కార్యక్రమాలు సరిగా కనిపించడం లేదు. దేశంలోకి వెళ్లడానికి కేవలం రెబెల్స్ అధీనంలో ఒకే ఒక మార్గం తీసి ఉంది. సాయం అందించడం కోసం వచ్చిన అంతర్జాతీయ సంస్థలు సిరియాలో ఒక్కో ప్రాంతం ఒక్కొక్కరి అధీనంలో ఉండడంతో ముందుకు వెళ్లడానికి సవాలక్ష అనుమతులు తీసుకోవాల్సి వస్తోంది. కుర్దులు, సిరియన్ తిరుగుబాటుదారులు, జిహాదీ శక్తులు, తుర్కియే మిలటరీ మద్దతున్న రెబెల్స్, సిరియా ప్రభుత్వం ఇలా దేశం మొత్తం పలువురి అధీనంలో ఉండడం సహాయ కార్యక్రమాలకు ఆటంకంగా మారింది. -
Joshimath: కుంగుతున్నా వదలట్లేదు
డెహ్రాడూన్: భూమి కుంగిపోతున్నా సొంతింటిని, స్వస్థలాలను వదిలి వెళ్లేందుకు జోషీమఠ్ వాసులు ససేమిరా అంటున్నారు. ఖాళీ చేయాలంటూ ఇప్పటికే దాదాపు 200కుపైగా ఇళ్లకు అధికారులు ఎరుపు రంగు పూశారు. వెంటనే సురక్షిత శిబిరాలకు లేదా అద్దె భవనాలకు తరలిపోవాలని, ఒక్కో కుటుంబానికి నెలకు రూ.4,000 చొప్పున ఆరునెలలపాటు ఆర్థికసాయం అందిస్తామని ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రకటించింది. సోమవారం మరో 68 ఇళ్లకు పగుళ్లు పడ్డాయి. దీంతో కుంగిన, దెబ్బతిన్న ఇళ్ల సంఖ్య 678కి పెరిగింది. అయినా పలువురు ఇళ్లు వీడటం లేదంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ సంధూ సోమవారం ఆందోళన వ్యక్తంచేశారు. ‘ ప్రతి నిమిషమూ అత్యంత ప్రధానం. వెంటనే ఇళ్లను వీడండి’’ అని కోరారు. ‘‘ఎన్డీఆర్ఎఫ్, రాష్ట్ర బృందాలు ఇప్పటికే జోషిమఠ్‌లో సహాయ, పునరావాస చర్యల్లో నిమగ్నమయ్యాయి. భూమి కుంగడంతో పగిలిన తాగు నీటి సరఫరా పైపులను పునరుద్దరించాలి. లేదంటే పెద్దమొత్తంలో నీరు దిగువ భూముల్లో ఇంకి త్వరగా మరింతగా కుంగే ప్రమాదం పెరుగుతుంది’’ అని ఆయన అన్నారు. కాగా, ఘటనను జాతీయ విపత్తుగా ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ సోమవారం డిమాండ్చేసింది. కుటుంబానికి రూ.5,000 చాలా తక్కువ మొత్తమని, సర్వస్వం కోల్పోతున్న ఒక్కో బాధితునికి రూ.50వేలు ఇవ్వాలని రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి హరీశ్ రావత్ అభిప్రాయపడ్డారు. -
ఉదారంగా సాయం అందించండి.. కేంద్ర బృందానికి రాష్ట్ర అధికారుల వినతి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గత నెలలో వచ్చిన గోదావరి వరదలు మునుపెన్నడూ లేని రీతిలో ప్రభావం చూపాయని, సాయం అందించే విషయంలో ఉదారంగా స్పందించాలని విపత్తుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ కేంద్ర బృందాన్ని కోరారు. హోంమంత్రిత్వ శాఖ ఆరి్థక సలహాదారు (ఎన్డీఎంఏ) రవినేష్ కుమార్ నేతృత్వంలోని బృందం రెండు రోజులపాటు గోదావరి వరదలకు ముంపునకు గురైన అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లా, ఏలూరు జిల్లా, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో పర్యటించింది. అనంతరం గురువారం రాష్ట్ర అధికారులతో సమావేశమైంది. రవినేష్ కుమార్‌తోపాటు బృందం సభ్యులు డాక్టర్.