fishermens
-
మత్స్యకారులకు గుడ్ న్యూస్
-
మన తీరం.. మత్స్య హారం!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రతి మత్స్యకారుడు ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే లక్ష్యంతో సముద్ర తీర ప్రాంతంలో ప్రతి 50 కి.మీ.కి ఒక పోర్టు కానీ ఫిషింగ్ హార్బర్ లేదా ఫిష్ ల్యాండింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, 4 పోర్టులను వాయువేగంతో నిర్మిస్తున్నామని గుర్తు చేశారు. తీరం వెంట మౌలిక సదుపాయాలను గణనీయంగా మెరుగుపరిచామన్నారు. మనకున్న 974 కి.మీ. పొడవైన సుదీర్ఘ తీరప్రాంతాన్ని సద్వినియోగం చేసుకుంటూ బ్లూ ఎకానమీ (నీలి విప్లవం) పెంచేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. వీటన్నిటివల్ల మత్స్యకారులు ఎక్కడెక్కడికో వలస వెళ్లి ఉపాధి వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా సొంత రాష్ట్రంలోనే మెరుగైన జీవనోపాధి లభిస్తుందన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల్లో ఓఎన్జీసీ పైపు లైన్ కారణంగా ఉపాధి కోల్పోయిన 23,458 మత్స్యకార కుటుంబాలకు ఐదో విడతగా ఒక్కొక్కరికి నెలకు రూ.11,500 చొప్పున ఆర్నెళ్లకు రూ.69,000 మేర పరిహారం చెల్లిస్తూ మొత్తం రూ.161.86 కోట్లను మంగళవారం క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి జగన్ బటన్ నొక్కి నేరుగా వారి ఖాతాల్లో జమ చేశారు. ఇప్పటివరకు ఐదు విడతల్లో రూ.647.44 కోట్ల మేర లబ్ధిదారులకు ప్రయోజనాన్ని చేకూర్చారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. రూ.20 వేల కోట్లతో తీరంలో సదుపాయాలు మొత్తంగా 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లతో పాటు నాలుగు పోర్టుల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. నాలుగు పోర్టులను దాదాపు రూ.16 వేల కోట్లతో నిర్మిస్తున్నాం. పది ఫిషింగ్ హార్బర్లను రూ.4 వేల కోట్లతో నిర్మిస్తుండగా మరో రూ.200 కోట్లతో ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు ఏర్పాటవుతున్నాయి. మొత్తంగా రూ.20 వేల కోట్ల పైచిలుకు సముద్రతీర ప్రాంతంలో మౌలిక సదుపాయాల మీద పెట్టుబడిగా పెడుతున్నాం. ఈ పనులన్నీ వేగంగా జరుగుతున్నాయి. వీటివల్ల అత్యధికంగా మత్స్యకార కుటుంబాలు బాగుపడతాయి. క్రమం తప్పకుండా ప్రతి ఆర్నెల్లకు.. రాష్ట్ర ప్రభుత్వ చొరవతో మత్స్యకారులను ఆదుకునే విషయంలో ఓఎన్జీసీ మంచి మనసుతో ముందుకొచ్చింది. మత్స్యకార కుటుంబాలకు నష్టం జరగకూడదనే ఉద్దేశంతో ఎక్కడా ఆలస్యం లేకుండా ప్రతి ఆర్నెల్లకు ఒకసారి సాయం అందిస్తూ ఆదుకుంటున్నాం. క్రమం తప్పకుండా డబ్బుల విడుదల కోసం గుర్తు చేస్తున్న ఎమ్మెల్యే సతీష్ ను అభినందించాలి. ఇప్పటివరకూ ఐదు విడతల్లో రూ.647.44 కోట్లు ఇచ్చాం. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 16,408, కాకినాడ జిల్లాలో 7,050 కుటుంబాలకు మంచి చేస్తున్నాం. బాబు సర్కారు ఆలకించలేదు.. 2012కు సంబంధించి జీఎస్పీసీ రూ.78 కోట్లు పరిహారంగా 16,554 కుటుంబాలకు చెల్లించాల్సి ఉన్నా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు. మనం అధికారంలోకి వచ్చిన మొదటి ఆర్నెళ్లలోనే రాష్ట్ర ప్రభుత్వం తరపున మత్స్యకారులకు మేలు చేస్తూ ఆ రూ.78 కోట్లను 16 వేలకుపైగా మత్స్యకార కుటుంబాలకు అందచేశాం. ఆ కుటుంబాల అవసరాలను మన అవసరాలుగా భావించి వారికి తోడుగా నిలుస్తూ గొప్ప అడుగులు పడ్డాయి. ఆ తర్వాత జీఎస్పీసీని ఓఎన్జీసీ టేకోవర్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు దీని గురించి ఓఎన్జీసీ దృష్టికి తేవడంతో రెండు మూడేళ్ల తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి ఆ డబ్బులు వచ్చాయి. అయితే ఈలోగా మత్స్యకారులకు మంచి చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యం చేయలేదు. మత్స్యకారులకు రాష్ట్రప్రభుత్వం అండగా ఉంటుందనే భరోసాను అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కల్పిస్తున్నాం. 1.07 లక్షల కుటుంబాలకు వైఎస్సార్ మత్స్యకార భరోసా చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా మత్స్యకారుల సంక్షేమం కోసం తాపత్రయ పడుతూ అడుగులు వేశాం. 1.07 లక్షల కుటుంబాలకు ఐదేళ్లలో వైఎస్ఆర్ మత్స్యకార భరోసా ద్వారా రూ.538 కోట్లు సాయంగా అందించాం. ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 మధ్యలో వేట నిషేధ సమయంలో వారికీ సాయాన్ని ఏటా అందించాం. చంద్రబాబు హయాంలో ఐదేళ్లలో మత్స్యకార సోదరులకు కేవలం రూ.104 కోట్లు మాత్రమే ఇచ్చారు. మనం ప్రతి ఒక్కరినీ ఈ పథకంలోకి తీసుకొచ్చి పారదర్శకంగా అందిస్తూ వచ్చాం. గతంలో రూ.4 వేలుగా ఉన్న సాయాన్ని ఏకంగా రూ.10 వేలకు పెంచి ఒక్కో కుటుంబానికి అందిస్తున్నాం. దేశంలో ఏ రాష్ట్రంలోనూ మత్స్యకారులకు ఇంత సహాయం అందించడం లేదు. రూ.130 కోట్లకు పైగా డీజిల్ సబ్సిడీ గతంలో డీజిల్‌పై లీటరుకు రూ.6 మాత్రమే సబ్సిడీ ఇవ్వగా మనం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.9కి పెంచాం. నాడు ఆ సబ్సిడీ ఎప్పుడిస్తారో కూడా తెలిసేది కాదు. ఇప్పుడు డీజిల్ పోయించుకున్నప్పుడే సబ్సిడీ ఇస్తున్నాం. దీనికోసం ప్రత్యేకంగా బంకులను ఎంపిక చేసి ప్రతి మత్స్యకారుడికి గుర్తింపు కార్డు ఇచ్చాం. డీజిల్ పోయించుకున్నప్పుడే రూ.9 సబ్సిడీ ఇచ్చేలా విప్లవాత్మక మార్పు తీసుకొచ్చాం. డీజిల్ సబ్సిడీని వర్తింపజేసే బోట్లను కూడా పెంచాం. దాదాపు 20 వేల బోట్లకు రూ.130 కోట్లకు పైగా డీజిల్ సబ్సిడీ ఇచ్చాం. రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా వేటకు వెళ్లే మత్స్యకారులు దురదృష్టవశాత్తూ మరణిస్తే చెల్లించే ఎక్స్Šగ్రేషియాను రూ.10 లక్షలకు పెంచి ఇస్తున్నాం. ఘటన జరిగిన వెంటనే రూ.5 లక్షలు పరిహారంగా చెల్లిస్తూ మిగిలిన అమౌంట్‌ను ఆర్నెళ్లలోగా అందజేసే కొత్త ఒరవడి తీసుకొచ్చాం. ఇలా దాదాపు 175 కుటుంబాలకు మంచి చేస్తూ మరో రూ.17 కోట్లు అందించాం. గతంలో ఎక్స్‌గ్రేషియా ఎప్పుడు వచ్చేదో తెలిసేది కాదు. ఈ మూడు కార్యక్రమాలే కాకుండా డ్రిల్లింగ్ కారణంగా నష్టపోయిన మత్స్యకారులకు ఉపాధి కల్పిస్తున్నాం. జీఎస్పీతో మొదట రూ.78 కోట్లు, ఓఎన్జీసీతో ఐదు దఫాల్లో రూ.647 కోట్లు అందచేశాం. ఆక్వా రైతులకు రూపాయిన్నరకే విద్యుత్ సబ్సిడీని అందిస్తున్నాం. 40,850 మంది లబ్ధిదారులకు మంచి చేస్తూ దాదాపు రూ.3,500 కోట్లు సబ్సిడీగా ఇచ్చాం. ఆరు కార్యక్రమాలతో రూ.4,913 కోట్లు అందించాం. ఇవికాకుండా నవరత్నాల ద్వారా అదనంగా ప్రతి మత్స్యకార కుటుంబానికి సాయం అందిస్తున్నాం. కార్యక్రమంలో ఇంధన, గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్.జవహర్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జువ్వలదిన్నెకు స్వయంగా వస్తా ‘‘ఇవాళే జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌ను ప్రారంభించాలని తొలుత అనుకున్నా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కాకుండా నేనే నేరుగా అక్కడకు వెళ్లి ప్రారంభించాలని నిర్ణయించా. ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా మత్స్యకారులు ఏ విధంగా లబ్ధి పొందుతున్నారో తెలియచేసేందుకు నేనే స్వయంగా వెళ్లి ఆ హార్బర్‌ను ప్రారంభిస్తా. ఫిషింగ్ హార్బర్ వల్ల మత్స్యకారుల జీవితాలు మారతాయి. ఒక్కో ఫిషింగ్ హార్బర్లో ఎన్ని బోట్లు ఉంటాయి? కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్లతో పాటు ఇతర మౌలిక సదుపాయాలతో ఏ రకమైన అభివృద్ధి జరుగుతుందనే విషయాలు అందరికీ తెలియాలి. అందుకే అక్కడ ఇవాళ తలపెట్టిన కార్యక్రమాన్ని వాయిదా వేశాం’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. మీ చేతి నుంచే ఆరో విడత కూడా.. రాష్ట్రంలో మత్స్యకార సోదరులంతా చాలా సంతోషంగా ఉన్నారు. మత్స్యకారుల బతుకుదెరువు, ఆర్ధిక ఎదుగుదలకు తోడ్పడుతూ మనసున్న ముఖ్యమంత్రిగా మీరు అండగా నిలుస్తున్నారు. ప్రభుత్వం నుంచి నేరుగా సాయం అందడం మీ వల్లే సాధ్యమైంది. మళ్లీ మీ చేతుల మీదుగా ఆరో విడత కూడా తీసుకుంటాం. మీ ప్రేమ, అభిమానం ఎప్పటికీ మరువలేనిది. – పొన్నాడ సతీష్ కుమార్, ఎమ్మెల్యే, ముమ్మిడివరం ఆశ వదిలేసుకున్న డబ్బులు అందుకుంటున్నాం.. గత ప్రభుత్వంలో రావనుకున్న డబ్బులు మీ చేతుల మీదుగా తీసుకుంటున్నాం. ఇప్పటివరకు ఒక్కొక్కరూ రూ.2,07,000 తీసుకున్నాం. ఇప్పుడు ఐదో విడతలో రూ. 69,000 అందుకుంటున్నాం. వేట నిషేధం సమయంలో గత ప్రభుత్వంలో అప్పులు చేయాల్సి వచ్చేది. ఇప్పుడు మత్స్యకార భరోసా, సబ్సిడీపై డీజిల్ అందిస్తున్నారు. గతంలో మాకు బీమా వచ్చేది కాదు. ఇప్పుడు మీరు ఇస్తున్నారు. నాకు అమ్మ ఒడి సాయం అందింది. మా అబ్బాయికి ట్యాబ్ ఇచ్చారు. ఆరోగ్యశ్రీ ద్వారా మంచి వైద్య సేవలు అందుతున్నాయి. మా కుటుంబానికి రూ.5,32,000 మేర లబ్ధి చేకూరింది. ఆసరా సాయం కింద అందిన రూ.42 వేలతో కుట్టుమిషన్లు కొనుక్కున్నా. మా అమ్మకు చేయూత సాయం అందింది. –నారాయణమ్మ, లబ్ధిదారు, కోనసీమ జిల్లా అన్నీ ఇస్తున్నారు.. గతంలో మా గురించి ఏ ప్రభుత్వమూ పట్టించుకోలేదు. మా మత్స్యకారులందరికీ మీరు సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. వేట నిషేధ సమయంలో ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఏటా రూ.10 వేలు ఇస్తున్నారు. ఆయిల్ సబ్సిడీ గతంలో కొందరికే అందగా ఇప్పుడు అర్హత ఉంటే చాలు అందరికీ ఇస్తున్నారు. గతంలో బీమా సాయం అందేది కాదు. ఇప్పుడు అన్నీ ఇస్తున్నారు. గతంలో ఫిషింగ్ హార్బర్లు లేవు. ఇప్పుడు మీరు ఏర్పాటు చేస్తున్నారు. మేమంతా మీ వెంటే ఉంటామన్నా. – భైరవమూర్తి, వెంకటాయపాలెం, కోరంగి పంచాయతీ, కాకినాడ జిల్లా -
karnataka assembly elections 2023: మత్స్యకారులకు రూ.10 లక్షల బీమా: రాహుల్
ఉడుపి/మంగళూరు: కాంగ్రెస్ నేత రాహుల్ కర్ణాటక మత్స్యకారులపై వరాల జల్లు కురిపించారు. రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే మత్స్యకారులకు రూ.10 లక్షల బీమా కల్పిస్తామని, లీటర్ డీజిల్‌పై రూ.25 చొప్పున రాయితీ ఇస్తామని, రోజుకు 500 లీటర్ల డీజిల్‌కు ఈ రాయితీ వర్తిస్తుందని, మత్స్యకార మహిళలకు రూ.లక్ష వడ్డీ లేని రుణం అందజేస్తామని హామీ ఇచ్చారు. రాహుల్ గురువారం ఉడుపి జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మత్స్యకారులతో సమావేశమయ్యారు. కేవలం హామీలు ఇవ్వడం కాదు, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి రోజు నుంచే వాటిని అమలు చేస్తామని వెల్లడించారు. ప్రస్తుతం కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వం కాదని అన్నారు. కర్ణాటకలో అధికారంలోకి రాగానే మహిళలకు ప్రజా రవాణా సంస్థ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని రాహుల్ హమీ ఇచ్చారు. -
క్షేమంగా.. ఆ నలుగురు
సాక్షి, మచిలీపట్నం/కాట్రేనికోన: ఐదు రోజుల క్రితం చేపల వేటకు వెళ్లి కనిపించకుండా పోయిన కృష్ణాజిల్లా క్యాంప్‌బెల్‌పేటకు చెందిన మత్స్యకారుల ఆచూకీ లభ్యమైంది. సముద్రంలో గాలివాటాన్ని బట్టి వారు ఉన్న బోటు గురువారం కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం కొత్తపాలెం సముద్ర తీరానికి చేరుకుంది. గమనించిన మెరైన్ పోలీసులు ఆ నలుగురిని క్షేమంగా ఒడ్డుకు చేర్చారు. వివరాల్లోకి వెళితే.. మచిలీపట్నం మండలం కరగ్రహారం పంచాయతీ క్యాంప్‌బెల్‌పేటకు చెందిన సుమారు 20 మంది నాలుగు బోట్లలో ఈ నెల 2వ తేదీన చేపల వేటకు వెళ్లారు. అంతర్వేదికి చేరుకున్నాక ఓ బోటు అలల తాకిడికి ముందుకెళ్లలేక ఆగిపోయింది. ఎంత ప్రయత్నించినా బోటు ముందుకు కదలకపోవడంతో మత్స్యకారులు క్యాంప్‌బెల్‌పేటకు చెందిన ఏడుకొండలుకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. సముద్రంలో చిక్కుకున్న రామాని నాంచారయ్య, మోకా వెంకటేశులు, విశ్వనాథపల్లి మస్తాన్, చెక్కా నరసింహను క్షేమంగా తీసుకొచ్చేందుకు మరికొంతమంది మత్స్యకారులు అంతర్వేదికి పయనమయ్యారు. అక్కడ వారి ఆచూకీ లభ్యం కాకపోవడంతో మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య (నాని), కలెక్టర్ రంజిత్‌బాషాకు సమాచారం ఇచ్చారు. ఈ విషయాన్ని పేర్ని నాని సీఎంవో దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన అధికారులు వారి ఆచూకీ కోసం హెలికాప్టర్ ఏర్పాటు చేశారు. మత్స్యశాఖ అధికారులు, మెరైన్ పోలీసులు, నేవీ తదితర అధికార యంత్రాంగం నాలుగు రోజుల పాటు సముద్రంలో గాలింపు చర్యలు చేపట్టింది. ఎట్టకేలకు అధికార యంత్రాంగం అన్వేషణ ఫలించింది. అమలాపురం సమీపంలో మత్స్యకారుల ఆచూకీ కనుగొన్నారు. ఆ నలుగురిని వెంటనే కాట్రేనికోన పీహెచ్‌సీకి తరలించి వైద్య సేవలు అందించారు. అనంతరం గురువారం రాత్రి ఆ నలుగురిని క్యాంప్‌బెల్‌పేటలోని కుటుంబీకులకు అప్పగించారు. మత్స్యకారుల ఆచూకీ తెలియడంతో మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని నాని, ఇన్చార్జ్ కలెక్టర్ మహేష్‌కుమార్ రావిరాల అధికార యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలిపారు. -
మురిపిస్తున్న 'కరిమీన్'
సాక్షి, అమరావతి: కేరళ ‘కరిమీన్’ చేప ఆంధ్ర తీరప్రాంత మత్స్యకారులను మురిపిస్తోంది. సాగుయోగ్యం కాని తీరప్రాంత భూముల్లో సిరులు కురిపించే ఈ చేపల సాగును మన రాష్ట్రంలో ప్రోత్సహిస్తున్నారు. పైలెట్ ప్రాజెక్టుగా కృష్ణా జిల్లాలో చేపట్టిన ఈ సాగు సత్ఫలితాలివ్వడంతో గోదావరి జిల్లాల్లో కూడా ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు. వీటి సాగుకు అవసరమైన సాంకేతికతను సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (సీఎంఎఫ్ఆర్ఐ) అందిస్తోంది. కేరళ రాష్ట్ర అధికారిక చేప పెరల్స్ పాట్.. (శాస్త్రీయ నామం–ఎట్రోప్లస్ సురాటెన్సిస్). ఒళ్లంతా ముత్యాల్లా తెల్లటి మచ్చలుండడంవల్ల దీన్ని ముత్యాల మచ్చగా పేరొందింది. కేరళ రాష్ట్ర అధికారిక చేపగా ప్రసిద్ధి చెందిన ఈ చేపను అక్కడ ‘కరిమీన్’గా పిలుస్తారు. మన వాడుక భాషలో ఈ చేపను ప్రాంతాన్ని బట్టి మురి మీను/చుక్కగొరక/దువ్వెన చేపని పిలుస్తుంటారు. మన ప్రాంతంలో పెద్దగా డిమాండ్‌లేని ఈ చేపకు కేరళలో మాత్రం మంచి మార్కెట్ ఉంది. అక్కడ స్టార్‌హోటళ్లు, రెస్టారెంట్ మెనూల్లో స్పెషల్ డిష్ ఇదే. స్థానికులే కాదు..అక్కడకొచ్చే విదేశీయులు ఈ చేపతో చేసే కరిమీన్ ఫ్రై, కరిమీన్ మోలీ, కరిమీన్ పొల్లిచాతు వంటకాలను అమితంగా ఇష్టపడతారు. ఈ చేపల సాగుకు సీజన్ అంటూ ఏమీలేదు. ఇది ప్రాథమికంగా ఉప్పునీటి చేప. కానీ, మంచినీరు, సముద్రపు నీటిలో జీవిస్తుంది. లోతు జలాల్లో దొరికే ఆల్గే మొక్కలు, కీటకాలను ఆహారంగా తీసుకునే ఈ చేప గరిష్టంగా 20 సెం.మీ వరకు పెరుగుతుంది. 150 గ్రాముల సైజు పెరిగితే చాలు కిలో రూ.325 నుంచి రూ.400 వరకు పలుకుతుంది. డిమాండ్‌ను బట్టి రూ.500 నుంచి రూ.600 వరకు కూడా విక్రయిస్తారు. పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టిన కృష్ణాజిల్లా పెద్దపాలెంలో గిరిజన మత్స్యకారులు పట్టిన చేపలు ‘కృష్ణా’లో ప్రయోగం విజయవంతం ఐసీఎఆర్–సీఎంఎఫ్ఆర్ఐ విశాఖ ప్రాంతీయ కేంద్రం సహకారంతో ఎలెర్ట్ ఎన్జీఓ అనే సంస్థ కృష్ణాజిల్లా నాగాయలంక మండలం పెద్దపాలెంలో ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ మురిమీను సాగు అద్భుత ఫలితాలిచ్చింది. వివిధ గ్రామాలకు చెందిన యానాదులతో ఏర్పాటుచేసిన గ్రూపులకు ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఎంఎస్ఎస్ఆర్ఎఫ్) ద్వారా ప్రత్యేక శిక్షణనిచ్చి చేపల సాగుకు శ్రీకారం చుట్టారు. 20 గ్రాముల పరిమాణం కలిగిన 5వేల చేప పిల్లలను అందించారు. పది నెలలపాటు సాగుచేయగా, ఒక్కో చేప సగటున 120 గ్రాముల పరిమాణంలో 510 కిలోల చేపలను శుక్రవారం పట్టుబడి చేశారు. కిలో రూ.225ల చొప్పున విక్రయించగా రూ.1.14లక్షల ఆదాయం ఆర్జించారు. పెట్టుబడి పోనూ రూ.60 వేలకు పైగా మిగలడంతో వారి ఆనందానికి అవధుల్లేవు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం ఈ సాగు ద్వారా తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందవచ్చు. నిరుపయోగంగా ఉన్న తీరప్రాంత భూముల్లో వీటి సాగును ప్రోత్సహించవచ్చు. చేపల పెరుగుదల నెమ్మదిగా ఉంటుంది. మనుగడ మాత్రం 83 శాతానికి పైగా ఉంటుంది. సీడ్ క్రీక్ వాటర్‌లో విరివిగా దొరుకుతుంది. కృష్ణా జిల్లాతో పాటు గోదావరి జిల్లాల్లో కూడా ఈ చేపల సాగుకు అనుకూలం. విత్తన సాంకేతిక సీఐబీఏ–చెన్నై, సీఎంఎఫ్ఆర్ఐ, కొచ్చిన్ వద్ద ఉంది. – డాక్టర్ శుభదీప్ ఘోష్, హెడ్, ఐసీఏఆర్–సీఎంఎఫ్ఆర్ఐ, విశాఖపట్నం ప్రాంతీయ కేంద్రం -
తంతడి తీరానికి అతిపెద్ద అతిథి
దొండపర్తి (విశాఖ దక్షిణ): ప్రపంచంలోనే అతి పెద్ద చేపగా గుర్తించబడిన వేల్ షార్క్ విశాఖ తీరానికి వచ్చింది. ఇక్కడి తంతడి బీచ్‌లో బుధవారం స్థానిక మత్స్యకారుల వలకు చిక్కింది. 50 అడుగుల పొడవు, 2 టన్నుల బరువు ఉండే చేప ఒడ్డుకు రావడాన్ని గమనించిన వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ శ్రీకాంత్ మన్నెపూరి వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారాన్ని తెలియజేశారు. విశాఖ డీఎఫ్‌వో అనంత్‌శంకర్ ఆదేశాల మేరకు సిబ్బంది వెంటనే తంతడి బీచ్‌కు చేరుకొని ప్రపంచంలోనే అతిపెద్ద చేప అయిన వేల్‌షార్క్‌గా దీనిని నిర్ధారించారు. అంతరించిపోతున్న షార్క్‌ల జాతిలో ఇదొకటిగా గుర్తించారు. షార్క్‌ను సురక్షితంగా సముద్రంలోకి పంపించే ఏర్పాట్లు చేయాలని డీఎఫ్‌వో అనంత్‌శంకర్ సూచించారు. వెంటనే అటవీ శాఖ సిబ్బంది, మత్స్యకారులు, వన్యప్రాణుల సంరక్షకులు షార్క్‌కు ఫిల్టర్ ఫీడింగ్ ఇచ్చారు. అనంతరం షార్క్‌ను సురక్షితంగా సముద్రంలోకి పంపించారు. చిక్కింది టేకు చేప.. మత్స్యకారుల వలకు భారీ టేకు చేప చిక్కింది. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం తంగెడ గ్రామ సమీపంలోని కృష్ణా నదిలో బుధవారం చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు పోస సాయికృష్ణ, ఉట్టి వెంకటేశ్వర్లు, గంగరాజులు వేసిన వలలో 200 కిలోల బరువున్న ఈ భారీ టేకు చేప పడింది. – దాచేపల్లి -
Fishermen: ‘వల’సి సొలసి
బరంపురం: రెక్కాడితే కానీ డొక్కాడని ఎంతోమంది జీవితాలను కరోనా మహమ్మారి ఛిన్నాభిన్నం చేస్తోంది. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్రంలో అమలు చేస్తున్న లాక్డౌన్, షట్డౌన్లతో రోజువారీ కూలీలు, కొన్ని సంప్రదాయ వృత్తుల వారు పొట్టకూటి కోసం అష్టకష్టాలు పడుతున్నారు. ముఖ్యంగా అనాది కాలంగా చేపల వేటని నమ్ముకుని జీవిస్తున్న మత్స్యకారుల పరిస్థితి అయితే మరీ దారుణం. కరోనా నిబంధనలు అతిక్రమిస్తూ వేట కొనసాగించలేని వారంతా ఇప్పుడు ఇంటికే పరిమితమై, ఆకలితో పస్తులుంటున్నారు. కొంతమంది తీరం వైపు చూస్తూ తమ కష్టాలు ఎప్పుడు తీరుస్తావమని సముద్ర దేవునికి దండం పెట్టుకుంటున్నారు. దాదాపు రెండు వారాల నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతుండగా, వేటకు వెళ్తే కానీ ఆ రోజు కాలం గడవదని, ఈ పరిస్థితుల్లో తామెలా బతకాలని మత్స్యకారులు వాపోతున్నారు. ప్రభుత్వమే స్పందించి, తమకు ఆర్థికసాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రాష్ట్రంలో 475 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్న గంజాం జిల్లాలో సూన్‌పూర్ నుంచి చందిపూర్ వరకు దాదాపు 108 మత్స్యకార గ్రామాలు ఉండగా, ఆయా గ్రామాల్లోని 15 వేల కుటుంబాలు చేపల వేటని ప్రధాన వృత్తిగా చేసుకుని జీవిస్తున్నారు. వేట నిషేధ సమయంలో ప్రభుత్వం ఆదుకున్న విధంగానే ఇప్పుడు కూడా ఆదుకోవాలని పలు మత్స్యకార సంఘాల ప్రతినిధులు జి.ఎర్రయ్య, టి.సింహాద్రి, జి.పాపారావు తదితరులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. -
100కు పైగా ఆక్వా హబ్‌లు
గతంలో సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారుడు దురదృష్టవశాత్తు చనిపోతే పట్టించుకున్న వారు లేరు. కానీ మన ప్రభుత్వం వచ్చాక అలా చనిపోతే వెంటనే గుర్తించాం. 67 కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున మొత్తం రూ.6.7 కోట్లు ఆర్థిక సహాయం అందజేశాం. దేవుడి దయ వల్ల మత్స్యకారులకు మంచి కార్యక్రమాలు చేయగలుగుతున్నాం. పశ్చిమ గోదావరి జిల్లాలో ఏపీ ఫిషరీస్ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తున్నాం. ఈ ఏడాదిలోనే పనులు మొదలు పెట్టబోతున్నాం. దీని ద్వారా మత్స్యకారులకు సాంకేతిక పరమైన శిక్షణ ఇచ్చి, వారికి మంచి ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యం. నాణ్యత లేకపోవడం వల్ల ఆక్వా రైతులు నష్టపోకూడదన్న లక్ష్యంతో ఆక్వా సాగు చేస్తున్న 35 నియోజకవర్గాల్లో రూ.50.30 కోట్లతో ఇంటిగ్రేటెడ్ ఆక్వా ల్యాబ్‌లు ఏర్పాటు చేశాం. ఆర్బీకేలతో అనుసంధానం చేసి ప్రతి రైతుకు నాణ్యతతో కూడిన సీడ్, ఫీడ్, మందులు సరఫరా చేస్తున్నాం. అన్ని విధాలా తోడుగా ఉంటున్నాం. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ఆక్వా రైతులతో పాటు ఏ ఒక్క మత్స్యకారుడు నష్టపోకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా 100కు పైగా ఆక్వా హబ్‌ల నిర్మాణం చేపడుతున్నామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. ఒక్కో హబ్ కింద 120 రిటెయిల్ షాప్‌ల చొప్పున మొత్తం 12 వేల షాప్‌లు వస్తాయని, రెండేళ్లలో వీటిని అందుబాటులోకి తెచ్చేందుకు కార్యాచరణ అమలు చేస్తున్నామని వెల్లడించారు. వీటి ద్వారా ఆక్వా ఉత్పత్తులతో పాటు మత్స్యకారుల చేపలకు గిట్టుబాటు ధర లభిస్తుందని చెప్పారు. చేపల వేటపై నిషేధ సమయంలో ఉపాధి కోల్పోయే మత్స్యకార కుటుంబాలను ఆదుకునేందుకు వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకం కింద వరుసగా మూడో ఏడాది 1,19,875 మత్స్యకార కుటుంబాలకు మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్లో బటన్ నొక్కి రూ.10 వేల చొప్పున రూ.119.88 కోట్లను వారి ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రాలు, ఆర్బీకేల నుంచి పాల్గొన్న అధికారులు, మత్స్యకారులను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. కోవిడ్ వల్ల ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ.. ప్రభుత్వ కష్టాలకన్నా, పేదలు, సామాన్యుల కష్టాలు ఇంకా ఎక్కువని భావించి ఇవాళ మత్స్యకార కుటుంబాల ఖాతాల్లో దాదాపు రూ.120 కోట్లు జమ చేస్తున్నందుకు ఎంతో సంతోష పడుతున్నానని అన్నారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. వీడియోకాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట నిలబెట్టుకున్నాను ► ఇది మంచి కార్యక్రమం. ఎందుకంటే ఒక వైపు కోవిడ్. మరోవైపు ఏప్రిల్ 15 నుంచి రెండు నెలల పాటు చేపల వేటపై నిషేధం. ఇటువంటి పరిస్థితుల్లో దాదాపు 1.20 లక్షల కుటుంబాలకు రూ.10 వేల సహాయం ఎంతో ఉపయోగపడుతుంది. ► ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి రాగానే, ప్రతి కుటుంబంలో ఒక అన్నగా, తమ్ముడిగా, అన్ని రకాలుగా తోడుగా ఉంటానని చెప్పి, మత్స్యకార భరోసా పథకం అమలు చేస్తున్నాము. తొలి ఏడాది లక్ష మందితో మొదలు పెట్టగా ఇప్పుడు దాదాపు 1.20 లక్షల మంది లబ్ధిదారులు. ఇప్పటి వరకు దాదాపు రూ.332 కోట్లు నేరుగా మత్స్యకార కుటుంబాలకు చేరవేశామని సగర్వంగా తెలియజేస్తున్నాను. అక్క చెల్లెమ్మలకు ప్రతి అడుగులో తోడు ► మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 23 నెలల కాలంలో ప్రతి పథకం, ప్రతి అడుగులో.. అక్క చెల్లెమ్మలకు అండగా ఉండాలని, పేదలకు మంచి జరగాలనే తపన, తాపత్రయంతో అడుగులు వేశాము. ► అమ్మ ఒడి, గోరుముద్ద, విద్యా కానుక, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, వైఎస్సార్ రైతు భరోసా, ఆసరా, వైఎస్సార్ చేయూత, పెన్షన్ కానుక, వైఎస్సార్ ఇళ్ల పట్టాల పంపిణీ.. ఇలా ఏ పథకం చూసినా ఎక్కడా వివక్ష, అవినీతికి తావు లేకుండా చూస్తున్నాం. గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చి, మీ బిడ్డగా ప్రతి పథకంలో పేదలకు అండగా ఉన్నానని సంతోషంగా చెబుతున్నాను. గతంలో అలా.. ఇప్పుడు ఇలా.. ► చేపల వేట నిషేధ సమయంలో గతంలో రూ.4 వేలు ఇస్తామని చెప్పినా, ఏనాడూ సక్రమంగా అమలు చేయలేదు. ఏనాడూ సకాలంలో ఇవ్వలేదు. ఇచ్చినా అరకొరగానే ఇచ్చారు. డీజిల్‌పై రూ.6 సబ్సిడీ ఇస్తామన్నా సక్రమంగా ఏనాడూ ఇవ్వలేదు. పైగా కేవలం 5 వేల బోట్లకు మాత్రమే ఇచ్చారు. ► ఇవాళ 26,823 బోట్లకు లీటరు డీజిల్‌కు రూ.9 సబ్సిడీ ఇస్తున్నాము. అంటే బోట్ల సంఖ్య పెరిగింది. సబ్సిడీ కూడా పెరిగింది. 100 పెట్రోల్ బంకులను అందు కోసం కేటాయించాము. డీజిల్ కొనుగోలు చేసిన వెంటనే స్మార్ట్ కార్డుల ద్వారా ఆ రాయితీని బంకు యజమానులకు చెల్లించేలా ఏర్పాటు చేశాం. దీనికి మరో రూ.48 కోట్లు ఖర్చు చేశామని మీ బిడ్డగా సగర్వంగా తెలియజేస్తున్నాను. ఆక్వా రైతులకు అన్ని విధాలా అండ ► మత్స్యకారులకు తోడుగా ఉండడంతో పాటు, ఆక్వా సాగుపై ఆధార పడిన రైతులకు కూడా అండగా నిల్చాం. ఆక్వా సాగుకు యూనిట్ విద్యుత్ రూ.1.50కే సరఫరా చేయడం ద్వారా 53,550 మంది ఆక్వా రైతులకు ప్రయోజనం కలుగుతోంది. ► దీని వల్ల ఏటా దాదాపు రూ.780 కోట్ల భారం పడుతున్నా, ఈ రెండేళ్లలో దాదాపు రూ.1,560 కోట్ల భారం పడుతున్నా ఆక్వా రైతుల కోసం ప్రభుత్వం సంతోషంగా భరిస్తోంది. ఆక్వా రైతులకు అన్ని విధాలా అండగా నిలుస్తున్నాం. వేగంగా ఫిషింగ్ హార్బర్లు ► మన మత్స్యకారులు ఉపాధి కోసం సుదూర ప్రాంతాలకు వలస పోయి, తెలిసీ తెలియక విదేశీ సముద్ర జలాల్లోకి ప్రవేశించి, జైళ్ల పాలవుతున్నారని గతంలో ఎవరూ ఆలోచించలేదు. ఆ పరిస్థితి రాకూడదని 8 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. ► గుంటూరు జిల్లా నిజాంపట్నం, కృష్ణా జిల్లా మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్ల ఆధునికీకరణతో పాటు, తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడ, నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె వద్ద కొత్తగా రెండు ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టాం. ఇప్పటికే వీటి పనులు మొదలయ్యాయి. ► ఈ నాలుగు ప్రాజెక్టుల వ్యయం రూ.1,509.80 కోట్లు. రెండో దశలో భాగంగా రూ.1,365.35 కోట్ల అంచనాతో శ్రీకాకుళం జిల్లా బుడగట్లపాలెం, విశాఖ జిల్లా పూడిమడక, పశ్చిమ గోదావరి జిల్లా బియ్యపుతిప్ప, ప్రకాశం జిల్లా కొత్తపట్నంలో నాలుగు ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి త్వరలో టెండర్లు ఖరారు చేసి, ఈ ఏడాదిలోనే పనులు మొదలు పెడతాం. ► రూ.2,775 కోట్లతో నిర్మించే ఎనిమిది ఫిషింగ్ హార్బర్ల నిర్మాణంతో దాదాపు 80 వేల మంది మత్స్యకారులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. అందుకే ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నాము. ఓఎన్జీసీ ఇవ్వకపోయినా.. ► 2012లో జీఎస్పీసీ, ఓఎన్జీసీ తవ్వకాల వల్ల ముమ్మిడివరం నియోజకవర్గంలో దాదాపు 14,927 మత్స్యకార కుటుంబాలకు ఉపాధి లేకుండా పోయింది. ఒక్కో కుటుంబానికి రూ.47,250 పరిహారం ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. వారి గురించి ఎవరూ పట్టించుకోలేదు. ► ఆ కుటుంబాలను ఆదుకుంటానని నా పాదయాత్రలో వారికి హామీ ఇచ్చాను. ఆ తర్వాత అధికారంలోకి రాగానే ముమ్మిడివరంలోనే సమావేశం పెట్టి, రూ.75 కోట్లు ప్రభుత్వమే భరించి ఇచ్చింది. ఆ విధంగా 14,927 కుటుంబాలను ఆదుకుంది. ఓఎన్జీసీ నుంచి ఇంకా ఆ డబ్బులు పూర్తిగా రాలేదు. ► పేదలు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో ప్రతి అడుగు ముందుకు వేశామని సగర్వంగా చెబుతున్నా. దేవుడి దయతో మీ అందరికీ ఇంకా మంచి చేసే అవకాశం రావాలని కోరుకుంటున్నాను. ► ఈ కార్యక్రమంలో పశు సంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, ఎంపీ మోపిదేవి వెంకటరమణ, సీఎస్ ఆదిత్యనాథ్‌దాస్, వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, మత్స్యశాఖ కమిషనర్ కె.కన్నబాబు, ప్రభుత్వ సలహాదారు (వ్యవసాయం) అంబటి కృష్ణారెడ్డి, పలువురు అధికారులు పాల్గొన్నారు. మత్యకారుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు కోవిడ్ సంక్షోభంలో కూడా ఏ ఒక్క కార్యక్రమాన్ని, పథకాన్ని ఆపకుండా దేశంలోనే మీరు (సీఎం) ఆదర్శంగా నిలుస్తున్నారు. విదేశాల్లో చిక్కుకున్న మత్స్యకారులను సురక్షితంగా తీసుకు వచ్చారు. కోవిడ్ సమయంలో వివిధ తీర ప్రాంతాలు, పోర్టుల్లో చిక్కుకుపోయిన మత్య్సకారులను స్వస్థలాలకు తరలించారు. తీర ప్రాంతం ఉన్న ప్రతి జిల్లాకు హార్బర్ కట్టించాలన్న మీ ఆలోచనకు ప్రతి మత్స్యకారుడు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. – సీదిరి అప్పలరాజు, పశు సంవర్థక శాఖ మంత్రి -
మత్స్య రంగానికి రూ.3,450.92 కోట్ల రుణం
సాక్షి, అమరావతి: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22)లో మత్స్య రంగానికి రూ.3,450.92 కోట్ల రుణం అవసరమని నాబార్డ్ అంచనా వేసింది. ఇది గత ఏడాది కన్నా 26.81 శాతం అధికమని పేర్కొంది. ఈ విషయాన్ని రాష్ట్ర ఫోకస్ పత్రంలో నాబార్డ్ వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల జీవనోపాధి పెంచేందుకు పలు చర్యలు తీసుకుంటోందని ప్రశంసించింది. మత్స్యకారుల బోట్లకు ఇచ్చే డీజిల్ సబ్సిడీని పెంచిందని, వేట నిషేధ సమయంలో వైఎస్సార్ మత్స్యకార భరోసా పేరుతో వరుసగా రెండేళ్లు వారికి ఆర్థికసాయం అందించిందని తెలిపింది. ఆక్వా రైతులను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుందని, రైతుభరోసా కేంద్రాల ద్వారా నాణ్యమైన సర్టిఫైడ్ ఇన్పుట్స్ సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టిందని, ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తోందని వివరించింది. ఈ నేపథ్యంలో ఈ రంగానికి రుణ అవసరం గతంతో పోలిస్తే బాగా పెరిగిందని నాబార్డ్ పేర్కొంది. -
హార్బర్ల నిర్మాణంతో మారనున్న ముఖచిత్రం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నిర్మించనున్న ఫిషింగ్ హార్బర్ల ద్వారా తీర ప్రాంతం సంపదకు నెలవుగా, ఉపాధికి కల్పతరువుగా మారనుంది. ఇప్పటి వరకు నిర్లక్ష్యానికి గురైన ఈ ప్రాంతం అనూహ్యంగా అభివృద్ది చెందనుంది. అర్థరాత్రి అపరాత్రి అనే తేడా లేకుండా సముద్రంలో చేపల వేటకు వెళ్లే పడవలు, వేట ముగించుకుని ఒడ్డుకు వచ్చే పడవలతో తీర ప్రాంతం సందడిగా మారనుంది. మత్స్య సంపదను నిల్వచేసే కోల్డు స్టోరేజి ప్లాంట్లు, ప్రాసెసింగ్ యూనిట్లు అక్కడ ఏర్పాటు కానున్నాయి. అక్కడి నుంచే దేశ విదేశాలకు మత్స్య సంపదను ఎగుమతి చేసే సంస్థలు వ్యాపార కార్యక్రమాలు ప్రారంభించనున్నాయి. రూ.1,510 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 4 హార్బర్ల వల్ల అక్కడి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవుతాయి. రాష్ట్ర ప్రభుత్వ అంచనాల మేరకు కొత్తగా 5,900 మర పడవలకు హార్బర్లలో అన్ని సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. సముద్రంలో వేటకు వెళ్లే సమయంలో పడవలకు అవసరమైన డీజిల్, ఐస్‌ను హార్బరులోనే కొనుగోలు చేయవచ్చు. గత ప్రభుత్వం ఈ హార్బర్లను నిర్లక్ష్యం చేయడంతో మర పడవల నిర్వాహకులు తీరం నుంచి 10 – 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న పట్టణాల్లో డీజిల్, ఐస్‌ను కొనుగోలు చేస్తున్నారు. ఇప్పుడు హార్బర్లలోనే పెట్రోల్ బంకులు, ఐస్ ప్లాంట్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుండటంతో నిర్వాహకులకు ఆ సమస్యలు తప్పుతాయి. పెరిగిన మర పడవల కారణంగా సాలీనా 2,37,350 టన్నుల మత్స్య సంపద అదనంగా లభ్యమవుతుందని నిపుణుల అంచనా. దీని వల్ల సాలీనా రూ.500 కోట్లకు పైగా ఆదాయం పెరగనుంది. వీటిన్నింటిపై ఆధారపడి జీవించే 1,18,000 కుటుంబాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనుంది. చేపల వేట, అమ్మకాలు, ప్రాసెసింగ్, క్రయ విక్రయాల్లో కార్మికులకు విస్తారంగా అవకాశం లభిస్తుంది. 20 నుంచి 40 టన్నుల నిల్వ సామర్థ్యం కలిగిన ఐస్ ప్లాంట్ల నిర్మాణాలు జరిగే అవకాశం ఉండటంతో 2,240 టన్నుల ఐస్ అక్కడ అందుబాటులో ఉంటుంది. మీ మేలు మరవలేం నేను ఉన్నాను.. నేను విన్నాను’ అని మీరు పాదయాత్రలో అన్నారు. సీఎం కాగానే మీరు ఆ మాట నిలబెట్టుకున్నారు. తక్కువ టైంలో మా చేతికి రూ.10 వేల సాయం అందింది. మీరు చిన్న కర్ర తెప్పలను కూడా గుర్తించి వాళ్లకు కూడా రూ.10 వేలు ఇచ్చినందుకు మీకు రుణపడి ఉంటాం. గతంలో ఇలాంటి సాయం ఎప్పుడూ అందలేదు. ఎవరైనా వేటకు వెళ్లి మరణిస్తే అందించే సాయాన్ని ఏకంగా రూ.10 లక్షలు చేశారు. పాకిస్తాన్, గుజరాత్లో చిక్కుకుపోయిన మత్స్యకారులను రప్పించిన మీ మేలు మరవలేం. మంచినీళ్లు పేట దగ్గర జెట్టీ నిర్మాణానికి హామీ ఇచ్చారు. మత్స్యకారుడికి ఎమ్మెల్యే టిక్కెట్టు ఇవ్వడంతో పాటు మంత్రి పదవి కూడా ఇచ్చారు. మత్స్యకారులం అందరం మీకు రుణపడి ఉంటాం. ఎల్లకాలం మీరే సీఎంగా ఉండాలి. – లక్ష్మయ్య, మత్స్యకారుడు, మంచినీళ్లపేట, శ్రీకాకుళం. ఏ ప్రభుత్వం ఇలా మేలు చేయలేదు మీరు ఆక్వా కల్చర్‌లో అన్ని అంశాలను ఒక గొడుగు కిందకు తెస్తూ.. ఆక్వాకల్చర్ అథారిటీ ఏర్పాటు చేయడం వల్ల మా సమస్యలన్నింటికి పరిష్కారం కనిపిస్తోంది. గతంలో ఏ ప్రభుత్వమూ చూడనంత తీవ్రంగా, తీక్షణంగా మీరు మా సమస్యను చూసి పరిష్కరిస్తున్నారు. గతంలో ఇంత మేలు ఎప్పుడూ జరగలేదు. యూనిట్ విద్యుత్ రూ.1.50 చొప్పున ఇవ్వడం ఎంతో ఉపయోగకరంగా ఉంది. ఒకరకంగా ఈ రోజు రైతులు ప్రాణాలతో ఉన్నారంటే అందుకు మీరే కారణం. కోవిడ్ సమయంలోనూ మద్దతు ధర కల్పించి ఆదుకుంటున్నారు. ఆక్వా హబ్‌లు, ప్రాసెసింగ్ యూనిట్లు, జనతా బజార్లు మా తల రాతలను మారుస్తాయనడంతో సందేహం లేదు. – కనుమూరి ప్రసాద్, గుడివాడ, కృష్ణా జిల్లా -
వారిని రాష్ట్రానికి తీసుకొస్తాం: మంత్రి మోపిదేవి
సాక్షి, అమరావతి: లాక్డౌన్ కారణంగా తమిళనాడు రాష్ట్రంలోని కాసిమేడ్ ప్రాంతంలో చిక్కుకున్న ఏపీ మత్స్యకారులను వారి స్వస్థలాలకు చేరవేయడానికి ఏపీ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో ఏపీ అధికారులు తమిళనాడు ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారు. మత్స్యకారులను ఏపీకి తీసుకొచ్చేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నామని.. ఆందోళన పడొద్దని మత్స్యశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ తెలిపారు. రెండు, మూడు రోజుల్లో వారిని స్వస్థలాలకు చేరుస్తామని పేర్కొన్నారు. రైళ్లు, రోడ్డు మార్గం ద్వారా మత్స్యకారులను రాష్ట్రానికి తీసుకొస్తామని మంత్రి వెల్లడించారు. (ఏపీలో 8 కొత్త ఫిషింగ్ హార్బర్లు) గుజరాత్లో చిక్కుకున్న మన రాష్ట్ర మత్స్యకారులు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చొరవతో ఎట్టకేలకు స్వస్థలాలకు చేరుకుంటున్నారు. లాక్‌డౌన్‌తో రాష్ట్రానికి చెందిన 4,068 మంది మత్స్యకారులు గుజరాత్లో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. వీరిలో అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారు 2,911 మంది ఉండగా, విజయనగరం జిల్లాకు చెందిన వారు 711, విశాఖపట్నం జిల్లాకు చెందినవారు 418, తూర్పుగోదావరి జిల్లాకు చెందినవారు 13 మంది, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన వారు ఒకరు, ఒడిశాలో ఉంటున్న మరో 14 మంది ఉన్నారు. లాక్డౌన్ నేపథ్యంలో గుజరాత్లో నిలువ నీడ లేక, తినడానికి తిండి లేక 37 రోజుల పాటు వీరంతా అష్టకష్టాలు పడ్డారు. వారి కుటుంబసభ్యుల వినతి మేరకు వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గుజరాత్ సీఎం విజయ్ రూపానీతో మాట్లాడారు. మత్స్యకారులను రాష్ట్రానికి తరలించడానికి సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. మత్స్యకారులకు రాష్ట్రానికి తీసుకురావడానికి రూ.3 కోట్లు విడుదల చేయించారు. (విదేశాంగమంత్రికి సీఎం వైఎస్ జగన్ లేఖ) -
అకాల వర్షం: రెండు గ్రామాల్లో పెనువిషాదం
కృత్తివెన్ను(పెడన): గంగపుత్రులకు ఆధారం సాగరం.. సాయమందించేది వల.. కడుపునింపేది వేట. ఉవ్వెత్తున ఎగసే అలలతోనే నిత్యం పోరాటం చేస్తారు.. కష్టమైనా, నష్టమైనా.. రాత్రయినా, పగలైనా బతుకు పోరు సాగిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటారు. అదే ఆశతో వలలు పట్టుకుని కడలిలోకి వెళ్లారు కృత్తివెన్ను మండల పరిధిలోని మత్స్యకారులు. వేట ముగిసింది. ఇక తిరిగెళ్లి పోదాం అనుకుంటున్న తరుణంలో.. అనుకోని విపత్తు వారి ఆశలను చిదిమేసింది. పెనుగాలి రూపంలో సాగరం మధ్యలో తాండవమాడి వారిని కడలి ఒడిలోకి లాగేసుకుంది. వారి కుటుంబ సభ్యులను శాశ్వత శోకంలో నింపేసింది. మండల పరిధిలోని మత్య్సకార గ్రామాలైన పల్లెపాలెం, ఒర్లగొందితిప్పలకు చెందిన ఆరుగురు గంగపుత్రులు వేటకు సముద్రంలోకి వెళ్లి గల్లంతయ్యారు. వీరిలో నలుగురి మృత దేహాలు లభ్యం కాగా.. మరో ఇద్దరి కోసం గాలింపు కొనసాగుతోంది. మంత్రి పేర్ని నాని, ఎమ్మెల్యే జోగి రమేష్‌లు మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఒకే కుటుంబంలో ముగ్గురు.. ఒర్లగొందితిప్ప గ్రామానికి చెందిన జల్లా వెంకటేశ్వరావు (52) అతని కుమారులు దావీదు (23), ఏసురాజు.. వెంకటేశ్వరరావు సోదరుడు జల్లా పెద్దిరాజులు (60) ఇతని కుమారుడు మత్యాలరాజులు బుధవారం రాత్రి సమీపంలోని సముద్రపు ముఖద్వారం వద్దనున్న వలకట్టు వద్ద చేపలవేటకు వెళ్లారు. రాత్రంతా చేపల వేట సాగించి తెల్లవారు జామున ఇంటికి బయలు దేరుతుండగా ఒక్కసారిగా ఉప్పెనలా పొంగిన సముద్రం, ఆపై పెనుగాలులు, వడగండ్ల వర్షంతో ఒక్కసారిగా వారి పడవలు బోల్తాపడ్డాయి. వెంకటేశ్వరరావు, అతని కుమారుడు దావీదు, సోదరుడు పెద్దిరాజులు సముద్రంలో గల్లంతవగా, ముత్యాలరాజు తాటిపట్టెసాయంతో బయటపడ్డాడు. ఏసురాజు సముద్రం లోపలకి పోగా అదృష్టవశాత్తు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నాడు. సోదరులైన వెంకటేశ్వరరావు, పెద్దిరాజుల మృతదేహాలు లభ్యం కాగా వెంకటేశ్వరరావు కుమారుడు దావీదు ఆచూకి తెలియాల్సి ఉంది. వృద్ధాప్యాన్ని సైతం లెక్కచేయక.. కృత్తివెన్ను పల్లెపాలెంకు చెందిన వారిది మరోగాథ. ఇక్కడ నుంచి 15 మంది బుధవారం రాత్రి గ్రామానికి సమీపంలోని సముద్రపు పాయలో వలకట్లు వద్దకు చేపలకోసం వెళ్లారు. వీరంతా తమ పని పూర్తి చేసుకుని తెల్లవారుజామున తిరుగుపయనమవ్వగా ఒక్కసారిగా పెనుగాలులు వీచడంతో వారి పడవ నీటిలో బోల్తాపడిపోయింది. దీంతో వారంతా నీటిలో మునిగిపోగా 12 మంది ఈదుకుంటూ సురక్షితంగా ఒడ్డుకు చేరుకోగా వనమాలి వెంకటేశ్వరరావు (61), మోకా నాగేశ్వరరావు (64), బలగం నరసింహమూర్తి (62)లు నీటిలో మునిగి గల్లంతయ్యారు. వీరిలో రెండు మృతదేహాలు లభ్యం కాగా నరసింహమూర్తి కోసం గాలింపు కొనసాగుతోంది. చనిపోయిన వారు ముగ్గురు 60 ఏళ్లు పైబడిన వారే.. కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా వృద్ధాప్యంలో కూడా వారు సాహసించి ప్రాణాలను ఫణంగా పెట్టి వేటకు వెళ్లి మరణించిన ఘటన అందరిని కలచివేసింది. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండ.. వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మరణించిన వారి కుంటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని రాష్ట్ర మంత్రి పేర్ని నాని వారి కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. ఆయన ఎమ్మెల్యే జోగి రమేష్‌తో కలసి కృత్తివెన్ను, ఒర్లగొందితిప్ప గ్రామాలను సందర్శించి మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడిన ఏసురాజు, ముత్యాలరాజులను ప్రమాద ఘటన గురించి వివరాలడిగి తెలుసుకున్నారు. మరణించిన ఒక్కొక్క కుటుంబానికి రూ. 10లక్షలు ఆర్థికసాయం ప్రభుత్వం నుంచి ఇవ్వనున్నట్లు ప్రకటించారు. జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు, ఫిషరీష్ జాయింట్ డైరెక్టర్ లాల్‌మహ్మద్, డీడీ రాఘవరెడ్డి, డీఎస్పీ మహబూబ్‌బాషా, బందరు ఆర్డీవో ఖాజావలీ, పార్టీ మండల కని్వనర్ గంగాధర్, పార్టీ నాయకులు ఉన్నారు. -
ఔను.. వారంతా మళ్లీ పుట్టారు!
సాక్షిప్రతినిధి విజయనగరం: కడలిపుత్రులకు నిజంగా ఇది పునర్జన్మే. మృత్యుభయాన్ని నాలుగునెలలకు పైగా అనుభవించిన వారు అదృష్టవశాత్తూ ముఖ్యమంత్రి చొరవతో అక్కడినుంచి బయటపడ్డారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకోవడానికి, రాజన్న సంక్షేమ రాజ్యాన్ని తిరిగి తీసుకురావడానికే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన వై.ఎస్.జగన్మోహన్రెడ్డి చెప్పిన ప్రతీదీ చేసి చూపిస్తున్నారు. రాష్ట్రంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా వెంటనే స్పందించి ఆదుకుంటున్నారు. ఇటీవలే పాకిస్థాన్ చెర నుంచి మన జిల్లాకు చెందిన మత్స్యకారులను విడిపించారు. తాజాగా బంగ్లాదేశ్ జైలు నుంచి మన మత్స్యకారులకు విముక్తి కలిగించారు. నాలుగు నెలలకుపైగా బంగ్లాదేశ్ జైల్లో అనేక కష్టాలు పడిన ఎనిమిది మందికి పునర్జన్మనిచ్చారు. దినదినగండం... నాలుగు నెలల జీవనం బంగ్లాదేశ్ జైలులో తాము అనుభవించిన నాలుగు నెలలూ ప్రత్యక్ష నరకాన్ని చూశామని మత్స్యకారులుకన్నీరు మున్నీరుగా విలపించారు. మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నవారు ‘సాక్షి ప్రతినిధి’తో మాట్లాడారు. ఆ వివరాలివి. ‘అమృత’ అనే బోటులో వెళ్లి పట్టుబడ్డ మత్స్యకారులను పట్టుకున్న బంగ్లాదేశ్ కోస్ట్‌గార్డ్ తొంభై మంది సిబ్బంది ఉన్న ఒక భారీ ఓడతో ‘అమృత’ను లాక్కెళ్లారు. మత్స్యకారులను తాళ్లతో కట్టేసి యాభై మంది బంగ్లాదేశీ ఖైదీలుండే గదుల్లో ఒక్కొక్కరినీ విడివిడిగా పడేశారు. భాష తెలియని మనుషుల మధ్య, బానిసల్లా బతికారు. కేవలం రొట్టె, తినడానికి పనికిరాని ఆహారంతో అర్ధాకలితో గడిపారు. నిలబడి మూత్రవిసర్జన చేస్తే వెనుకగా వచ్చి లాఠీతో పరిగెత్తించి మరీ కొట్టేవారు. దుస్తులను బోటులోనే పోగొట్టుకోగా, ఒక స్వచ్ఛంద సంస్థ ఇచ్చిన నైట్ ప్యాంటునే రోజూ ఉతికి వేసుకున్నారు. ఇక్కడున్న వారి కుటుంబాల పరిస్థితి మరీ దయనీయం. వస్తారో రారో తెలియని తమవారి కోసం కళ్లు కాయలుకాసేలా ఎదురుచూశారు. తినడానికి లేక, పిల్లలతో పాటు పెద్దలు పస్తులున్నారు. ఏదైతేనేం చివరికి మనసున్న ముఖ్యమంత్రి వల్ల వారు మళ్లీ మనుషులయ్యారు. స్వాగతం పలికిన ఎమ్మెల్యే, కలెక్టర్ 2019 సెస్టెంబర్ 24వ తేదిన పూసపాటిరేగ మండలం తిప్పలవలస గ్రామానికి చెందిన 8 మంది మత్స్యకారులు విశాఖపట్నం షిప్పింగ్ హార్బర్ నుంచి బోటులో చేపల వేటకు వెళ్లారు. ఆక్టోబర్ 2వ తేదీన బోటు పాడవడం... వాతావరణం అనుకూలింకచపోవడంతో వారికి తెలియకుండానే బంగ్లాదేశ్ సరిహద్దుల్లోకి వెళ్లిపోయారు. వెంటనే అక్కడి అధికారులు వారిని జైల్లో పెట్టారు. సీఎం జగన్ మోహన్‌రెడ్డి చొరవవల్ల జనవరి 28వ తేదీన వారు బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలయ్యారు. అక్కడి నుంచి బోటులో కోల్కత్తా జలాల్లోకి ప్రవేశించారు. హరిపురం చేరుకునేసరికి బోటు మళ్లీ మొరాయించింది. ఇక చేసేది లేక దానిని ఆ గ్రామంలోనే వదిలి వేరే బోటులో కోల్కత్తా చేరుకుని అక్కడినుంచి రైల్లో విశాఖ చేరుకున్నారు. మంగళవారం ఉదయం వారు విజయనగరం వచ్చారు. కలెక్టర్ డాక్టర్ ఎం.హరిజవహర్‌లాల్, నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, మత్స్యశాఖ డీడీ సోమలత, జిల్లా మత్స్యకార సహకార సంఘం అధ్యక్షుడు బర్రి చిన్నప్పన్న, విశాఖ మత్స్యకార సంఘం నాయకుడు వాసుపల్లి జానకీరామ్ కలెక్టరేట్ వద్ద మత్యకారులకు స్వాగతం పలికారు. వారిని, మత్స్యకార నాయకుడు వాసుపల్లి జానకీరామ్‌ను సత్కరించారు. అనంతరం మత్స్యకారులను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రభుత్వ పరంగా ఆదుకుంటాం పరాయి దేశంలో ఖైదీగా గడపడం చాలా బాధాకరం. కుటుంబ సభ్యులకు దూరంగా, తిరిగి వస్తామో రామో తెలియని భయంలో మత్స్యకారులు అనుభవించిన మాససిక సంఘర్షణ మాటల్లో చెప్పలేనిది. సీఎం, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేల చొరవతో వారికి విముక్తి లభించింది. ప్రభుత్వ పరంగా వారిని అన్ని విధాలుగా ఆదుకోవడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. త్వరలోనే చేయూతనందిస్తాం. – డాక్టర్ ఎం.హరిజవహర్‌లాల్,కలెక్టర్, విజయనగరం తక్కువ కాలంలోనే విడుదల అయ్యాం ఇంత తక్కువ కాలంలో మన దేశానికి వస్తామని అనుకోలేదు. మమ్మల్ని మా కుటుంబ సభ్యుల దగ్గరికి చేర్చిన సీఎం జగన్‌కు జీవితాంతం రుణపడి ఉంటాం. ఆయన దయ వల్ల మా భార్య, పిల్లలను కలుసుకోగలిగాం.– వాసుపల్లి అప్పన్న, మత్స్యకారుడు,తిప్పలవలస. సీఎం కారణంగానే పునర్జన్మ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మత్యకారులకు పునర్జన్మ ప్రసా దించారు. ఆయన చొరవ తీసుకోవడం వల్లనే తక్కువ కాలంలోనే మత్స్యకారులను బంగ్లాదేశ్ చెర నుంచి విడిపించి కుటుంబ సభ్యులకు అప్పగించగలిగాం. – బడ్డుకొండ అప్పలనాయుడు,ఎమ్మెల్యే, నెల్లిమర్ల. -
సీఎం జగన్ చొరవతో వారికి పునర్జన్మ..
సాక్షి, అమరావతి: మత్స్యకారుల పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉదారత చూపారని మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. పాకిస్తాన్ చెర నుంచి విడుదలయిన 20 మంది ఆంధ్రా జాలర్లకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారని తెలిపారు. హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న మంత్రి మోపిదేవి మీడియాతో మాట్లాడారు. పాకిస్తాన్ చెరలో బందీలుగా ఉన్న మత్స్యకారులను సీఎం జగన్ చొరవ,కృషితో విడిపించడం గర్వంగా ఉందన్నారు. 14 మాసాలుగా ఏపీకి చెందిన 22 మంది మత్స్యకారులు పాకిస్తాన్ జైలులో బిక్కుబిక్కుమంటూ గడిపారని.. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రమాణాస్వీకారం చేశారన్న వార్తతో స్వస్థలం చేరుకోగలమన్న ఆత్మవిశ్వాసం వారిలో కలిగిందని తెలిపారు. సీఎం జగన్ ప్రసాదించిన పునర్జన్మగా వారు భావిస్తున్నారన్నారు. రాత్రి 8 గంటలకు సీఎం జగన్మోహన్రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలపనున్నారని పేర్కొన్నారు. మరో ఇద్దరు మత్స్యకారులను రెండు రోజుల్లో తీసుకువస్తామని చెప్పారు. 20 మంది మత్స్యకారులు సాధారణ స్థితికి వచ్చే వరకు ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. మత్స్యకారులకు సీఎం జగన్ ఐదు లక్షల రూపాయల చొప్పున చెక్‌లు అందజేస్తారని మంత్రి మోపిదేవి వెల్లడించారు. (చదవండి: సీఎం జగన్‌కు రుణపడి ఉంటాం: మత్స్యకారులు) -
సీఎం జగన్‌కు రుణపడి ఉంటాం: మత్స్యకారులు
సాక్షి, అమరావతి: పాకిస్తాన్ చెర నుంచి విడిపించిన ఏపీ ప్రభుత్వానికి రుణపడి ఉంటామని ఆంధ్రా జాలర్లు తెలిపారు. మంగళవారం మత్స్యకారులు ఢిల్లీ నుంచి బయల్దేరి హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. వారి వెంట మంత్రి మోపిదేవి ఉన్నారు. అనంతరం విజయవాడలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని మత్స్యకారులు కలవనున్నారు. మీడియాతో మత్స్యకారులు మాట్లాడుతూ.. పదిహేను నెలలుగా నరకం అనుభవించామన్నారు. తమ విడుదలకు చొరవ చూపిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. పాకిస్తాన్ చెర నుంచి విడుదలయిన 20 మంది ఆంధ్రా జాలర్లకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒక్కొక్కరికి రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారని మంత్రి మోపిదేవి తెలిపారు. పొట్టకూటి కోసం గుజరాత్ వలస వెళ్ళిన ఆంధ్రా జాలర్లు 2018 డిసెంబర్లో పొరపాటున గుజరాత్ తీరం వద్ద పాకిస్తాన్ జలాల్లోకి ప్రవేశించడంతో పాకిస్తాన్ అరెస్ట్ చేసింది. పాదయాత్రలో ఉన్న వైఎస్ జగన్ దృష్టికి ఈ విషయాన్ని వైఎస్సార్సీపీ నేతలు, బాధితులు తీసుకొచ్చారు. తక్షణమే విడుదలకు కృషి చేయాల్సిందిగా వైఎస్ జగన్.. ఎంపీ విజయసాయిరెడ్డికి ఆదేశాలిచ్చారు. అప్పటి నుంచి విదేశాంగ శాఖపై ఎంపీ విజయసాయిరెడ్డి ఒత్తిడి తీసుకొచ్చారు. ఆంధ్ర జాలర్లను విడిచిపెట్టాలని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రికి పలుమార్లు ఆయన లేఖలు రాశారు. విజయసాయి రెడ్డి లేఖతో కేంద్ర విదేశాంగ శాఖ రంగంలోకి దిగింది. పాకిస్తాన్‌తో చర్చలు జరిపి ఆంధ్రా జాలర్లను విడిపించేందుకు చర్యలు తీసుకుంది. -
రేపు విశాఖకు మత్స్యకారులు..
