30 గంటలు వరద నీటిలోనే..!
- వరదలో 30 గంటలు
- చేపల వేటకు వెళ్లి ఎల్లంపల్లి నీటిలో చిక్కుకున్న ఇద్దరు జాలర్లు
- రంగంలోకి దిగిన ఎన్‌డీఆర్‌ఎఫ్
- సురక్షితంగా ఒడ్డుకు చేర్చిన బృందం
- ఆదివారం ఉదయం 10 గంటలకు ఎల్లంపల్లి గ్రామానికి చెందిన కూనారపు సంతోష్, ధర్మాజీ రాజేశ్, ధర్మాజీ శ్రీనివాస్ కలిసి చేపల వేటకు ప్రాజెక్టు దిగువలోని గోదావరి నదిలో దిగారు. వరద ఉధృతి పెరుగుతుండడంతో ధర్మాజీ శ్రీనివాస్ సాయంత్రం ఒడ్డుకు చేరి ఇంటికి వెళ్లాడు.
- సాయంత్రం ఆరు గంటలు గడుస్తునా తనతోపాటు నదిలో దిగిన ఇద్దరు ఇంటికి చేరలేదు. దీంతో శ్రీనివాస్ ప్రాజెక్టు వద్దకు చేరుకున్నాడు. ద్విచక్ర వాహనాలు, బట్టలు అక్కడే ఉండడంతో వరదలోనే చిక్కుకున్నట్లు గుర్తించి కేకలు వేశాడు. అటునుంచి కేకలతో సమాధానం వచ్చింది.
- సాయంత్రం 6.30 గంటలకు తన తమ్ముడితోపాటు స్నేహితుడు సంతోష్ వరద నీటిలో చిక్కుకున్నాడని సర్పంచ్ సంకటి సుధాకర్‌కు శ్రీనివాస్ తెలియజేశాడు. సర్పంచ్ వెంటనే స్థానిక పోలీసులకు సమాచారమిచ్చారు.
- రాత్రి 8గంటలకు ప్రాజెక్టు వద్దకు ఎస్సై శీలం ప్రమోద్‌రెడ్డి, గ్రామ పోలీసు అధికారి బాయి శ్రీనివాస్ చేరుకున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి టార్చిలైట్ల సాయంతో మరోసారి జాలర్లు చిక్కుకున్న ప్రదేశానికి సమాంతరంగా బురద, ముళ్లపొదలు దాటుకుంటూ కొద్దిదూరం వెళ్లారు. తర్వాత కేకలు వేయడంతో.. వరదనీటిలోనే ఉన్నామని నీటిలో చిక్కుకున్న వారి నుంచి సమాధానం వచ్చింది. ‘మీకేం భయంలేదు.. జాగ్రత్తగా ఉండండి.. ఏం వరద రాదని’ వారికి ఎస్సై తదితరులు ధైర్యం చెప్పారు.
- అదే రాత్రి గుడిపేట వైపు జాలర్లను పిలిపించి వారు చిక్కుకున్న ప్రదేశాన్ని చూపించి ఒడ్డుకు చేర్చేందుకు చేపట్టాల్సిన సలహాలు, సూచనలు ఇచ్చారు.
- చివరగా అర్ధరాత్రి గం.2.30 (సోమవారం వేకువజాము) హైదరాబాద్‌లోని 10వ బెటాలియంకు చెందిన జాతీయ విపత్తుల స్పందన సంస్థ (ఎన్‌డీఆర్‌ఎఫ్)కు ఇక్కడి ఘటనను వివరించారు. అధునాతన వస్తుసామగ్రితో ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం ప్రత్యేక బస్సులో బయలు దేరి సోమవారం ఉదయం 6 గంటలకు ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్దకు చేరారు.
- ప్రాజెక్టులో వరద పరిస్థితిని గోదావరిఖని ఏఎస్పీతో సమీక్షించారు. గేట్ల వద్ద వరద ఉధృతితోపాటు ఎయిర్‌బోట్స్ దిగేందుకు ప్లాట్‌ఫామ్స్ లేకపోవడం, ఇరువైపులా భారీగా ముళ్లపొదలు ఉండడంతో ముల్కల్ల వద్ద ఉన్న పుష్కరఘాట్ వద్ద నుంచి ఆపరేషన్ కుదురుతుందని ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం స్పష్టం చేసింది.