కె.మనోహరన్, శ్రావణ్ కుమార్ సింగ్, పి.దేవేందర్ రావు, ఎం.మురుగునాధన్, అరవింద్ కుమార్ సోని ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో వరదల ప్రభావం, క్షేత్ర స్థాయిలో జరిగిన నష్టాన్ని సాయిప్రసాద్, విపత్తుల సంస్థ ఎండీ బి.ఆర్.అంబేడ్కర్ కేంద్ర బృందానికి వివరించారు. రాష్ట్ర కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు వరద ఉధృతిపై జిల్లా కలెక్టర్లకు సూచనలిచి్చనట్లు తెలిపారు. ముందుస్తుగానే జిల్లాల్లోకి సహాయక బృందాలను పంపించా మని వివరించారు. 10 ఎన్డీఆర్ఎఫ్, 11 ఎస్డీఆర్ ఎఫ్, 3 ఇండియన్ నేవీ బృందాలతో ముంపులో చిక్కుకున్న 183 మందిని రక్షించి, మరో 9 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. సహాయక బృందాలు కూడా చేరుకోలేని ఏలూరు జిల్లా కుకునూరు, వేలేరుపాడు మండలాల్లోని గ్రామాలకు హెలికాప్టర్ల ద్వారా ఆరు రోజుల పాటు ఆహారం, నిత్యావసరాలను అందించినట్లు తెలిపారు. గర్భిణుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించామన్నారు. ప్రభుత్వ స్పందన భేష్ రవినేష్‌కుమార్ మాట్లాడుతూ మూడు జిల్లాల్లో వరదలకు దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించామన్నారు. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు ఎక్కువగా నష్టం వాటిల్లిందని చెప్పారు. వరద సమయంలో ప్రభుత్వ చర్యలు, యంత్రాంగం సత్వర స్పందనను అభినందించారు. ముఖ్యం గా వలంటీర్ వ్యవస్థ సేవలు బాధితులకు అండగా నిలిచాయని ప్రశంసించారు. అత్యవసర సరీ్వసులను వెంటనే పునరుద్ధరించడంలో అధికారులు సమయస్ఫూర్తితో పనిచేశారని కొని యాడారు. కలెక్టర్లకు వెంటనే నిధులు మంజూ రు చేయడంతో వేగంగా సహాయక చర్యలు చేపట్టినట్టు గుర్తించామన్నారు. తమ నివేదికను త్వ రగా కేంద్ర ప్రభుత్వానికి అందిస్తామని, వీలైనంత మేర సహాయం అందించడానికి సహకారాన్ని అందిస్తామని తెలిపారు. సమావేశంలో విద్యుత్ శాఖ డైరెక్టర్ రమేష్ ప్రసాద్, ఇరిగేషన్ ఈఎన్సీ నారాయణరెడ్డి, ఆర్ అండ్ బీ ఈఎన్సీ నయిమ్ఉల్లా, ఆర్డబ్ల్యూఎస్ సీఈ హరేరాము, ఫిషరీస్ జేడీ హీరానాయక్, విపత్తుల సంస్థ ఈడీ సి.నాగరాజు తదితరులు పాల్గొన్నారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో కేంద్ర బృందం పర్యటన సాక్షి అమలాపురం: గోదావరి వరదల వల్ల కలిగిన నష్టాన్ని పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం నియమించిన ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీమ్ (ఐఎంసీటీ) గురువారం డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించింది. రావులపాలెం మండలం గోపాలపురం, పి.గన్నవరం మండలం నాగుల్లంక, రాజోలు మండలం నున్నవారిబాడవలో నష్టాన్ని పరిశీలించింది. పంట నష్టం, రైతులు, మత్స్యకారుల అభిప్రాయాలు, సాంకేతిక అంచనాలను సేకరించింది. వివిధ వర్గాలవారికి, రోడ్లు, విద్యుత్, ఇతర మౌలిక సదుపాయాలకు కలిగిన నష్టాన్ని పరిశీలించింది. ఫొటో ఎగ్జిబిషన్ తిలకించింది. జిల్లా కలెక్టర్ హిమాన్సు శుక్లా, రాష్ట్ర ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి వరదల వల్ల జరిగిన నష్టాన్ని, బాధితులకు అందించిన సాయాన్ని, దెబ్బతిన్న పంటల వివరాలను, రోడ్లు, విద్యుత్ లైన్లకు జరిగిన నష్టాన్ని ఛాయాచిత్రాలు చూపిస్తూ వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో ఆదుకుంది ఆపదలో ఉన్న తమను రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో ఆదుకుందని అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని వరద బాధిత రైతులు, మత్స్యకారులు, ప్రజలు కేంద్ర బృందానికి తెలిపారు. పునరావాసం కలి్పంచిందని, ఆహారం, తాగు నీరు అందించిందని వివరించారు. నిత్యావసర వస్తువులు, నగదు సాయం అందజేసిందన్నారు. కేంద్రంతో మాట్లాడి పంటలకు ఇచ్చే నష్ట పరిహారాన్ని పెంచేలా చూడాలని రైతులు ఈ బృందాన్ని కోరడం విశేషం. కేంద్ర బృందంలో రవినేష్ కుమార్‌తోపాటు వ్యవసాయ సహకార రైతు సంక్షేమ శాఖ సంచాలకులు డాక్టర్ కె.మనోహరం, రోడ్డు రవాణా జాతీయ రహదారుల విభాగం ఎస్ఈ శరవన్ కుమార్ సింగ్, కేంద్ర జలశక్తి, జల వనరుల శాఖ సంచాలకులు పి.దేవేందర్ రావు, కేంద్ర ఆరి్థక శాఖ సహాయ కార్యదర్శి మురుగన్ నాదమ్, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి అరవింద్ ఉన్నారు. -
కామారెడ్డి జిల్లా: శెట్పల్లి వాగులో చిక్కుకుపోయిన ముగ్గురు స్థానికులు.. కాపాడిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది
-
'ఆ తేడా తెలియని కిషన్‌రెడ్డి కేంద్ర మంత్రిగా ఉండటం దురదృష్టకరం'
సాక్షి, హైదరాబాద్: ఎన్డీఆర్ఎఫ్ (నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్), ఎస్డీఆర్ఎఫ్ (స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్)కు తేడా తెలియని కిషన్‌రెడ్డి కేంద్ర మంత్రిగా ఉండటం దురదృష్టకరమని మంత్రి కె.తారకరామారావు మండిపడ్డారు. తెలంగాణకు చేయాల్సిన వరద సాయంపై కిషన్‌రెడ్డి చెప్పేవన్నీ తప్పుడు లెక్కలేనని ఆరోపించారు. కేంద్రం ఎన్డీఆర్ఎఫ్ కింద ఇచ్చిన ప్రత్యేక, అదనపు నిధులపై సమాధానం చెప్పాలని తాము డిమాండ్ చేస్తే.. రాష్ట్రానికి రాజ్యాంగ హక్కుగా దక్కే ఎస్డీఆర్ఎఫ్ లెక్కలు చెప్తూ కిషన్‌రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నారని గురువారం ఒక ప్రకటనలో విమర్శించారు. తెలంగాణ పట్ల కేంద్రం చూపుతున్న వివక్ష నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. ఆ నిధులు రాజ్యాంగ హక్కు తెలంగాణ నుంచి కేంద్రానికి చెల్లించే పన్నుల నుంచి తిరిగి రాష్ట్రానికి దక్కే మార్గాల్లో ఎస్డీఆర్ఎఫ్ ఒకటని, ఈ విషయంపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి అవగాహన లేదని కేటీఆర్ విమర్శించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 280 ప్రకారం ఫైనాన్స్ కమిషన్ ద్వారా రాష్ట్రాలకు ఎస్డీఆర్ఎఫ్ నిధులు కేటాయించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంటుందన్నారు. లోక్‌సభలో ఈ నెల 19న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ చేసిన ప్రకటనను కిషన్‌రెడ్డి ఒకసారి చదువుకోవాలన్నారు. 2018 నుంచి ఇప్పటిదాకా తెలంగాణకు ఎన్డీఆర్ఎఫ్ ద్వారా అదనంగా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని నిత్యానంద్రాయ్ ప్రకటించిన మాట అబద్ధమా? కిషన్‌రెడ్డి చేసిన ప్రకటన అబద్ధమా? ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ వరదలప్పుడు ఒక్క పైసా ఇవ్వలే.. గతంలో భారీ వర్షాలతో హైదరాబాద్ మునిగి కష్టాలు పడ్డప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రూ.3,500 కోట్లు కోరితే.. కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని కేటీఆర్ మండిపడ్డారు. ఇప్పుడు కూడా భారీ వర్షాలతో ప్రాథమికంగా రూ.1,400 కోట్ల నష్టం వచ్చిందని, తెలంగాణకు ప్రత్యేక ఎన్డీఆర్ఎఫ్ నిధులు అందించాలని కోరితే.. కేవలం పరిశీలన బృందాలను పంపించి చేతులు దులుపుకొనే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. 2021లో బీజేపీ పాలిత రాష్ట్రాలతోపాటు తౌక్టే తుఫాన్ వల్ల గుజరాత్లో వరదలు వచ్చినప్పుడు.. ప్రధాని ఆగమేఘాల మీద సర్వే జరిపించి రూ.1,000 కోట్ల ఎన్డీఆర్ఎఫ్ ప్రత్యేక అదనపు సాయాన్ని అడ్వాన్స్ రూపంలో విడుదల చేశారని కేటీఆర్ గుర్తు చేశారు. వేరే పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు అధికార బృందాలను పంపడం.. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలకు మాత్రం నిధులు మూటలు పంపడం దారుణమన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న 4 రాష్ట్రాలకు 2018 నుంచి ఇప్పటిదాకా రూ.15,270 కోట్లు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం.. తెలంగాణకు నిధులు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ.. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు విరుద్ధంగా కిషన్‌రెడ్డి అబద్ధాలు చెప్తున్నారని, ఆయన వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సొంత రాష్ట్రంపై ఏ మాత్రం ప్రేమ ఉన్నా.. కేంద్రం నుంచి ఎన్డీఆర్ఎఫ్ అదనపు నిధుల కోసం ప్రయత్నించాలని, లేకుంటే నయా పైసా సాయం తీసుకురాలేని చేతకాని మంత్రిగా కిషన్‌రెడ్డి చరిత్రలో మిగిలిపోతారని వ్యాఖ్యానించారు. -
Amarnath Floods: ఆకస్మిక వరదలు.. అమర్నాథ్లో అసలేం జరుగుతోంది?
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో అమర్నాథ్ యాత్రికులను శుక్రవారం భీకర వర్షం బెంబేలెత్తించింది. పవిత్ర గుహ సమీపంలో సాయంత్రం 5.30 గంటల సమయంలో వర్ష బీభత్సం కారణంగా వరద పోటెత్తింది. ఇప్పటిదాకా కనీసం 16 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారని, మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది తెలిపారు. మరో 40 మంది అదృశ్యమయ్యారని పేర్కొన్నారు. వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. వరదల్లో గాయపడిన వారిని హెలికాప్టర్లలో ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నామని కశ్మీర్ ఐజీ విజయ్‌కుమార్ చెప్పారు. చదవండి👉🏻గుజరాత్లో వరుణ విలయం ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి ప్రస్తుతానికి పరిస్థితి అదుపులోనే ఉందన్నారు. వరదల వల్ల ఆహార కేంద్రాలు, టెంట్లు దెబ్బతిన్నాయి. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. అమర్నాథ్లో కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. 13 మంది యాత్రికులు మృతిచెందడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. బాధితులకు అవసరమైన సహాయం అందజేస్తామని ప్రకటించారు. పదో బ్యాచ్ కింద శుక్రవారం ఉదయం 6,100 మందికి పైగా యాత్రికులు రెండు బేస్ క్యాంపుల నుంచి ఆమర్నాథ్ యాత్రకు బయలుదేరారు. చదవండి👉🏻Maharashtra: శివసేనకు మరో ఎదురుదెబ్బ -
ముంబైను ముంచెత్తుతున్న వర్షాలు... జలదిగ్బంధంలో నగరం
సాక్షి, ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కురుస్తున్న భారీ వర్షానికి రహదారులు, లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. మంగళవారం ఉదయం వీధుల్లో నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తెగ ఇబ్బందిపడ్డారు. సియాన్, అంధేరిలో రోడ్డుపై మోకాళ్ల లోతు నీళ్లు చేరుకున్నాయి. కొన్ని రూట్లలో రైళ్లు, బస్సు సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. రాబోయే 24 గంటల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. మహారాష్ట్ర వ్యాప్తంగా ఆరు జిల్లాల్లో ఎల్లో అలెర్ట్ జారీ అయింది. ముంబైతో పాటు సమీప జిల్లాల్లో ఎన్డీఆర్ఎఫ్ దళాలు అప్రమత్తంగా ఉండాలని మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే ఆదేశించారు. మొదటి వర్షానికే పరిస్థితి ఇలా ఉంటే ఇక ముందుముందు తెరిపి లేకుండా భారీ వర్షాలు కురిస్తే ముంబై పరిస్ధితి ఏంటనే ప్రశ్న తలెత్తుతోంది. వర్షాకాలానికి ముందు బీఎంసీ రూ.