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల కాలంలోనే పాకిస్తాన్ చెరలో చిక్కుకున్న ఆంధ్రా జాలర్లను విడిపించడానికి కృషి చేశామని మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. ఆయన శనివారం అమృత్సర్ చేరుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. నేడు మధ్యాహ్నం నాలుగు గంటలలోపు వాఘా బోర్డర్ వద్ద మత్స్యకారులను అప్పగించే కార్యక్రమం జరుగుతుందని వెల్లడించారు. పాక్ చెరలో బందీలుగా ఉన్న జాలర్లు వస్తారో రారో అని వారి కుటుంబసభ్యులు ఇన్నాళ్లూ ఆందోళనలో ఉన్నారన్నారు. వైఎస్ జగన్ ఆదేశాలతో ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించాయన్నారు. మత్స్యకారులను రేపు(మంగళవారం) సాయంత్రం 7 గంటలకు ఢిల్లీ నుంచి విశాఖపట్నానికి విమానంలో పంపించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇచ్చిన హామీలన్ని నిలబెట్టుకున్నారని మంత్రి మోపిదేవి తెలిపారు. (చదవండి: ఫలించిన ఎంపీ విజయసాయి ప్రయత్నాలు) -
ఫలించిన ఎంపీ విజయసాయి ప్రయత్నాలు
సాక్షి, విజయవాడ: పాకిస్తాన్ చెరలో ఉన్న ఆంధ్రా జాలర్ల విడుదలకు వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మత్స్యకారుల విడుదలకు పాకిస్తాన్ ప్రభుత్వం అంగీకరించింది. ఈ మేరకు విదేశాంగ శాఖకు సమాచారం అందింది. ఈ నెల 6న వాఘా సరిహద్దు వద్ద భారత్ అధికారులకు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన మొత్తం 20 మంది మత్స్యకారులను పాకిస్తాన్ అప్పగించనుంది. మత్స్యకారుల జాబితాను పాక్ ప్రభుత్వం.. భారత విదేశాంగ శాఖకు పంపించింది. పొట్టకూటి కోసం గుజరాత్ వలస వెళ్ళిన ఆంధ్రా జాలర్లు 2018 డిసెంబర్లో పొరపాటున గుజరాత్ తీరం వద్ద పాకిస్తాన్ జలాల్లోకి ప్రవేశించడంతో పాకిస్తాన్ అరెస్ట్ చేసింది. పాదయాత్రలో ఉన్న వైఎస్ జగన్ దృష్టికి ఈ విషయాన్ని వైఎస్సార్సీపీ నేతలు, బాధితులు తీసుకొచ్చారు. తక్షణమే విడుదలకు కృషి చేయాల్సిందిగా వైఎస్ జగన్.. ఎంపీ విజయసాయిరెడ్డికి ఆదేశాలిచ్చారు. అప్పటి నుంచి విదేశాంగ శాఖపై ఎంపీ విజయసాయిరెడ్డి ఒత్తిడి తీసుకొచ్చారు. ఆంధ్ర జాలర్లను విడిచిపెట్టాలని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రికి పలుమార్లు ఆయన లేఖలు రాశారు. విజయసాయి రెడ్డి లేఖతో కేంద్ర విదేశాంగ శాఖ రంగంలోకి దిగింది. పాకిస్తాన్‌తో చర్చలు జరిపి ఆంధ్రా జాలర్లను విడిపించేందుకు చర్యలు తీసుకుంది. దీంతో ఆంధ్ర జాలర్లను విడిచి పెట్టేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం అంగీకరించింది. ►పాకిస్తాన్ విడుదల చేసిన ఆంధ్రా జాలర్ల జాబితా.. ఎస్.కిశోర్ , తండ్రి అప్పారావు నికరందాస్ ధనరాజ్, తండ్రి అప్పన్న గరమత్తి, తండ్రి రాముడు ఎం. రాంబాబు, తండ్రి సన్యాసిరావు ఎస్. అప్పారావు, తండ్రి రాములు జి. రామారావు, తండ్రి అప్పన్న బాడి అప్పన్న, తండ్రి అప్పారావు ఎం. గురువులు, తండ్రి సతియా నక్కా అప్పన్న, తండ్రి లక్ష్మయ్య నక్క నర్సింగ్, తండ్రి లక్ష్మణ్ వి. శామ్యూల్, తండ్రి కన్నాలు కె.ఎర్రయ్య, తండ్రి లక్ష్మణరావు డి. సురాయి నారాయణన్, తండ్రి అప్పలస్వామి కందా మణి, తండ్రి అప్పారావు కోరాడ వెంకటేష్, తండ్రి నరసింహులు శేరాడ కళ్యాణ్, తండ్రి అప్పారావు కేశం రాజు, తండ్రి అమ్మోరు భైరవుడు, తండ్రి కొర్లయ్య సన్యాసిరావు, తండ్రి మీసేను సుమంత్ తండ్రి ప్రదీప్ -
కాసుల కచ్చిడి
ఈ చిత్రంలో కనిపిస్తున్న చేప పేరు కచ్చిడి. ఈ చేప వలకు చిక్కితే మత్స్యకారులకు కాసుల పంటే. ఆడ, మగ చేపల్లో.. ఈ రకం మగ చేపకు విపరీతమైన డిమాండ్ ఉంది. దీనిని మందుల తయారీలో ఉపయోగిస్తారు. అందువల్ల కచ్చిడి చేపను అధిక ధరకు కొనుగోలు చేస్తారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ మత్స్యకారులకు చిక్కిన కచ్చిడి సుమారు 30 కేజీల బరువుంది. ఆదివారం కుంభాభిషేకం రేవులో దీనిని వేలం వేయగా రూ.2.05 లక్షల ధర పలికింది. గతంలోనూ కచ్చిడి చేప రూ.1.80 లక్షలు పలకగా.. ఈసారి అంతకుమించి రేటు వచ్చింది. కాకినాడకు చెందిన వ్యాపారి కచ్చిడి చేపను కొనుగోలు చేసి దానిని హౌరాకు పంపించారు. – సర్పవరం (కాకినాడ రూరల్) -
దాయాది దేశం దయ కోసం ఎదురు చూపులు
ఏడ్చీ ఏడ్చీ కన్నీళ్లు ఇంకిపోయాయి.. అడిగీ అడిగీ గుండెలు ఎండిపోయాయి. ఎదురుచూసీ చూసీ చూపులు అవిసిపోయాయి. అయినా లాభం లేదు. కడుపున పుట్టిన వారి కోసం కొందరు, కట్టుకున్న వారి కోసం మరికొందరు, తోబుట్టువుల కోసం ఇంకొందరు నెలల తరబడి నిరీక్షిస్తూనే ఉన్నారు. ఎక్కడో పాకిస్తాన్ చెరలో చిక్కుకుపోయిన వారి కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. ప్రతి వారం ఠంచనుగా అధికారులకు విన్నపాలు అందిస్తున్నారు. కనిపించిన నాయకుల వద్ద విజ్ఞప్తులు చేస్తున్నారు. అయినా వారి నిరీక్షణ ఫలించడం లేదు. గంగపుత్రుల బెంగ తీరడం లేదు. సాక్షి, అరసవల్లి(శ్రీకాకుళం) : జిల్లా గంగపుత్రులకు దాయాది దేశ కష్టాలు ఇంకా తీరలేదు. ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన మన గంగ పుత్రులు వలసకు వెళ్లి పొరపాటున పొరుగు దేశ సరిహద్దును క్రాస్ చేయడంతో పాకిస్తాన్ దళం అదుపులోకి తీసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇలా మొత్తం 22 మంది మత్స్యకారులు పాకిస్తాన్ కోస్ట్‌గార్డులకు చిక్కడంతో తీవ్ర ఆందోళనగా పరిస్థితులు మా రాయి. వీరి కోసం ఆయా కుటుంబ సభ్యులు ఎదురుచూపులు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. అసలు వాళ్లంతా అక్కడ ఎలా ఉన్నారో ఎప్పుడొస్తారో కనీస సమాచారం కూడా తెలీని పరిస్థితులపై బాధిత కుటుంబాల రోదనలు అందరినీ కలచివేస్తున్నాయి. ఒక టి కాదు రెండు కాదు ఏకంగా ఏడు నెలలు గడుస్తున్నా పొరుగు దేశ దళాలకు చిక్కిన మన వాళ్లు ఇంకా మన తీరానికి చేరలేదు.గత ఏడాది నవంబర్ 28న గుజరాత్లో వీరావల్ ప్రాంతానికి బోట్లలో వలస వెళ్లే క్రమంలో అనుకోకుండా పాకిస్తాన్ సరిహద్దులోకి ప్రవేశించడంతో ఆ దేశ కోస్ట్ గార్డు సిబ్బంది మొత్తం 22 మంది మత్స్యకారులను అదుపులోకి తీసుకున్న సంగతి విదితమే. ఇందులో మన జిల్లాకు చెందిన వారు అత్యధికంగా 15 మంది ఉంటే, విజయనగరం జిల్లాకు చెందిన వారు ఐదుగురు కాగా, మరో ఇద్దరు ఎవరో ప్రభుత్వం గుర్తించలేదు. దీంతో స్థానిక జిల్లాలో ఆ బాధిత కుటుంబాల పరిస్థితులు చూస్తుంటే కన్నీరు ఉబికి వస్తుంది. నెరవేరని గత ప్రభుత్వ హామీలు పొరుగు దేశ దళాలకు మన వాళ్లు చిక్కారని తెలియగానే నాటి టీడీపీ సర్కార్ ఆఘమేఘాల మీద వారి కుటుంబాలను ఆదుకుంటామని, ప్రతి బాధితుని ఇంటికి ప్రభుత్వం తరఫున రెండేసి లక్షల రూపాయలు, ఇంజిన్ బోట్లు ఇస్తామని, అలాగే రేషన్ కార్డు ఆధారంగా బాధితులను గుర్తించి వారి కుటుంబాలకు భృతిగా ఈ ఏడాది జనవరి నుంచి నెలకు రూ.4500 ఇస్తామంటూ వరుస ప్రకటనలు గుప్పించిన సంగతి తెలిసిందే. అయితే వీటిలో ఒక్కటంటే ఒక్కటి కూడా బాధితులకు అందలేదు. రేషన్ కార్డుల వారీగా మొత్తం 11 కుటుంబాలను గుర్తించి, వారికి రెండేసి లక్షల రూపాయలను కేటాయించి, ఇందులో రూ.1.25 లక్షలను ఇంజిన్ బోటు కోసం బాధితుల కుటుంబ సభ్యుల నుంచే వసూలు చేయించి, మిగిలిన మొత్తాన్ని మాత్రమే బాధితులకు అందజేసిన ఘనత గత ప్రభుత్వానికే చెందుతుంది. దీంతో ఆయా కుటుంబ సభ్యులంతా తమ వాళ్ల క్షేమ సమాచారాన్ని తెలియజేయాలని, అలాగే తమకు ప్రభుత్వం చెప్పిన పథకాలను అమలు చేయాల డిమాండ్ చేస్తున్నారు.ఆరు నెలల నుంచి ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్‌కు, జిల్లా మత్స్యశాఖ జెడి. కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయినప్పటికీ ఏమాత్రం ఫలితం లేకపోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాయాది దేశమైన పాకిస్తానీలు మా వాళ్లను వదలరు.. మన అధికారులు బాధితుల్ని ఆదుకోరంటూ మత్స్యకార సంక్షేమ సంఘ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చిక్కుకున్న జిల్లావాసులు వీరే జిల్లాలో ఎచ్చెర్ల, శ్రీకాకుళం నియోజకవర్గాలకు చెందిన మత్స్యకారులే పాకిస్తాన్ చెరలో చిక్కుకున్నారు. వీరిలో కేశం ఎర్రయ్య, కేశం రాజా, సూరాడ అప్పారావు, సూరాడ కిషోర్, సూరాడ కళ్యాణ్, గణగళ్ల రామారావు, బేరి సుమన్, మైలపల్లి సన్యాసి, మైలపల్లి రాంబాబు, చీకటి గురుమూర్తి, (డి,మత్స్యలేశం), దూడంగి సూర్యనారాయణ (శ్రీకాకుళం), వాసిపల్లి శ్యామ్యూల్, కోనాడ వెంకటేష్, బడే అప్పన్న (బడివానిపేట), పెంట మణి (ఎచ్చెర్ల) ఉన్నారు. వీరిలో పెంట మణికి తప్ప మిగిలిన వారికి రూ.2 లక్షల చొప్పున సాయాన్ని అందజేశారు. దీంతో మణి కుటుంబ సభ్యులు కూడా ఆందోళనకు దిగుతున్నారు. మా బాధలు మీకు పట్టవా.. సార్ ‘ఏంటి సార్. ఎన్ని సార్లు మీ ఆఫీసుల చుట్టూ తిరగాలి. ఓ వైపు ఇంటి మనుషులు ఏడు నెలలుగా కానరాలేదు. మీ ప్రకటనలకు కూడా ఆ ఏడు నెలలే అవుతుంది. కానీ మా కెవ్వరికీ నెల భృతిగా రూ.4500 రావడం లేదు. మోటార్ ఇంజిన్ బోట్లు ఇవ్వలేవు’ అంటూ బాధితులు సోమవారం జిల్లా మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ కృష్ణమూర్తిని నిలదీశారు. సోమవారం వారంతా కార్యాలయానికి వెళ్లి జాయింట్ డైరెక్టర్‌ను చుట్టుముట్టారు. తమ సమస్యలను తేల్చకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయంటూ హెచ్చరికలు కూడా చేశారు. దీంతో జాయింట్ డైరక్టర్ దీనిపై స్పందిస్తూ బోట్లు ఇంకా తయారవుతున్నాయని, త్వరలోనే ఇస్తామని, అలాగే నెలవారీ భృతి కోసం పెట్టిన బిల్లులు సీఎఫ్ఎంఎస్లో పెండింగ్‌లో ఉన్నాయన్నారు. అలాగే ఆలస్యంగా గుర్తించిన పెంట మణికి కూడా రూ.2 లక్షల సాయం కూడా వచ్చిందని, త్వరలోనే అందజేస్తామని తెలియజేశారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులంతా కలిసి మత్స్యశాఖ కార్యాలయం బయట కాసేపు నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మూగి శ్రీరాములు, మూగి గురుమూర్తి, కుందు లక్ష్మణ, గనగళ్ల రామారావు, మూగి రామారావు, సూరాడ అప్పారావు, ముగతమ్మ, నూకరత్నం, శిరీష తదితరులు పాల్గొన్నారు. -
చేతినిండా ఉపాధి
మహబూబ్‌నగర్ న్యూటౌన్: కులవృత్తులకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు.. ఊర్లోనే చేతినిండా ఉపాధీ కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా మత్స్య సంపదపై మక్కువ పెరిగేలా వివిధ కార్యక్రమాల అమలుకు శ్రీకారం చుట్టింది. మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు, వ్యక్తిగత సహకారం అందించడంతో పాటు జిల్లాలోని చెరువులు, కుంటల్లో వందశాతం సబ్సిడీపై చేపపిల్లలను వదిలి మత్స్య సంపదను పెంచి నీలి విప్లవాన్ని తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇందుకోసం జిల్లా మత్స్య శాఖ అందుకు తగ్గట్టు ప్రణాళికలు సిద్ధం చేసింది. 3.95 కోట్ల చేపపిల్లలు లక్ష్యం మహబూబ్‌నగర్, నారాయణపేట రెండు జిల్లాల్లో కలిపి ఈసారి 3.95 కోట్ల చేప పిల్లలను చెరువులు, కుంటలు, జాలాశయాల్లో వదిలేందుకు చర్యలు తీసుకుంటున్నారు. కట్ల, రోహు, బంగారుతీగ, మ్రిగాల రకాలైన చేపపిల్లలను చెరువులు, కుంటలు, జలాశయాల్లో వదిలేందుకు ప్రణాళికలు తయారు చేశారు. వందశాతం సబ్సిడీపై అందించే ఈ చేపవిత్తనాల ద్వారా మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెంపొందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ముందస్తుగా ప్రణాళికలు సిద్ధం చేసుకొని టెండర్లు నిర్వహించి వర్షాలు రాగానే చేప విత్తనాలను చెరువులు, కుంటలు, జలాశయాల్లో వదిలేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి జూలై లేదా ఆగస్టు నెలల్లో చేప విత్తనాలను చెరువుల్లో వదలాలని అంచనా వేస్తున్నారు. 243 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలకు ప్రయోజనం జిల్లాలో మొత్తం 245 డిపార్ట్మెంటర్ చెరువులు, 1671 గ్రామ పంచాయతీ చెరువులు, కుంటలు ఉన్నాయి. వాటి పరిధిలో 243 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల్లో 14,723 మంది మత్స్యకారులున్నారు. 18 మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల్లో 674 మంది సభ్యులు ఉన్నారు. మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాలలో కోయిల్‌సాగర్, సంగంబండ, భూత్పూర్ రిజర్వాయర్, సాలార్‌నగర్ ప్రాజెక్టులతో పాటు జూరాల బ్యాక్ వాటర్‌లో చేపల వేట సాగించేందుకు 1520 మంది లైసెన్సు దారులు ఉన్నారు. లైసెన్సుదారులు, మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల్లోని సభ్యులందరికి ఉపాధి కల్పించి వారి కుటుంబాల ఆర్థిక స్థితిగతులను పెంపొందించాలనేది ప్రభుత్వ ఉద్దేశం. అందుకోసం ప్రభుత్వం వంద శాతం సబ్సిడీ కింద చేపవిత్తనాల పంపిణీతో పాటు ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటుంది. టెండర్ల ఖరారుకు నివేదిక జిల్లాలో గుర్తించిన చెరువులు, కుంటలు, జలాశయాల్లో చేపవిత్తనాలు సరఫరా చేసేందుకు ఇటీవల ప్రభుత్వం టెండర్ దరఖాస్తులను ఆహ్వానించింది. జిల్లాలో చేప విత్తనాలు సరఫరా చేసేందుకు ఆరు మంది టెండరుదారులు దరఖాస్తులు సమర్పించగా వాటిని పరిశీలించిన జిల్లా ఇన్చార్జ్ జాయింట్ కలెక్టర్ కె.స్వర్ణలత ఆమోదంతో జిల్లా మత్స్య శాఖ అధికారులు ఈనెల 2న రాష్ట్ర మత్స్సశాఖ కమిషనర్ కార్యాలయానికి నివేదిక పంపారు. జిల్లా కొనుగోలు కమిటీ బృందం సభ్యులు క్షేత్ర స్థాయిలో చేపల పిల్లల విత్తన హెచరీస్‌లను పరిశీలించేందుకు వెళతారు. వారిచ్చే నివేదిక ఆధారంగా టెండర్లను ఖరారు చేయనున్నారు. నిర్ణీత సైజులోనే.. ప్రభుత్వం నిర్ణయించిన సైజులో చేప విత్తనాలను వదిలేందుకు జిల్లా మత్స్య శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. చెరువులు, కుంటల్లో వదిలే చేపవిత్తనాలు, జలాశయాల్లో వదిలే చేపవిత్తనాలు వేర్వేరు సైజుల్లో ఉంటాయి. చెరువులు, కుంటల్లో 35 మిల్లీమీటర్ల నుంచి 40 మిల్లీమీటర్ల సైజులో ఉన్న బొచ్చ, రాహు, బంగారుతీగ రకాల చేపవిత్తనాలను వదులుతారు. సంవత్సరం పొడవునా నీరు ఉండే జలాశయాలు, ప్రాజెక్టుల్లో 80 మిల్లీ మీటర్ల నుంచి 100 మిల్లీమీటర్ల సైజులో గల బొచ్చ, రాహు, మ్రిగాల రకాలైన చేపవిత్తనాలను వదులుతారు. ప్రణాళికలు సిద్ధం చేశాం ప్రభుత్వం మత్స్యకారుల జీవన ప్రమాణాలను పెంపొందించి ఆర్థిక స్థోమత అందించేందుకు చర్యలు తీసుకుంది. ప్రతీఏడాదిలాగే ఈ సారి కూడా వంద శాతం సబ్సిడీపై చేపపిల్లలను అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. రెండు జిల్లాల పరిధిలో ఈ సంవత్సరం 3.95 కోట్ల చేప విత్తనాలు అవసరమవుతాయని లక్ష్యాన్ని పెట్టుకొని ప్రభుత్వానికి నివేదించాం. అందుకు గాను టెండర్లు ఆహ్వనించగా ఆరుమంది దరఖాస్తులు ఇచ్చారు. – డా.లక్ష్మప్ప, మత్స్య శాఖ ఏడీ -
మోసపు వలలో జాలరి విలవిల
ఎన్నికల వేళ జనాన్ని మాయమాటలతో ఏమార్చడం.. అధికార పీఠంపై అధిష్టించాక అంటీముట్టనట్టు వ్యవహరించడం చంద్రబాబునాయుడికి వెన్నతోపెట్టిన విద్య. నారా వారు విసిరిన మోసపు హామీల వలలో చిక్కి విలవిల్లాడుతున్న వారిలో మత్స్యకారులూ ఉన్నారు. గత ఎన్నికల సమయంలో చంద్రబాబు గుప్పించిన హామీలను గంగలో కలిపేసిన తీరును గంగపుత్రులు గుర్తు చేసుకుంటున్నారు. సాక్షి, చీరాల (ప్రకాశం): గంగపుత్రులు గంపెడు కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నారు. మత్స్యకారులపై ప్రభుత్వానికి మమకారం లేకుండా పోయింది. డీజిల్ సబ్సిడీకి సర్కారు పంగనామం పెట్టింది. ఎప్పుడో 2002 మార్చిలో నమోదు చేసుకున్న బోట్లకు తప్ప ఆ తర్వాత వచ్చిన బోట్లకు సబ్సిడీ అందడంలేదు. వేట విరామ సమయంలో చేయూతనందించాల్సిన సర్కారు మొండి చేయి చూపిస్తోంది. చివరకు ఉపాధి పనుల్లో అవకాశం కల్పించాలని మత్స్యకారులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం ఆ దిశగా కనీసం ఆలోచించడం లేదు. సబ్సిడీపై అందించాల్సిన బోట్ల వ్యవహారాన్ని అటకెక్కించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2004 సునామీ తర్వాత కట్టించిన 300 పక్కా గృహాలు తప్ప మత్స్యకారులకు కొత్తగా ఎటువంటి గృహాలు నిర్మించలేదు. రాయితీలకు ఎగనామం 2002 మార్చి అంటే 9వ ఆర్థిక ప్రణాళికా సంఘంలో నమోదు చేసుకున్న బోట్లకే డీజిల్ సబ్సిడీ అందుతుండగా ఆ తర్వాత కొనుగోలు చేసిన బోట్లకు డీజిల్ సబ్సిడీ ఇవ్వడం లేదు. అలానే రూ.10 నుంచి రూ.50 వేల విలువ చేసే వలలపై ప్రభుత్వం 50 శాతం సబ్సిడీకి ఆపేసింది. బోటు ఇంజన్ల కొనుగోలుపై 50 శాతం సబ్సిడీని ఎగ్గొట్టింది. నాబార్డు నిధులతో మత్స్యకార గ్రామాల్లో రోడ్లు, కమ్యూనిటీ హాళ్లు, మౌలిక వసతులు, ఫిష్‌ల్యాండింగ్ సెంటర్లు ఏర్పాటు చేయకపోవడంతో వారి కష్టాలు మరింత ఎక్కువయ్యాయి. వేటకు వెళ్లి ప్రమాదశాత్తు చనిపోతే ఇవ్వాల్సిన రూ.2 లక్షలను చంద్రన్న బీమాలో కలిపేసి చేతులు దులుపుకొన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో మత్స్యకారులు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.2క్షలు ఎక్స్‌గ్రేషియా ఇచ్చే పథకాన్ని ప్రస్తుత సర్కారు తొలగించింది. అలానే ఐదుగురు మత్స్యకారులు కలిసి రూ.2.5 లక్షల విలువైన బోటు కొనుగోలు చేస్తే 50 శాతం సబ్సిడీ ఇవ్వాల్సి ఉండగా ఆ సొమ్మును దళారులే మింగేస్తున్నారు. బోటు కోనుగోలు చేసేందుకు అవసరమైన పెట్టుబడి పెట్టే సామర్థ్యం మత్స్యకారులకు లేకపోవడంతో దళారులు పెట్టుబడి పెట్టి వారి పేర్లతో బోట్లను కైవసం చేసుకుంటున్నారు. జిల్లాలో తీర ప్రాంతం 102 కి.మీ మత్స్యకార గ్రామాలు 74 మత్స్యకారుల జనాభా 80000 ఇంజన్ బోట్లు 1849 సంప్రదాయ బోట్లు 2883 మత్స్యకార సొసైటీలు 54 మెరైన్ సొసైటీలు 44 సొసైటీల్లో సభ్యులు 16,000 సంక్షేమం నామమాత్రమే.. మత్స్యకారులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు నామమాత్రంగానే అందుతున్నాయి. వేట సాగించే మత్స్యకారులకు కేంద్ర ప్రభుత్వం రూ.3.45, రాష్ట్ర ప్రభుత్వం రూ.7.5 అందిస్తుంది. అయితే కొన్నేళ్లుగా కేంద్రం ఇవ్వాల్సిన సబ్సిడీ ఇవ్వడం లేదు. ప్రభుత్వ గుర్తింపు పొందిన మెకనైజ్డ్ బోట్లకు నెలకు 1000 లీటర్లు అవసరం ఉండగా ప్రభుత్వం 300 లీటర్లకు మాత్రమే సబ్సిడీ ఇస్తోంది. క్యాబిన్ బోట్లకు నెలకు 6 వేల లీటర్లు డీజిల్ కావాల్సి ఉండగా నెలకు 3 వేల లీటర్లు కూడా ఇవ్వడం లేదు. ఆ అవస్థలు వర్ణనాతీతం వేటాడిన చేపలను ఒడ్డుకు చేర్చేందుకు, బోట్లు లంగరు వేసేందుకు మత్స్యకారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాడరేవు, చిన్నబరప, విజయలక్ష్మీపురం, బాపట్ల మండలంలోని దానవాయిపేట, పాండురంగాపురం గ్రామాలకు చెందిన మత్స్యకారులు ఈపూరుపాలెం స్ట్రయిట్కట్పై ఉన్న బ్రిడ్జి సమీపంలోని జెట్టీ వద్ద మాత్రమే బోట్లు నిలుపుతున్నారు. చేపలు విక్రయించేందుకు మరే ఇతర సౌకర్యాలు లేవు. దీంతో కొన్నేళ్లుగా మండలంలోని మత్స్యకారులు బాపట్ల మండలంలోని దానవాయిపేట సమీప ప్రాంతాన్ని జెట్టీగా వినియోగించుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల మినీ హార్బర్‌కు రూ.432 కోట్లు కేటాయించింది. ప్రస్తుతం అది స్థల సేకరణ దశలో ఉంది. హార్బర్ నిర్మాణం పూర్తయితే మత్స్యకారులు తమ మత్స్యసంపదను దళారులకు కాకుండా నేరుగా అమ్ముకునేందుకు వీలుంటుంది. ఉపాధి ఉసేది? వేట విరామ సమయంలో తమిళనాడు, కేంద్ర ప్రభుత్వాలు ఏప్రిల్, మే నెలలో నెలకు రూ.10 వేల నగదు, 50 కేజీల బియ్యం అందిస్తున్నాయి. రెండు నెలల పాటు వేటకు వెళ్లకపోయినప్పటికీ ప్రభుత్వం ఇచ్చే చేయూతతో మత్స్యకారుల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. కానీ టీడీపీ ప్రభుత్వం రెండు నెలలకు రూ.4 వేలు మాత్రమే ఇస్తోంది. ఆ సొమ్ము కూడా జిల్లాలో సగం మందికి అందడం లేదు. -
పాకిస్థాన్ కోస్టుగార్డు చెరలో జిల్లా మత్స్యకారులు
