ఆశల వేట
గార, న్యూస్‌లైన్: తీరంలో మళ్లీ సందడి ప్రారంభమైంది. మరోసారి ఆశల వేట మొదలైంది. సముద్రాన్నే సర్వస్వంగా భావించే గంగపుత్రులు గత 47 రోజులుగా దానికి దూరమయ్యారు. ఉపాధి లేక, ప్రభుత్వ సాయం అందక అలమటించారు. ఎట్టకేలకు పునరుత్పత్తి సీజను ముగిసింది. సాగరుడు రా.. రామ్మని ఆహ్వానించడంతో కోడి కూసే వేళకే మత్స్యకారుల కోలాహలంలో తీరం మేల్కొంది. చేపల వేట పునఃప్రారంభమైంది. అయితే తొలిరోజు వేట నిరాశనే మిగిల్చింది. జిల్లాలోని 104 మత్స్యకార గ్రామాల్లో ఉన్న సుమారు 506 ఇంజిన్ బోట్లు వేటకు బయలు దేరాయి. సుమారు 3 వేల మంది మత్స్యకారులు సముద్రుడి ఒడిలో జీవన భృతిని వెతుక్కునేందుకు ఈ బోట్లలో వె ళ్లారు. దీంతో జిల్లాలోని తీరప్రాంతాలు మళ్లీ సందడిగా కనిపించాయి. ఒక్క గార మండలం బందరువానిపేట గ్రామం నుంచే సుమారు 60 ఇంజిన్ బోట్లు, 30 సాధారణ పడవలు వేటకు బయలుదేరాయి. మత్స్యసంపద అపారంగా లభిస్తే నెలన్నర రోజుల కష్టం మరిచిపోగలుగుతామని వేటకు బయలుదేరిన మత్స్యకారుల కుటుంబీకులు ఎంతో ఆశగా చెప్పారు.
తొలి రోజూ నిరాశాజనకం...
అయితే తొలిరోజు వేట నిరాశాజనకంగా సాగింది. బందరువానిపేట తీరంలో సుమారు లక్ష రుపాయల విలువైన మత్స్య సంపదే లభించినట్లు స్ధానిక మత్స్యకారులు తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఇది దాదాపు సగం తక్కువ. సముద్ర జలాలు కలుషితం కావడం, వాతావరణంలో సంభవిస్తున్న మార్పులు, సోనా బోట్ల తాకిడి పెరగడం వంటి కారణాల వల్ల మత్స్య సంపద బాగా తగ్గిపోతోందని వేటకు వెళ్లిన వారు ఆందోళన వ్యక్తం చేశారు. వేకువజామున వేటకు వెళ్లి సుమారు 11 గంటల ప్రాంతంలో తీరం చేరుకున్న మత్స్యకారులు పట్టుకున్న చేపలను హోల్‌సేల్‌గా వ్యాపారస్తులకు అమ్మారు. తొలి రోజు నిరాశాజనకంగా ఉండటంతో ఈ సంవత్సరం వేటకుఎలా ఉంటోందొనని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.