Gara
-
ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
సాక్షి, శ్రీకాకుళం : జిల్లాలోని గార మండలం బైరి జంక్షన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆటో, బైక్ ఢీకొని నలుగురు దుర్మరణం పాలయ్యారు. మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను శ్రీకాకుళంలోని రిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితులను జిల్లాలోని సరుబుజ్జిలి మండలం కొత్తకోట వాసులుగా గుర్తించారు. నరసన్నపేటలో జరిగిన తమ బంధువుల పెళ్లి వేడుకల్లో పాల్గొని ఆటోలో తిరిగి వస్తుండగా బైరికూడలి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో తండ్రీకొడుకులైన వెంకటి, సింహాచలంతోపాటు శ్రీలత అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, గణేశ్ అనే వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్డు బాగుంటే పాప ప్రాణాలు దక్కేవి
సాక్షి, శ్రీకాకుళం: తాము పడుతున్న కష్టాలు తమ బిడ్డకు రాకూడదని ఆ తల్లిదండ్రులు భావించారు. అనుకున్నట్టుగానే తమ కుమార్తె బాగా చదువుకోవాలని తన తాతగారింటికి పంపించేశారు. అయితే విధి వక్రించి పాము రూపంలో వచ్చిన మృత్యువు కాటేసింది. అయితే సకాలంలో 108 వాహనం వచ్చేందుకు గ్రామ రోడ్డు బాగులేకపోవడంతో పాపను కోల్పోయామని కుటుంబీకులు బోరుమన్నారు. ఈ విషాద ఘటన గార మండలం శ్రీకూర్మం చినముద్దాడపేట గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసుల వివరాల మేరకు... గ్రామానికి చెందిన అమ్మమ్మ బాడితమంతి జయలక్ష్మి, తాతయ్య పైడయ్య వద్ద ఉంటున్న ఒనుము పద్మావతి (11) శ్రీకూర్మంలోని బాలికల పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. కల్లుగీత కార్మికులైన చిన్నారి తల్లిదండ్రులు ఒనుము రమణ, సుజాత అదే మండలం ఆలింగపేటలో ఉంటున్నారు. వీరి కష్టాన్ని చూడకూడదని భావించి అమ్మమ్మ ఇంటికి పంపించేశారు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో పద్మావతితోపాటు అమ్మమ్మ, తాతయ్య, మరో బంధువు కలిసి నేలపై నిద్రిస్తున్నారు. వరి పొలాలకు దగ్గర్లో పాకలో నివాసముంటున్న వీరిలో బాలికను గుర్తు తెలియని విషసర్పం కాటువేసింది. అప్పటికే ఏదో కుట్టినట్లు అనిపించడంతో పాప వెంటనే లేచి అమ్మమ్మ, తాతయ్యలకు చెప్పింది. నల్లటి ఛారలతో తెల్లటి మచ్చల పాము కరిచినట్టుగా గుర్తించి వెంటనే అంబులెన్స్ ద్వారా రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం వేకువ జామున 5 గంటల సమయంలో మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. గార ఎస్ఐ లావణ్య కేసు దర్యాప్తు చేస్తున్నారు. సకాలంలో అంబులెన్స్ వచ్చి ఉంటే.. గత టీడీపీ పాలకుల నిర్లక్ష్యం పాప మృతికి అద్దం పడుతోంది. రోడ్ల కోసం మంజూరైన నిధులను దుర్వినియోగం చేసారన్నది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. సరైన రోడ్లు వేయకపోవడంతో బాలిక చనిపోయిందని బాధిత కుటుంబ సభ్యులు బోరుమంటున్నారు. వాస్తవంగా ముద్దాడపేట గ్రామం లూప్‌లైన్ కావడంతో అంబులెన్స్ వచ్చేసరికి గంటకుపైనే సమయం పట్టింది. పొరపాటున వర్షం పడితే మాత్రం అంబులెన్స్ కాదు కదా.. కనీసం ఆటో కూడా వచ్చే పరిస్థితి లేదు. మృతదేహాన్ని పరిశీలిస్తున్న గార ఎస్ఐ -
పోస్టాఫీసులో రూ.1.5 కోట్ల నిధుల హాంఫట్
గార: శ్రీకాకుళం జిల్లా గార పట్టణంలోని పోస్టఫీసులో ఉపాధి హామీ పనులకు సంబంధించిన రూ.1.5 కోట్ల నిధులు స్వాహా అయ్యాయి. బాధితుల ఫిర్యాదు చేయడంతో విషయం బుధవారం వెలుగులోకి వచ్చింది. విషయం తెలిసిన వెంటనే పోస్టల్ సూపరింటెండెంట్ గురువారం ఉదయం గార నగరానికి వచ్చి సబ్ పోస్టుమాస్టర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. పోస్టల్ ఉన్నతాధికారులందరూ గారకు వచ్చారు. పోస్టాఫీసు తలుపులు మూసి రికార్డులు తనిఖీ చేశారు. మీడియా వాళ్లను లోపలికి అనుమతించలేదు. ఉపాధి హామీ కూలీలకు ఇవ్వాల్సిన నిధులు రూ.1.5 కోట్ల రూపాయలు గల్లంతయ్యాయి. బినామీ పేర్లతో డ్రా చేశారు. లభ్దిదారులు తమ డబ్బుల కోసం వెళ్తే ఇంతకు ముందే తీసుకున్నారని సమాధానం రావడంతో వారు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. సబ్ పోస్టుమాస్టరే నిధులు నొక్కేశారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఉన్నతాధికారుల విచారణలో నిజానిజాలు బయటపడే అవకాశం ఉంది. -
ఆశల వేట
గార, న్యూస్‌లైన్: తీరంలో మళ్లీ సందడి ప్రారంభమైంది. మరోసారి ఆశల వేట మొదలైంది. సముద్రాన్నే సర్వస్వంగా భావించే గంగపుత్రులు గత 47 రోజులుగా దానికి దూరమయ్యారు. ఉపాధి లేక, ప్రభుత్వ సాయం అందక అలమటించారు. ఎట్టకేలకు పునరుత్పత్తి సీజను ముగిసింది. సాగరుడు రా.. రామ్మని ఆహ్వానించడంతో కోడి కూసే వేళకే మత్స్యకారుల కోలాహలంలో తీరం మేల్కొంది. చేపల వేట పునఃప్రారంభమైంది. అయితే తొలిరోజు వేట నిరాశనే మిగిల్చింది. జిల్లాలోని 104 మత్స్యకార గ్రామాల్లో ఉన్న సుమారు 506 ఇంజిన్ బోట్లు వేటకు బయలు దేరాయి. సుమారు 3 వేల మంది మత్స్యకారులు సముద్రుడి ఒడిలో జీవన భృతిని వెతుక్కునేందుకు ఈ బోట్లలో వె ళ్లారు. దీంతో జిల్లాలోని తీరప్రాంతాలు మళ్లీ సందడిగా కనిపించాయి. ఒక్క గార మండలం బందరువానిపేట గ్రామం నుంచే సుమారు 60 ఇంజిన్ బోట్లు, 30 సాధారణ పడవలు వేటకు బయలుదేరాయి. మత్స్యసంపద అపారంగా లభిస్తే నెలన్నర రోజుల కష్టం మరిచిపోగలుగుతామని వేటకు బయలుదేరిన మత్స్యకారుల కుటుంబీకులు ఎంతో ఆశగా చెప్పారు. తొలి రోజూ నిరాశాజనకం... అయితే తొలిరోజు వేట నిరాశాజనకంగా సాగింది. బందరువానిపేట తీరంలో సుమారు లక్ష రుపాయల విలువైన మత్స్య సంపదే లభించినట్లు స్ధానిక మత్స్యకారులు తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఇది దాదాపు సగం తక్కువ. సముద్ర జలాలు కలుషితం కావడం, వాతావరణంలో సంభవిస్తున్న మార్పులు, సోనా బోట్ల తాకిడి పెరగడం వంటి కారణాల వల్ల మత్స్య సంపద బాగా తగ్గిపోతోందని వేటకు వెళ్లిన వారు ఆందోళన వ్యక్తం చేశారు. వేకువజామున వేటకు వెళ్లి సుమారు 11 గంటల ప్రాంతంలో తీరం చేరుకున్న మత్స్యకారులు పట్టుకున్న చేపలను హోల్‌సేల్‌గా వ్యాపారస్తులకు అమ్మారు. తొలి రోజు నిరాశాజనకంగా ఉండటంతో ఈ సంవత్సరం వేటకుఎలా ఉంటోందొనని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.