బతుకు తెరువు కోసం వలస వెళ్లి.. పాకిస్థాన్ కోస్టుగార్డు చెరలో చిక్కుకున్న తమవారు ఎలా ఉన్నారో.. ఏం జరుగుతుందోనని ఆ కుటుంబాలు కలవర పడుతున్నాయి. క్షేమంగా తిరిగి రావాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నారు. అధికారులు చర్యలు తీసుకొని తమవారిని కాపాడాలని వేడుకుంటున్నారు. ఎచ్చెర్ల మండలం డి.మత్స్యలేశం పంచాయతీ పరిధి బడివానిపేట పంచాయతీకి చెందినవారితోపాటు జిల్లాలోని మరి కొంతమంది మత్స్యకారులు గుజరాత్ రాష్ట్రంలోని వీరావల్ వలస వెళ్లి అక్కడ సముద్రంలో చేపల వేట సాగిస్తున్నారు. అయితే వీరు నిబంధనలకు విరుద్ధంగా పాకిస్థాన్ బోర్డర్లోకి పొరబాటున వెళ్లిపోయారు. దీంతో వారిని ఆ దేశ భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్న విషయం విదితమే. ఈ సమాచారం తెలుసుకున్న వారి కుటుంబ సభ్యులు భయాందోళన చెందుతున్నారు. నిద్రాహారాలు మాని తమవారి క్షేమ సమాచారం కోసం ఎదురుచూస్తున్నారు. శ్రీకాకుళం , ఎచ్చెర్ల క్యాంపస్: పాకిస్థాన్ కోస్టుగార్డు చెరలో ఉన్న తమవారిని క్షేమంగా ఇంటికి చేర్చాలని డి.మత్స్యలేశం పంచాయతీ పరిధి బడివానిపేట పంచాయతీ వాసులు వేడుకుంటున్నారు. కాగా జిల్లాకు చెందిన మత్స్యకారులు పాకిస్థాన్‌కు చెందిన భద్రతా దళాల చెరలో ఉన్నట్టు తెలుసుకున్న జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. డి.మత్స్యలేశం, బడివానిపేట గ్రామాలను ఎచ్చెర్ల ఎస్సై కృష్ణతోపాటు పోలీసులు, మత్స్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ గోవిందరావు గురువారం సందర్శించారు. వీరు మత్స్యకారుల పూర్తిసమాచారం సేకరించే పనిలో ఉన్నారు. ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వనున్నట్లు చెప్పారు. స్థానికుల సమాచారం మేరకు శత్రు దేశం పాకిస్థాన్ కోస్టుగార్డుకు చిక్కిన వారిలో డి.మత్స్యలేశం పంచాయతీకి చెందిన 10 మంది,బడివానిపేట గ్రామానికి చెందిన ముగ్గురు, తోటపాలెం గ్రామానికి చెందిన వారు ఒకరు, శ్రీకాకుళం రూరల్‌కు చెందిన వారు ఒకరు ఉండగా.. విజయనగరం జిల్లా కుప్పలవలసకు చెందిన నలుగురు, కాకినాడకు చెందిన ఇద్దరు..మొత్తం 21 మంది ఉన్నట్టు సమాచారం. వీరంతా మూడు బోట్లలో చేపల వేటకు వెళ్లి పాకిస్థాన్ బోర్డర్లోకి అనుకోని పరిస్థితిలో చొరబడి అక్కడి భద్రతాదళాలకు చిక్కుకున్నారు. వీరంతా గత ఆగస్టులో వీరావల్ వెళ్లారు. డ్రైవర్, అసిస్టెంట్ డ్రైవర్, కలాసీ, వంట మనిషిగా చేపల వేట కాంట్రాక్టర్ వద్ద పనిచేస్తున్నారు. వీరికి భోజనం పెట్టి నెలకు పది వేల రూపాయల నుంచి రూ. 25 వేల వరకూ జీతంగా కాంట్రాక్టర్ చెల్లిస్తున్నారు. 20 నుంచి 30 రోజుల వరకు సముద్రంలో చేపల వేట సాగిస్తారు. పట్టుబడిన చేపలు చెడిపోకుండా కోల్డ్ స్టోరేజీలు బోట్లలోనే ఉంటాయి. ఈ క్రమంలోనే చేపల వేటకు వెళ్లి.. పని ముగించుకొని వచ్చే ప్రక్రియలో అరేబియన్ సముద్రంలో 12 వేల నాటికల్ మైళ్లు దాటి పాకిస్థాన్ జలాల్లోకి పొరపాటున వెళ్లిపోయి అక్కడి భద్రతాదళాలకు చిక్కారు. ప్రస్తుతం వీరు కరాచీలో ఉన్నట్లు తెలిసింది. పాక్ చెరలో ఉన్న జిల్లా మత్స్యకారులు.. డి.మత్స్యలేశం పంచాయతీకి చెందిన గనగళ్ల రామారావు, కేశవ, ఎర్రయ్య, రాజు, మైలిపల్లి సన్యాసిరావు, రాంబాబు, సూరాడ అప్పారావు, కల్యాణ్, కిశోర్, చీకటి గురుమూర్తి, సుమంత్, బడివానిపేటకు చెందిన వాసనల్లి శ్యామ్యూల్, బడి అప్పన్న, కొనాగ వెంకటేష్, తోటపాలెం గ్రామానికి చెందిన మణి, శ్రీకాకుళం రూరల్‌కు చెందిన శివ ఉన్నట్టు సమాచారం. అయితే అధికారులు పాకిస్థాన్ కోస్టుగార్డు చెరలో ఎవరెవరు ఉన్నారనే సమాచారాన్ని పూర్తిస్థాయిలో సేకరిస్తున్నారు. గుజరాత్ ప్రభుత్వంతోపాటు కేంద్ర రక్షణశాఖ సమాచారం కోసం నిరీక్షిస్తున్నారు. క్షేమంగా విడిపించాలి.. తమ వారిని క్షేమంగా పాకిస్థాన్ చెర నుంచి విడిపించాలని డి,మత్స్యలేశం, బడివానిపేట గ్రామస్తులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఎలాంటి హాని తలపెట్టకుండా చూడాలని పాక్ కోస్టుగార్డు చెరలో ఉన్న అప్పారావు భార్య మంగమ్మ, రామారావు భార్య నూకరత్నం, రాజు భార్య లక్ష్మ మ్మ, గురుమూర్తి భార్య లక్ష్మి విలపిస్తున్నారు. తమ వారు ఎప్పుడు వస్తారని అధికారులను ప్రశ్నిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని పాక్‌కు పట్టుబడ్డ మత్స్య కారులను సురక్షితంగా ఇంటికి చేర్చేలా చర్యలు తీసుకోవాలని జిల్లా మత్స్యకార యూనియన్ నాయకులు మూడి రామారావు, స్థానిక ఎంపీటీసీ సభ్యుడు మూగి శ్రీరాములు, న్యాయవాదులు చింతపల్లి సూర్యనారాయణ, మూగి గురుమూర్తి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ విషయమై మత్స్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ గోవిందరావు మాట్లాడుతూ సమస్యను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తామన్నారు. -
కల్లోల కడలి
వాకాడు : కడలిపై పది రోజులుగా కల్లోల వాతావరణ నెలకొంది. సముద్రంపై పోరుగాలి వీస్తుండడంతో వేటకు వెళ్లిన బోట్లు తిరగబడుతున్నాయి. మత్స్యకారులు వేటకు వెళ్లలేని పరిస్థితితో వాతావరణం అనుకూలించే సమయం కోసం తీరంలోనే కుటుంబాలతో సహా పడిగాపులు పడుతున్నారు. 61 రోజుల వేట విరామం తర్వాత జూన్ 15వ తేదీ నుంచి వేటకు మత్స్యకారులు సిద్ధమయ్యారు. సాధారణంగా వేట విరామం తర్వాత మత్స్య సంపద విరివిగా దొరుకుతుంది. సముద్రంపై పోరు గాలి, పెరిగిన అలల ఉధృతి కారణంగా పడవలు ఒక్క చోట నిలవక మత్స్యకారులు వేట చేయలేకపోతున్నారు. పోరు గాలితో మత్స్య సంపద చెల్లాచెదురై పొద్దస్తమానం సముద్రంలో వలేసి గాలించినా ఒక్క చేప కూడా దొరకడం లేదు. శ్రమతోపాటు, డీజిల్ ఖర్చులు పెరిగి మత్స్యకారులు నిరాశతో వెనుతిరిగి వచ్చేస్తున్నారు. వేట తప్ప మరే పని తెలియని మత్స్యకారులు పది రోజులుగా సముద్రంపై కుస్తీ పడుతున్నారు. అటు వేట లేక, పూట గడవక గంగపుత్రులు ఆకలితో అలమటిస్తున్నారు. వేటే జీవనాధారంగా చేసుకుని తెల్లవారు జామునే వల భుజాన వేసుకుని సముద్రాన్ని గాలించి మంచి మత్స్యసంపదతో సంతోషంగా కనిపించే సాగర పుత్రులు ప్రతికూల వాతావరణంతో దిగాలు చెందుతున్నారు. అలల ఉధృతిని సైతం లెక్క చేయకుండా ఎదురొడ్డి వేట చేసే మత్స్యకారులు సైతం ప్రస్తుతం భయపడుతున్నారు. ఇటీవల పోరుగాలి, అలల ఉధృతి కారణంగా పలుచోట్ల బోట్లు తిరగబడి మత్స్యకారులు గల్లంతైన ఘటనలు దృష్టిలో ఉంచుకుని మత్స్యకారులు వేట మానేసి బోట్లు ఒడ్డున లంగర్ వేశారు. జిల్లాలోని కావలి నుంచి తడ వరకు 12 మండలాల పరిధిలోని తీర ప్రాంతంలో ఇదే పరిస్థితి నెలకొంది. పోరుగాలితో వేట సాగడం లేదు పది రోజులుగా సముద్రంపై ప్రతికూల వాతావరణం నెలకొంది. పోరుగాలికి వేట చేయలేకున్నాము. తెల్లవారు జామున సముద్రంపై వేటకు వెళ్లినప్పటికీ బోట్లు ఒక్కచోట నిలవక, చేప దొరక్క నిరాశతో వెనుతిరిగి రావాల్సి వస్తుంది. ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి సాయం అందట్లేదు. రెండేళ్లుగా వేట నిషేధిత పరిహారం రాకపోవడంతో జీవనం కష్టంగా ఉంది. – సోమయ్య, మత్స్యకారుడు, తూపిలిపాళెం రెండేళ్లుగా వేట విరామం నగదు రావడం లేదు రెండు సంవత్సరాల నుంచి ప్రభుత్వం నుంచి మత్స్యకారులకు అందాల్సిన వేట విరామం నగదు అందడం లేదు. తిరిగి తిరిగి కాళ్లు అరిగిపోతున్నాయే తప్ప డబ్బులు మాత్రం రావడంలేదు. వేట లేక, పూట గడవక, పస్తులుంటున్న సంగతి సంబంధిత అధికారులకు తెలిసినా తమను ఎవరూ పట్టించుకోవడం లేదు. – ఎం.పోలయ్య, మత్స్యకారుడు కొండూరుపాళెం -
ఎమ్మెల్యే ఎదుట కన్నీరుమున్నీరైన మహిళలు
కావలి (నెల్లూరు): పోలీసులపై దాడి చేసి రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన మత్స్యకార గ్రామమైన కావలి రూరల్ మండలం తుమ్మలపెంట పంచాయతీ కొత్తసత్రాన్ని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఆదివారం సందర్శించారు. పోలీసులపై దాడి చేసిన ఘటనలో 60 మందిపై కేసులు నమోదు కావడం, గ్రామంలోని యువకులను లక్ష్యంగా చేసుకుని పోలీసులు గాలిస్తుండటంతో స్థానికులు, ముఖ్యంగా మహిళలు, పిల్లలు భీతిల్లుతున్నారు. కొందరు ఆకతాయి యువకులు చేసిన తప్పులకు గ్రామంలోని ప్రజలందరూ బాధ్యత వహించాల్సి వస్తోందని, పోలీసులు ఈ కేసులో తమ కుటుంబ సభ్యులను అకారణంగా ఇబ్బంది పెడతారేమోనని మహిళలు భీతిల్లుతున్నారు. ఇదే విషయాన్ని అదివారం ఎమ్మెల్యే ఎదుట వెళ్లబోసుకుని కన్నీంటిపర్యంతమయ్యారు. వారిని ఓదార్చిన ఎమ్మెల్యే సమస్యను పోలీసు అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తానని ధైర్యం చెప్పారు. చట్టాలను అమలు పరచడానికి, ప్రజలు ప్రశాంతంగా జీవించడానికి పోలీసులు ఆహోరాత్రులు శ్రమిస్తుంటారని, అలాంటి పోలీసులు మన గ్రామాలకు వచ్చినప్పుడు వారిని గౌరవించాలని పేర్కొన్నారు. కొందరు ఆకతాయి యువకులు చేసిన చర్యల వల్ల గ్రామస్తులందరూ బాధ పడుతున్నారన్నారు. ప్రశాంతంగా జీవించే మత్స్యకారులు ఇలాంటి దుర్ఘటనల్లో చిక్కుకోవడం వ్యక్తిగతంగా తనకు కూడా బాధగా ఉందన్నారు. తప్పు చేసిన వారిని గుర్తించి తెలియజేస్తే, పోలీసులకు నచ్చచెప్తానన్నారు. అనంతరం మహిళలతో పాటు గ్రామస్తులను వెంట బెట్టుకుని కావలి డీఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు. మత్స్యకారులను డీఎస్పీ కె.రఘుతో మాట్లాడించిన ఎమ్మెల్యే అమాయకులను ఇబ్బంది పెట్టవద్దని డీఎస్పీ ని కోరారు. దీనిపై డీఎస్పీ మాట్లాడుతూ గ్రామానికి వచ్చిన పోలీసులపై దాడులు చేయడం హేయమైన చర్యని పేర్కొన్నారు. ఈ ఘటనలో నిందితులను గ్రామస్తులే గుర్తించి, పోలీసులకు అప్పగించి సహకరించాలని సూచించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మన్నెమాల సుకుమార్‌రెడ్డి, నాయకులు జంపాని రాఘవులు, కొమారి రాజు, పామంజి నాగమణి, ఆవుల దుర్గారావు, ఎల్లంగారి రమణయ్య, బుచ్చింగారి తిరుపతి, కాటంగారి చిట్టిబాబు, వావిల పోతయ్య, ఎల్లంగారి జయరాం, రాష్ట్ర సేవాదళ్ సంయుక్త కార్యదర్శి కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి పాల్గొన్నారు. -
పాక్ చెరలో 200 మంది భారతీయులు
సాక్షి, ఢిల్లీ : తమ సముద్రజలాల్లోకి ప్రవేశించారనే నెపంతో 52 మంది భారత జాలర్లను పాకిస్తాన్ అరెస్టు చేసింది. ఈ మేరకు పాక్ అధికార వర్గాలు ఈ విషయాన్ని శనివారం దృవీకరించాయి. వారితో పాటు 8 వేట పడవలను అదుపులోకి తీసుకున్నట్లు పాకిస్తాన్ అధికారులు తెలిపారు. అరెస్ట్ చేసిన మత్స్యకారులను జుడీషియల్ రిమాండ్ కోసం కరాచీలోని మలిర్ జైలు పంపినట్లు పాక్ వర్గాలు వెల్లడించాయి. వీరంతా గుజరాత్‌లోని దిండి తీర ప్రాంతానికి చెందిన వారు. రాత్రి పూట కావడంతో సరిహద్దులు గుర్తించలేక పాక్ జలాల్లోకి వెల్లినట్లు బాధితులు తెలిపారు. రెండు దేశాల మధ్య జరుగుతున్న వరుస అరెస్టులతో అమాయకులైన జాలర్లు ఏళ్లపాటు జైళ్లలో మగ్గుతున్నారు. సత్ప్రవర్తన కారణంగానో, జాతీయ పండగల సందర్భంగా ఏ ఒక్కరికో ఇద్దరికో క్షమాబిక్ష లభిస్తోంది. మిగతా వారంతా ఎప్పటికి విడుదలౌతారో తెలియక నరకం అనుభవస్తున్నారు. గత నవంబర్ నుంచి దాదాపు 200 మంది భారతీయు జాలర్లను తమ జలాల్లోకి అక్రమంగా ప్రవేశించారనే నెపంతో పాక్ అరెస్టు చేసింది.