- దీంతో ఉదయం 8.30 గంటలకు ఆదిలాబాద్ జిల్లా ముల్కల్ల వద్ద ఉన్న పుష్కరఘాట్‌కు 22 మందితో కూడిన బృందం చేరుకుంది. వారితో రబ్బర్‌బోట్, లైట్‌బాయ్, డాట్‌బ్రాహెల్‌మోటార్స్, లైట్ జాకెట్స్, లైఫ్‌లైన్‌రోప్స్‌తో ఎన్‌డీఆర్‌ఎఫ్ ఎస్సైలు ఘన్‌పాల్‌సింగ్, తృశాల్‌సింగ్‌తోపాటు 22 మంది బృందం వరద నీటిలో దిగేందుకు రంగం సిద్ధం చేశారు.
- మూడు రబ్బర్ బోట్స్‌తో మరిన్ని ఆయుధాలను సిద్ధం చేసుకొని మూడు బృందాలుగా విడిపోయి ఉదయం 11.30గటలకు ప్రాజెక్టు వరద నీటిలోకి మొదటి బోటులో ఐదుగురు బృందంతో దిగారు. దాని తర్వాత పది నిమిషాల వ్యవధిలోనే రెండో బోటు దిగి వెళ్తుున్న క్రమంలో వరద ఉధృతితో వెనుకకు కొట్టుకు వచ్చింది. దీంతో మొదటి బోటుతోనే ఆపరేషన్ చేపట్టారు.
- వరద ఉధృతికి బోటు పది మీటర్లు ముందుకు వెళ్తే.. ఇరవై మీటర్లు వెనక్కి వచ్చింది. అయినా వెనక్కి తగ్గని బృందం.. జాలర్లు చిక్కుకున్న ప్రదేశానికి వంద మీటర్ల దూరానికి చేరింది. బోటును చూస్తుండగా అందరి ముఖాల్లో సంతోషం.. క్రమంగా ఉత్కంఠకు తెరతీసింది. పెరుగుతున్న వరద ఉధృతితో సుమారు ఐదు వందల మీటర్ల దూరానికి బోటు పక్కకు కొట్టుకుపోయింది.
- అధికారులు వెంటనే అప్రమత్తమై కొట్టుకుపోతున్న బోటుకు ఎదురుగా ఉన్న రెండు గేట్లను మూసివేశారు. దీంతో బోటు ముందుకు సాగిపోయింది. ప్రయాణం సాఫీగా సాగి నీటిలో చిక్కుకున్న జాలర్ల వద్దకు చేరుకున్న సహాయ బృందం.. ఇద్దరు జాలర్లను బోటులోకి ఎక్కించుకొని మధ్యాహ్నం 1.45 గంటలకు తిరుగు ప్రయాణమైంది. ఇరవై నిమిషాల్లో ముల్కల్ల ఘాట్‌కు సురక్షితంగా చేరుకుంది.
- అప్పటికే సిద్ధంగా ఉన్న 108 సిబ్బంది.. జాలర్లకు అత్యవసర వైద్య సేవలు అందించారు. బీపీ, ఇతరత్రా పరీక్షలు జరిపారు. తక్షణమే అంబులెన్స్ ద్వారా మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
- అప్పటికే ఆదిలాబాద్ జేసీ సుందర్ అబ్నార్ ముల్కల్ల ఘాట్‌కు చేరుకుని బాధితులను పరామర్శించారు. ఎన్‌డీఆర్‌ఎఫ్ ధైర్యసాహసాలను మెచ్చుకున్నారు. గోదావరిఖని ఏఎస్పీ, బెల్లంపల్లి డీఎస్పీ, మంచిర్యాల ఆర్డీవో తదితరులు ఎన్‌డీఆర్‌ఎఫ్ సేవలను ప్రశంసించారు. బెటాలియన్ ఎస్సైలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
- ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం వరద నీటిలో గాలిస్తున్నంత సేపు ముల్కల్ల ఘాట్‌తోపాటు ఎల్లంపల్లి బ్యారేజీపై ఉన్న పోలీసులు, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం సభ్యులు బోట్‌లో ఉన్న వారితో ఎప్పటికప్పుడు వాకీటాకీలతో పరిస్థితిని తెలుసుకుంటూ ముందుకు సాగడం అందరిలోనూ ఉత్కంఠను రేకెత్తించింది.