స్త్రీ శక్తి
పురాణాల నుంచి వర్తమానం వరకు పతిప్రాణాలు రక్షించుకోవడం కోసం మహిళలు పడిన కష్టాలు, చేసిన పోరాటం మనకు కొత్త కాదు. నూకమ్మ చేసిన పోరాటం ఆ కోవలోకే వస్తుంది. శ్రీకాకుళం జిల్లాలోని మారుమూల గ్రామానికి చెందిన నూకమ్మ భర్త, అతడి బృందం గుజరాత్‌లో చేపల వేటకు వెళ్లి పాకిస్తాన్ కోస్టు గార్డుల చేతికి చిక్కారు. పాకిస్తాన్ జైల్లో పద్నాలుగు నెలలు మగ్గారు.
అప్పట్లో ‘ప్రజా సంకల్పయాత్ర’ చేస్తున్న వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి దృష్టికి తమ సమస్యను తీసుకు వెళ్లారు. బాధిత కుటుంబాలకు జగన్ అండగా నిలబడ్డారు. ధైర్యం చెప్పారు. వీరి నిరంతర పోరాటం వల్ల... నాటి వైఎస్ జగన్ ప్రభుత్వం చొరవతో మత్స్యకారులు పాకిస్తాన్ జైలు నుంచి 14 నెలల తరువాత విడుదలయ్యారు. నాగచైతన్య కథానాయకుడిగా వస్తున్న ‘తండేల్’ సినిమాకు మూలం రామారావు– నూకమ్మల జీవితకథ.
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం పంచాయతీ పరిధిలోని గ్రామాలు డి.మత్స్యలేశం, కె.మత్స్యలేశం. గనగళ్ల రామారావుది కె.మత్స్యలేశం. నూకమ్మది డి.మత్స్యలేశం గ్రామం. వీరిద్దరి పరిచయం ప్రేమగా మారింది. పెద్దలు కూడా వీరి ప్రేమను ఆమోదించారు. పెళ్లి చేశారు. తమ ప్రేమకు పెద్దలు ఒప్పుకుంటారో లేదో, ఎన్ని కష్టాలు ఎదురవుతాయో! అనుకున్నారు. హమ్మయ్య... ఎలాంటి కష్టం లేకుండానే వారి పెళ్లి జరిగింది. అయితే సినిమా ట్విస్ట్‌లా అసలు కష్టాలు ఆ తరువాతే మొదలయ్యాయి. తన బృందంతో కలిసి చేపల వేట కోసం రామారావు గుజరాత్‌లోని వెరావల్‌కు వెళుతుండేవాడు. గుజరాత్‌లో వేటకెళ్లిన మత్స్యకారుల నాయకుడిని ‘తండేల్’ అని పిలుస్తారు.
ఆరోజు....
శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన 22 మంది రామారావు నాయకత్వంలో మూడు బోట్లలో గుజరాత్ వెరావల్ నుంచి బయలుదేరి చేపల వేట సాగిస్తున్నారు. ఎదురుగా దట్టమైన మంచు. ఏమీ కనిపించడం లేదు. పయనిస్తున్న పడవ దిశ మారిపోయింది. దీంతో పాకిస్థాన్‌ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించారు. బోట్‌లలో వైర్‌లెస్ సెట్లు కూడా పనిచేయకపోవడంతో వారికి దిక్కు తోచలేదు. ఆ తరువాత పాకిస్తాన్ కోస్టు గార్డులు చేతికి చిక్కారు. వీరి ఫొటోలు తీసుకుని ఏప్రాంతానికి చెందిన వారని ఆరా తీశారు. పొరపాటున వచ్చిన మిమ్మల్ని విడిచి పెడతాం’ అని కోస్టు గార్డులు హామీ ఇవ్వడంతో ‘బతికిపోయినం దేవుడా’ అనుకున్నారు. ఊపిరి పీల్చుకున్నారు.
కథ మలుపు తిరిగింది...
కానీ తరువాత కథ మలుపు తిరిగింది. ‘భయపడకండి... విడిచి పెడతాం’ అన్న వాళ్లే ఆ తరువాత ‘విడిచిపెట్టేదే లేదు’ అంటూ మాట మార్చారు. ఆ మాట వారి గుండెల్లో గునపంలా దిగింది. వేలిముద్రలు తీసుకుని కరాచీ సబ్‌జైలులో బంధించారు. వీరందరినీ ఒకే బ్లాక్‌లో ఉంచారు. జైలులో వారు పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. సరైన ఆహారం అందకపోవడం, జైలు సిబ్బంది నానా రకాలుగా ఇబ్బంది పెట్టడంతో చిత్రహింసలు అనుభవించారు. ఎవరికి ఎవరూ ధైర్యం చెప్పుకునే పరిస్థితి లేదు. అందరి కళ్ల ముందు దుఃఖసముద్రం.
పద్నాలుగు నెలలు... ప్రతి రోజూ నరకమే
వేటకు వెళ్లిన తమ వాళ్ల ఆచూకి దొరకకపోవడంతో బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. పాకిస్తాన్ కోస్టు గార్డులకు పట్టుబడ్డారనే వార్త తెలిసి కుప్పకూలిపోయారు. ‘ఎన్ని కష్టాలొచ్చినా సరే నా భర్తను జైలు నుంచి విడిపించుకుంటాను’ ఏడుస్తూనే దృఢంగా అన్నది నూకమ్మ. ‘నీ భర్త విజయనగరంలో ఉన్నాడనుకున్నావా? విశాఖపట్నంలో ఉన్నాడనుకున్నావా?... అక్కడెక్కడో పాకిస్తాన్ జైలులో ఉన్నాడు’ అన్నారు ఒకరు. ఆ మాటకు అర్థం... ఇక ఆశ వదులుకోవాల్సిందేనని!
పాక్ జైల్లో బందీలుగా వున్న మత్స్యకారుల గురించి పాదయాత్రలో వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డికి వివరిస్తున్న నూకమ్మ తదితరులు
అయితే చివరి శ్వాస వరకు అయినా పోరాడాలని నిర్ణయించుకుంది నూకమ్మ. ఆమెకు ఎర్రమ్మ భార్య శిరీష జత కలిసింది. నిండు గర్బిణీగా ఉన్న నూకమ్మ, ఎర్రయ్య సతీమణి శిరీష కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ప్రభుత్వానికి విన్నపాలు చేశారు. అప్పట్లో ‘ప్రజాసంకల్పయాత్ర’ చేస్తున్న వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి దృష్టికి తమ సమస్యను తీసుకు వెళ్లారు. బాధిత కుటుంబాలకు జగన్ అండగా నిలబడ్డారు. ధైర్యం చెప్పారు. వీరి నిరంతర పోరాటం వల్ల, నాడు ఉన్న వైఎస్ జగన్ ప్రభుత్వం చొరవతో మత్స్యకారులు పాకిస్తాన్ జైలు నుంచి 14 నెలల తరువాత విడుదలయ్యారు. భర్తను జైలు నుంచి విడిపించటం కోసం గల్లీ నుంచి దిల్లీ వరకు నూకమ్మ చేసిన పోరాటం, గర్భిణిగా, పాపకు జన్మనిచ్చిన తల్లిగా తను ఎదుర్కొన్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. అంతులేని నిస్సహాయతలో కూడా చిన్న ఆశ మనిషిని బతికిస్తుంది. పోరాటశక్తిని ఇస్తుంది. విజయాన్ని చేతికి అందిస్తుంది. నూకమ్మ విషయంలో అదే జరిగింది.
పాకిస్తాన్ నుంచి విడుదలైన తర్వాత తనను కలిసిన రామారావుకు స్వీట్ తినిపించిన నాటి సీఎం వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి
అదృష్టం కాదు...అంతా ఆమె కష్టమే!
పాకిస్తాన్ జైల్లో ఉన్నప్పుడు ఎప్పుడూ కుటుంబం గుర్తుకొచ్చి నాలో నేను కుమిలిపోయేవాడిని. నెల గర్భిణిగా ఉన్న నా భార్య నేను విడుదలయ్యే నాటికి మూడు నెలల పాపతో కనిపించింది. ఎన్నో నెలల పాటు నా కుటుంబానికి దూరంగా బతికాను. నా విడుదల కోసం నా భార్య చేసిన పోరాటం, పడిన కష్టాలు ఎంతోమంది ద్వారా విన్నాను. ఆమె పడిన కష్టం వల్లే విడుదలయ్యాను.
– గనగళ్ల రామారావు
ఆందోళనలో బతికా
నా భర్త పాకిస్తాన్‌కు పట్టు పడినట్లు తెల్సుకున్నాక ఆందోళన చెందా. గుజరాత్ మరి వెళ్లనని సంక్రాంతికి వచ్చి ఇక్కడే ఉండి పోతానని అన్నారు. అంతలో పాకిస్తాన్‌లో చిక్కుకుపోయారు. పాకిస్తాన్ మన శత్రుదేశం కావటం వల్ల ఎంతో ఆందోళన చెందాను. అయినా ఆత్మస్థైర్యం కోల్పోకుండా పోరాటం చేశాను. ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వ పెద్దలను, అధికారులను కలిశాను. ఆయన జైలులో ఉండగా పాప పుట్టింది. మా కథ సినిమాగా వస్తుండటం సంతోషంగా ఉంది.
– నూకమ్మ
– కందుల శివశంకరరావు,
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం
Comments
Please login to add a commentAdd a comment