కోట్లు ఖర్చుచేసి మురికి కాల్వలు, నాలాలు శుభ్రం చేయిస్తుంది. వర్షా కాలంలో వర్షపు నీరు సాఫీగా సముద్రంలోకి వెళ్లేందుకు వీలుగా పనులు చేపడుతుంది. కానీ ఇప్పటికే కురిసిన భారీ వర్షానికి దాదర్ సర్కిల్, ఫైవ్ గార్డెన్, హిందూకాలనీ, చెంబూర్, వడాల, రఫీ మహ్మద్ కిడ్వాయి మార్గ్ తదితర ప్రాంతాలు జలమయమయ్యాయి. గతంలో నీరు నిల్వని ప్రాంతాల్లో కూడా ఇప్పుడు వర్షపు నీరు నిలిచిపోవడం మొదలైంది. వీటితోపాటు రెండు రోజుల కిందట సెంట్రల్ రైల్వే మార్గంలో థానే, కల్యాణ్ దిశగావెళ్లే లోకల్ రైలు సేవలు కొద్దిసేపు స్తంభించిపోయాయి. పశ్చిమ మార్గంలో అంధేరీ స్టేషన్ సమీపంలో ఉన్న సబ్వేలో కూడా వర్షపు నీరు చేరింది. మూడు అడుగుల మేర వర్షపు నీరు చేరడంతో గత్యంతరం లేక సబ్ వేను మూసివేయాల్సిన పరిస్ధితి వచ్చింది. చివరకు విద్యుత్ మోటర్ పంపుల ద్వారా నీటిని బయటకు తోడాల్సి వచ్చింది. నీరంత బయటకు తోడేసిన తరువాత మరమ్మతులు చేసి సబ్వేను పునఃప్రారంభించారు. అదేవిధంగా ముంబైలోని పేడర్ రోడ్‌పై కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో ఈ రహదారిని పూర్తిగా మూసివేయాల్సి వచ్చింది. హిందూమాత, దాదర్, తిలక్ నగర్, గాంధీ మార్కెట్ ప్రాంతాల్లో నీరు నిలిచింది. దీంతో బీఎంసీ ఖర్చుచేసిన రూ.కోట్లు వృథా పోయినట్లు స్పష్టమైతోంది. ఏటా వర్షా కాలంలో హిందూమాత, దాదర్ టీటీ, పరేల్ టీటీ, అంధేరీలో మిలన్ సబ్వేలో వర్షపు నీరు చేరడం పరిపాటే. ఏటా వర్షా కాలంలో తమకు ఈ తిప్పలు తప్పవని స్ధానికులు వాపోతుంటారు. కాని బీఎంసీ మాత్రం మురికి కాల్వలు, నాలాలు వంద శాతం శుభ్రం చేశామని, ఈసారి వర్షా కాలంలో నీరు నిల్వదని ప్రగల్భాలు పలుకుతోంది. కానీ ఏటా వర్షా కాలంలో జరిగే పరిణామాల్లో ఏమాత్రం మార్పు ఉండదు. యథాతధంగా రోడ్లన్నీ జలమయం కావడం, లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరడం, లోకల్ రైళ్లకు అంతరాయం కల్గడం లాంటివి జరుగుతూనే ఉన్నాయి. #WATCH | Maharashtra: Sion area of Mumbai witnessed waterlogging in the wake of heavy rains in the city. Visuals from last night. pic.twitter.com/tjniUJ74RE — ANI (@ANI) July 5, 2022 (చదవండి: స్పైస్ జెట్‌లో తలెత్తిన సాంకేతిక లోపం...కరాచీలో అత్యవసర ల్యాండింగ్) -
భూకంప బాధితుల రక్షణకు రెస్క్యూ ఆపరేషన్
గన్నవరం రూరల్/సాక్షి, అమరావతి: ‘అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న ఆ ప్రాంతంలో ఒక్కసారిగా అలజడి.. భూకంపంతో భవనం కుప్పకూలింది.. జనం హాహాకారాలు చేస్తూ పరుగులు తీశారు.. మరికొందరు శిథిలాల మధ్య చిక్కుకున్నారు. స్థానికులు వెంటనే జాతీయ విపత్తు నిర్వహణ దళం (ఎన్డీఆర్ఎఫ్)కు సమాచారం అందించడంతో హుటాహుటిన రెస్క్యూ టీమ్ రంగంలోకి దిగింది’.. ఏంటి ఇదంతా వాస్తవం అనుకుంటున్నారా? కాదు.. కేవలం మాక్ డ్రిల్ మాత్రమే. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కొండపావులూరులో ఉన్న ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్‌ను మంగళవారం ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ అతుల్ కర్వాల్ సందర్శించారు. అనంతరం భూకంపం సంభవించినప్పుడు ఎన్డీఆర్ఎఫ్ స్పందించే విధానం, హైరిస్క్ భవనాల్లో చిక్కుకున్న బాధితులను రెస్క్యూ రోప్ టీమ్ రక్షించే విధానాలపై ప్రదర్శన ఏర్పాటు చేయగా ఆయన వీక్షించారు. మాక్ డ్రిల్ ఇలా: మాక్ డ్రిల్‌లో భాగంగా.. భవనం కుప్పకూలిపోయింది. స్థానికుల సమాచారం మేరకు అక్కడకు వచ్చిన రెస్క్యూ టీమ్ భవనం స్ట్రక్చరల్ ఇంజనీర్ సాయంతో గ్యాస్, కరెంట్ సరఫరాను నిలిపివేసింది. అనంతరం డాగ్ స్క్వాడ్ శిథిలాల కింద ఉన్న బాధితులను గుర్తించగా యంత్రాలతో గోడలు బద్దలుకొట్టి వారిని రక్షించింది. అనంతరం బహుళ అంతస్తుల భవనంలో చిక్కుకున్న బాధితులను రక్షించేందుకు రోప్ టీమ్ రంగంలోకి దిగింది. పై అంతస్తుల్లో ఉన్నవారి నడుముకు బెల్టులు అమర్చి రోప్ సహాయంతో వారిని సురక్షితంగా కిందకు చేర్చింది. దీంతో రెస్క్యూ ఆపరేషన్ విజయవంతంగా ముగిసింది. బెటాలియన్ కమాండెంట్ జాహిద్ ఖాన్, డిప్యూటీ కమాండెంట్లు జఫరిల్ ఇస్లాం, దిల్భాగ్ సింగ్, సుఖేందు దత్త, అఖిలేష్ చౌబే ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్లు నిర్వహించారు. సవాళ్లను దీటుగా ఎదుర్కొంటాం.. ప్రకృతి వైపరీత్యాలు, ఇతర ప్రమాదాలు సంభవించినప్పుడు సత్వరం సహాయ చర్యలు చేపట్టేందుకు దేశంలో 26 ప్రాంతీయ కేంద్రాలను ఏర్పాటు చేస్తాం. ఎన్డీఆర్ఎఫ్ బెటాలియన్లు 12 ఉండగా వాటిని 16కు పెంచాం. విపత్తుల సమయంలో ప్రాణనష్టం లేకుండా చూసేందుకు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో శిక్షణను బెటాలియన్లలో అందిస్తున్నాం. భవిష్యత్ సవాళ్లను దీటుగా ఎదుర్కొంటాం. – అతుల్ కర్వాల్, డీజీ, ఎన్డీఆర్ఎఫ్ -
ఎన్డీఆర్ఎఫ్ ట్విటర్ ఖాతా హ్యాక్..!
న్యూఢిల్లీ: నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(ఎన్డీఆర్ఎఫ్)కు చెందిన ట్విట్టర్ ఖాతా శనివారం(జనవరి 22) రోజున కొద్దిసేపు హ్యాక్ అయినట్లు ఎన్డీఆర్ఎఫ్ డైరెక్టర్ జనరల్ అతుల్ కర్వాల్ తెలిపారు. "ఎన్డీఆర్ఎఫ్ ట్విట్టర్ హ్యాండిల్ జనవరి 22న హ్యాకర్స్ హ్యాక్ చేశారు. సాంకేతిక నిపుణులు ఈ సమస్యను పరిశీలిస్తున్నారని" అని డిజీ కర్వాల్ చెప్పినట్లు ఏఎన్ఐ పేర్కొంది. '@NDRFHQ ట్విటర్ హ్యాండిల్ ద్వారా హ్యాకర్స్ కొన్ని యాదృచ్ఛిక సందేశాలను పోస్ట్ చేశారు. గత ఏడాది డిసెంబర్ 12న ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ ఖాతాను కొద్ది సేపు హ్యాక్ చేసిన సంగతి మనకు తెలిసిందే. ప్రధాని మోదీ వ్యక్తిగత ట్విటర్ అకౌంట్లో బిట్కాయిన్లు కొనాలంటూ ఆగంతకులు పోస్టు చేశారు. భారత్‌లో బిట్‌కాయిన్‌ను లీగల్ చేశారని, ప్రభుత్వం 500 బిట్కాయిన్లను కొనుగోలుచేసి ప్రజలకు పంచుతోందని లింక్‌లు పోస్ట్ చేశారు. (చదవండి: లబోదిబో అంటున్న జొమాటో ఇన్వెస్టర్లు..!)