శుక్రవారం సిక్కింలోని రంగ్‌పో పట్టణంలో జల దిగ్బంధంలో ఇళ్లు
గ్యాంగ్‌టక్: సిక్కింలోని తీస్తా నదికి బుధవారం సంభవించిన ఆకస్మిక వరదల్లో గల్లంతైన వారి ఆచూకీ కోసం ఆర్మీ, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు నిరి్వరామంగా గాలిస్తున్నాయి. ఇప్పటి దాకా 26 మృతదేహాలను వెలికి తీశారు. ఇందులో ఏడుగురు జవాన్ల మృతదేహాలున్నాయి. బర్దంగ్ ఏరియాలో సంభవించిన వరదల్లో 23 మంది ఆర్మీ సిబ్బంది గల్లంతైన విషయం తెలిసిందే. జవాన్లు సహా మొత్తం 143 మంది జాడ తెలియాల్సి ఉంది. జల దిగ్బంధానికి గురైన మొత్తం 2,413 మందిని రక్షించి, సహాయక శిబిరాలకు తరలించామని అధికారులు చెప్పారు.
బర్దంగ్ ప్రాంతంలో ఇసుక మేటను తొలగించి ఆయుధ డిపోను వెలికితీసినట్లు రక్షణ శాఖ తెలిపింది. అన్వేషణ కార్యకలాపాల్లో స్పెషల్ రాడార్లు, జాగిలాలను రప్పించామని తెలిపింది. సింగ్‌టమ్–బర్దంగ్ మధ్య ధ్వంసమైన రహదారిని వాహనాల రాకపోకలకు వీలుగా పునరుద్ధరించినట్లు తెలిపింది. ఇలా ఉండగా, రాష్ట్రానికి అవసరమైన సాయం అందజేస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారని సీఎం తమాంగ్ చెప్పారు. అడ్వాన్సుగా రూ.44.8 కోట్లు విడుదల చేస్తున్నట్లు హోం మంత్రి అమిత్ షా చెప్పారన్నారు. ఆకస్మిక వరద నష్టం అంచనాకు హోం శాఖ, ఇతర విభాగాల అధికారులతో కూడిన బృందాన్ని కూడా పంపుతామని అమిత్ షా తెలిపినట్లు సీఎం వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment