ఓఎన్జీసీ పైపులైనుతో ఉపాధి కోల్పోయిన మత్స్యకారులకు ఐదో విడత సాయానికి సంబంధించిన చెక్కు అందజేస్తున్న సీఎం జగన్
రూ.20 వేల కోట్లతో తీరం వెంట మౌలిక సదుపాయాలు
ప్రతి 50 కి.మీ.కి ఒక పోర్టు లేదా ఫిషింగ్ హార్బర్ లేదా ల్యాండింగ్ సెంటర్లు
వాయువేగంతో నాలుగు పోర్టులు.. బ్లూ ఎకానమీని పెంచేలా చర్యలు
జువ్వలదిన్నె హార్బర్‌ను వర్చువల్‌గా కాకుండా నేనే నేరుగా వెళ్లి ప్రారంభిస్తా
ఓఎన్జీసీ పైపులైనుతో ఉపాధి కోల్పోయిన మత్య్సకార కుటుంబాలకు ఐదో విడత సాయం
23,459 కుటుంబాలకు రూ.161.86 కోట్లు నేరుగా ఖాతాల్లో జమ చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఐదేళ్లలో ‘వైఎస్సార్ మత్స్యకార భరోసా’తో రూ.538 కోట్ల లబ్ధి
దాదాపు 20 వేల బోట్లకు డీజిల్ సబ్సిడీ కింద రూ.130 కోట్లకు పైగా చెల్లింపు
దురదృష్టవశాత్తు మరణిస్తే అందించే ఎక్స్‌గ్రేషియా రూ.10 లక్షలకు పెంపు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రతి మత్స్యకారుడు ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే లక్ష్యంతో సముద్ర తీర ప్రాంతంలో ప్రతి 50 కి.మీ.కి ఒక పోర్టు కానీ ఫిషింగ్ హార్బర్ లేదా ఫిష్ ల్యాండింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, 4 పోర్టులను వాయువేగంతో నిర్మిస్తున్నామని గుర్తు చేశారు. తీరం వెంట మౌలిక సదుపాయాలను గణనీయంగా మెరుగుపరిచామన్నారు. మనకున్న 974 కి.మీ. పొడవైన సుదీర్ఘ తీరప్రాంతాన్ని సద్వినియోగం చేసుకుంటూ బ్లూ ఎకానమీ (నీలి విప్లవం) పెంచేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
వీటన్నిటివల్ల మత్స్యకారులు ఎక్కడెక్కడికో వలస వెళ్లి ఉపాధి వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా సొంత రాష్ట్రంలోనే మెరుగైన జీవనోపాధి లభిస్తుందన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల్లో ఓఎన్‌జీసీ పైపు లైన్ కారణంగా ఉపాధి కోల్పోయిన 23,458 మత్స్యకార కుటుంబాలకు ఐదో విడతగా ఒక్కొక్కరికి నెలకు రూ.11,500 చొప్పున ఆర్నెళ్లకు రూ.69,000 మేర పరిహారం చెల్లిస్తూ మొత్తం రూ.161.86 కోట్లను మంగళవారం క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి జగన్ బటన్ నొక్కి నేరుగా వారి ఖాతాల్లో జమ చేశారు. ఇప్పటివరకు ఐదు విడతల్లో రూ.647.44 కోట్ల మేర లబ్ధిదారులకు ప్రయోజనాన్ని చేకూర్చారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే..
రూ.20 వేల కోట్లతో తీరంలో సదుపాయాలు
మొత్తంగా 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లతో పాటు నాలుగు పోర్టుల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. నాలుగు పోర్టులను దాదాపు రూ.16 వేల కోట్లతో నిర్మిస్తున్నాం. పది ఫిషింగ్ హార్బర్లను రూ.4 వేల కోట్లతో నిర్మిస్తుండగా మరో రూ.200 కోట్లతో ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు ఏర్పాటవుతున్నాయి. మొత్తంగా రూ.20 వేల కోట్ల పైచిలుకు సముద్రతీర ప్రాంతంలో మౌలిక సదుపాయాల మీద పెట్టుబడిగా పెడుతున్నాం. ఈ పనులన్నీ వేగంగా జరుగుతున్నాయి. వీటివల్ల అత్యధికంగా మత్స్యకార కుటుంబాలు బాగుపడతాయి.
క్రమం తప్పకుండా ప్రతి ఆర్నెల్లకు..
రాష్ట్ర ప్రభుత్వ చొరవతో మత్స్యకారులను ఆదుకునే విషయంలో ఓఎన్జీసీ మంచి మనసుతో ముందుకొచ్చింది. మత్స్యకార కుటుంబాలకు నష్టం జరగకూడదనే ఉద్దేశంతో ఎక్కడా ఆలస్యం లేకుండా ప్రతి ఆర్నెల్లకు ఒకసారి సాయం అందిస్తూ ఆదుకుంటున్నాం. క్రమం తప్పకుండా డబ్బుల విడుదల కోసం గుర్తు చేస్తున్న ఎమ్మెల్యే సతీష్ ను అభినందించాలి. ఇప్పటివరకూ ఐదు విడతల్లో రూ.647.44 కోట్లు ఇచ్చాం. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 16,408, కాకినాడ జిల్లాలో 7,050 కుటుంబాలకు మంచి చేస్తున్నాం.
బాబు సర్కారు ఆలకించలేదు..
2012కు సంబంధించి జీఎస్పీసీ రూ.78 కోట్లు పరిహారంగా 16,554 కుటుంబాలకు చెల్లించాల్సి ఉన్నా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు. మనం అధికారంలోకి వచ్చిన మొదటి ఆర్నెళ్లలోనే రాష్ట్ర ప్రభుత్వం తరపున మత్స్యకారులకు మేలు చేస్తూ ఆ రూ.78 కోట్లను 16 వేలకుపైగా మత్స్యకార కుటుంబాలకు అందచేశాం. ఆ కుటుంబాల అవసరాలను మన అవసరాలుగా భావించి వారికి తోడుగా నిలుస్తూ గొప్ప అడుగులు పడ్డాయి.
ఆ తర్వాత జీఎస్పీసీని ఓఎన్‌జీసీ టేకోవర్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు దీని గురించి ఓఎన్‌జీసీ దృష్టికి తేవడంతో రెండు మూడేళ్ల తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి ఆ డబ్బులు వచ్చాయి. అయితే ఈలోగా మత్స్యకారులకు మంచి చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యం చేయలేదు. మత్స్యకారులకు రాష్ట్రప్రభుత్వం అండగా ఉంటుందనే భరోసాను అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కల్పిస్తున్నాం.
1.07 లక్షల కుటుంబాలకు వైఎస్సార్ మత్స్యకార భరోసా
చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా మత్స్యకారుల సంక్షేమం కోసం తాపత్రయ పడుతూ అడుగులు వేశాం. 1.07 లక్షల కుటుంబాలకు ఐదేళ్లలో వైఎస్‌ఆర్ మత్స్యకార భరోసా ద్వారా రూ.538 కోట్లు సాయంగా అందించాం. ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 మధ్యలో వేట నిషేధ సమయంలో వారికీ సాయాన్ని ఏటా అందించాం. చంద్రబాబు హయాంలో ఐదేళ్లలో మత్స్యకార సోదరులకు కేవలం రూ.104 కోట్లు మాత్రమే ఇచ్చారు. మనం ప్రతి ఒక్కరినీ ఈ పథకంలోకి తీసుకొచ్చి పారదర్శకంగా అందిస్తూ వచ్చాం. గతంలో రూ.4 వేలుగా ఉన్న సాయాన్ని ఏకంగా రూ.10 వేలకు పెంచి ఒక్కో కుటుంబానికి అందిస్తున్నాం. దేశంలో ఏ రాష్ట్రంలోనూ మత్స్యకారులకు ఇంత సహాయం అందించడం లేదు.
రూ.130 కోట్లకు పైగా డీజిల్ సబ్సిడీ
గతంలో డీజిల్‌పై లీటరుకు రూ.6 మాత్రమే సబ్సిడీ ఇవ్వగా మనం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.9కి పెంచాం. నాడు ఆ సబ్సిడీ ఎప్పుడిస్తారో కూడా తెలిసేది కాదు. ఇప్పుడు డీజిల్ పోయించుకున్నప్పుడే సబ్సిడీ ఇస్తున్నాం. దీనికోసం ప్రత్యేకంగా బంకులను ఎంపిక చేసి ప్రతి మత్స్యకారుడికి గుర్తింపు కార్డు ఇచ్చాం. డీజిల్ పోయించుకున్నప్పుడే రూ.9 సబ్సిడీ ఇచ్చేలా విప్లవాత్మక మార్పు తీసుకొచ్చాం. డీజిల్ సబ్సిడీని వర్తింపజేసే బోట్లను కూడా పెంచాం. దాదాపు 20 వేల బోట్లకు రూ.130 కోట్లకు పైగా డీజిల్ సబ్సిడీ ఇచ్చాం.
రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా
వేటకు వెళ్లే మత్స్యకారులు దురదృష్టవశాత్తూ మరణిస్తే చెల్లించే ఎక్స్Šగ్రేషియాను రూ.10 లక్షలకు పెంచి ఇస్తున్నాం. ఘటన జరిగిన వెంటనే రూ.5 లక్షలు పరిహారంగా చెల్లిస్తూ మిగిలిన అమౌంట్‌ను ఆర్నెళ్లలోగా అందజేసే కొత్త ఒరవడి తీసుకొచ్చాం. ఇలా దాదాపు 175 కుటుంబాలకు మంచి చేస్తూ మరో రూ.17 కోట్లు అందించాం. గతంలో ఎక్స్‌గ్రేషియా ఎప్పుడు వచ్చేదో తెలిసేది కాదు.
ఈ మూడు కార్యక్రమాలే కాకుండా డ్రిల్లింగ్ కారణంగా నష్టపోయిన మత్స్యకారులకు ఉపాధి కల్పిస్తున్నాం. జీఎస్పీతో మొదట రూ.78 కోట్లు, ఓఎన్‌జీసీతో ఐదు దఫాల్లో రూ.647 కోట్లు అందచేశాం. ఆక్వా రైతులకు రూపాయిన్నరకే విద్యుత్ సబ్సిడీని అందిస్తున్నాం. 40,850 మంది లబ్ధిదారులకు మంచి చేస్తూ దాదాపు రూ.3,500 కోట్లు సబ్సిడీగా ఇచ్చాం. ఆరు కార్యక్రమాలతో రూ.4,913 కోట్లు అందించాం. ఇవికాకుండా నవరత్నాల ద్వారా అదనంగా ప్రతి మత్స్యకార కుటుంబానికి సాయం అందిస్తున్నాం. కార్యక్రమంలో ఇంధన, గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్.జవహర్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
జువ్వలదిన్నెకు స్వయంగా వస్తా
‘‘ఇవాళే జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌ను ప్రారంభించాలని తొలుత అనుకున్నా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కాకుండా నేనే నేరుగా అక్కడకు వెళ్లి ప్రారంభించాలని నిర్ణయించా. ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా మత్స్యకారులు ఏ విధంగా లబ్ధి పొందుతున్నారో తెలియచేసేందుకు నేనే స్వయంగా వెళ్లి ఆ హార్బర్‌ను ప్రారంభిస్తా. ఫిషింగ్ హార్బర్ వల్ల మత్స్యకారుల జీవితాలు మారతాయి. ఒక్కో ఫిషింగ్ హార్బర్‌లో ఎన్ని బోట్లు ఉంటాయి? కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్లతో పాటు ఇతర మౌలిక సదుపాయాలతో ఏ రకమైన అభివృద్ధి జరుగుతుందనే విషయాలు అందరికీ తెలియాలి. అందుకే అక్కడ ఇవాళ తలపెట్టిన కార్యక్రమాన్ని వాయిదా వేశాం’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు.
మీ చేతి నుంచే ఆరో విడత కూడా..
రాష్ట్రంలో మత్స్యకార సోదరులంతా చాలా సంతోషంగా ఉన్నారు. మత్స్యకారుల బతుకుదెరువు, ఆర్ధిక ఎదుగుదలకు తోడ్పడుతూ మనసున్న ముఖ్యమంత్రిగా మీరు అండగా నిలుస్తున్నారు. ప్రభుత్వం నుంచి నేరుగా సాయం అందడం మీ వల్లే సాధ్యమైంది. మళ్లీ మీ చేతుల మీదుగా ఆరో విడత కూడా తీసుకుంటాం. మీ ప్రేమ, అభిమానం ఎప్పటికీ మరువలేనిది.
– పొన్నాడ సతీష్ కుమార్, ఎమ్మెల్యే, ముమ్మిడివరం
ఆశ వదిలేసుకున్న డబ్బులు అందుకుంటున్నాం..
గత ప్రభుత్వంలో రావనుకున్న డబ్బులు మీ చేతుల మీదుగా తీసుకుంటున్నాం. ఇప్పటివరకు ఒక్కొక్కరూ రూ.2,07,000 తీసుకున్నాం. ఇప్పుడు ఐదో విడతలో రూ. 69,000 అందుకుంటున్నాం. వేట నిషేధం సమయంలో గత ప్రభుత్వంలో అప్పులు చేయాల్సి వచ్చేది. ఇప్పుడు మత్స్యకార భరోసా, సబ్సిడీపై డీజిల్ అందిస్తున్నారు. గతంలో మాకు బీమా వచ్చేది కాదు.
ఇప్పుడు మీరు ఇస్తున్నారు. నాకు అమ్మ ఒడి సాయం అందింది. మా అబ్బాయికి ట్యాబ్ ఇచ్చారు. ఆరోగ్యశ్రీ ద్వారా మంచి వైద్య సేవలు అందుతున్నాయి. మా కుటుంబానికి రూ.5,32,000 మేర లబ్ధి చేకూరింది. ఆసరా సాయం కింద అందిన రూ.42 వేలతో కుట్టుమిషన్లు కొనుక్కున్నా. మా అమ్మకు చేయూత సాయం అందింది.
–నారాయణమ్మ, లబ్ధిదారు, కోనసీమ జిల్లా
అన్నీ ఇస్తున్నారు..
గతంలో మా గురించి ఏ ప్రభుత్వమూ పట్టించుకోలేదు. మా మత్స్యకారులందరికీ మీరు సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. వేట నిషేధ సమయంలో ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఏటా రూ.10 వేలు ఇస్తున్నారు. ఆయిల్ సబ్సిడీ గతంలో కొందరికే అందగా ఇప్పుడు అర్హత ఉంటే చాలు అందరికీ ఇస్తున్నారు. గతంలో బీమా సాయం అందేది కాదు. ఇప్పుడు అన్నీ ఇస్తున్నారు. గతంలో ఫిషింగ్ హార్బర్లు లేవు. ఇప్పుడు మీరు ఏర్పాటు చేస్తున్నారు. మేమంతా మీ వెంటే ఉంటామన్నా.
– భైరవమూర్తి, వెంకటాయపాలెం, కోరంగి పంచాయతీ, కాకినాడ జిల్లా
Comments
Please login to add a commentAdd a comment