
‘తండేల్’ కథకు మూలంగా చెబుతున్న రామారావు తీరుపై తోటి మత్స్యకారుల మండిపాటు
పాక్ జలాల్లోకి వెళ్లడానికి రామారావే కారణమని ఆరోపణలు
రామారావు ఒకవైపు.. మిగతా 21 మత్స్యకార కుటుంబాలు మరోవైపు
ప్రెస్‌మీట్లతో ఒకరిపై ఒకరు విమర్శలు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ‘ఎలక్షన్ ముందు మాయ మాటలు చెబుతారు. కానీ జగన్ గారు గెలవక ముందే మా కుటుంబాల వారికి మాటిచ్చి నిలబెట్టుకున్నారు. వైఎస్ జగన్ గెలిస్తే మా బతుకుల్లో వెలుగులు వస్తాయని అనుకున్నాం. అలాగే ఆయన గెలిచాక మమ్మల్ని పాకిస్తాన్ జైలు నుంచి విడుదల చేయించారు. ఒక్కొక్కరికీ రూ.5లక్షల సాయం అందజేశారు. 14 నెలల కష్టాలు సీఎం జగన్‌ను చూడగానే మటుమాయమయ్యాయి. మాకు ఊపిరి పోసి, పునర్జన్మ ఇచ్చారు. మా కుటుంబాల్లో ఎవరెన్ని చెప్పినా, ఏమన్నా జగన్ పార్టీకి జీవితాంతం సేవ చేస్తా. ఆయన రుణం ఈ జన్మలోనే తీర్చుకుంటా.’ పాకిస్తాన్ జైలు నుంచి విడుదలయ్యాక మీడియాతో గనగళ్ల రామారావు అన్న మాటలివి..
కానీ తండేల్ సినిమా విడుదలయ్యాక ఎందుకో రామారావు స్వరం మారిపోయింది. వైఎస్ జగన్ హయాంలో జరిగిన మేలును చెప్పుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డారు. ఇతర దేశాల్లో ఉన్న వారిని విడిపించే బాధ్యతను కేంద్ర ప్రభుత్వమే చూసుకుంటుంది కదా.. ఇప్పుడు కొన్ని బుర్రలకు ఆ విషయం అర్థం కావడం లేదు.. ఏదో పట్టినట్టు కొంతమంది అదే పనిగా వైఎస్ జగన్ ప్రభుత్వం గొప్పతనమని చెబుతున్నారంటూ.. తోటి మత్స్యకారులనుద్దేశించి కొన్ని మీడియాల్లో మాట్లాడటం వివాదాస్పదంగా మారింది. అలాగే తండేల్ సినిమా యూనిట్‌తో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నా.. నాడు జరిగిన మేలు గురించి చెప్పకపోవడం కూడా మిగతా 21 మత్స్యకార కుటుంబాలకు ఆగ్రహం తెప్పించింది.
అసలు నిజమిది..
వాస్తవానికి రామారావు ఒక్కడే తండేల్ కాదని, సినిమాలో అలా కథ రాసుకున్నారు గానీ.. పాకిస్తాన్‌కు దొరికిన మూడు బోట్లలో ముగ్గురు తండేళ్లు ఉన్నారని 21 మత్స్యకార కుటుంబాల వారు తెలిపారు. తండేల్ సినిమాతో రామారావు ఒక్కరికే లబ్ధి చేకూరిందని అన్నారు. అప్పుడేం జరిగిందో తమకు తెలుసని, ఎవరి వల్ల విడుదలయ్యామో తమకు ఇంకా గుర్తుందని అన్నారు. వైఎస్ జగనే పునర్జన్మ ఇచ్చారని ఆనాడు చెప్పిన వ్యక్తి ఇప్పుడు రకరకాలుగా మాట్లాడుతున్నాడని అన్నారు. తాము స్టేజీ ఎక్కితే ఎక్కడ వాస్తవాలు చెబుతామో అని ఆ ఆవకాశం ఇవ్వకుండా చేశారని, రామారావు, కథా రచయిత తమను మోసం చేశారని మండిపడ్డారు.
ఇదేనా కృతజ్ఞత..
రామారావు వ్యవహార శైలి వల్ల డి.మత్స్యలేశంలో చిచ్చు రేగింది. రామారావుకు అవకాశవాదం తప్ప కృతజ్ఞత లేదని మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘పాకిస్తాన్ జైలు నుంచి విడుదలయ్యాక రామారావు ఏమన్నాడు.. ఇప్పుడేం మాట్లాడుతున్నారు...అంతా మీడియాలో రికార్డయి ఉంది.. మరిచిపోయి మాట్లాడితే పాత వీడియాలు గుర్తు చేస్తాయి...’ అని అంటున్నారు. సినిమా యూనిట్‌ను తప్పుదారి పట్టించి, తమకు కనీసం గుర్తింపు లేకుండా చేశారని కూడా వాపోతున్నారు. ఆ గ్రామంలో ప్రస్తుతం రామారావు ఒక వైపైతే.. మిగతా వారంతా మరో వైపు ఉన్నారు. ఢీ అంటే ఢీ అన్నట్టుగా మాట్లాడుకుంటున్నారు. ప్రెస్‌మీట్ పెట్టి ఒకరిపై ఒకరు కౌంటర్లు వేసుకుంటున్నారు. ఈ క్రమంలో నాడు జరిగిన వాస్తవాలు బయటకు వస్తున్నాయి. ఎవరి గొప్పతనమేంటో, ఎవరి చేసిన మేలు ఏంటో చర్చకు వస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment